విద్యలన్నిటిలోను కవిత్వ విద్య శ్రేష్ఠమైనది. ఆ కవిత్వ లక్షణము ఛందశాస్ర్తముల వలననే తెలియును.
చిటిక వేయునంత కాలములో ఉచ్ఛరించబడిన దానిని మాత్ర అందురు. (దీనిని వేసుకునే ఆత్రతో పొరపడరాదు).
నా నామము రమేష్. ఇది నాలుగు చిటికలు వేయునంత కాలములో ఉచ్ఛరించవచ్చు(చిటికలు వేయుచూ నా నామము పల్కిన మీకే తెలియును).
కొందరు మూడు చిటికలు వేయినంత కాలము లోనే నా నామము పలికినయెడల, వారు పలుకుటలో కొంచెం తొందరపడినట్లు తలుచుదును.
మూడు అక్షరములకు నాలుగు మాత్రలేలా? అన్న అనుమానము కలుగక పోదు. ఆ సందేహము తీర్చుటకే అచ్చటకు వచ్చుచున్నాను.
లఘవు, గురువులు
అ-ఇ-ఉ-క-చ-ట మున్నగునవి ఒక్క మాత్రలో ఉచ్ఛరించబడును. వీటిని లఘువులు అందురు.
ఆ-ఈ-కా-రా లాంటి అక్షరములు రెండు మాత్రల కాలమున ఉచ్ఛరించ వానిని గురువులు అందురు.
దీర్ఘాచ్చులు, దీర్ఘాచ్చులులతో గూడిన హల్లులను కూడా గురువులగును. ఉదా: ఆ, ఈ, ఊ, ఋూ, మేక పల్కుల మే మొదలైనవి.
ఒక అక్షరమునకు ప్రక్క సంయుక్తాక్షరము ఉండునేని ఆ పూర్వాక్షరము “ఊది” పలుకబడిను. ఉదా: అమ్మ – ఇందు అ అక్షరము ఊది పలుకబడును (ఊదినపుడు గాలి వచ్చుట సహజమే). ఇట్టి సంయుక్తాక్షరములు గురువులే. గమనిక : నా నామము శక్తి వృధా కానిది. ఊదుట అవసరం లేనిది.
నా నామమున ర అక్షరం లఘువు, మే అక్షరం గురువు ఉన్నవని ఈ పాటికి నా శిష్యులైన మీరు నిర్థారించి ఉండుదురు.(మే దీర్ఘముతో మేక లాగా అరుచుచూ సాగదీయు రెండు చిటికెల అక్షరము గురువు అని ఇందాక తలుంచుకొంటిమి కదా). మీతో నేను ఏకీభవించుదును. కానీ ష్ అను అక్షరము లఘువా? లేక అర లఘువా? ఆ సందిగ్ధము నాకు కలిగినది దీనికి సమాధానము నాకు తెలియదు. మీకు తెలిసిన యెడల తెలియజేయగలరు. కానీ గురువులు కానివన్నీ లఘువులే అని చదివితిని కాబట్టి ష్ లఘువనే పరిగణిద్దాము. అదీకాక ఆంగ్ల భాషలో ష్ అందురు కానీ తెలుగులో మాత్రం షు అనే అందురు కాబట్టి లఘువే కావచ్చును. దీనిని బట్టి నా నామములో ఒక గురువు, రెండు లఘువులున్నవని నిర్ధారణ కు వచ్చితిని. ( మీకు ఇంటిపని
గణము
మూడు గురు, లఘువులు కలిసిన “గణ” మనిపించుకొనును. మూడిటిలో ఒక్కో అక్షరము గురువు కానీ లఘువు కానీ కలవవచ్చును.
ఈ మూడేసి అక్షరములు గలవి ఎనిమిది సమగణములు అవి మగణము, భగణము, జగణము, సగణము, నగణము, యగణము, రగణము, తగణములు.
ఉదా: నగణము లో మూడక్షరములూ లఘువులే ఉండవలెను అలాగే జగణములో మధ్య అక్షరము గురువు కావలెను.
నా నామములో మధ్య అక్షరము మే ( రెండు మాత్రల మే ) కావున సమగణము జగణమే నా నామము నకు ఉన్న గుణమని భావిస్తున్నాను.
ఉపగణములు
ఇక సూర్యేంద్ర చంద్ర గణములు అనే ఉపగణముల గూర్చి క్లుప్తంగా చూచుదుము. తెలుగు పద్యములలో సూర్యేంద్ర గణములు ఎక్కువగా ఉపయోగించబడును. చంద్రగణములు తక్కువ. గీతము, సీసము, ద్విపద వంటి పద్యములందు కూడా సూర్యేంద్రగణములే ఉపయోగింతురు.
గాఢ నిద్రలో ఉన్న నాకు….
ఏ… మ… ం … డీ ( అన్నీ గురువులే ) అని వినిపించగానే లేచాను.
ఏంటా నిద్రలో కలవరింతలు?
కలలో ఛందస్సు నేర్పుతున్నారు!
ఎవరూ?
ఏమో దేవకన్య లాగా ఉంది!
క్షణకాలంలో నా శిరము మీద అచ్చులు అనగా మచ్చలు, తలకట్టు అనగా కొమ్ము, గుడి అనగా బొప్పి ప్రత్యక్షమయ్యెను కావున ఇంతటితో ముగిస్తాను!
నా ఛందోరూపనామములో లక్షణము, గుణము, ప్రాసా , లక్షణము లాంటివి త్వరలో కలలోకి రావాలని కోరుకుంటూ..
కౌండిన్య – 27/06/2018