సాహితీ సమరాంగణ సార్వభౌముడు ఆంధ్రభోజుడు అష్ట దిగ్గజ కవిరాజ పోషకుడ అగు శ్రీ కృష్ణదేవరాయలు రచించిన ప్రబంధ రాజము “ఆముక్తమాల్యద”. దీనిలో దశావతారాలు వర్ణిస్తూ శ్రీరామావతారం లో రాముడికి రావణాసురుడి కి మధ్య భీకర యుద్ధం జరుగుతున్నపుడు శ్రీరాముడి బాణాలు ఏలాటి శబ్థాలు చేస్తున్నాయో తెలియజేస్తూ ఆ పద్యాన్ని భీభత్స రసంలో (భయానకం) రచించారు. ఈ పద్యం చదవటానికి భీభత్సంగా ఉన్నా పక్కన ఉన్న వారిని పట్టించుకోకుండా నాలాగా గట్టిగా చదవేయండి ఫర్వాలేదు.
రాయలవారి దారుణాఖండలశస్త్ర తుల్యమైన వాక్కు విశ్వరూపం దాల్చిన పద్యమిది!
ఈ పద్యంలో వర్ణింపబడుతున్నవి శ్రీరామ బాణాలు, అవి చేస్తున్న రకరకాల శబ్దాలు. ఆ యుద్ధంలోని తీవ్రతనంతా శబ్దాలలోనే వ్యక్తీకరిస్తున్న పద్యమిది.
సీ. స్యందనస్థితబిడౌజఃక్షత్తృజాడ్యకృ
జ్ఘంఝామరుద్గరుజ్ఝాత్కృతములు
క్రవ్యాశిరాడ్గాత్రకనదసృగ్గాహన
స్ఫుటశల్యహవ్యభుక్చూత్కృతములు,
యోధవర్మితహృత్పుటోత్క్రాంత నిజపాత
సాలాశ్మకృతముహుష్ఠాత్కృతములు
పతితోగ్రరక్షఃకబంధభారభృశార్తి
భుగ్నభోగఫణీంధ్రపూత్కృతములు
“స్యందనస్థితబిడౌజఃక్షత్తృజాడ్యకృ
జ్ఘంఝామరుద్గరుజ్ఝాత్కృతములు”
స్యందన స్థిత, బిడౌజ క్షత్తృ, జాడ్య కృత్, ఝంఝా మరుత్, గరుత్, ఝాత్ కృతములు.
బిడౌజుడు అంటే ఇంద్రుడు. క్షత్తృ అంటే రథసారధి. బిడౌజక్షత్తృ అంటే ఇంద్రుని రథసారధి, మాతలి. రామరావణ యుద్ధంలో రాముని రథానికి సారథ్యం వహించినది స్వయంగా ఇంద్రుని సారథి అయిన మాతలే. మాతలి రాముని రథాన్ని తోలుతున్నాడు. రాముడు రావణునిపై బాణవృష్టి కురిపిస్తున్నాడు. తమ గరుత్తులు (బాణాల చివరనుండే యీకలు) ఝాత్ ఝాత్ అనే శబ్దాలు చేస్తూండగా ఆ బాణాలు దూసుకుపోతున్నాయి. అవి ఎంతలా దూసుకుపోతున్నాయంటే, ముందుకు వెళ్ళే వాటి వేగానికి, గాలి, తుఫాను ఝంఝామారుతంలాగా వెనక్కి తన్నుకు వస్తోంది. అలా వస్తున్న గాలి, రథ వేగాన్ని అడ్డగిస్తూ దానికి జడత్వాన్ని కలిగిస్తోందిట!
మనం బస్సులోనో రైల్లోనో వెళ్ళేటప్పుడు, అది వెళ్ళే దిశకి వ్యతిరేక దిశలో వేగంగా గాలి మనని తాకడం మనకి తెలిసినదే. ఇక్కడ దాన్ని గుర్తుచేసుకోండి. మహాజవంతో వెళుతున్న రామబాణాల వలన గాలి వాటి వ్యతిరేక దిశలో తుఫానులా హోరెత్తుతోంది. అలా వచ్చే ఆ ఝంఝ రథ వేగాన్ని నిరోధిస్తోందిట! అంటే ఆ బాణ వేగాన్ని మనం ఊహించగలమా! అంతటి వేగాన్ని తట్టుకొని రథాన్ని ముందుకు నడపాలంటే ఆ సారథి ఎంత సమర్థుడై ఉండాలి, ఆ గుఱ్ఱాలకు ఎంతటి జవసత్త్వాలుండాలి!
