విశాఖ: ఈ రోజు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20 లో టీమిండియా పోరాడి ఓటమి పాలయ్యింది. ఆటకు ముందు టాస్ సమయంలో తుమ్మడం కారణంగా ఏకాగ్రత కోల్పోయిన విరాట్ కొహ్లీ టాస్ ఓడి బ్యాటింగ్ తో బరిలోకి దిగారు. మొదట పది ఓవర్లు చెలరేగి మెరుపులతో ఆడినా, చివరి పది ఓవర్ల నత్తనడకలతో కేవలం 46 రన్స్ మాత్రమే చేసి 127 పరుగుల లక్ష్యాన్ని కంగారూల ముందు ఉంచారు. ఇంత తక్కువ స్కోరు చేసిన భారత్ మీద అలిగి కొంతమంది టివీలు స్విచ్ ఆఫ్ చేసారని వార్తలు వచ్చాయి, కానీ 127 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు భారత బౌలర్లు శత విధాల శ్రమించారు, కానీ చివరకు కొంపలు ముంచారు. ఆఖరి ఓవర్లో 14 రన్లు కొట్టాల్సి వచ్చి పరిస్థితితో కంగారులను కొంచెం కంగారు పెట్టినా, ఉమేష్ యాదవ్ ను రెండు ఫోర్లు బాది, చివరి బంతితో కావలసిన రెండు పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయ పతాకాన్ని ఎగురవేసింది.
భారత్ ఇన్నింగ్స్
ధావన్ స్థానంలో ఓపెనర్ రోహిత్ శర్మ తో బ్యాటింగ్ ప్రారంభించిన రాహుల్ తన సత్తాను మరో సారి చాటాడు. 34 బంతులలో 6×4, 1×6 లతో అర్థశతకం సాధించాడు. మిష్టర్ టాలెంట్ గా పిలవబడే రోహిత్ శర్మ మాత్రం 5 పరుగులు చేసి టీమ్ స్కోర్ 14 పరుగుల వద్ద పెవిలియన్ కు వెనుతిరిగాడు. తరువాత వచ్చిన విరాట్ కొహ్లీ 17 బంతులతో 24 పరుగులు చేసి భారీ స్కోరు చేయకుండానే అందరి ఆశలు అడియాసలు చేసి వెనుదిరిగాడు. ఆసిస్ బౌలర్ కౌల్టర్ నైల్ ధాటికి తట్టుకోలేక పంత్(3), కార్తీక్ (1) పరుగులతో విఫలమయ్యారు, తరువాత ఫలహారం చేస్తూ టి వి లో కనిపించారు. ధోని అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలో క్రితం లానే వీర విహారం చేస్తాడేమోనన్న అభిమానుల వేడి ఆశల మీద చల్లటి నీళ్ళు జల్లి కేవలం 29 పరుగులతో అజేయం గా నిలిచాడు. ఆట మధ్యలో థోని తన బ్యాటును మార్చినా పెద్దగా లాభం లేకపోయింది. చివరిగా ఆటను చూడటానికి వచ్చిన పిల్లలకోసం వారికి అర్థమయ్యే చిన్న అంకెల స్కోర్లతో ఛాహల్ 0, కృనాల్ 1 , ఉమేష్ 2 పరుగులు చేసారు.
ఆస్టేలియా ఇన్నింగ్స్
తక్కువ రన్ల చేధనతో బ్యాటింగ్ కు దిగిన ఆసీ బ్యాట్స్మన్ల కు మొదట్లోనే భారత్ బౌలర్లు వొంట్లో వొణుకు పుట్టించారు. 5 పరుగుల లోపే స్టొయినిస్, కెప్టెన్ ఫించన్ వికెట్లు పడగొట్టగా వారు పెవిలియన్ కు దారి కోసం చీకటిలో వెతుక్కుంటూ తప్పిపోగా, ప్రేక్షకులు తమ మొబైల్లలో టార్చ్ వేస్తూ దారి చూపించారు. తరువాత క్రీజ్ లోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్వెల్, 43 బంతులలో 2×6 , 6×4 లలో 56 పరుగుల చేసి నిలకడగా ఎలా ఆడాలో చూపాడు. అతనికి తోడుగా డార్సీ షార్టు 37 పరుగులు చేసి, మ్యాక్స్వెల్ తో కలిసి టీమ్ స్కోరు 84 పరుగులకు తీసుకురాగా మిగిలిన పరుగులు చేయడం చాలా సునాయాసం అని అందరూ భావించారు, కానీ అక్కడే పప్పులో కాలేసారని భారత్ నిరూపించబోయింది. ఎందుకంటే తరువాత మ్యాక్స్వెల్, డార్సీ షార్టు ల వికెట్లు పడగొట్టటమే కాకుండా రన్లు కూడా పిసినారి తనంగా ఇవ్వడంతో ఆసిస్ ఆటగాళ్ళు నొచ్చుకున్నట్లు గా కనిపించారు. బుమ్రా పంతొమ్మిదవ ఓవర్ లో కేవలం రెండు పరుగులకే రెండు వికెట్స్ తీయడంతో కంగారూలకు కంగారు మొదలయ్యింది. కానీ చివరి ఓవర్ లో కావలసిన 14 పరుగులు ఇచ్చిన ఉమేష్ ను ప్రేక్షకులు మనసులో తిట్టు కున్నారు. రాబోయే చివరి టి20 మ్యాచ్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో అందరూ అయోమయంతో ఎదురుచూస్తున్నారు. టి20 తరువాత భారత్ తో ఆసీలు ఐదు వన్డే లు కూడా తలపడనున్నారు.
కౌండిన్య – 24/02/2019