కొన్ని నేలల క్రితం ఒ టి టి లో విడుదలైన సినిమా 35. ఈ సినిమా లోని “నీలి మేఘములలో” అన్న పాట వినని తెలుగువారు ఉండరు అనడంలో అతిశయోక్తి కాదు.
సినిమా డైరక్టర్ నంద కిషోర్ ఈ పాటను సీతా స్వయంవరం తో అనుహరణ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని గేయ రచయితైన భరద్వాజ్ గాలి తో చర్చించి చక్కటి సాహిత్యంతో కూడిన పాటని రాబట్ట గలిగారు.
స్వయంవరం లో ఎలాంటి వరుడు వస్తాడో అన్న సంశయం వధువుకి మనసులో మెదలడం సర్వసాధారణం. ఆ ఘట్టం ముందు సీతమ్మ వారు రాబోయే వరుడైన రాములవారి గూర్చి ఎలా మధనపడి ఉంటుందో అన్న ఊహే ఈ పాటకు బీజం.
అలాగే, ఈ పాటలో ఒక సన్నివేశంలో ఇరువురు గుడిలో కలిసినపుడు తన బావ ప్రసాదు గవర్నమెంట్ ఉద్యోగం లో పాసైనట్లు చెప్పి, సరస్వతి ని భార్యగా స్వీకరిస్తానని చెప్పినపుడు, బావని కాబోయే వరుడుగా ఊహించుకొని తన మనసులో మెదిలిన సందిగ్ధాన్ని, సీతమ్మ వారు స్వయంవరం ముందుగా పడిన సందేహానికి ముడి పడేలా చేసారు.
అరుదైన సాహిత్యానికి అద్భుతమైన సంగీతాన్ని జతపరిచి పాటను హృద్యంగా తెరకెక్కించారు. మ్యూజిక్ వివేక్ సాగర్ అందించగా, పృథ్వి హరీష్ రాగయుక్తంగా ఓ కీర్తన లా, వీనుల విందుగా గానం చేసారు ఈ సినిమాలో.
ఇక సాహిత్యానికి వస్తే, పాట ఇలా మొదలవుతుంది;
నీలి మేఘములలో ధరణీ తేజం
నయనాంతరంగములలో
వనధీ నాదం
సీతమ్మ వారు ధరణీ తేజం, భూమిలోంచి పుట్టిన తేజస్సు. రాముల వారు నీలి మేఘశ్యాముడు. పాటను వీరితో ఉదహరిస్తూ “వనధీ నాదం” అంటూ ఒక అద్భుతమైన ప్రయోగంతో మొదలు అవుతుంది.
“వనధి” అంటే సముద్రం. నాదం అంటే ఘోష. మనసులోని చెప్పలేనంత బాధ ఆమె కళ్ళలో కనపడుతోంది అని సూటిగా అనకుండా, నయనాల అంతరంగంలో కన్నీటి ఘోష వినపడుతోంది అని వ్రాయడం చాలా అరుదు, చాలా లోతైన ఆలోచన.
తకిడతాం తకిడతాం
తకధిమి తోం త తోం త తోం త
తకిట త తదిమి తజను తోం
ఆ.. పోరునే గెలుచు పార్థివీపతి
సాటిలేని ఘనుడైనా
నీరజాక్షి అలిగే వేళ
ముడివిల్లు ముడి వంచగలడా
సడే చాలు శత సైన్యాలు
నడిపే ధీరుడైనా
వసుధా వాణి మిథిలా వేనిమది వెనుక పలుకు పలుకులెరుగ గలడా
పైన వాడిన తెలుగు పదాలు “ముడివిల్లు”, “వసుధా వాణి”, “మిథిలా వేని” లాంటి ముచ్చట్లైన వాటితో వాక్యాలు కూర్చడం సామాన్యం కాదు.
