హే చందన్చీ ఘరాహే ..కీ ..వందన్చీ ఘరాహే!
హే అభినందనా ఛే ఘరాహే!
కాలాపేక్షాహి సూనా రామ్టెక్ ఘరాహే!
రామ్టెక్ – నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన ఊరు. పాతకాలంలో ఈ ఊరిని “రామ తేకడి” అని పిలిచే వారుట. మరాఠి భాషలో తేకడి అంటే పర్వతం అని అర్థం. ఇక్కడ ఉన్న వింధ్య పర్వతానికి శ్రీరాముడు అరణ్యవాస సమయంలో సీతా లక్ష్మణ సమేతంగా అడుగుపెట్టడం మూలాన దీనికి “రామ తేకడి” అని పేరు వచ్చిందని, ఈ రామ తేకడే కాలాంతరం “రామ్టెక్” గా మారిందని చెబుతారు.
ఈ కొండ మీద ఆ కాలంలో ఋషులు తప్పస్సు చేసుకునే వారుట, వారిని కొంతమంది రాక్షసులు రోజూ ఆటంకం కలిగిస్తుండగా వారు శ్రీ రామచంద్రుల వారిని కోరగానే ఆ మహాప్రభువు ప్రతిజ్ఞ చేసి, రాక్షసులను సంహరించి వారికి అక్కడ బుషులకు ఉపశమనం కలిగించారుట.
ఈ ప్రదేశానికి ఇంకొక విశిష్టత ఏమిటంటే కవులందరూ గురువుగా భావించే కవికులగురువైన మహాకవి శ్రీ కాళిదాసు మేఘసందేశాన్ని రచించిన ప్రదేశం. నేను చదివిన కాలేజీ కిట్స్ (కవికులగురు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సు) లో కూడా ఆయన బిరుదు కలిసి ఉంటుంది.
ఈ మేఘసందేశం మహాకావ్యంలో యక్షుడు తన ప్రేయసికి మేఘాల ద్వారా సందేశం పంపండం జరుగుతుంది. ఈ పద్య కావ్యం “మందక్రాంత” అనే రమ్యమైన శైలి కలిగి వినడానికి కూడా తీయగా ఉంటుందిట. ఈ కావ్యం గురించి ఎన్నో వ్యాసాలు రాసినవారు మరియు అనువాదాలు చేసిన ఎందరో మహనీయులున్నారు.
ఇప్పటికి కూడా రామ్టెక్ ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది నాగపూర్ నుండి ఓ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశం. ఈ కొండ మీద రామాలయాన్ని ఆ కాలం నాటి యాదవ రాజైన శ్రీ రామ్ దేవ్ రాజుగారు నిర్మించారని చెబుతారు. ఇక్కడ సీతా రామాలయంతో పాటు లక్ష్మణ, హనుమాన్ ఆలయాలు కూడా ఉన్నాడు. ఇవే కాకుండా అక్కడ వరాహ మందిరం కూడా ఉంది. ఆ వరాహ మందిరం ముందున్న వరాహ విగ్రహం క్రింద నుండి దూరి అవతలకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ కొండ పైన ఆలయాలతో పాటు రామ్ కుండ్, సీతా కుండ్ అని రెండు చక్కటి కోనేరు కట్టడాలతో కనిపిస్తాయి. సీతా కుండ్ నుండి చల్లటి గాలితో రామ్టెక్ ఊరును వీక్షించవచ్చు.
ఈ ఊరి మరాఠీ వారికి తెలుగు వారు సుపరిచయమే. బహు బాషా కోవిదుడైన శ్రీ పి వీ నరసింహారావు గారు ఇక్కడే నుండి చాలా సార్లు రాజ్యసభకు గెలిచారు మరియు మరాఠిలో అనర్గళంగా మాట్లాడగల అపార మేధావి మరియు తెలుగు సాహిత్యంలో ఓ దిగ్గజం. ఈయన “సహస్రపణ్” అనే పేరుతో శ్రీ విశ్వనాథ వారి “వేయిపడగలు” నవలను హిందిలోకి అనువదించిన సంగతి అందరికీ తెలిసినదే.
ఇటీవల జరిగిన శ్రీ రామ నవమి సందర్భంగా వాట్సప్ లో మిత్రుడు వీడియో పంపగానే ఆ ప్రదేశం గురించి రాయాలని ఇది రాసి ఆ వీడియో ఇక్కడ పోస్టు చేస్తున్నాను.
నాతో పాటు చదివిన కాలేజీ మిత్రులు ప్రపంచం నలుమూలలా ఉన్నా ఆ ప్రదేశంతో ముడిపడినందుకు ఏదో ఒక అవినాభావ సంబంధం ఉండి ఉండాలి. పుట్టడం ఆంధ్రాలో పుట్టినా, మహారాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువులు అక్కడే ఉద్యోగం మొదలుకొని తరువాత యు కె లో ఇన్నేళ్ళు స్థిర పడటం అంతా జీవిత ప్రయాణంలో ఒక భాగం.
