ఇది ఓ ప్రేమ కథ. ఆ చేనులో ఓకే పత్తి చెట్టులోని ఓక కొమ్మకు, వేరు వేరు కాయలకు అవి కాసాయి. ఆమె తన గాథను చెబుతోంది.
నే పెరుగుతూ పెద్దదాన్నై బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న రోజులవి. గాఢ నిద్రలోనుండి తేరుకొని విచ్చుకోబోతున్న గట్టి శబ్ధానికి ఉలిక్కి పడి లేచాను. తృణ కాలం లో జరిగిపోయింది. అప్పటి వరకూ చీకటిలో పెరిగిన నా శరీరం మొదటి సారి వెలుగు ప్రపంచన్ని చూడబోతుంది. అంతటి కాంతిని చూసే శక్తి ఇంకా నాకు లేక తల దాచికొని అటు వైపు తిరిగాను. తను సూర్యుడిని చూస్తున్నాడు, తనను నేను మొదటి సారి చూసాను. చల్లగా వీస్తున్న గాలి లో తను నా వైపు చూసి నవ్విన చిరునవ్వు తో మొదలయ్యిన స్నేహం మాది. కలిసి పెరిగాము, బయట ఎలా బ్రతకాలో ముందుగా తను నేర్చుకున్నవి నాకు నేర్పాడు. తను నిరాకరించినా, తనపై ఎండ పడకుండా నే కొంగు పడితే, గాలికి నే ఎగిరిపోకుండా తను అడ్డుగా నిలిచిన రోజులెన్నో, వానలో ఇద్దరం తడుస్తూ చెప్పుకున్న ముచ్చట్లు ఎన్నో, ఒకరినొకరిని ఆ మేఘాలతో పొల్చి కవితలు అల్లిన సమయాలు మరెన్నో? బయట జీవ ప్రపంచంతో కలిసి పోరాడుతూ, మిగతా వారికి తెలియకుండా గుట్టుగా మే గడుపుతున్న రోజులవి. ఓ చెడు వార్త మా చెవిన పడింది. ఎన్నాళ్ళు కలిసుంటామో తెలీదు, నాకు మాత్రం నాలోప్రాణం ఉన్నంతవరుకూ కలిసి ఉండాలనే ఉంది.
అల్లకల్లోలం. అరుస్తున్న శబ్ధాలు. మేము అనుకున్న ప్రకారం ఒకరి కళ్ళలో ఒకళ్ళు చూస్తూ సమయం కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతవరకూ పరస్పర స్పర్శ ఎలా ఉంటుందో తెలీదు. కలుస్తాము, కలిసే ఉంటామన్న విశ్వాసం ఇద్దరిలోనూ ఉంది. రెండు విడి చేతులు ఇద్దరి మీద పడవన్న ఆశతో ఎదురుచూస్తున్నాం. మాకు తొందరే కానీ కానీ తొలిచేవారికి మా అంత తొందరెక్కడిది? నే సహనం కోల్పోతున్నా తను మాత్రం నాకు థైర్యం చెబుతున్నాడు. నాలో శక్తి అంతా ఉపయోగిస్తే తనను చేరుకోగలనేమో? ఎంత భయంకరమైన ఆలోచన నాది, అలా చేరుకోక పోతే మేము అనుకున్నదంతా వృధా, ససేమీరా అలా జరుగకూడదు అనుకొంటున్న వేళలో మా వంతు రానే వచ్చింది. కళ్ళు మూసుకున్నాను, నొప్పితో విడిపోతున్న కాయకు వీడ్కోలు పలికాను మళ్ళీ అంధకారానికి చేరాను. తను ఎక్కడ ఉన్నాడో తెలీదు, నే నెక్కడున్నానే నాకే తెలీదు. ఎంత ఒత్తిడి వస్తున్నా అందరితో కలిసి పోకుండా నన్ను నేను విడతీసుకుంటున్నాను, బహుసా తనూ ఇదే యుద్దం సాగిస్తుండాలి. అందరి రోదనతో చెవులు చిల్లులు పడుతున్నాయి. ఆ చీకటిలో తనకోసం అరిచినా వినపడదు, ఇది సమయం కాదని నన్ను నేను ఓదార్చుకున్నాను, మౌనవ్రతం పాటించాను, శక్తిని వృధా చేయకుండా కళ్ళు మూసుకొని ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా నిద్రలోకి జారుకున్నాను.