స్వయంవరం సమయంలో సాటిలేని ఘనుడైన శ్రీ రాముడు విల్లును అవలీలగా వంచి, పోరులో గెలిచిన సంగతి అందరికీ ఎరుక, కానీ ఆమె అలిగిన వేళ, విల్లులా ముడి పడిన కనురెప్పలను వంచ కలడా అన్న సందేహం వ్యక్తం చేస్తోంది నీరజాక్షి. ఇక్కడ ఈ వాక్యం చదవగానే మనకు సీతా స్వయంవరం ఘట్టం లో శివథనస్సు వంచన, అలానే మైథిలి అలిగి ముడిపడిన కనుబొమ్మలు ఒకే సారి మదిలో మెదిలిన అనుభూతి కలుగుతుంది.
అలానే, ఒక చిన్న చప్పుడు (రాజు చప్పట్లతో ఎవరక్కడ అని పిలిచినట్లు ) శత సైన్యాలను నడిపే ధీరుడైనా సరే, తన మనసు లో భావాలను తెలుసుకోగలడా? అన్నది మరొక సందేహం.
“మది వెనుక పలుకు పలుకులెరుగ గలడా” అనే వాక్యం పదే పదే చదవాలనిపిస్తుంది.
రచయిత “వసుధా వాణి, మిథిలా వేని” అన్న పదాలను ఈ చరణం లో వాడారు. సీతమ్మ భూమి లోంచి వచ్చింది కదా, జనకుడు పెట్టె తెరవగానే ముందు పసిపాప ఏడ్పు వినిపించింది. అది భూమి లోంచి అందరికీ వాణి లా సందేశం ఇచ్చిందని దీనిలోని అంతర్యం. మిథిలకు సీత అమ్మవారి జననం వల్ల కీర్తి వచ్చింది కాబట్టి “మిథిలా వేని” అని అద్భుతమైన ప్రాసతో వ్రాసారు.
నీలి మేఘములలో ధరణీ తేజం
నయణాంతరంగములలో
వనధీ నాదం
జలధి జలముల్ని లాలించు మేఘమే
వాన చినుకు మార్గమును లిఖించదే
ఆ… స్వయంవరం అనేది ఓ మాయే
స్వయానా కోరు వీలు లేదాయే
మ ప ద ప మ ప ద ప
మ ప ద ప రి గ మ రి మనస్సులే ముడేయు వేళాయే
శివాస్త్ర ధారనేల కొలతాయే
“జలధి జలములు” అంటే సముద్రపు నీరు. వాటిని మేఘాలు లాలిస్తూ, ప్రేమతో మోస్తాయి. అవి చివరకు వాన చినుకు లాగా భూమి మీదకు కురుస్తాయి, కానీ, వాటి ప్రయాణించే మార్గం మాత్రం ఆ మేఘాలు నిర్ణయించలేవు కదా. దీంట్లో ఉన్న తాత్వికత గురించి తరువాత చర్చిద్దాం కానీ ఈ “జలధి జలముల్ని లాలించు మేఘమే“ అనే వాక్యంలో ఎంత మృదువైన ఊహ.
దాని తరువాత వాక్యాలు అత్యద్భుతం. “ స్వయంవరం అనేది ఓ మాయే.. స్వయానా కోరు వీలు లేదాయే“ అంటే సీతా రాముల జంట నిశ్చయం ఎప్పుడో జరిగింది బాహ్యంగా జరిగే స్వయంవరం ప్రక్రియ కోరుకున్నా వీలు పడదు ఎందుకంటే ఇదంతా ఓ మాయ అని అర్థం.
పైగా, మనస్సులు ముడి వేసే సమయం వచ్చినప్పుడు ఇక శివ ధనుస్సు ఎత్తడం లాంటి పరీక్షలు ఎందుకు అన్న భావం కలుగుతుంది.
