(గమనిక : ఇది మధ్యతరగతి మధురిమలు చూసిన వారు మాత్రమే చదువవలనని మనవి.. చూడని వారు ముందుగా అమెజాన్ ప్రైమ్ లో చూడండి, బావుంది.. నాకైతే నచ్చింది.. ఇక సీక్వెల్)
“చందాలకి ఐదువందల్ చాలదా?.. హోటల్ పెట్టి రెండు సంవత్సరాలు కాలే.. ఇంతకంటే ఎక్కువ ఇయనీకి నేనైమే హౌలాగాని లెక్క కనపడుతున్నాను బే” అంటాడు రాఘవేంద్ర.
“అన్నా.. వీడే అన్నా.. క్రితం సంవత్సరం ఎదురుగా న్యూ రాఘవేంద్రా హోటల్ బోర్డు పెడుతుంటే పీకాడు” అన్నాడు ఒకడు.
“వీడి సంగతి కొత్త కార్పొరేటర్ అన్నకి చెబితే మన అన్నే చూసుకుంటాలేరా పదా” అంటూ బయటకు ఇద్దరూ నడిచారు.
“బావా .. అందరితో అలా గొడవపడితే ఎలా? కొంచెం లౌక్యం నేర్చుకోవాలి.. అదీకాక నువ్వు మీ నానగారిలా గుంటూరు ఘాటైన భాష నేర్చుకుంటే మంచిది” అంటుంది సంధ్య.
“నా బాష ముంబై చట్నీ టేస్టు లాగా అస్సలు మారదు అంతే” అని బయటకు నడిచి చట్నీ కు కావలసిన కాయలకోసం మావిడి చెట్టెక్కాడు.
“బావా.. ఓ రెండు కాయలు ఎక్కువ కోయి.. ఎందుకో తినాలని ఉంది” అంటుంది సంధ్య.
చెట్టు దిగి కాయలతో లోపలికి నడుస్తూ ఓర చూపులు చూస్తున్న సంధ్యను చూసి పరిస్థితి అర్థమై, ఆ మావిడి కాయల్ని గాలిలో విసిరేసి అమాంతంగా ఎత్తుకొని ఓ పాట పాడుకుంటారు రాఘవ, సంధ్య.
తరువాత రోజు కొత్త కార్పొరేటర్ తాలూకా కుర్రోళ్ళు మళ్ళీ ఎదురుగా న్యూ రాఘవేంద్ర హోటల్ బోర్డు పెడుతూ రాఘవేంద్ర ఎదురు రావడం చూసి ఒక నోటిస్ అందిస్తారు.
దాంట్లో “రూల్సు ప్రకారం ఆ మావిడి చెట్టు గవర్నమెంటు వారి ఆస్తి అని, ఇక ముందు కాయలు కోయడానికి వీలు లేదని” ఉండటం చూసి దాన్ని చింపి గొడవబడపోతాడు. సంధ్య ఆపడంతో తన హోటల్ లోకి కోపంగా నడుస్తాడు.
ఇంతలో తండ్రి కొండల్రావు, తల్లి సొంత ఊరునుండి దిగుతారు. ఇదంతా చూసిన కొండల్రావు “ఏందిరా.. నే చెప్పానా.. ఉన్న ఊర్లలో మనకు బలం కాని ఇలాంటి పెద్ద ఊర్లలో గవర్నమెంటు వాళ్ళతో మనలాంటి మధ్యతరగతి వాళ్ళు పెట్టుకోకూడదు” అంటాడు. “నాన్న.. మీరు ముందు లోపలికి రండి.. నే చూసుకుంటాగా..” అంటాడు రాఘవేంద్ర.
“ఈ చెట్టు కాకపోతే గుంటూరు పెద్ద మార్కెట్ లో మావిడి కాయలు దొరకవా ఏంది?” అంటాడు కొండల్రావు.
“ఇంకెక్కడ పెద్ద మార్కెట్ నాన్న.. ఎప్పుడో పీకేసారు.. బహుసా మాల్ కట్టి వెజిటబుల్ ఫ్రెష్ వాళ్ళు సూపర్ స్టోర్ పెడుతున్నారు” అంటాడు రాఘవేంద్ర.
“అక్కడే కొంటాం రా.. మనకి ఏడైతే ఏంది?” అంటాడు కొండల్రావు.
“అయినా అన్నీ సీజన్ లో మావిడి కాయలు దొరకవురా కన్నా.. కాబట్టి కొత్త వంటకాలు కనిపెట్టాలి.. ఎన్ని రోజులు ఒకే వంటకం మీద ఇలా..” అంటుంది రాఘవ తల్లి లక్ష్మి.
