Skip to content

Ramesh Kalavala

We all are stories in the end. Just make it a good one!

Menu
  • About
Menu

సంగీత జ్ఞానం

Posted on October 22, 2025November 8, 2025 by Ramesh

( మా ఇంట్లో ఉన్న కీ-బోర్డు కు ఈ మధ్య బయటకి తీసి, దుమ్ము దులిపి, శుభ్రపరచడం జరిగింది. ఒక రోజు మా ఆవిడ ఓ రాగంలో పాట పాడుతుండగా, కీ-బోర్డు మీద నా సంగీత విధ్వంసం మొదలయ్యింది. అది తట్టుకోలేక మా ఆవిడ శంకరాభరణం లో శంకర శాస్తి గారిలా “నేను పాడుతున్న రాగం ఏంటి? మీరు వాయిస్తున్న రాగం ఏంటి“ (సరదాగా అన్నాను లేండి!) అనగానే నా కీ-బోర్డు మీద పలికే అపస్వరం తో కూడిన ఆ విధ్వంసం ఒక్కసారిగా ఆగింది. నేను కీ-బోర్డ్ మీద సులువైన “శంకరాభరణ” స్వర స్థానాలు వాయిస్తుంటే, మా ఆవిడ “మాయా మాళవగౌళ” రాగంలో పాడినట్లు తెలిసింది. ఈ రాగాల గూర్చి తరువాత ప్రస్తావిస్తాను. 

ప్రతీ రోజూ మా ఇంట్లో ఏడెనిమిది గంటలు కనీసం సంగీతం పాటల రూపంలో మ్రోగుతుంది(మా ఆవిడ వల్ల). మా అత్తయ్య గారు ఈ మధ్య ఒక కచేరీ లో నవ రాగ మాలిక పాడటం జరిగింది. నవరాగ మాలిక అంటే తొమ్మిది రాగాలతో కూడిన వర్ణ మాలికని తెలిసింది. ( పూర్వాంగంలో 4 రాగాలు-  కేదారం, ధీరశంకరాభరణం, మేచ కళ్యాణి,  బేగడ రాగాలు అలానే ఉత్తరాంగంలో 5 రాగాలు- కాంభోజి, యదుకుల కాంభోజి, బిలహరి, మోహన, శ్రీ రాగం ). అసలు రాగం అంటేనే పూర్తిగా అవగాహన లేని నాకు నవ రాగ మాలిక లాంటివి విన్నా అవి నాకు అర్థం అవడం సాధ్యం కాదు. మా అత్తగారు చిన్నప్పటి నుండి సంగీత సాధన మొదలుపెట్టి ఈ రోజు వరకూ నిత్యం సాధన చేస్తారు కాబట్టే కఠినమైన రాగ మాలికా వర్ణములు కూడా పాడ గలరు, అలానే నక్షత్ర మాలిక (27 రాగాలు తో కూడిన మాలిక) పాడినా ఆశ్చర్య పోనక్కర్లేదు. మా అమ్మగారికి కూడా సంగీతం లో ఎంతో కొంత ప్రవేశం ఉండేది కాబట్టి, అడపాదడపా ఆవిడ పాటలు పాడటం విన్నాను. అలానే మా ఆవిడ కూడా వారి అమ్మగారి ప్రోద్బలంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకొని, లలిత సంగీతం లో సినిమా పాటలు పాడటం వల్ల నాలాంటి వారికి ఇంట్లో సంగీతం కొంతవరకైనా వినపడుతుంది. అలానే మా మావయ్య, అత్తయ్య గారింట్లో కూడా నిత్యం సంగీతం వినపడేది, అప్పట్లో అవగాహన అసలు ఉండేది కాదు.

కానీ, నాకు మాత్రం సంగీతం మీద కొంచెం కూడా అవగాహన లేదనే చెప్పాలి, అలా అని సంగీతం అంటే ఇష్టం లేక పోలేదు. కొందరు కళాకారులు అవుతారు, కొందరు కళా పోషకులు గా మారతారు, మరికొందరు కళాభిమానులు గా మిగులుతారు. నేను బహుశా మూడో కోవకు చెందటానికి ప్రయత్నిస్తున్నానేమో?

