ఆ పార్టీ కార్యాలయానికి ఎదురుగా చెట్టునీడన సుగంధ సోడా బండి దగ్గర చిట్టెమ్మ కొడుకు మారం చేస్తున్నాడు.
పొద్దెక్కిన వేళ కాబట్టి మొహం కడుక్కుంటే గానీ సుగంధ సోడా ఇవ్వనంటూ బెట్టు పెట్టింది చిట్టమ్మ, ఇస్తే గానీ లేవనంటూ పేచీ పెట్టి ఏడుస్తూ, మొత్తానికి కొడుకే నెగ్గాడు.
చిట్టమ్మ ప్రేమంతా పోసి సుంగధ సోడా తయారు చేసి చేతికిచ్చింది, కుర్రాడు ఓ గుటక తాగి తన ఏడుపు ఆపి, ఎదురుగా బండి దగ్గరకు ఎవరో రావడం చూసి అతన్ని గమనిస్తూ బుగ్గ మీద కన్నీళ్ళను తుడుచుకున్నాడు.
ఆ వచ్చినతను ఆ కార్యాలయంలోని పార్టీ అధ్యక్షుడి కొడుకు. ఒక్క రోజు కూడా సోడా తాగి డబ్బిచ్చింది లేదు. డబ్బుల ప్రస్తావన చేసిన చిట్టెమ్మతో “ఇస్తాలే ఎక్కడికి పోతాను” అంటూ నాపరాయిలా నిగనిగలాడుతున్న తన శరీరం ఎండ తీక్షణతకు తట్టుకోలేకపోతుండే ఆ సూర్యుడి కేసి కోపంగా పైకి చూసాడు. ఇంతలో చిట్టెమ్మ చటుక్కున కొడుకు చేతిలోంచి వాడు తాగుతున్న సుంగధ సోడా తీసి ఆయనకు అందించింది.
అడిగిన వెంటనే అందించినందులకు “పనిలో చిట్టమ్మ చురుకు” అని ఛలోక్తులొదిలి గటాగాటా త్రాగాడు, “మంచి రుచి సువాసన ఉందన్నాడు”.
తను తాగవలసిన దానిని ఆయన స్వాహా చేసేయటం చూసిన చిట్టమ్మ కొడుకుకు దుఃఖం ముంచుకొచ్చింది. అది గమనించిన చిట్టమ్మ వాడిని “వెళ్ళి పళ్ళుతోముకొని రాపో” అంటూ పురమాయించింది. వాడు బిక్కమొహంతో బయలుదేరబోయాడు.
ఆ మండే ఎండకు ఆ అధ్యక్షుడి కొడుక్కి ఇంకా దాహం తీరలేదు, పైగా తన సొమ్మేంబోయింది “ఏదీ ..ఇందాకా ఇచ్చిన లాంటి ఇంకో ఓ మాంచి సుగంధ సోడా ఇవ్వు” అన్నాడు చిట్టెమ్మతో మళ్ళీ పళ్ళు ఇకలిస్తూ.
చిట్టెమ్మ పక్కచూపులు చూస్తూ వెళ్ళబోతున్న తన కొడుకును ఆపి “ఓరేయ్ ఎల్లబాకు నీతో పనుంది” అంటూ వెనక్కి పిలిచింది.
కౌండిన్య – 25/06/2018