భటులు పరెగెత్తుకుంటూ మహారాజా గారి పడక గది బయటకు వచ్చి నించొన్నారు. అందులో ఒక భటుడు ఆయనకు వినపడేలా “ఆజ్ఞ మహారాజా” అంటూ రాజు గారికి ఏదో సందేశం తెలియజేయటానికి వచ్చినట్లుగా ఉన్నారు.
విశ్రాంతి తీసుకుంటున్న రాజు గారు, భటుల అలికిడి విని కొంచెం విసుగు ప్రదర్శిస్తూ ప్రవేశించమని చెప్పమని అక్కడ ఉన్న భటుడికి సంజ్ఞ చేసారు, పడక గది తెర తీసారు. ఇద్దరు భటుడు లోపలకు ప్రవేశించారు. విశ్రాంతి తీసుకుంటున్న రాజుగారు మీసం మెలేస్తూ చెప్పండి అన్నట్లుగా సైగలు చేసారు.
“యువరాజా వారు కొత్తగా తయారు చేయించిన పల్లకీ ఎక్కడానికి తిరస్కరిస్తున్నారు మహారాజ” అని విన్నవించాడు.
“ఎవరక్కడ” అంటూ తన పాన్పు నుండి కేసరిలా గర్జిస్తూ లేచారు. రాజుగారు చర్యకు భటులు భయపడి వెనక్కి అడుగులు వేసారు.
“తిరస్కరణ రాజ లాంఛనాలకు విరుద్దం” అన్నారు మహారాజు గారు కోపం ప్రదర్శిస్తూ, తన ఒంటి మీద నుండి జారుతున్న పట్టు వస్త్రాలు మళ్ళీ కప్పుకున్నారు.
లోపల పడక గదిలో మహారాజు గారి మాటలకి, అక్కడ జరుగుతున్న అలజడికి మంత్రి గారు లోపలకు ప్రవేసించారు.
పరిస్థితి కనుక్కొని “మహారాజా గారు మీరు విశ్రాంతి తీసుకోండి. యువరాజా వారితో నేను మాట్లాడి వస్తాను” అంటూ ఆ భటుడితో బయటకు నడిచారు. మహారాజా వారు మళ్ళీ పానుపు మీద నడుము వాల్చారు కానీ ఆయన ముఖంలో కోపం ప్రతిబింబిస్తూనే ఉంది.
మంత్రి గారు అక్కడకు చేరుకొన్నారు. ఆ పల్లకీ మోసే మనుషులు నల్లగా నిగనిగలాడుతూ, బలిష్టంగా ఉండి ఆ పల్లకీని అవలీలగా ఎత్తేవారిలా కనిపించారు. వారితో పాటు బోలేడు భటులు యువ రాజు రక్షణ కోసం పల్లకీతో సహా నడిచేందుకు కూడా నించొని ఉన్నారు.
మంత్రి గారు యువరాజ గారిని కలిసి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. యువరాజ వారికి సర్థి చెప్పి ఆ పల్లకీలో కూర్చో బెట్టారు. ఆ పల్లకీ మోసే వారితో దానిని ఎత్తమన్నారు, యథావిధిగా ఎత్తడం జరిగింది. అదేమి చిత్రమో కానీ పల్లకీ ఎత్తగానే యువరాజా వారు పిల్లవాడి వలె తల్లడిల్లుతూ దించమని అరవడం మొదలు పెట్టారు. కంగారు పడి మంత్రిగారు ఆ పల్లకీ మోసే వారిని దించమని సైగలు చేసారు.
అలా ఆ పల్లకి క్రింద నేల మీద పెట్రగానే హడావుడి ఉక్కిరి బిక్కిరి అవుతూ చిన్న పిల్లవాడిలా బయటపడి “నేను ఎన్ని క్రోసులైనా నడుస్తాను కానీ ఇలా పల్లకీలో మాత్రం ఎక్కను” అంటూ మారం చేయడం చూసి ఆ మంత్రి గారు దగ్గరకు వెళ్ళి “చూడండి యువ రాజా, మన రాజ లాంఛనాల ప్రకారం మీరు పల్లకీలోనే విహరించాలికానీ ఇలా నడుస్తాననడం రాజవంశ్యం పరువు ప్రతిష్ఠకు తగ్గ విషయం” అంటూ యువరాజా వారిని వారించారు.