కొన్ని రోజులుగా సంగీతం గురించి ఆలోచిస్తూ ఉంటే చిన్నప్పుడే ఈ సంగీత విద్య నేర్చుకొని ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. కానీ అమ్మ దయ ఉండొద్దు? ఏది ఏమైనా సంగీతం పరిజ్ఞానం గురించి కొంతయినా అవగాహన రావాలన్న తపన మాత్రం నాలో కలిగింది.)

“సంగీత సాహిత్య సమలంకృతే 

  స్వర రాగ పదయోగ సమభూషితే” 

సి నా రె గారు రచించిన సంస్కృత దివ్య కృతి ఇది. విశ్వనాథ్ గారి సినిమాలో, కె వి మహదేవన్ గారి సంగీతంలో, బాలు గారి స్వరంలో ఈ పాటని వినని తెలుగు వారుండరు. 

సంగీతం మరియు సాహిత్యం రెండింటి కలయికతో గొప్పగా అలంకరించబడి, స్వరాలు, రాగాలు మరియు పదాల సమ్మేళనంతో సుందరంగా ఉన్న పాట వినడానికి సంగీతం రానక్కర్లేదు. సాహిత్యం మీద, సంగీతం మీద కొంచమైనా మక్కువ ఉంటే చాలు. 

అన్ని కళల లాగానే సంగీతం కూడా ఆది నుండి ప్రస్తుతం వరకూ ఏంతో విస్తరించింది. దీని మీద పూర్తిగా అవగాహన తెచ్చుకోవడం, పూర్తిగా నేర్చుకోవడం ఒక జీవిత కాలంలో సాధ్యం కాదేమో? బాలమురళి కృష్ణ గారి లాంటి విద్వాంసులు కోటికి ఒక్కరు. ఆయన పిన్న వయసులోనే మేళకర్త రాగాల మీద పట్టు సాధించడం తో పాటు, జీవితకాలంలో వే వేల కచేరీలు ఇవ్వడమే కాకుండా కొత్త రాగాలు కనిపెట్టిన మహనీయుడు. కొందరే శాస్త్రీయ సంగీతం లో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు.  మహా వైద్యనాథ్ అయ్యర్ గారి 72 రాగాల వర్ణన యం ఎస్ అమ్మ గాత్రంలో ఉన్న వీడియోలు మనకు అందుబాటులో ఉన్నాయి. 

మనకు తెలిసిన భారతీయ సంగీతం లో కర్నాటక సంగీతం శైలి 15 శతాబ్దాల కాలం నుండి ఉన్నాయని తెలుస్తుంది. హిందుస్తానీ సంగీతం గురించి తరువాత తెలుసుకుందాం. కానీ, ఆలోచిస్తే 15 వ శతాబ్దం ముందు కూడా సంగీతం లేక పోలేదు అలానే సంగీత వాయిద్యాలు లేక పోలేవు. 

శ్రీ పురందర దాసు (1480-1564) సల్పి న విశేష కృషి వల్ల ఆయన్ని కర్నాటక సంగీతానికి ఆద్యుడిగా భావిస్తాము. ఆయన సమకాలీనులైన త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి లను త్రిమూర్తులు గా భావిస్తాము. వీరి కంటే ముందు మనకు అన్నమాచార్యులు, నారాయణ తీర్థులు, రామదాసు, సదాశివ బ్రహ్మ లాంటి వారు ఎందరో విద్వాంసులు ఉన్నారు, అత్యద్భుతమైన కీర్తనలు రచించారు, స్వరపరిచారు. 

పూర్వకాలంలో సంగీతం తో పాటు సాహిత్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చేవారు. శ్రీ పురందర దాసు 15 వ శతాబ్దంలో సంగీతం బోధించడానికి కొన్ని అనువైన పద్దతులను ఏర్పాటు చేయడం వల్ల ప్రతి ఒక్కరి వరకూ సంగీతం చేరడానికి సాధ్యమైందని చెప్పవచ్చు. 

ఈ కర్నాటక సంగీతం నేర్చుకోవటానికి ముందు దాని చరిత్ర గురించి, ప్రధాన అంశాలు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. లోతుగా అధ్యయనం చేసేవారికి మరిన్ని వివరాలు విస్తృతంగా ఈ రోజుల్లో వికీపీడియా లాంటి వివిధ మాధ్యమాల్లో దొరుకుతున్నాయి.