“అదే అమ్మ రోజూ ప్రయోగాలు చేస్తూనే ఉన్నానమ్మా.. “ అంటాడు. తరువాత రోజు తల్లితండ్రులు పల్లెటూరికి వెడిపోతారు.
మళ్ళీ కార్పొరేటర్ మనుషులు ఏదో విషయంతో విసిగించడం మొదలపెడుతుంటారు. కొన్ని నెలలు గడుస్తాయి చలికాలం వస్తుంది. మావిడి కాయల సీజన్ అయిపోవడంతో అవి లేకుండానే ముంబాయి పచ్చడి చేయడంతో అందరూ క్వాలిటి పడిపోయిదంటారు, ఎదురు న్యూ రాఘవేంద్రాకు జనాలు పెరుగుతారు. రాఘవకు మళ్ళీ మధ్య తరగతి కష్టాలు మొదలవుతాయి.
సంధ్యకు నెలలు దగ్గర పడుతుంటే రాఘవేంద్ర కార్పొరేటర్ మనుషులతో గొడవలు పడటం, పైగా ఎదుటి హోటల్ లో జనాలు పెరగడం చూసి “బావా.. మీ నానగారు ఇచ్చిన స్తలం ఉంది చూడు అక్కడ హై వే వచ్చిందిట.. అక్కడ మన హోటల్ పెడితే బావుంటుందేమో..” అంటుంది సంధ్య.. రాఘవేంద్ర ఆలోచనలో పడతాడు.
ఇంతలో గోపాల్ పోన్ చేస్తాడు “ఒరేయ్.. నీకో గుడ్ న్యూస్ .. గౌతమి కి డెలివరీ అయ్యిందిరా.. బాబు పుట్టాడురా..” అంటాడు. సంధ్య వైపుకు తిరిగి “నాకు పాప పుడితే వాడికే ఇచ్చి పెళ్ళి చేస్తానురా..” అంటాడు.
“నువ్వు మన ఊరు వచ్చేయకూడదు.. మళ్ళీ పాతరోజుల్లా ఇంచక్కా గడపవచ్చు.. పట్నంలో అందరికీ దూరంగా ఎందుకురా.. హోటల్ పెట్టాలనుకున్నావు ఆ దురద తీరింది కాబట్టి ఇక వచ్చేయ్ రా.” అంటాడు మళ్ళీ రాఘవ ఆలోచనలో పడతాడు.
“ఓరేయ్ .. ఏం మాట్లాడవేంటి.. మా పెదనాన్నకు రావలిన రోడ్డు తాలూకు డబ్బులు గవర్నమెంటు వాళ్ళు ఇచ్చారురా.. మా అన్నయ్య మీ నాన్నకు వడ్డీతో సహా ఏడున్నర లక్షలు మొన్ననే ఇచ్చాడు.. “ అని చెబుతాడు గోపాల్. “నాన్న డబ్బులు ఇక వాడుకునే ఉద్దేశం లేదురా.. నా కాళ్ళ మీదే నిలబడుతాను.“ అంటాడు.
రాఘవేంద్ర అంత సులభంగా వెనక్కి తిరిగి ఎక్కడినుండి వచ్చాడో అక్కడికి చేరతాడా? లేక ఉన్న చోటే ఉండి కొత్త రెసిపీతో పాటు కార్పొరేటర్ తో పోరాటం సాగిస్తాడా? లేక సంధ్య చెప్పిన మాట విని హైవే దగ్గర కొత్త హోటల్ బ్రాంచి పెడతాడా? ఇలా మధ్యతరగతి ఆలోచనలతో రోజులు గడుస్తాయి..
ఈ లోగా కార్పొరేటర్ కుర్రాళ్ళతో మధ్యలో రాఘవేంద్ర రెండు ఫైట్స్ చేస్తాడు..
చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ సొంత ఊరు మీద గాలి మళ్ళి, తల్లితండ్రులను , గోపాల్ ని కూడా కలవాలని సొంత ఊరు వెళ్ళి అక్కడ పచ్చటి పైర్ల మధ్య రాఘవ, సంధ్య ఓ డ్యూయెట్ పాడుకుంటారు.
గోపాల్ పెదనాన కొడుకు శ్రీను అందరి డబ్బులు తిరిగిచ్చే అందరి దగ్గరా పేరు తెచ్చుకొని వాళ్ళ నానగారి ఆశయం నిరవేర్చేలా ఎమ్ ఎల్ ఏ పదవికి ఇండిపెండెంట్ గా నిలబడతాడు. గెలిస్తే ఊరిని గుంటూరు లా సిటీ ని చేస్తానని చెబుతాడు.. గోపాల్, రాఘవేంద్ర కూడా ఊర్లో అంతా శ్రీను పార్టీ కోసం బాగా ప్రచారం చేస్తారు.
