చల్లటి గాలి. అలా గాలి వీస్తుంటే ఆ ఆకాశం లో వెడుతున్న మేఘాలు రకరకాలుగా ఆకారాన్ని మారుస్తూ కనిపించాయి. ఇంకా అలాగే వాటిని చూస్తూ ఉంటే ఓ మేఘం చేతులు జాపింది. అరే, భలే వింతగా ఉందేనని ఇంకా తీక్షణంగా ఆ మేఘాన్ని చూస్తూ
మైమరిచాను. నా రెండు చేతులు ఆ మేఘనికి అందించాను. నా ఒళ్ళంతా తేలిపోతొంది అలా ఆ మేఘాల లోపలికి వెడుతున్నట్లుంది. అలా ఆ మేఘాలలో కలుస్తూ న్న నాకు చల్లటి చిరుగాలి తగులుతోంది, ఆ చల్లదనం నా ఒళ్ళంతా సోకి మనసుకు ఎంతో చెప్పలేనంత ఆహ్లాదకరంగా ఉంది.
కొన్ని మేఘాలు సుతిమెత్తగా నా ఒంటి కి తగులు కుంటూ వెడుతున్నాయి. నన్ను ఆ పైకి తీసుకొని వెడుతున్నాయి, అక్కడికి చేరిన తరువాత ఆకాశం నుంచి చూస్తే దట్టమైన మేఘాలలోంచి కింద ఏమి కనపడడం లేదు. నేను ఇంకా అలా తేలుతూనే ఉన్నాను. ఓ సారి అలా ఆ మేఘాలను కళ్ళు చిట్లించి పరిశీలనగా చూసాను. ఓహో ఓక అద్భుతం! కొన్ని మేఘాలు నన్ను చూసి చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నాయి. కొన్ని మేఘాలు మాత్రం పరాయివాడిని చూసినట్లుగా నన్ను వింతగా చూడటం మొదలు పెట్టాయి. మరికొన్ని నన్ను చూసి వెంటనే అదృశ్యమవు తున్నాయి. అరే!రకరకాల మనుషులని చూసాను కానీ, ఇలా రకరకాల మేఘాలను చూస్తానని ఎన్నడూ అనుకోలేదు.
అలానే చూస్తుంటే ఓ మేఘం తొలిగి నింగి నుండి దూరంలో ఉన్న నేల కనిపించింది. ఎక్కడున్నానా అని ఓక్కసారి భయం వేసింది. ఉలిక్కి పడ్డాను, గుండె అకస్మాత్తుగా జారినట్లయ్యింది, భయంతో హృదయం బరువెక్కింది, దానితో ఒళ్ళంతా చమటలు పట్టి కంగారు వచ్చి శరీరం మోయలేనంత భారంగా తయారయ్యింది. కిందకి పడిపోతానేమో అన్న భయంతో నేలమీదకు జారిపోబోతున్న వేళలో, ఓ మేఘం అలావచ్చి నన్ను తాకింది. ఆ చల్లదనానికి మళ్ళీ నా హృదయం కొంచెం తేలికయ్యి నా శరీరాన్ని మళ్ళీ పై పైకి తేలింది, అది ఫర్వాలేదు అని అభయం ఇచ్చింది. అది అనడంతో ఉన్న భయం పోయి మళ్ళీ అలా తేలుడం మొదలుపెట్టాను. ఇంక ఇప్పటి నుండి కిందపడను అన్న ధైర్యం వచ్చింది, అన్ని మేఘాల లాగా నేనూ తేలుతున్నాను.
ఇలా గాలిలో తేలడం ఆ మేఘాలు నాకు నేర్పాయా ? లేక, నా అంతట నేనే నేర్చుకున్నానా అర్ధం కావడం లేదు. ఆ కొత్త అనుభూతి హద్దులుమీరి ఉంది. నీళ్ళళ్ళో పిల్లవాడు కేరింతలు కొట్టి ఆడుకుంటున్నట్లు టప టప కొట్టాను. “అబ్బ అబ్బ”, అని అరుపులు వినిపించాయి, ఇంతలో స్పృహలోకి వచ్చి చేసిన పొరపాటు మన్నించమని అడిగాను. తీక్షణంగా వీక్షించడంతో పాటు, అవి చేసే శబ్ధాలు కూడా వినడం మొదలుపెట్టాను. ఇందాకా నాకు ధైర్యం చెప్పిన వెండి లాంటి ఆ మెరిసేటి మేఘం కాబోలు మళ్ళీ దగ్గరకు వచ్చింది. దాని స్పర్శ అదో విధమైన అనుభూతి కలిగిస్తోంది, ఆ చల్లదనంలో అది కూడా మధురానుభూతే. ఉండబట్టలేక మీరెవరు అని అడిగాను. ఓక్క నిమిషంలో వేరే మేఘం లో కలిసిపోయింది. ఎంత వెతికానా మళ్ళీ కనపట్టం లేదు.