విశ్వ సృష్టిలో నాద బ్రహ్మ: తత్వశాస్త్రం ప్రకారం, నాదం (శబ్దం) విశ్వం ప్రారంభానికి మూలం తలుస్తారు. సంగీతం అనేది నాద బ్రహ్మ యొక్క వ్యక్తీకరణగా భావిస్తారు, ఇది సంగీతానికి మూలమైన దివ్య ధ్వనిని సూచిస్తుంది. 

సరిగమపదనిస లు సప్త స్వర స్థానాలు. పూర్వీకులు ప్రకృతిని నిశితంగా పరిశీలించి వీటిని ఏర్పరిచారని చెబుతారు. జంతువులు, పక్షుల అనుకరణ ద్వారా ఈ స్వరాలను ఏర్పడ్డాయి. వీటిలో స, ప, ద, గ, మ అకారాంతాలు, రి,ని ఇకారాంతాలు.

స – సడ్జమం – నెమలి కూత

రి – రిషభం – వృషభ ధ్వని

గ – గాంధారం – మేక చేసే శబ్దం 

మ – మధ్యమం – క్రౌంచ పక్షి కూత

ప – పంచమం – కోకిల కూత

ద – దైవతం – గుఱ్ఱం సకిలించడం

ని – నిషాదం – ఏనుగు ఘీంకారం 

ఋగ్వేద, సామవేదాలలో కొన్ని స్వరాలతో ఉచ్చారణ చేసే మంత్రాలు ఉండేవని, యజుర్వేదం లో వీణ లాంటి పక్క వాయిద్యం  ప్రస్తావన ఉందని తెలుస్తోంది. అలానే రామాయణ, మహాభారతాల్లో శాస్త్రీయ సంగీత ప్రస్తావన లేకపోలేదు. పూర్వకాలంలో సంగీతం, నాట్య శాస్త్రం తో కూడా ముడిపడి ఉండేది. 4 వ శతాబ్దంలో భరతముని విరచిత “నాట్యశాస్త్రము”, అలాగే 12 వ శతాబ్దము లోని సారంగదేవుని విరచిత “సంగీత రత్నాకరము” లాంటి గ్రంథాల ద్వారా ఆ కాలం శాస్త్రీయ సంగీతం గురించి మనకు ఒక అవగాహన వస్తుంది. 

14 శతాబ్దాలలో దక్షిణ భారత దేశంలో కర్నాటక సంగీతము, ఉత్తర భారత దేశంలో హిందుస్తానీ సంగీతాలు ప్రాచుర్యం పొందాయి. హిందుస్తానీ సంగీతం గూర్చి తరువాత విడిగా వ్రాస్తాను.

18 వ శతాబ్దం నుండి 20 వ శతాబ్దం వరకు మనం ఈ రోజు చూస్తున్న కర్నాటక సంగీతానికి శ్రీ వెంకటమఖి మేళకర్త రాగాలువర్గీకరణ చేసి దానిని తన సంస్కృత గ్రంథం, “చతుర్దండి ప్రకాశిక”లో పొందుపరిచారు. నేడు వాడుకలో ఉన్న సంపూర్ణ మేళకర్త రాగాల పట్టికను శ్రీ గోవిందాచార్య తయారు చేసారు. 

శాస్త్రీయ సంగీతం తో పాటు వివిధ రకాల వాయిద్యాలు – వీణ, రుద్రవీణ, వేణువు, మృదంగం, ఘటం, వయోలిన్ లాంటి వాయిద్యాలలో నిష్ణాతులు ఉన్నారని గ్రంథాల ద్వారా తెలుస్తోంది. 

త్రిమూర్తులు గా భావించే త్యాగరాజు స్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి వీరు గాత్రంలో నే కాకుండా వాయిద్యాలలో కూడా నిష్ణాతులని గ్రంథాల ద్వారా తెలుస్తోంది. వీరి గురించి వ్రాయాలని తలిస్తే తెలుసుకొని పుంఖాలుగా వ్రాయవచ్చు. 