ఈ వాక్యాలని తాత్వికంగా చూస్తే జనకుడు సీతమ్మ వారి పెళ్లి కోసం ఎన్నో స్వయంవరాలు జరిపించాడు, కానీ చాలా రోజులు వరకు పెళ్లి కుదరక పోవడంతో సభలో అందరితో పాటు, ఆయన కొంత నిరాశ చెందుతాడు. జనకుడు సీతమ్మ ను మేఘంలా లాలించినా ఆమె దిశను మాత్రం నిర్దేశంచలేక పోయాడు, ఎందుకంటే అదంతా భగవంతుడి నిశ్చయం. తరువాత, మిగిలినదంతా ఓ మాయ అని తెలియజేయడంలో రచయిత సాఫల్యం పొందాడు అని చెప్పవచ్చు.
ఆ.. వరంధాముడే వాడే
పరం ఏలు పసివాడే
స్వరం లాగ మారాడే
స్వయం లాలి పాడాడే
పరం ఏలే పరంధాముడు వాడు, వరాలు ఇచ్చే వరంధాముడు. స్వరం లాగా మారి స్వయంగా లాలి పాడాడు అనడం లో ఎంత ముద్దుగా ఉందో.
ఆ.. భస్కరాభరణ కారిణీ
గుణ శౌరి శ్రీకరుడు వాడే
అవనీసున అనుసోకాన
స్టిమితాన తానుండలేడే
శరాఘాతమైనా గాని
తొణికే వాడు కాడే
సిరి సేవించి సరి లాలించి
కుశలములు నిలుప ఘనము నొదిలి కదిలే
నీలి మేఘములలో ధరణీ తేజం
నయణాంతరంగములలో
వనధీ నాదం
ఈ చివరి చరణం ఈ పాటని, మన మనసుని అత్యున్నతమైన స్థానానికి తీసుకొని వెళ్లి వదిలేస్తాయి.
“భాస్కరాభరణ కారిణీ” అనేది ఎంత మంచి వాక్యం. శ్రీ రాముడు సూర్యుని ఆభరణాన్ని ధరించినవాడు పైగా ఆయన కారుణ్య శీలుడు, గుణాధీసుడు, శౌర్యుడు, శ్రీకరుడు. రాముడి గుణగణాలు ఇక్కడ చక్కగా వర్ణించారు.
అవనిలో ఎవరైనా దుఃఖం లో ఉంటే ఆయన స్తిమితంగా ఉండగలడా?
యుద్దంలో బాణాలు శరీరాన్ని విఘాతం చేస్తున్నా తొణికిసలాడే వాడు కాదు.
కుశలం కోసం మేఘాలు వదిలి పరిగెత్తుతూ రాడా అమ్మ వారి సేవకి, లాలించటానికి? అంటూ అందరికీ మనసును హత్తుకుంటుంది.
పాటలో ఎన్నో ప్రాసలు, ఉపమానాలు వాడుతూ వసుధా వాణి, మిథిలా వేని లాంటి అంతరార్థాలు కలిగిన పదాలతో, ముడి విల్లు లాంటి తెలుగు మాటల తో మంచి సాహిత్యాన్ని మనకు అందించి, ఈ పాటలో ఉన్న కొత్త కొత్త పదాల గురించి శోధించేలా చేసింది.
ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన “యమునా తీరం” పాట ఇప్పటి వరకూ అలరిస్తూనే ఉంది, అలానే, అదే ట్యూన్ తో ఉన్న ఈ పాట కూడ వచ్చే కొన్నేళ్ల వరకూ శ్రోతలను అలరిస్తుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ఈ పాట రచయిత పట్టుమని పది పాటలు కూడా వ్రాయలేదంటే నమ్మశక్యంగా లేదు. వృత్తి రీత్యా ఐ టి లో పనిచేస్తున్నా ఇలా అందరికీ మంచి సాహిత్యం మున్ముందు మనకి అందించాలని కోరుతూ..
కౌండిన్య – 29/04/2025