
ఈ రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి. అశోక వనంలో సీతమ్మ వారిని శింశుపావృక్షం మీదనుండి హనుమంతుల వారు మొట్టమొదట దర్శించిన రోజు.
సీతమ్మ వారిని హనుమంతుల వారు అంతముందు చూడనేలేదు. సాగర లంఘనం చేసి, నగర ప్రవేశం చేసిన తరువాత అమ్మవారి జాడ కనబడక ఆయన పడిన మనస్తాపం అంతా ఇంతా కాదూ.
సీతమ్మ వారి కోసం లోపల అన్నీ ప్రదేశాలు గాలించాడు. అద్భుతమైన అంతఃపురాన్ని, లోపల పట్టమహిషిలను, పక్కన ఉన్న పానశాలను కూడా పరికించాడు. అంతఃపురం బయట సీతమ్మను అపహరించి తీసుకువచ్చిన పుష్పకవిమానాన్ని చూసి విశ్వకర్మ ఎలా నిర్మించాడా అని ఆశ్చర్యపోయాడు. అన్నీ చోట్లా తిరిగిన తరువాత సీతమ్మ జాడ కనపడక అమ్మవారు ప్రాణత్యాగం చేసారా అనుకున్నాడు, మళ్ళీ వివేకం తెచ్చుకొని సుగ్రీవుడు పెట్టిన గడువు పూర్తి అయ్యేలోగా మరొక్కసారి వెతుకుతాను అనుకొని మళ్ళీ అన్ని భవనాలు, వనాలు వెదకడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్న ఒక పెద్ద వనంలోకి ప్రవేశించాడు.
ఆ అశోకవనంలో ఉన్న వృక్షసంపద, క్రీడావనాలు, సెలయేళ్ళు, సరోవరాలు చూస్తూ వనవాసప్రియయైన జానదేవి ఇక్కడకు తప్పకవచ్చి ఉండాలని అనుకుంటూ శింశుపావృక్షం మీద నుండి చుట్టుపక్కల పరిశీలిస్తున్నాడు. అక్కడే రాక్షసీజనాల పక్కన ఉన్న విశాలనయనియైన జానకీ మాతను చూసాడు హనుమంతుల వారు. ఆమె ధరించిన ఆభరణాలను, కట్టుకున్న పట్టుచీరను బట్టి ఆమెను గుర్తించి ఆ తల్లి సందర్శనంతో అమితసంతోషంతో ఆయన మనసులో రామచంద్రుని ఒక్కసారిగా తలుచుకున్నాడు.
కౌండిన్య – 27/12/2020