ఇక కర్నాటక సంగీతం ను పరిశీలిస్తే స్వరం తో పాటు స్వర స్థానాలు ( 12 , 16 – 72 మేళ కర్త రాగాలు ఈ 16 స్వర స్థానాల నుండి ఏర్పడ్డాయి వీటిని తరువాత చర్చిద్దాము ), శృతి (ధ్వని) , తాళం (6/12/14/16 బీట్స్) , లయ (తాళం యొక్క కాలం), స్థాయి (తక్కువ, హెచ్చు స్థాయి), రాగం (మేళకర్త రాగాలు), పల్లవి, అనుపల్లవి, చరణం, ఆరోహణం, అవరోహణం, గమకం, ధాతు (స్వరం), మాతు (సాహిత్యం), లఘువు (దెబ్బ, మూడు వేళ్లు) , ధృతము (దెబ్బ, ఉసి), క్రియ (ఆది తాళం లో 4 క్రియలు, 2 క్రియలు, 2 క్రియలు ఉంటాయి) , ఆవర్తము (స నుండి స వరకు) , ప్రస్ధారాలు (పద, జప, రమ, మప లాంటి కూడలి), సరళీస్వరాలు, జంటస్వరాలు, అలంకారాలు , స్వరజతులు,  గీతం, వర్ణం (తాన వర్ణాలు, పద వర్ణాలు) , కృతి, కీర్తనలు, తిల్లానాలు లాంటివి ప్రధాన అంశాలు.  ఈ అంశాలన్నీ ఒక్కొక్క దాని గురించి వ్రాస్తే ఒక్కో వ్యాసం తయారవుతుంది కాబట్టి కొన్నిటిని మాత్రమే క్లుప్తంగా తెలుసుకుందాము.

శృతి

శృతి లయలు సంగీత మాధుర్యాన్ని పెంచుతాయి, ఇవి ధ్వని కి సంబంధించినవి. మానవుల చెవి 22 శృతులను మాత్రమే గుర్తించ గలదు. శృతులలో 12, 22 రకాల శృతులు ఉన్నాయి. సాధారణంగా సంగీత సాధన లో ఒకే శృతి లో పాడటం నేర్పుతారు. ఒక్కొక్కరు ఒక్కో నిర్దిష్టమైన స్థాయి లో పాడ గలరు, అందువల్లే వారికి అనుగుణమైన శృతిని గురువు ద్వారా తెలుసుకొని సంగీత సాధన చేయడం ద్వారా ధ్వని మాధుర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది, సులువు గా పాడ గలుగుతారు.  

కర్నాటక సంగీత సాధన లో భాగంగా శృతి కొరకు తంబూరా వినియోగించడం చూసే ఉంటారు. 

స్వరం

సంగీతం లో ఏడు స్వరాలు ఉంటాయని అందరికీ విదితం. స,రి,గ,మ,ప,ద,ని,స లు షడ్జమ, రిషభ,గాంధార,మధ్యమ,పంచమ, దైవత, నిషాదములైన స్వరాలకు సంక్షిప్త రూపాలు.

షడ్జమం (స) , పంచము (ప) లకు ఒకే రీతి, ఉప రీతి ఉండదు.

మధ్యమ (మ) స్వరానికి రెండు ఉప రీతులు ఉంటాయి(మ1,మ2)

రిషభ (రి) ,గాంధార (గ) , దైవత (ధ), నిషాద (ని)  స్వరాలకు మూడు ఉప రీతులు ఉంటాయి(రి1,రి2,రి3)

రాగాలు 

మాధుర్యాన్ని పలికించడానికి ఏర్పరిచిన కొన్ని నిబంధనల సమాహారమే రాగం. 

ఈ సప్త స్వరాలతో అనేక రీతులతో మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి.

సప్త స్వరాలు స, రి, గ, మ, ప, ద, ని రాగం యొక్క ఆరోహణా, అవరోహణల్లో కచ్చితంగా వున్న రాగాలని మేళ కర్త రాగాలు అంటారు. వీటి సంఖ్య 72. వీటినే జనక లేదా సంపూర్ణ రాగాలని కూడా అంటారు. 

ఈ మేళ కర్త రాగాలనుండి పుట్టిన రాగాలని జన్య రాగాలంటారు. అంటే ఆరోహణా, అవరోహణల్లో ఒకటీ లేదా రెండు స్వరాలు వర్జితం కావచ్చు, కొన్ని అదనంగా ఉండచ్చు. ఈ జన్య రాగాలకీ అనేక విభజనలున్నాయి.  ఒక్కో జనక లేదా జన్య రాగాల గూర్చి వ్రాస్తే ఒక్కో వ్యాసం తయారవుతుంది కానీ కర్నాటక సంగీతం లో కొన్ని ముఖ్యమైన రాగాలు, ఎక్కవగా వాడుక రాగాలు ముందు మేళకర్త రాగాల వాటితో తెలియజేస్తాను. 

