
ఈ సారి గుంటూరు వెళ్ళినపుడు నాలానే పే…………ద్ద రచయితలు ఎవరు ఉన్నారా అని దీర్ఘంగా మబ్బుల వైపుకు చూస్తూ ఆలోచిస్తుంటే, సరిగ్గా అదే సమయానికి నా చిన్ననాటి మిత్రుడు, అనుకోకుండా పేరు సంపాదించిన రచయిత గవారా (గంథం వాసనల రావు) గాడు ఫోన్ చేసాడు.
రచయితల కోసం వెతుకున్న సంగతి వాడికి చెప్పాను. అది విని “ఫలానా షాపులో గు క అనే పుస్తకం దొరుకుతుంది అంటూ వెకిలిగా పక పకా నవ్వాడు. పైగా గు క అంటే తెలుసుగా.. గుంటూరు కథలు అన్నాడు. ఫోను కట్ చేసాను, లేకపోతే మొ అ భాషతో బుర్ర తినేసేవాడే! చూసారా అపుడే వాడి ప్రభావం నా మీద పడింది. మొ అ అంటే మొదటి అక్షరం.
సరే, వాడు చెప్పిన షాపుకు వెళ్ళాను. ఆ పుస్తకం లేదన్నారు. సరిగా అడిగానో లేదో అనిపించింది. వాడిని తిట్టుకుంటూ బయటకు వచ్చానో లేదో మళ్ళీ కాల్ చేసాడు “నిన్న చెప్పడం మరిచిపోయా అరసం వాళ్ళ ప్రచురణ అని అడుగు” అన్నాడు మళ్ళీ ఫోన్ కట్ చేసాను .. ఆ అరసం అంటే ఏంటో అడిగే థైర్యం లేక .. ఆ పక్కనే ఉన్న బండిలో నిమ్మకాయ రసం తాగితే గానీ తగ్గలేదు నా నీరసం. మళ్ళీ షాపు లోపలకు వెళ్ళాను.
“అరసం గుక ఉందా? “అని అడిగాను కొంచెం తెలివి ప్రదర్శిస్తూ .
లేదు “అఅరసంగుజిశాగుక” ఉంది అన్నాడు.
ఇంత తికమక పెట్టాడేంటబ్బా అని “కరికి మకరికిఁ గరి” అంటూ గజేంద్ర మోక్షంలో అర్ధించినట్లు పోతన గారి ఓ పద్యం అందుకోబోయాను.
ఆయన నా నోరు నొక్కి “అఅరసంగుజిశాగుక” అంటే “ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ గుంటూరు కథలు” అని అర్థం , మీరు అడిగింది అదేగా అంటూ “ఇంతకీ కొంటారా?” అని అడిగారు.
“మీరు గవారా గారి(డి) అభిమానిలా ఉన్నారు” అన్నాను. గుర్రం సకిలించినట్లు ఇకిలించి నవ్వాడు.
జేబులోంచి ఓ వందరూపాయల ఇచ్చాను, పుస్తకం ఇవ్వమన్నట్లుగా సైగలు చేసాను.
“ఈ వందకు ప్లేటు ఇడ్లీ కూడా రాదు, దీని వెల మూడువందల యాభై” అన్నాడు.
ఇంకో రెండువందల యాభై ఇచ్చి “రెండున్నర ప్లేట్లు ఇడ్లీ కొనుక్కోండి” అని చెప్పాను. పళ్ళు నూరాడు.
“మీ నోట్లో వేయించిన శనగపప్పుకు, కొబ్బరి, చింతపండు, తిరగమోత, ఉప్పు కలిపి వేస్తే ఆ ఇడ్లీలకు పచ్చడి తయారయ్యేది” అన్నాను.
కోపంగా ఆ పక్క ర్యాక్ లోనుంచి ఆ పుస్తకం తీసి, దుమ్ము దులపడం సొంపు కాబోలు ఉఫ్ అంటూ దాని మీద మట్టి నా మొహం మీదకు ఊదాడు.
నేను ఆ పక్కనున్న నీళ్ళుతీసుకొని నా మొహం మీద చిలకరించాను.
“ఏం చేస్తున్నారు?” అని అడిగారు.
“నాకు తడిసిన మట్టి వాసనంటే భలే ఇష్టం” అని చెప్పాను.
నా క్యారెక్టర్ చూసి కాబోలు “ఇంతకీ మీరెవరూ?” అని అడిగాడు.
“నేను కరబ్లాలోకౌఓపేమోర (కలవల రమేష్ బ్రాకెట్ లో కౌండిన్య ఓ పేరు మోసిన రచయిత)” అన్నాను. చాలా సార్లు వినే ఉంటారు కదూ అంటూ నిలువుగా నాలుగు సార్లు తల ఊపాను, ఆయన “పొరపాటున కూడా వినలేదు” అంటూ అరడజను సార్లు అడ్డంగా ఊపాడు.
“వెయ్యి పేజీలకు పైగా రాసాను, అందులో చింపేసినవి తొమ్మిదివందలా యాభై ఉంటాయి” అని విశ్వనాథ వారి స్టైల్లో అన్నాను.
“ఎల్ బో రా” అన్నాడు. అమ్మో నన్ను రా ..అని పిలిచే స్టేజీ కు వచ్చాడు అనుకొని మోచేయి చూసుకుంటుంటే అది గమనించి మీవి “ఎల్ బోర్డు రాతలా?” అన్నాడు.