“క్రవ్యాశిరాడ్గాత్రకనదసృగ్గాహన
స్ఫుటశల్యహవ్యభుక్చూత్కృతములు”
క్రవ్యాశి రాట్, కనత్, గాత్ర, అసృక్, గాహన, స్ఫుట, శల్య, హవ్యభుక్, ఛూత్కృతములు.
క్రవ్యమంటే మాంసము, అశి అంటే భుజించే అని అర్థం. క్రవ్యాశి అంటే రాక్షసులు. క్రవ్యాశి రాట్ – రాక్షసరాజైన రావణుడు. రావణశరీరంలో ప్రవహిస్తున్న నెత్తుటిలో (అసృక్ అంటే నెత్తురు) మునగడం వల్ల బాణపు ములుకులకున్న నిప్పు ఛూత్ అనే శబ్దాన్ని చేస్తున్నదిట! బాగా కాల్చిన చువ్వను నీటిలో ముంచితే “ఛూత్” అని శబ్దం చేస్తూ ఆరిపోతుంది కదా. రామబాణాల చివరలు రావణుని శరీరంలోని రక్తంలో ములిగి వాటి అగ్ని కూడా చల్లారి అలాంటి శబ్దం చేస్తోందట!
“యోధవర్మితహృత్పుటోత్క్రాంత నిజపాత
సాలాశ్మకృతముహుష్ఠాత్కృతములు”
యోధ, వర్మిత, హృత్ పుట, ఉత్క్రాంత, నిజ పాత, సాల, అశ్మ, కృత, ముహుః, ఠాత్ కృతములు
రామబాణాలు ఇంకేమేమి శబ్దాలు చేస్తున్నాయో చెపుతున్నాడు కవి. వర్మము అంటే కవచం. కవచాలు ధరించే వారు కాబట్టే రాజుల పేర్లలో వర్మ పదం ఉండేది. కవచాలు ధరించిన యోధుల హృదయ కోశాలనుండి బయటకు వెళ్ళి తనమీద పడే రామబాణాల వల్ల, గోడల రాళ్ళు (అశ్మములు) కూలిపోతూ కోట మళ్ళీమళ్ళీ ఠాత్ ఠాత్ అనే శబ్దాలు చేస్తోందిట! అంటే రామబాణాలు శత్రుయోధుల కవచాలని చీల్చి, వారి గుండెలను చీల్చుకొని, కోట గోడల రాళ్ళను కూడా బద్దలు కొడుతున్నాయని అర్థం. రామబాణాల తీవ్రత అది!
“పతితోగ్రరక్షఃకబంధభారభృశార్తి
భుగ్నభోగఫణీంధ్రపూత్కృతములు”
పతిత, ఉగ్ర రక్షః, కబంధ భార, భృశ, ఆర్తి, భుగ్న, భోగ, ఫణీంద్ర, ఫూత్ కృతములు
ఉగ్రులైన రాక్షసులు రామబాణాలు తగిలి పడిపోతూ ఉంటే, వారి మొండేల (కబంధాలు) బరువుకు, మిక్కిలి ఆర్తితో వంగిన పడగలు కల ఫణీంద్రుడు (ఆదిశేషువు) ఫూత్కారాలు చేస్తున్నాడట. బరువు మోయలేక అతని ఊర్పులు ఎక్కువయ్యాయి. పాము కదా, అందుచేత అవి భుస్ భుస్సనే ఫూత్కారాలు. రాక్షసులే కాదు, సమస్త ప్రాణులూ ఉన్న భూభారాన్ని మోస్తున్న ఆదిశేషువు, ఆ సమయంలో వారి మొండేల బరువు మోయలేక ఎందుకంత ఆర్తి చెందుతున్నాడు అనే అనుమానం రావచ్చు. అది ఆలోచిస్తేనే ఇందులో ఉన్న ధ్వని మనకి తెలుస్తుంది. రాక్షసులు మామూలుగా ఉంటే వారి భారాన్ని మోయడం శేషువుకి అలవాటే. కానీ యిక్కడ రాక్షసులు రామబాణాలకి తల తెగి కిందపడుతున్నారు. ఆ పడే వేగం వల్ల భూమి మీద అపారమైన ఒత్తిడి కలుగుతోంది. ఆ ఒత్తిడి తట్టుకోవడం ఆదిశేషునికి భారమయ్యింది! అంటే రామబాణాలు తగిలి రాక్షసులు అంత వేగంగా కూలి పడుతున్నారన్న మాట!