యువరాజు ససేమీరా ఎక్కనంటే ఎక్కనని తీర్మానించుకు నించొని ఉన్నారు. మంత్రిగారు తప్పేది లేక యువరాజ వారి ప్రయాణం నిలిపివేసి వారిని విశ్రాంతి తీసుకోమని రాజ భవనంలోక్ సాగనంపారు.
యువ రాజు గారి కోసం మహారాజు వారు ప్రత్యేకంగా ఈ మధ్యనే తయారు చేయించిన పల్లకీ అది. వజ్ర వైఢూర్య స్థగితమై , మేలిమి బంగారం తొడిగుతో మహారాజా వారి సింహాసనానికి ఏమాత్రం తీసి పోనట్లుగా ఉండి, ఆరుబయట సూర్యడి కాంతికి మెరిసిపోతూ కనపడుతోంది. కొన్ని రోజులు క్రితమే శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు కూడా జరిపించారు.
యువ రాజు వారు లోపలకు వెళ్ళిన తరువాత మంత్రిగారు స్వయంగా ఆ పల్లకీని పరిశీలించాలని నిశ్చయించుకున్నారు. మంత్రి గారు లోపల పరిచిన వాటిని, అలంకారాలతో సహా అన్నీ తీయించి క్షుణ్ణంగా అన్నీ కోణాలనుండి పరిశీలించారు. ఆయనకు ఏమీ తేడా కనిపించలేదు అన్నీ మళ్ళీ సర్థించేసారు.
మహా రాజు గారు యుక్త వయసు రావడంతో యువ రాజా వారికి త్వరలో వివాహము నిశ్చయం చేయించారు. తదనంతరం పట్టాభిషేక మహోత్సవం కూడా నిశ్చయించారు. ఆ వేడుకలకు సందర్భంగా రాజ్యాన్ని ముస్తాబు చేయించడమే కాకుండ యువరాణిని కలిసేందుకు వీలుగా యువరాజ వారికి ప్రత్యేకంగా పల్లకీని తయారు చేయించారు. తీరా చూస్తా యువరాజు గారికి పల్లకీ ఎక్కగానే తల్లడిల్లడం అందరినీ కలవర పెట్టింది.
మంత్రి గారు కూడా విఫలమైన సంగతి రాజు గారికి, ఇటు రాణి గారికి తెలిసి యువరాజు విశ్రాంతి భవనంలో సేద తీర్చుకుంటున్న చోటకు ఇద్దరూ చేరారు. తన పానుపుమీద అలసటగా పడుకొని ఉండటం చూసి రాణి గారు తక్షణం వైద్యులను పిలిపించమన్నారు. యవ రాజు పల్లకీలో యువ రాణి దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి అవడం వల్ల ఆమెను స్వయంగా వెంటపెట్టుకొమ్మని కబురుపంపారు మహారాణి గారు.
మహారాజు గారికి యువరాజు సుకుమారంగా ఉండటం ఇష్టపడక తనతో వెంటపెట్టుకొని ఆ పల్లకీ దగ్గరకు నడిచారు. మహారాజు గారు రావడంతో అందరూ అప్రమత్తమైయ్యారు. ఆయన స్వయంగా యువరాజ గారికి కలిగుతున్న ఇబ్బంది చూడ దలుచుకున్నారు కాబట్టి యువ రాజ వారిని పల్లకీ ఎక్కమన్నారు. తండ్రి మాట తిరస్కరించలేక బెరుకుగా పల్లకీ ఎక్కారు. ఆ మోసే వాళ్ళు పల్లకీని ఎత్తారు. యువ రాజు గారు మరొక సారి తట్టుకోలేక పోవడమే కాకుండా విరక్తి ప్రదర్శించడం చూసి మహారాజు గారు కూడా నిర్ఘాంత పోయారు.