పాలుపోసే అంజయ్య మనవరాలు విదేశాలలో పై చదువులు చదివి అక్కడ ఉద్యోగం వచ్చినా తాతయ్య అంజయ్య పెద్దవాడయ్యాడని తిరిగి తన సొంత ఊరు వచ్చేస్తుంది. ఒక సారి ఊరు ఎంత మారిందో చూడటానికి అలా వెడుతుంటే శ్రీను కు ఎదురుపడుతుంది. శీను తరువాత అంజయ్య మనవరాలని తెలుసుకుంటాడు.
ఓ సారి శ్రీను అంజయ్య ఆరోగ్యం గురించి వాకబు చేయటానికి వచ్చినపుడు ఇద్దరికి పరిచయం పెరుగుతుంది.
అంజయ్య మనవరాలు ఊరి బాగోగులకోసం శ్రీనుకు బోలేడు సలహాలు ఇస్తుంది. శ్రీను వాటి వల్ల ఆ ఊర్లో ఎలెక్షన్లో గెలుస్తాడు.
శ్రీనుకి అంజయ్య మనవరాలి మీద అభిమానం పెరుగుతుంది కానీ అంజయ్య వయసు రీత్యా అనారోగ్యంతో పోయిన తరువాత ఆ పల్లెటూరు లో ఉండటానికి ఇష్టపడదు, గుంటూరు సిటీ కి వెళ్ళాలని అనుకుంటుంది. గోపాల్ తనని అక్కడకు వెళ్ళి రాఘవేంద్రాని కలవమంటాడు.
ఇక రాఘవేంద్ర గుంటూరు లో కొత్త రెసిపీతో “పులిహార కుక్కిన ఇడ్లీ” ను కనిపెడతాడు. దాని వల్ల మళ్ళీ జనాల రద్దీ బాగా పెరుగుతుంది.
పాత షెడ్డు పీకి రెండస్తుల హోటల్ కట్టాలనుకుంటాడు, కానీ కార్పొరేటర్ నానా తిప్పలు పెట్టడంతో ఎత్తులు పన్నుతుంటాడు. తను వచ్చే ఎలక్షన్ లో కార్పొరేటర్ కు ఎదురుగా నుంచోవాలనుకుంటాడు.
అంజయ్య మనవరాలు గుంటూరు చేరుతుంది. శీను ని గెలిపించినట్లు రాఘవేంద్ర గెలిపిస్తాను అంటుంది. గుంటూరులో నాలాగా సెటిల్ చేస్తే బాధ్యత నాదే అంటాడు అంజయ్య మనవరాలితో.
కార్పొరేటర్ కు బాగా ఖర్చులు అయ్యేటట్లు తెలుస్తుంది. సంధ్య హైవే దగ్గర స్థలం అమ్మేద్దామని సలహా ఇస్తుంది. పెద్దవాళ్ళని వొప్పించి దానిని అమ్మేసి ఆ డబ్బులతో బాగా ఖర్చు పెట్టి మొత్తానికి కార్పొరేటర్ అవుతాడు రాఘవేంద్ర. ఈ సుభసందర్భంలో సంధ్య, రాఘవేంద్ర ఓ డ్యూయెట్ పాడుకుంటారు.
ఇక పాలిటిక్స్ లో బిజీ అయిన రాఘవేంద్ర తన హోటల్ బిజినెస్ ను అంజయ్య మనవరాలికి అప్పచెప్పి చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ కింద చేసే బాధ్యత తనదేనంటాడు. ఛాలెంజి గా తీసుకుంటానని మాట ఇస్తుంది.
ది ఎండ్
రాఘవేంద్ర కార్పొరేటర్ గా మంచి పేరు తెచ్చుకుంటాడు. తన హోటల్ బిజినెస్ కూడ అంజయ్య మనవరాలి సహాయంతో ఓచైన్ గా తీర్చి దిద్దుతాడు. ఇలా సాగుతుండగా…
ది నెవర్ ఎండ్
రాఘవేంద్ర కార్పొరేటర్ గా పలుకుబడి ఉపయోగించి పలు చోట్ల గవర్నమెంటు స్థలాలలో హోటల్ పెట్టి దూసుకు పోతున్నాడని, ఆ హోటల్ మూసేయాలని ఓ న్యూస్ ఛానల్ వాళ్ళు రిపోర్టు చేయడంతో మళ్ళీ కొత్త మధ్య తరగతి కష్టాలు మొదలవుతాయనమాట… అదీ సంగతి!
కౌండిన్య – 21/11/2020