ఆ నివసించిన ప్రదేశాల గురించి ఏ వీడియోనో చూసినపుడు ఆలోచనలు అక్కడి దాకా వెళ్ళి అక్కడ గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకోవడం సహజం. అక్కడ మా చుట్టాలు కూడా ఉండటంతో నాలుగేళ్ళు ఎలా గడిచాయో తెలీదు. తాతగారు, బామ్మ, బాబు, కన్ని, చిన్ని, సుమ, కోటిరెడ్డి, జనార్థన్, శ్రీను, చరణ్ తదితరులతో ఇట్టే గడిచిపోయింది.
హాస్టల్ నుండి పదే పదే చుట్టాలింటికి వెడుతూ ఉండటంతో నన్ను హాస్టలో నివసించేవాడిగా కాకుండా లోకల్ మరాఠీ వాడిగా పరిగణించి “లోకల్ రమేష్” అన్న ముద్ర వేసి, ఇప్పటికీ కాలేజీ మిత్రులు “ఎవడు? ఆ లోకల్ గాడేనా” అంటే కానీ గుర్తు రాకుండా చేసారు కాబట్టి “నేను పక్కా లోకల్”!
ఆ శ్రీ రాముని దయతో, కాళిదాసు కొలిచిన గీర్వాణిని అనుగ్రహంతో ఎపుడో ఓ సారి రామ తేకిడిని ప్రస్తావిస్తూ కొంత కాలం క్రితం రాసిన తవిక.
అయ్యా, రామయ్య.
అనుజుడు లక్ష్మణుడుని తోడ విశ్వామిత్రుని ఆశ్రయించి
అస్త్ర శస్త్ర విద్యలు నేర్చితి వయ్యా
తాటకిని వధించి రక్షణ చేసి
ఋషుల యజ్ఞం కాపాడితి వయ్యా
ధనస్సు విరిచి ధీరునని చాటి
జానకిని పరిణయము గావించితి వయ్యా
మందర కైకేయి ఈర్ష్యకు బలి అయ్యి
సీతా లక్షణ సహిత అరణ్యము పాలైతి వయ్యా
రాజ్యము వదిలి వనవాసం పాలై
దశరథునకు బహు వేదన గొల్పితి వయ్యా
నీ పాదరక్షలు తోడ రాజ్యము ఏలగోలిన
తమ్ముడు భరతుని దీవించిన వాడి వయ్యా
రాయిని తాకి అహల్యగా మార్చి
శబరి కొరికిన ఫలము లారగించిన వాడ వయ్యా
మాయ లేడి వెనుక పడి
సీతామాతను రాక్షసునికి అప్పగించినా వయ్యా
తేకిడికి ఏగి రామ తేకిడిగా మార్చి
వింధ్య పర్వతములు దాటి అన్వేషణ కొనసాగించితి వయ్యా
వానర అధిపతి వాలిని ఓడించి
సుగ్రీవునకు తిరిగి రాజ్యమును ఇప్పించితి వయ్యా
భక్తి తో మ్రొక్కిన సుందర భాష్యడు
హనుమంతుడు ని చేరదీసితి వయ్యా
వేయి యోజనాల లంకకు ఏగి
హనుమంతుడి తో సీతమ్మ జాడ తెలిసికొంటి వయ్యా
కపి వానరులతో కడలికి సాగి
వారధి కల్పన చేయించితి వయ్యా
లంకకు సాగి రావణుని తోటి
ఘోర యుద్ధము సాగించి గెలుచితి వయ్యా
పుష్పక విమానం లో సీతా సహిత
అయోధ్య కు చేరి రాజ్యము తిరిగి నేలితి వయ్యా
లోక పరోక్షతో ధర్మ రక్షణకు
సతిని అడవులపాలు చేసినవాడ వయ్యా
సీతా వియోగక్షోభతో ఉన్నా రాజ్య క్షేమం కోరి
అశ్వమేధయాగం పూనితి వయ్యా
లవకుశ ద్వారా స్వీయచరిత్ర విని
జానకి జాడ తెలుసుకొంటి వయ్యా
అవనిజ నినువీడి భువిలో కలిసిన
బహు దిగ్భ్రాంతి పొందినవాడ వయ్యా
మరా మరా మరా మ రామ రామ రామ
కౌసల్యా సుప్రజా రామ
సుగుణాభి రామ
అయ్యా, నా రామయ్య!
ఇదంతా ఎలా ఉన్నా నేను పొద్దున్నే బ్రేక్ ఫాస్టుకు మిరపకాయ బజ్జీని పల్నాడు కొరివి కారంలో ముంచుకు తినడమో లేదా దోసె మీద దండిగా ఎర్రటి కారప్పొడి కారం జల్లించి తినేసి కాఫీతో ముగించే నాకు అక్కడ జిలేబి తో మొదలుపెట్టి, పోహా, సమోసా, పకోడ, టీ లాంటి పదార్థాలతో నా నాలికలోని పౌరుషం చప్పబడిందనే చెప్పాలి.
కౌండిన్య – 28/03/2018