ఇంట్లో కిటికీలన్నీ తెరిచిన క్షణంలో,
చల్లటి గాలి తాకగానే,
కవిత్వం వ్రాయలనిపిస్తుంది!
ఇంటి వాకిట ముందు నించున్న క్షణంలో,
విరిసిన పారిజాత పరిమళాలు సోకగానే,
కవిత్వం వ్రాయలనిపిస్తుంది!
మౌనంగా సముద్రం వైపు చూస్తున్నప్పుడు,
నురుగు కెరటాలు కాలిని ముద్దాడగానే,
కవిత్వం వ్రాయలనిపిస్తుంది!
నడిచే దారిలో వెన్నెల విరిసినప్పుడు,
మెరిసే నక్షత్రాల జల్లు కురియగానే,
కవిత్వం వ్రాయలనిపిస్తుంది!
సృష్టి సౌందర్యం కళ్ల నుండి పయనించి,
స్వచ్ఛమైన మనసుకు తాకినప్పుడు,
కవిత్వం వ్రాయలనిపిస్తుంది!
ప్రకృతి అందమైన సృష్టి రహస్యాన్ని దగ్గరకు పిలిచి,
మెల్లగా చెవిలో చెప్పగానే,
కవిత్వం వ్రాయలనిపిస్తుంది!
కానీ, అమ్మ దయ లేక పోతే,
మనసులోంచి కవిత్వం కాక,
మెదడులోంచి కపిత్వం బయటకు వస్తుంది!
కౌండిన్య – 19/02/2025