కళ్ళు తెరిచాను, మళ్ళీ అదే వెలుతురు, అదే చిరునవ్వు. నా చేయి తన చేతిలోనే ఉంది, అందుకే నేమో ఇంతసేపు కళ్ళు తెరవాలనిపించనే లేదు, నా చిన్నప్పుడు లా నిదురించాను.మా పాత రోజులు తిరిగొచ్చాయు. మేమనుకున్నది జరిగింది, ఇద్దరం కలిసే ఉన్నాము. ఎ మాత్రం అలజడి చేయదలుచుకోలేదు. క్షణాలను గడపదలుకున్నాం. ఎవరికీ అనుమానం రాకుండా మనసులతో ముచ్చట్లాడ దలుచుకున్నాం. మా భావాలను మాలోనే దాచు కుంటున్నాం. రోజులు, నెలలు గడుస్తున్నాయి. ఎన్నో సంభాషణలు, మరెన్నో మధుర క్షణాలు, మరువలేని స్ర్ముతులు ఆ ఒక్క సంఘటన తప్ప. తనకు తెలియదు అతని సంగతి, నాకు ఎన్నడూ చెప్పాలనిపించలేదు. సహించాను. తను వెనుకకు తిరగి చూడలేడు. రోజూ అతని చేస్టలు చూసినా పట్టించుకో దలుచుకోలేదు. అతనికి ఈర్ష్య కాబోలు మా మీద, మా ప్రేమానురాగం మీద. ఆ రోజు ఎక్కడి నుండి వచ్చాడో తెలీదు. నిద్ర పోతున్న వాడి మీద దాడి చేయబోతుంటే ఇది వరలో ఉపయోగిద్దామనుకున్న శక్తి బయటకు వచ్చింది, బుసలు కొట్టాను, కాటేసాను. వెను తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. నా ప్రియుడు కళ్ళు తెరిచాడు నే చిరునవ్వుతో పలకరించాను. తన కళ్ళలో ఆందోళన కనిపించింది. తన మనసులోని తరంగాలు నా హృదయంలోకి ప్రవహించాయి. మళ్ళీ విడిపోతామన్న ఆందోళన. పీడ కలేమో నని అడిగాను. అదే అయితే ఈ ప్రపంచంలో నా కొన్న సంతోషపడే వాడు ఇంకొకడు లేడన్న సంకేతం పంపాడు. ఎవరూ చూడకుండా దగ్గరకు జరిగాను, ఏం జరగబోతొందో ఆలోచించదలుచుకోలేదు. నే నిద్రపోయాను, లేచిన తరువాత తనకు నిద్రపట్ట లేదని తన కళ్ళు చెబుతున్నాయి. ఏదో నన్ను పట్టుకొని లేపడంతో విదులించుకుందామన్న ప్రయత్నం పనికి రాలేదు. ఇన్నాళ్ళు మూగబోయిన నోరు మొదటి సారి పెగిలింది, ధ్వని రాలేదు. నా లోని ఆవేదన నా మనసు వీడి వడివడిగా తన మనసుకు చేరింది. తను చేసిన రోద నాకు వినిపించి, కన్నీరు భగీరధుడు ఆపి వదిలిన గంగలాగా ప్రవహించింది. ఆ ప్రవాహ మంత ధాటిగా నే చేస్తున్న శబ్ధం సూర్యమండలం చేరింది, ఆకాశంలో చంద్రుడు బెంగతో నను చూసాడు. నా ఆకారం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. రూపు రేఖలు శాశ్వతం కాదని మొదటి సారి తెలిసింది. నను కూడా అందరిలా మలిచి దాంట్లో పడేసారు, నలిగి, కుమిలి, రగిలి పోయింది నా మనసు, నీరసంతో కళ్ళు మూతలు పడ్డాయి.