“అవును, మొన్నటికి సరిగ్గా రెండేళ్ళయ్యింది రాయడం మొదలుపెట్టి” అంటూ
మాట మార్చి “దీంట్లో గుంటూరు శేషేంద్ర శర్మగారి కథలుంటాయా?” అని అడిగాను.
“ఆయనది గుంటూరు కాదు” అన్నాడు.
“మరీ తెనాలి రామకృష్ణుడు” అని అడిగాను
“కు జో లు వేయకండి” అంటూ
“ఆయనది గుంటూరు జిల్లానే, కానీ ఆయన కాలంలో అరసం లేదు.. విరసం అంతకన్నా లేదు…భువనవిజయం ఉండేది” అన్నాడు.
“అవునూ …ఆయన ఇంటి పేరు తెలీదు కానీ …కవిత్రయంలో ద్వితీయుడు ..తెలుగు కవిత్వంలో అద్వితీయుడును ..తిక్కన గారిది గుంటూరే..ఆయన కథలు?” అని అన్నాను.
“ఆయన రాసినవాటిని కథలు అనరు, వాటికి ఈ పుస్తకం సరిపోదు. అయినా దీంట్లో కథలన్ని చిన్న కథలు, తిక్కన గారి మహాభారతంలోలా పెద్ద పర్వాలు ఉండవు” అన్నాడు.
“మరీ కవిసార్వభౌమ శ్రీ నాథుడు, కవికోకిల గుర్రం జాషువా వి ?”
“మీరు చదివి తెలుసుకోండి మహాప్రభో “ అంటూ ఆయన లోపల కెళ్ళి గుంటూరు సీమ రచయిత ము న (శ్రీ మునిమాణిక్యం నరసింహరావు) గారి హాస్యాన్ని గూర్చిన రాసిన సిద్దాంత గ్రంథం “మన హాస్యం” పుస్తకం తెచ్చి మీకు సరిపోతుంది చదవండి అన్నారు.
“రెండు ప్లేట్లా ?” అంటూ రెండువందలు ఇవ్వబోయాను.
నా చేతిలో పుస్తకాలు లాక్కోబోయాడు, తప్పించుకొని ఆ పుస్తకం తిప్పి వెనుక వెల చూసి “ప్లేటున్నర …. మిగతావి కాఫీకి ఉంచుకోండి” అని డబ్బులిచ్చి తుర్రున బయటకు పరిగెత్తాను.
ఇంటికి వచ్చి తెరిచి చూస్తే ఈ కథా సంకలనంలో బోలెడు సాహితీవేత్తల గుంటూరు సీమ కథలు( డెబ్బ్బై కథలు), కవితలు ఉన్నాయి.
గత వందేళ్ళుగా రాసిన కథలు అంటే గుంటూరు సీమలో సాహితీ వెలుగులు అందించిన శ్రీ అ ఉ (అక్కిరాజు ఉమాకాన్తమ్ గారు) మొదలుకొని, శ్రీ రా భ (రావూరి భరధ్వాజ), శ్రీ కొ కు (కొడవటిగంటి కుటుంబరావు), శ్రీ గో (గోపిచంద్), శ్రీ వా సీ (వాసిరెడ్డి సీతాదేవి), శ్రీ ఓ (ఓల్గా), శ్రీ పొ వి (పొత్తూరి విజయలక్ష్మీ), శ్రీ స శ (సత్యం శంకరంమంచి), శ్రీ గు వె చ (గుడిపాటి వెంకట చలం) , శ్రీ పె సు (పెద్దిభొట్ల సుబ్బరామయ్య), శ్రీ వే రా (వేదగిరి రాంబాబు) … ఇంకా ఎందరో మహానుభావుల కథలు గుంటూరు సీమకు అద్దం పట్టేలా ఉన్నాయి.
ఈ ప్రముఖు రచయితలే కాకుండా మొత్తం మీద కథలు రాసే మూడు వందల యాభై గుంటూరు సీమ రచయిత ల పేర్లు కూడా ఉన్నాయి.
చివరగా ఆ గవారా గారి(డి) మొ అ భాషలో రాసిన పుస్తకం లోని ఓ పద్యం మీకోసం
కొ త భా డ, డ స
త్వ, తి పి, ప
సొ గ శో నే, యా
ధ్ర యె,గు పు యె క ప్ర
-క గు జా -( అ – గ వా రా )
ఈ గు క లోనించే కాపీ కొట్టుంటాడు, అది మీ కోసం
కొమ్మన తండ్రి భాస్కరు డకుంఠిత తేజ, డఖండ సత్కవి
త్వమ్మును గూడ, తిక్కన పితామహుడేలగ, పట్టణాలకున్
సొమ్మయి గర్తపట్టణము శోభిలునాడును నేడు, యావదాం
ధ్రమ్మొక యెత్తు, గుంటూరు పురమ్మొక యెత్తు కళా ప్రతిష్ఠలన్
-కవికోకిల గుర్రం జాషువా (అనువాదం – గంథం వాసనల రావు)
మొదటి అక్షరాల ఇన్ఫ్లూయన్స్లఅంతా ఆ గవారా గాడి వల్లే..
ఇట్లు మీ క ర ( చక్రాలు తింటుంటే వచ్చే శబ్థ భాషతో రాసాను క ర అంటే కలవల రమేష్ అని)
శు భూ అంటే శుభం భూయాత్, గాలి పీలుస్తూ శు భూ అనండి చూద్దాం..
కౌండిన్య (27/07/2018)