తాళం

సంగీతంలో వినిపించే మరోధ్వని విశేషం తాళం.

తాళం అంటే నిర్ణీత కాలవ్యవధిలో క్రమబద్ధమైన, లయబద్ధమైన రీతిలో వచ్చే ఒక దరువు. 

శ్రుతి లయలు సంగీత మాధుర్యానికి ఆధారాలని ఇంతకు మందు అనుకున్నాము. 

కర్ణాట సంగీత కళాకారులు ముఖ్యంగా తమ చేతులనూ, వేళ్ళను పైకి, క్రిందకూ ఆడించడం ద్వారా దీన్ని అనుసరిస్తారు.

అట్టి తాళంలో కూడా రకాలున్నాయి, వీటినే సప్త తాళాలు అనబడే తాళం సమూహం.

  1. ధ్రువ తాళం 
  2. మత్య తాళం
  3. రూపక తాళం 
  4. ఝంపే తాళం
  5. త్రిపుట తాళం
  6. అట తాళం
  7. ఏక తాళం

కర్నాటక సంగీత సాధనలో భాగంగా లేదా కచేరీలలో తాళం కోసం మృదంగం ను సాంప్రదాయక వాయిద్యం గా వినియోగిస్తారు. 

సంగీత సాధన 

ఈ సంగీతాన్ని బోధించడానికి పురందర దాసు కొన్ని పద్ధతులు ఏర్పరచారు. దీని ప్రకారం ముందుగా సరళీ స్వరాలునేర్పిస్తారు. తరువాత అలంకారాలు, సులభమైన గీతాలు, స్వరజతులు నేర్పించబడతారు. 

విద్యార్థి ఒక దశ చేరుకున్న తర్వాత వర్ణాలు, కృతులు బోధిస్తారు. సాధారణంగా వేదిక మీద ప్రదర్శన ఇవ్వడానికి ఒక విద్యార్థికి కొన్ని ఏళ్ళ కాలం అవసరమౌతుంది. 

ఈ సంగీతాన్ని మొదటి సారిగా నేర్చుకునే వారికి “మాయా మాళవ గౌళ” రాగాన్ని నేర్పిస్తారు. ఇది సంగీతంలో తొలి అడుగులు వేసేవారికి అనుకూలంగా ఉంటుంది. 

కచేరీలు ఇచ్చే స్థాయికి వర్ణాలు, కృతులు, కీర్తనలు, మనోధర్మ సంగీతం గూర్చి ఎక్కువగా అవగాహన అవసరం కాబట్టి వాటి గురించి వివరంగా తరువాత వ్రాస్తాను.

 మేళకర్త రాగాలు – కర్నాటక సంగీతం

ఇవి దక్షిణ భారత శాస్త్రీయ సంగీతానికి ప్రాథమిక రాగాలు. 

మేళకర్త రాగాలను శుద్ధ మధ్యమం ఇంకా ప్రతి మధ్యమం అనే రెండు రాగ సమూహాలుగా ఉంటాయి. శుద్ధ మధ్యమం మ1 లోని మ2 చేస్తే అది ప్రతి మధ్యమం అవుతుంది. 

72 మేళ కర్త రాగాలలో శుద్ధ మధ్యమం లో 36 రాగాలు అలానే ప్రతి మధ్యమం లో 36 రాగాలు ఉన్నాయి. కటపయాది పద్దతి ప్రకారం రాగాన్ని, ఆ రాగం లో స్వర స్థానాలని ఎలా గుర్తించాలో తరువాత విడిగా మరొకసారి వ్రాస్తాను.

