‘ఇదిగో నా సైకిల్ ఎవరైనా ముట్టుకున్నారంటే ముక్కు పగులుద్ది’ అని స్టాండ్ వేసి హోటల్ లోపలికి వెళ్ళాడు కనకాంబరం.
‘కందిపచ్చడి అవ్వదా అన్నాడు’ అక్కడ నించొని సిగిరెట్ కాలుస్తున్న ఓ కుర్రాడు. కోపంగా చూసే సరికి ఆ కొంటెవాడు ఉన్నపళంగా అటు పరిగెత్తాడు. లోపలకు నడిచిన ఆయన అసలు పేరు కందిపచ్చడి కనకాంబరం.
రోజూ ఆయన హోటల్ లోపలకు వెళ్ళినపుడు సైకిల్ మీద కూర్చొని సిగిరెట్లు కాలుస్తుంటారు ఆ కుర్రోళ్ళు. నిన్న బయటకు వచ్చి తీరా చూస్తే ఆయన సీటుకు బొక్క పడింది ఇందాక ఆ కోపమే వాళ్ళ మీద చూపించాడు.
ఆయన లోపలకు రావడం చూసి ‘ఇదిగో ఆయనొచ్చాడు రెండు ఇడ్లీ బక్కెట్ సాంబారు పట్రా’ అన్నాడు హోటల్ యజమాని.
‘ఏంది అట్టా అరుస్తావు? అందరి ముందు’ అన్నాడు కనకాంబరం కోపంగా.
‘ఇప్పటి నుండి అరవను లే’ అంటూ రెండు వేళ్ళు, ఓ బక్కెట్ ఎత్తినట్లు సైగలు చూపించాడు ఆ సర్వర్ కు.
కనకాంబరం ఆ హోటల్ కు మంచి చిక్కటి పాలు పోస్తాడు, అందుకే సాంబారు తాగితే తాగాడులే ఓ బక్కెటే కదా అని వదిలేస్తాడు ఆ ఓనర్ రోజూ.
ఆ సర్వర్ సాంబార్ బక్కెట్ తీసుకొచ్చి ముందు పెట్టాడు.
‘ఇడ్లీ ఏయి?’ అన్నాడు.
‘లోపలున్నాయి’ అన్నాడు.
‘ఏంది సాంబార్లోనా?’ అని అడిగాడు
‘కాదు నా నోట్లో ‘ అని బార్లా తెరిచాడు. ‘రోజూ ఆ సాంబార్లోనే గా ముంచుకు తినేది’ అన్నాడు సర్వర్.
‘నే ముంచేది యేరు. నువ్వు ముంచేది యేరు’ అన్నాడు కనకాంబరం.
‘ఎవరు ముంచితే ఏందయ్యా?’ అన్నాడు సర్వర్
‘యేడి సాంబారులో చెయ్యి ఎట్టా పెట్టేది? గరిట తీసుకురాబో’ అన్నాడు
ఆ సర్వర్ కు, పాలు పోసే కనకాంబరానికి మధ్య అగ్గిపుల్ల వేస్తే భగ్గుమంటుంది. తీసుకొచ్చి గరిట విసిరాడు.
గరిట లోపల తిప్పితే ఇడ్లీలు కనపడక కోపంతో ‘ఏయి ఇడ్లీలు?’ అని అడిగాడు.
ఆ సర్వర్ వెనకనుండి దాచిన ఇడ్లీ ప్లేటు తీసి టేబుల్ మీద పెట్టి ‘ఊరికే అన్నాలే ఇదిగో నీ ఇడ్లీలు’ అన్నాడు.
కోపంగా చూసి ‘మొహం బగులుద్ది.’ అన్నాడు కనకాంబరం.
‘ఏది పగలకొట్టు చూద్దాం’ అని అడిగాడు. కనకాంబరం భాషలో కోపం వస్తే ఏదోకటి పగులుద్ది.
సర్వర్ పోవయ్యా అన్నట్లు మొహం పెట్టి భుజాన వేసుకున్న గుడ్డ తీసి దులిపాడు. దాని నిండా మట్టే. ఆ పక్క టేబుల్ లో తింటున్న ఆయన ప్లేట్లో మట్టి ఎలా పడిందో అర్థం కాక పైకి సీలింగ్ వైపుకు చూసాడు.