అవీ రామబాణాలు చేసే రకరకాల ధ్వనులు!
తే. శ్రాంతరథ్య నిరంతర ఛాయదములు,
దివ్యతావక కార్ముకోత్ప్రేరితములు,
కలుషము లడంచుగాత లంకాపురాంగ
ణాంబర చలత్కలంబ కదంబకములు.
అంతే కాదు, ఆ బాణాలు పందిరిగా ఏర్పడి విశ్రాంతి తీసుకుంటున్న తమ రథాలకు నీడనిస్తున్నాయట. ఓ రామా! అలా నీ దివ్య ధనుస్సునుండి వెలువడి లంకా నగర ప్రాంగణమంతటా కదలాడుతున్న బాణాల (కలంబ) గుంపులు (కదంబకములు) సర్వ పాపాలను అణచుగాక అని విష్ణుచిత్తుని ద్వారా రాయలవారు ప్రార్థిస్తున్నారు.
ఇంతటి ప్రౌఢమైన, ఓజోగుణ భూయిష్టమైన పద్యానికి ముందు కాస్త సున్నితమైన పద్యం ఒకటి వస్తుంది, రామావతారాన్ని గురించినదే. అది:
మ. పవిధారాపతనంబు గైకొనని యప్పౌలస్త్యు మై సప్తధా
తువులం దూఱు పరిశ్రమంబునకు నుద్యోగించె నా, సప్త సా
ల విభేదం బొనరించి నిల్వక సలీలన్ జన్న యుష్మన్మరు
జ్జవనాస్త్రం బొసగున్ సిరుల్ రఘుకులస్వామీ! రమావల్లభా!
ఇంత సుకుమారశైలి రాయలవారి కెక్కడిది! ఇది మనుచరిత్రలోని పద్యం. రాయలువారు ఇష్టపడి తిరిగి తన ఆముక్తమాల్యదలో వాడుకున్నది. ఈ పద్యమిక్కడ ప్రస్తావించడానికి కారణాం పద్యం చివరనున్న సంబోధనలు. అవి మనోహరమైన సంబోధనలు. రమావల్లభా అని సంబోధించడంలో ఒక విశేషం ఉంది. దశావతారాలలో రామావతారం వచ్చే వరకూ విష్ణువు రమావల్లభుడు కాడు! అంతకుముందు అవతారాలు సంపూర్ణావతారాలు కాదు. రామావతారమే మొట్ట మొదటి (ఒక రకంగా ఒకేఒక) సంపూర్ణావతారం. అంచేతనే ఆ అవతారంలో మాత్రమే విష్ణువు రమావల్లభుడయ్యాడు. స్వయంగా లక్ష్మీదేవి సీతగా అవతరించింది. ఆ విశేషాన్నంతా ధ్వనించే సంబోధన “రమావల్లభా” అన్నది.
(దయచేసి ఇదంతా నేను రాసాను అనుకోకండి. గూగుల్ మహత్మ్యం వల్ల శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు ఆముక్తమాల్యద బ్లాగు లో కనిపించగానే చాలా బాగా రాసారని షేర్ చేసాను అంతే!)
ఈ సారి ఇండియా నుండి వచ్చేటపుడు ఆంధ్ర పంచకావ్యాలు 1.మను చరిత్ర 2. వసు చరిత్ర 3. ఆముక్తమాల్యద, 4. పాండురంగమహాత్మ్సము 5. శృంగార నైషధం కొనే భాగ్యం కలిగింది, చదివించి అర్థం చేయించే భాధ్యత ఆ తల్లిదే!
కౌండిన్య – 25/06/2018