ఈ సారి మహారాజు గారు స్వయంగా తనే పల్లకీ లో కూర్చొని పరిస్థితి తెలుసుకోవాలని తన భారీ కాయాన్ని కాస్తా పల్లకీలోకి దూర్చారు. ఆ మోసే వాళ్ళు ఎత్తిడం జరిగింది మహరాజు గారికి ఎటువంటి అసౌకర్యము లేకుండా తన సింహాసనంలో కూర్చున్నంత అనుభూతి కలిగింది. తన కుమారుడు మాత్రం ఎందుకు కూర్చోలేక పోతున్నాడో ఆయనకు అర్థం కాలేదు. మహా రాజు గారు పట్టు వీడ దలుచుకోలేదు. ఎలాగైనా యువ రాజు పల్లకీ ఎక్కలేకపోవడానికి కారణం తెలుసుకోవాలనుకున్నారు.
తక్షణం రాజ్యంలో ఉన్న జ్యోతిష్కులను, సిద్దాంతులను, మంత్రవైద్యులను పిలిపించారు. అక్కడకు చేరుకున్న భూతవైద్యులు తక్షణం ఉపశమనం కోసం అనుపానాలిస్తూ మంత్రాక్షతలు జల్లించారు. కానీ అవి తాత్కాలికంగా పనిచేయడం తప్ప ప్రయోజనం లేక పోయింది.
అక్కడకు వచ్చిన వారిలో ఒక ప్రసిద్ధుడైన సిద్దాంతి గారు బాగా ఆలోచించి మహా రాజు గారి దగ్గరకు వచ్చి తన అభిప్రాయం తెలియచేయటానికి అనుమతి ఇవ్వమన్నారు. సరేనన్నారు మహారాజుగారు.
“కొత్తగా చేయించిన పల్లకీ లో కుర్చున్న ఆసనం ఎదురుగా ఉన్న అద్దంలో భూతం దూరి ఉంది” అని అన్నారు. పల్లకీ తయారు చేయించిన వారిని పిలించమన్నారు. మహారాజు గారు తక్షణం తీసుకురమ్మన్నారు. తీసుకొని వచ్చారు. అతను వచ్చి వణికి పోతూ మహారాజు దగ్గర వినమ్రంగా నించొని ఉన్నాడు. అతనే జరిగింది ఇలా చెప్పడం మొదలు పెట్టాడు.
“మహా రాజా! పల్లకీ కోసం కావలసిన మంచి కలప కోసం అడవిలో చాలా రోజులు వెతికాను. అన్నింటికన్నా మంచిది తేవాలన్న తాపత్రయంతో సమయం వృధా అవ్వడంతో, గడువు సమయం ముగుస్తుందని నాకు తోచిన వాటిలో ఒక మంచి కలప చెట్టు లో ఒక భాగం నరకడం మొదలు పెట్టాను. ఆ నరికిన భాగాన్ని నేను తీసుకు వెడుతున్నంత సేపు నాతో ఎవరో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. అలసట కారణంగా నా మనసులో మాటలు నాకే వినపడుతున్నాయనుకొని పట్టించుకోకుండా దానితో నేను ముందుగా పల్లకీ లోకి అద్దం తయారు చేసాను. అంతా తయారుచేసిన తరువాత నేను మాత్రం ఆ అద్దంలో చూసుకోలేక పోయాను” అన్నాడు. అందువల్ల అద్దానికి ఉపయోగించిన కలపను పల్లకికీ ఉపయోగించకుండా వేరే మేలిమి కలపను కొనుగోలు చేసి పల్లకీని తయారుచేసాను. తప్పులేమైనా ఉంటే క్షమించమని ప్రాథేయ పడ్డాడు”.
ఆ సిద్దాంతి గారు మహారాజు గారితో “ఆ అద్దంలో చూసుకున్న వారికి వారిలో ఉన్న చెడు ఓ భూతంలా కనిపిస్తుంది, బహుసా అందువల్లే యువ రాజు గారు పల్లకీలో కూర్చోగానే ఎదురుగా ఉన్న అద్దంలో నుండి అలా కనపడటంతో ప్రవర్తన అలా ఉండవచ్చు” అని అభిప్రాయం తెలియజేసారు.