ఈ మేళకర్త రాగాలని 12 చక్రాలుగా విభజించారు, ఒక్కొక్క చక్రం లో 6 రాగాలు ఉంటాయి. అవి

  1. ఇందు చక్రం – ఒక్క ఇంద్రుడు ( చంద్రుడు )
  2. నేత్ర చక్రం – రెండు నేత్రాలు 
  3. అగ్ని చక్రం – మూడు అగ్ని లు 
  4. వేద చక్రం – నాలుగు వేదాలు
  5. బాణ చక్రం – మన్మధుడి ఐదు బాణాలు 
  6. ఋతు చక్రం – ఆరు ఋతువులు
  7. ఋషి చక్రం – సప్త ఋషులు 
  8. వసు చక్రం – ఏడు వసువు లు
  9. బ్రహ్మ చక్రం – తొమ్మిది బ్రహ్మ లు
  10. దిశ చక్రం – దశ ( దిశ ) దిశలు
  11. రుద్ర చక్రం – పదకొండు రుద్రాలు
  12. ఆదిత్య చక్రం – పన్నెండు ఆదిత్యులు 

1-ఇందు చక్రం 1-6 /7-ఋషి చక్రం – 37-42

కనకాంగి/సాలగం

S R1 G1 M1 P D1 Ni1 S/S R1 G1 M2 P D1 Ni1 S

రత్నాంగి/జలార్ణవం

S R1 G1 M1 P D1 Ni2 S/S R1 G1 M2 P D1 Ni2 S

గానమూర్తి/ఝాలవరాళి

S R1 G1 M1 P D1 Ni3 S/S R1 G1 M2 P D1 Ni3 S

వనస్పతి/నవనీతం

S R1 G1 M1 P D2 Ni2 S/S R1 G1 M2 P D2 Ni2 S

మానవతి/పావని

S R1 G1 M1 P D2 Ni3 S/S R1 G1 M2 P D2 Ni3 S

తానరూపి/రఘుప్రియ

S R1 G1 M1 P D3 Ni3 S/S R1 G1 M2 P D3 Ni3 S

2-నేత్ర చక్రం 7-12/8-వసు చక్రం – 43-48

సేనావతి/గవాంబోధి

S R1 G2 M1 P D1 Ni1 S/S R1 G2 M2 P D1 Ni1 S

హనుమతోడి/భవప్రియ

S R1 G2 M1 P D1 Ni2 S/S R1 G2 M2 P D1 Ni2 S

ధేనుక/శుభపంతురావళి

S R1 G2 M1 P D1 Ni3 S/S R1 G2 M2 P D1 Ni3 S

నాటకప్రియ/షడ్వితమార్గణి

S R1 G2 M1 P D2 Ni2 S/S R1 G2 M2 P D2 Ni2 S

కోకిలప్రియ/సువర్ణాంగి

S R1 G2 M1 P D2 Ni3 S/S R1 G2 M2 P D2 Ni3 S

రూపవతి/దివ్యమణి

S R1 G2 M1 P D3 Ni3 S/S R1 G2 M2 P D3 Ni3 S

3-అగ్ని చక్రం 13-18 /9-బ్రహ్మ చక్రం 49-54

S R1 G3 M1 P D1 Ni1 S/S R1 G3 M2 P D1 Ni1 S

గాయకప్రియ/ధవళాంబరి

S R1 G3 M1 P D1 Ni2 S/S R1 G3 M2 P D1 Ni2 S

వకుళాభరణం/నామనారీయణి

S R1 G3 M1 P D1 Ni3 S/S R1 G3 M2 P D1 Ni3 S

మాయమాళవగౌళవ/కామవర్థిని

S R1 G3 M1 P D2 Ni2 S/S R1 G3 M2 P D2 Ni2 S

చక్రవాకం/రామప్రియ

S R1 G3 M1 P D2 Ni3 S/S R1 G3 M2 P D2 Ni3 S

సూర్యకాంతం/గమనాశ్రయ

S R1 G3 M1 P D3 Ni3 S/S R1 G3 M2 P D3 Ni3 S

హతకాంబరి/విశ్వంభరి

4-వేద చక్రం 19-24 /10- దిశ చక్రం – 55-60

S R2 G2 M1 P D1 Ni1 S/S R2 G2 M2 P D1 Ni1 S

జంకారధ్వని/సామలాంగి

S R2 G2 M1 P D1 Ni2 S/S R2 G2 M2 P D1 Ni2 S

నటభైరవి/షణ్ముఖప్రియ

S R2 G2 M1 P D1 Ni3 S/S R2 G2 M2 P D1 Ni3 S