ఆ సర్వర్ తో ‘ఇదిగో ఇడ్లీల మీదంతా మట్టే’ అన్నాడు.
‘అది నంచుకునే పొడి అండి మట్టి కాదు’అన్నాడు విసుగుగా.
ఆయన నోట్లో పెట్టుకొని మట్టితగిలి తుపుక్కని ఉమ్మి ‘మట్టే నయ్యా..’ అనగానే విసుగ్గా ఆ ప్లేటు తీసుకొని వెళ్ళాడు, కొత్త ప్లేటు తీసుకొచ్చి ఇచ్చాడు.
వేరే టేబుల్ లో సాంబార్ పట్రమ్మన్నాడు. కనకాంబరం టేబుల్ మీద ఉన్న సాంబార్ బక్కెట్ తీయబోతే కనకాంబరం కోపంగా దాన్ని లాక్కొని ‘చెంప పగులుద్ది. యేరే సాంబార్ తెచ్చుకో’ అన్నాడు.
చుక్క మిగల్చకుండా తిన్నాడు కనకాంబరం. బయటకు నడవబోతూ ‘రేపు యెటకారం చేయబాక. గుండు బగులుద్ది’ అన్నాడు సర్వర్ తో.
సర్వర్ విసుగుగా ఆ భుజం మీద గుడ్డ తీసాడు. పక్కాయన టేబుల్ ఆయన అది గ్రహించి ప్లేటు పక్కకు జరిపాడు. తెలుసుకున్నాడు ఇందాక ప్లేటులో పడింది సీలింగ్ నుంచి పడిన మట్టి కాదని.
కనకాంబరం బయటకు నడిచాడు. నిన్న సైకిల్ సీటుకు కుర్రోళ్ళు బొక్క పెట్టారు ఈరోజు అసలు సీటే లేదు.
చిర్రెత్తి అటు అటూ చూసాడు. బడ్డి కొట్టు వెనక దాక్కొని కాళ్ళు కనపడుతున్నాయి. తలపాగా తీసి నడుముకు బిగించాడు. ఆ కుర్రాళ్ళ వైపు పరిగెత్తాడు. నలుగురు నాలుగు వైపులా పరిగెత్తారు. ఇపుడే హోటల్ లాగించి వచ్చిన వాడు ఏం పరిగెడుతాడులే అనుకొన్నాడు ఆ కుర్రాళ్ళు.
ఆ సీటు చేతిలో ఉన్న కుర్రాడు వైపు పరిగెత్తాడు. ముందు అతను పరుగెడుతున్నాడు, వెనుక కనకాంబరం పరిగెడుతున్నాడు. ఒక్కసారిగా వెనక వీపు మీద చెయ్యి పడింది. ఆ కుర్రాడు చేతిలో ఆ సీటు నేల మీద పడింది అతను నేల మీద కరుచుకు బోర్లా పడ్డాడు.
‘నాతో పెట్టుకో బాకు… వీపు పగులుద్ది’ అన్నాడు ఆ నేల మీద పడిన సీటు తీసుకుంటూ.
‘ఆల్రెడీ పగిలింది. మనీషను కున్నావా గొడ్డనుకున్నావా ?’ అన్నాడు వీపు రాసుకుంటూ.
‘బర్రెను బాదినట్లు బాదావు’ అన్నాడు ఆ కుర్రోడు.
‘నీకు ఆటికి తేడా ఏంటి మరీ…నాతో పెట్టుకోబాక బాక్సు పగులుద్ది!’ అన్నాడు కనకాంబరం.
సీటు బిగించి సైకిల్ ఎక్కి ఓ సారి తొక్కి సరిగ్గా సీటు మీద సీటు ఆనించి కూర్చునే ముందు ఎక్కడినుండి వచ్చాడో ఆ కుర్రాడు తెలీదు, వచ్చి ఆ సీటు కాస్తా లాగాడు. తర్వాత ఏమైయ్యిందో మనకు తెలుసు. గట్టిగా బాధతో కనకాంబరం అరిచాడు.
‘యూత్ తో పెట్టికోబాకు సీటు పగులుద్ది …’ 😛 అంటూ కాలర్ ఎగరేసాడు.
కనకాంబరం సైకిల్ దిగేలోగా శరవేగంతో పరిగెట్టాడు ఆ కుర్రాడు…
శుభం భూయాత్!
కౌండిన్య – 03/06/2017