మహారాజు వారు ఆ పల్లకీ చేసిన అతని వైపు చూసి కోపం ప్రదర్శిస్తూ “అలాంటి అద్దాన్ని తెలిసి కూడా పల్లకీలో ఎందుకు ఉంచావు” అని ప్రశ్నించారు. “క్షమించండి మహారాజు. నాలో దోషాలున్నాయని తెలుసు కానీ మీ గురించి, యువవరాజు గారి గురించి చెడు ఎన్నడూ వినలేదు కాబట్టి అంత అందంగా కుదిరిన అద్దాన్ని తీయదలుచుకోలేదు” అన్నాడు.
మహారాజు గారు ఆ పల్లకీలో అద్దం తీయించి తీసుకురమ్మన్నారు. యువరాజ వారి ముందు ఉంచారు. మళ్ళీ చిన్న పిల్లవాడిలా తల్లడించడం గమనించారు మహారాజు గారు. ఇదంతా జరుగుతుంటే మహారాణి గారు కబురుపంపిన యువ రాణి గారు తన పల్లకీలో రావడం జరిగింది. మహారాజు గారు యువ రాణి గారిని పిలిపించి ముందర ఉంచారు. ఆమె ఎటువంటి ఇబ్బంది గురికాకుండా ఉండటం గమనించారు. ఒక వైపు ఆయన మనసులో ఎటువంటి చెడు లేదని తెలుసుకోవడం అదీకాక కాబోయే యువ రాణి గారి ఆలోచనలలో చెడు లేదని తెలుసుకున్నందుకు సంతోషం వేసినా యువ రాజు గారిని బాధిస్తున్నందులకు ఆ అద్దాన్ని ముక్కలు ముక్కలు చేయమన్నారు.
వెంటనే సిద్దాంతి గారు మహారాజు గారితో “దాని వల్ల ప్రయోజనం లేదని” తెలియజేసారు. అయితే దీని విరుగుడు కు ఏదైనా ఉపాయం చెప్పమన్నారు. ఇంతలో ఆ చెట్టు కొట్టిన అతను మహారాజు గారితో తను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వమంటూ తను ఆ కొమ్మ ఇంటికి తీసుకెడుతుంటే ఆ వినపడిన మాటల గురించి చెప్పడం మొదలుపెట్టాడు.
“చెట్లను నరకడం నీ వృత్తి ధర్మం కాదనను. కానీ నరికినందులకు బదులుగా మరో చెట్టు నాటిన నాడే నేను ఈ కొమ్మను విడిచి నా చెట్టుకు వెళ్ళి పోతాను అంతవరకూ ఈ కొమ్మను వీడను” అన్న సంగతి విన్నవించాడు. తను ఆ మాటలను పెడచెవిన పెట్టినందుకు క్షమించమని “నేను ఈ రోజే మొక్కను నాటుతాను” అంటూ వినయంగా నమస్కరించాడు.
రాజు గారు మంత్రి గారిని దగ్గరకు పిలిపించారు. రాజ్యంలో ప్రతీ ఒక్కరూ చెట్లు నాటించేలా చూడాలని ప్రస్తావనతో “రాజ్యంలో ప్రతీ ఒక్కరూ ప్రతీ పది ఏళ్ళు నిండగానే ఒక చెట్టు తప్పక నాటించేలా చూడాలి” అంటూ ఆజ్ఞ జారి చేయించమన్నారు.
సమస్య పరిష్కారానికి దోహద పడ్డ సిద్దాంత గారిని, ఆ పల్లకీ తయారు చేయించినతనిని రాబోయే పట్టాభిషేకం రోజు ప్రత్యేకంగా సత్కరించమని ఆదేశించి, సమస్య తొలగినందుకు సంతోషంతో రాజభవనం లోకి నడిచారు.
మంత్రి గారు, అక్కడ వేచి ఉన్న భటులు, వైద్యులు, సిద్దాంతులు, జ్యోతిష్కులు, మంత్ర వైద్యులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు!
శుభం భూయాత్!
కౌండిన్య – 10/03/2018