నీ గీకుడు.. అంటూ దూకుడు స్టైల్లో మీరు ఓ పాటేసుకునేలోగా ఓ విషయం చెబుతాను.
ఈ గీతల పిచ్చి ఎలా మొదలయ్యిందో చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళాలి. సన్నిహితులు బొమ్మల గురించి ఇచ్చే ప్రోత్సాహం ఇంతా అంతా కాదు, పైగా ఎలా చేయగలగుతున్నారని అడుగుతున్నారు కాబట్టి ఇది వ్రాయడం మొదలు పెట్టాను.. బ్యాగ్ గ్రౌండ్లో నా పాట ఆపొద్దు..
ఎదైనా ఓ బొమ్మను మీరు చూసేరానుకోండి మీరు ఏం చేస్తారు? నేనైతే దాన్ని పదే పదే చూస్తాను, దాంట్లో ఉన్న జీవం బయటకు కనపడేదాక. అంటే ఆ బొమ్మలో ఉన్న పాత్రలు కానీ, సన్నివేశం కానీ నా మెదడులో ఒక చిత్రాన్ని నడిపేదాకా దాన్ని చూస్తూనే ఉంటాను(నా పక్క వాళ్ళు ఏమనుకున్నా సరే). అలా చూస్తూ ఆ పాత్రలకు తగ్గిన సన్నివేశాన్ని, వాటికి తగ్గ రసాన్ని జోడిస్తే ఓ కథ తయారవుతుంది. ఇదేదో నే కనిపెట్టిన ఓ కొత్త ప్రక్రియ కాదు, ఇలా ఓ బొమ్మ ను చూసి దాని వెనుక ఉన్న కథను ఊహించ వ్రాయడం లాంటి రచనలు చేసే వారున్నారు, నేను కూడా ఈ ప్రక్రియలో కొన్ని కథలు వ్రాసాను. ఈ కథల వ్రాయడం పక్కన పెడితే, ప్రతీ కథకు బొమ్మలు ఎంతో ముఖ్యం అని నా భావన. చెప్పి చెప్పనట్టుగా కథను పాఠకులకు చెప్పి ఆసక్తిని పెంచేలా చేస్తుంది. (ఇంతకీ ఈ భావన ఎవరు? ఇప్పుడే తెలియాలి..)
నేను కథలు వ్రాయడం మొదలుపెట్టి ఇదివరలో నా కథకు తగ్గట్టుగా ఓ చిత్రాన్ని వెతికి కథతో పాటు దానిని పెట్టేవాడిని. తరువాత రోజులలో కథకు తగ్గట్టుగా పోనీ నేనే గీతలు మొదలు పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఓ రోజు తళుక్కున మెరిసింది.. ఇది చదువుతూ బ్యాగ్ గ్రౌండ్లో నా పాట ఆపారు కదూ.. సరే మళ్ళీ సారి ఆ పాట నీ గీకుడు గుర్తుచేసుకొని ముందుకెడదాం.
మంచి కథలు వ్రాయడం ఎంత కష్టమో అలాగే చెప్పాలంటే బొమ్మలు వేయడం కూడా చాలా కష్టమే. ఓస్ ….ఇది చెప్పటానికి ఇంత వ్రాయాలా? అనుకునే వారికి కోసం అసలు విషయం లోకి మళ్ళీ వస్తూ.. అలా మంచి బొమ్మలు వేయాలన్న ఆలోచన నా మనసులో విత్తనంగా మెదలయ్యి , పెత్తనం చెలాయించే దశకు వచ్చిందనమాట. అంటే ఒక ముక్కలో గీతల పిచ్చి ముదిరింది.
ఓరి దేవుడో .. గీతలు ఎక్కువ ..కథల వ్రాతలు తక్కువ అవుతాయని ఏ నాడైనా అనుకున్నానా? లేదు.. పోనీలేండి ఏది ఏదైనా ఏమీ తోచనపుడు సమయాన్ని వినియోగించుకోవడానికే ఈ వ్రాతలైనా, గీతలైనా కాబట్టి ఏం ఫర్వాలేదు. ఈ లాక్డౌన్ సమయం ప్రత్యేకంగా ఉపయోగపడిందనే చెప్పాలి. దేనికైనా సాధన ఎంత ముఖ్యమో నే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కానీ ఒకటి మొదలుపెడితే వాటికి బోలెడు సమయం కేటాయించాలి. కొన్ని సార్లు అర్థ రాత్రి వరకూ ఇలా గీతలతో ముగిసినా మీరు సహృదయంతో బావుంది అంటూ పెట్టే కామెంట్ ఇచ్చే కిక్కే వేరు. దేనికైనా ఓపిక కావాలి, వచ్చే సారి ఇంకొంచెం బాగా చేయలన్న తపన కూడా ఉండాలి.
అలాగే మొన్న ఒక రోజు ఏమి తోచక మా ఆవిడతో కలిసి ఓ డ్యూయెట్ పాట రికార్డ్ చేయాలన్న ఇంకో ఆలోచన మళ్ళీ తళుక్కున మెరిసింది…….. వెంటనే “పళ్ళురాల్తాయ్….” అంటూ నా అంతరాత్మ గనుక అనకపోతే ఈ పాటికి ఓ పాట పాడి మీ చెవులలో తుప్పు వొదలించే వాడిని. ఉన్నవి వెలగపెట్టు చాలు అన్న దివ్య సందేశంతో మీరంతా బ్రతికిపోయారు. బ్యాక్ గ్రౌండ్ లో మళ్ళీ నీ గీకుడు మ్యూజిక్..
ఇక చివరిగా ముగించే ముందు కొన్ని రోజులు గీతలతో పాటు వ్రాతలు కూడా చేద్దామన్న నిర్ణయంతో త్వరలో మీ ముందుకు వస్తాను.. మీ లైకులు, లవ్వులకు శతకోటి వందనాలు. మీ ఆప్యాయతకు, ప్రేమకు సదా కృతజ్ఞుడను..
ఇక మీ అందరూ ఆ పాట ఆపేయవచ్చు.. సదా మీ కౌండిన్య.
కౌండిన్య – 10/01/2021.