కీరవాణి/సింహేద్రమధ్యమం

S R2 G2 M1 P D2 Ni2 S/S R2 G2 M2 P D2 Ni2 S

ఖరహరప్రియ/హేమవతి

S R2 G2 M1 P D2 Ni3 S/S R2 G2 M2 P D2 Ni3 S

గౌరిమనోహరి/ధర్మవతి

S R2 G2 M1 P D3 Ni3 S/S R2 G2 M2 P D3 Ni3 S

వరుణప్రియ/నీతిమతి

5-బాణ చక్రం 25-30 /11-రుద్ర చక్రం-61-66

S R2 G3 M1 P D1 Ni1 S/S R2 G3 M2 P D1 Ni1 S

మరరంజని/కాంతిమతి

S R2 G3 M1 P D1 Ni2 S/S R2 G3 M2 P D1 Ni2 S

చారుకేశి/రిషభప్రియ

S R2 G3 M1 P D1 Ni3 S/S R2 G3 M2 P D1 Ni3 S

సరసంగి/లతాంగి

S R2 G3 M1 P D2 Ni2 S/S R2 G3 M2 P D2 Ni2 S

హరికాంభోజి/వాచస్పతి

S R2 G3 M1 P D2 Ni3 S/S R2 G3 M2 P D2 Ni3 S

ధీరశంకరాభరణం/మేచకళ్యాణి

S R2 G3 M1 P D3 Ni3 S/S R2 G3 M2 P D3 Ni3 S

నాగనందిని/చిత్రాంభరి

6-ఋతు చక్రం-31-36/12-ఆదిత్య చక్రం 67-72

S R3 G3 M1 P D1 Ni1 S/S R3 G3 M2 P D1 Ni1 S

యాగప్రియ/సుచరిత

S R3 G3 M1 P D1 Ni2 S/S R3 G3 M2 P D1 Ni2 S

రాగవర్ధిని/జ్యోతి స్వరూపిణి

S R3 G3 M1 P D1 Ni3 S/S R3 G3 M2 P D1 Ni3 S

గాంగేయభూసని/థాతువర్థని

S R3 G3 M1 P D2 Ni2 S/S R3 G3 M2 P D2 Ni2 S

వాగథీశ్వరి/నాసికభూషిణి

S R3 G3 M1 P D2 Ni3 S/S R3 G3 M2 P D2 Ni3 S

సులని/కోసలం

S R3 G3 M1 P D3 Ni3 S/S R3 G3 M2 P D3 Ni3 S

చలనట/రసికప్రియ

ముఖ్యమైన జనక / సంపూర్ణ రాగాలు

8- హనుమ తోడి రాగం

S R1 G2 M1 P D1 Ni2 S

15 – మాయమాళగౌళ రాగం

S R1 G3 M1 P D2 Ni3 S

20 –  నట భైరవి రాగం

S R2 G2 M1 P D1 Ni2 S

21 – కీరవాణి రాగం

S R2 G2 P M1 D1 Ni3 S 

22 – ఖరహర ప్రియ రాగం

S R2 G2 M1 P D2 Ni2 S

26 – చారుకేశి రాగం

S R2 G3 M1 P D1 Ni2 S

28 – హరి కాంభోజి రాగం

S R2 G3 M1 P D2 Ni2 S

29 – ధీర శంకరాభరణం రాగం

S R2 G3 M1 P D2 Ni3 S

65 – మేచకళ్యాణి రాగం

S R2 G3 M2 D2 Ni3 S

ఈ సంగీత పరిజ్ఞానం వల్ల కనీసం ఒక మంచి శ్రోత గా నైనా మారి సంగీతాన్ని ఆస్వాదించ గలిగే ఒక అదృష్టం పొందుతానని భావిస్తూ..

కౌండిన్య – 22/10/2025

1 thought on “సంగీత జ్ఞానం”

  1. janardhan rao says:
    October 28, 2025 at 5:31 am

    Very well written Ramesh. “Ekam sangeetha vignanam chaturvarga phala pradam”

Comments are closed.

  • హిందోళ రాగం
  • “Cat and the Robin – A Dialogue”
  • హిందూస్తానీ సంగీతం 
  • సంగీత జ్ఞానం
  • నీలిమేఘములలో – 35 సినిమా
©2026 Ramesh Kalavala | WordPress Theme by Superbthemes.com