ఉలిక్కి పడి లేచాను. నా చేతిలో తన చెయ్యి ఉంది. నాలానే తన ఆకారం మలిచారు. నన్ను నేను చూసుకోవాలనిపించ లేదు, తనను చూస్తే జాలితో నా గుండె పగిలేలా ఉంది, జీవచ్చవం లేని బ్రతుకు. తను మాత్రం ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. అదే నా కొస ప్రాణానికి జీవం పోసింది. మళ్ళీ పాత రోజులు రాబోతున్నాయని సైగకి సుస్పందన చేసే ఓపిక లేదు. కోలుకున్నాను. ఆకారం వదిలేస్తే ఇదివరలానే ఉన్నాను. ఏ జన్మ అనుభందమో ఇది? జన్మ జన్మలకు ఇలానే ఉండాలని కోరిక కలుగుతోంది. బ్రతికి ఉండాలన్న ఆశ ఎన్నో సార్లు చిగురించింది, ఆశయం నెరవేరింది. నెలలు గడిచాయి.
ఆ రోజు ఇద్దరి తనువులు పూర్తిగా కలిసిన రోజు. సంతోష పడాలో, బాధ పడాలో తెలియని రోజు. తన చిరునవ్వు మాత్రం చెదరలేదు, బయటకు ఏమాత్రం ఆందోళన వ్యక్తపరచడం లేదు. ఇరువురం ఓ మంచి కార్యానికి పనికి రాబోతున్నట్లుగా సిద్దం అవ్వమని నాతో తెలిపాడు. తళ తళ మెరిసే కుందులలో చల్లటి తైలంలో మునిగి తేలాము. క్రింది భాగం ఇంకా మునిగే ఉంది. మా అర్ధనారీశ్వర రూపంతో మా కళ్ళతో అటు చూడగానే అందరూ దేవుళ్ళు కనిపించారు, మా లాంటి సామగ్రితో పాటు ఓ మనిషి కూడా ధ్యానం చేస్తూ కనిపించాడు. అర్థం అయ్యింది. ఓహో సమర్పణ చేస్తారా? ఆహుతి ఇస్తారా? ద్వేష భీజాలు నాటుకుంటున్నాయి, ఉద్రేకం పెరుగుతోంది, సహనం కోల్పోతున్నానేమో అనిపిస్తోంది, ఇదంతా శక్తి రూపమే, పరాశక్తి రూపమే.
తను మాత్రం నిర్భయంగా, పరమశివునిలా చిద్విలాసంగా, లోకంతో ఏమాత్రం సంబంధం లేనట్టుగా ఉండి, మనుషులకు, దేవుడికి ఉన్న వ్యత్యాసాన్ని, శివతత్వాన్ని చూపిస్తున్నారు. కార్తీక మాసంలో ఆ భగవంతుడికి ఇలా సమర్పించుకోవడం అంటే ఎన్ని జన్మల పుణ్యమోనని నా చెవిలో తను చెప్పింది ఓ మంత్రంలా ఘోషించింది. భీజాక్షరాలతో నిండిన ప్రణవ నాదం వినిపించి నా మనసు కుదుటపడింది. జీవితానికి సార్థకత దీని వల్లే ప్రాప్తం అని అర్ధమయ్యింది, జన్మ జన్మల పుణ్యం చేసుకుంటే కానీ తమను తాము అర్పించుకునే భాగ్యం దొరకదు. దీపంలా వెలుగుతాను, కాదు లక్ష కోట్ల నక్షత్రాల వెలుగుతో ప్రకాశించేలా, యుగ సహస్ర యోజన భానుడి లా వికసించేలా శక్తిని ప్రసాదించమని ఆ భగవంతుడిని కోరుతాను. మా కళ్ళ ముందే హారతి మటు మాయమైయ్యింది ఎంత సంతోషంతో ఆ భగవంతుడిలో కలిసిపోయింది? పరిమళాలు వెదజల్లుతున్న అగరొత్తుల కంటే ఎక్కువ సేపు వెలిగి నీకు సేవ చేస్తూ నీలో మేము కూడా కలుస్తూ , మరో జన్మంటూ ఉంటే మళ్ళీ ఇలాగే అర్పించుకనే భాగ్యం కలగాలని, ఇద్దరూ పరమాణు రూపంగా ఆ భగవంతుడిలో లీనమయ్యారు!
శుభం భూయాత్!
కౌండిన్య – 26/03/2017