అన్ని మేఘాలను పరిశీలిస్తున్నాను ఆ మేఘమాల కోసం ఎదురు చూస్తున్నను. గాలిలో అన్నీ మేఘాలు కదులుతున్నా కదలిక లేనట్లే ఉన్నాయి. కొన్ని దట్టంగా ఉన్నాయి, కొన్ని పల్చగా కదులుతూ మిగతా వాటితో కలిసిపోతున్నాయి. కొన్ని కారునలుపు లో ఉంటే , కొన్ని మెరిసే వెండిలాగా ఉన్నాయి. ఎప్పుడైతే దూరంగా మేఘాల నుండి నేల కనిపిస్తోందో అప్పుడు తెలుస్తోంది ఎంత వేగంగా ప్రయాణం చేస్తున్నామో నని. ఇంతలో మళ్ళీ వెండిలాంటి మెరిసేటి ఆ మేఘమాల ప్రత్యక్షమైయ్యింది. పలకరించాను, దయచేసి మాయమవ్వద్దని తనతో మాట్లాడలాని నా యొక్క విన్నపం తెలిపాను. చిరునవ్వు నవ్వినట్లు తెలుస్తోంది. నేను నవ్వాను. నన్ను దగ్గరకు రమ్మని పిలిచింది, పడవలా అలా మేఘాలను తోస్తూ తన చెంతకు చేరాను. ఓ మేఘాన్ని మలిచి మాలను నాకు వేసింది. చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళింది.
ఆశ్చర్యం. మన ఇళ్ళకంటే పెద్ద పెద్ద భవనాలు. రకరకాల రంగులతో శోభిల్లితున్నాయి. భవనాలతో మధ్యలో పెద్ద పెద్ద తోటలు. ఓ తోటలోకి తీసుకొని వెళ్ళి ఓ మేఘాన్ని మలిచిన ఆ కుర్చీ మీద ఆసీనులను కమ్మంది. తన వాళ్ళని తీసుకొస్తానని నా కళ్ళకు గంతలు కట్టి మాయమైయ్యింది. కొంత సేపట్లో ఎక్కడినుండో వేడిగాలులు సోకుడం మొదలయ్యాయి. నా కళ్ళగంతలు తీద్దామని ప్రయత్నించినా రావడం లేదు, కానీ మేఘాల కదలిక బాగా తెలుస్తోంది. మేఘాలు ఆందోళనతో అరుస్తున్నాయి. అవి విని నా గుండె బరువెక్కడం మొదలు పెట్టింది. కిందకి జారుతున్నట్లు ప్రస్పుటంగా తెలుస్తోంది. ఇంతలో ఆ చల్లటిగాలి తో నా మేఘమాల నా దగ్గరకు వచ్చి మరు జన్మంటూ ఉంటే ఇక్కడే ఇలాగే కలుద్దామని చెప్పి, నా కళ్ళ గంతలు తీసి నీరు చిందుతూ మాయమైయ్యింది. నేను నేల మీద పడటానికి ఏంతో సమయం లేదని అర్ధం అయ్యింది.
కింద పడినా పెద్దగా దెబ్బలేమి తగల లేదు. నా రూమ్ మేట్ అరుస్తున్నాడు “ఓరేయ్ ఏవయ్యింది రా? ఆ దోమ తెరతో ఆడుకోవడం ఏంటి? పక్కమీద కేరింతలు కొట్టడమేండి, ఎవరితోనో ఆ పలకరింపులేంటి, ఆ ఇకఇక లేంటి, పకపక లేంటి? ఆ పడవను నడపటం ఏంటి? ఆ మేఘమాలెవరు, ఈ గోలేంటి ? నీకు మతి పోయినట్లుంది?”, “అర్జెంట్ గా వెళ్ళి వార్డెన్ సార్ తో చెప్పి రూమ్ మార్పించుకోవాలి”, అంటూ బయలు దేరాడు. వాడిని ఆపి, అవునూ నేను నేల మీద ఎందుకున్నాను, అని అడిగాను. “నా కాలితో గట్టిగా తన్నాను కాబట్టీ”, అన్నాడు వెటకారంగా. “వర్షం పడిందా”, అని అడిగాను. “నేనే నీళ్ళు చల్లా ఏదైనా ప్రాబ్లమా”, అని అడిగాడు కోపంగా. లేదని, “ఈ ఒక్క సారి కి క్షమించి వదిలేయ్ రా బాబు”, అని బతిమలాడాను, వినకుండా బయటకు వెళ్ళి పోయాడు. ఆ మేఘమాల ఎలా ఉందో సరిగా గుర్తుకు రాక మళ్ళీ నిద్ర పోతే కనిపిస్తిందేమో నని ఆ దోమతెరలోకి దూరాను.
శుభం భూయాత్!