బాల్యదశలో రాముడు, తల్లి కౌసల్యా దేవి ల మధ్య ఓ అనిర్వచనీయ సంభాషణ ( శ్రీ విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం బాల కాండలోని అవతార ఖండం లోని మూడు వందల ముప్పై నాలుగవ పద్యం )
ఓ నాడు కౌసల్యా దేవి బాల రామచంద్రమూర్తి కి స్నానం చేయించి కూర్చోబెట్టి అతనిచే మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. ఒక్కొక్క మాట తల్లి చెబుతుంటే రాముడు అంటున్నాడుట.
శా.
తానో ‘లాములు’ తండ్రిపేరెవరయా? ‘దాచాతమాలాలు’ ‘నౌ
లే! నాపే’రన ‘నమ్మగాల’నఁగ నోలిందల్లి’ కౌసల్య తం
డ్రీ! నాఁగాననఁబోయిరాక కనులన్ నీర్వెట్టఁ ‘కౌసల్యనౌఁ
గానే కానులె యమ్మనే’ యని ప్రభున్ గౌసల్య ముద్దాడెడిన్.
“నాన్నా నీ పేరేంటి?”
“లాములు” ( రాముడు )
“నాన్న పేరు?”
“దాచాత మాలాలు” ( దశరథ మహారాజు )
“నా పేరో?”
“అమ్మగాలు” ( అమ్మ గారు )
కాదు, “కౌసల్య”. తండ్రీ!
బాబుకు కౌసల్య అని అనడానికి రాక కనులలో నీరు వచ్చింది. అప్పుడు అమ్మ “కౌసల్యను కానులే అమ్మనే” అని ముద్దుపెట్టుకుంది.
పిల్లలు వచ్చీ రానే మాటలలో మాట్లాడడం ఎంత ముచ్చటగా చూపించారు, అదీ కాక రాముడు తెలుగు లో మాట్లాడితే ఎలా ఉంటుందో చవి చూపించిన మహనీయులు. ఆ తల్లి కౌసల్య దేవి రాముని తో పలికించిన ముద్దు మాటలు అనిర్వచనీయం.
కౌండిన్య – 15/12/2017