నేనెవరు?
కవినా? ఏడిసావ్. వ్యాసాలు రాసావా? మీ ఉద్ధేశం ఆవు వ్యాసం? కాదు తెలుగు వ్యాసాలే! ఏమి రాయలేదు. నాటికలు? ఓకటో రెండో ప్రత్యక్షంగా చూసాను. కన్యాశుల్కం చదవాలని ఎప్పటి నుండో కోరిక. కథలు రాసావా? ప్రయత్నించా! అలల ధాటికి ఒడ్డున పడి ఉన్నా. థైర్యే సాహసే లక్ష్మీ అన్నారు కదా, మళ్ళీ ఎదురీతకు సముద్రం వైపుకు పయనిస్తా. విమర్శలు రాసారా? మనసులో మాత్రం శ్రీ శ్రీ గారిలా నిర్భయంగా చెప్పాలని ఉంటుంది, కానీ బయటకు మృదుభాషి, వేరొకరిని నొప్పించని వాడిని. పరిశోధన ? నేను రాయడం మొదలుపెట్టి ఓ ఎనిమిది నెలలు అయ్యింది, అప్పటి నుండి అనునిత్యం పరిశోధన చెద్దామనే ప్రయత్నం. తెలుగు సాహిత్యం మీద మక్కువ పెరగడం వల్ల భాషా పరిశోధనకు అంకురార్పణ చేసా. ఏది ఇంకెవరైనా తెలుగు భాషా మీద పరిశోధన చేసినవాళ్ళ పేర్లు చెప్పు? గిడుగు పంతులు గారు. అబ్బో! ఛందస్సు మీద చిన్నప్పుడు శ్రద్ధ పెట్టావా? పైపైనే. పోనీ వేరే మాత్ర ఛందస్సు లాంటివి? వాడుక భాష సరళమైన భాష ఇప్పటికి నాకు నయమని నిశ్చయించుకొన్నా, గురజాడ గారు అదేగా చెప్పింది. ఇండియా వెళ్ళినపుడు సాహిత్య పుస్తకాలు కొన్నావుట? కొనడం వాస్తవమే, కానీ చదవడం సంగతే… మంచివి కొన్నావా? నేను వెళ్ళిన ఒక్క షాపులో ఉన్నవి కొన్నా! మచ్చుకకు ఎలాంటివి? వేయి పడగలు, మహా ప్రస్థానం, బారిస్టర్ పార్వతీశం, కూనలమ్మ, ఎంకిపాటలు, కోతి కొమ్మచ్చి వగైరా వగైరా. వేయి పడగలా, అంత పెద్దది చదవ గలవా? అందుకేగా కొన్నది. మహాప్రస్థానం ? పేజీలు తిరగేసా, స్వయంగా శ్రీ శ్రీ గారు చదివింది నెట్లో విన్నా. అభ్యుదయ కవిత్వం అర్థం చేసుకోవాలని వాంఛ. ఆయన కోపం వస్తే కవితలు రాస్తారుట, ప్రశాంతంగా ఉంటే కవితలు చదువుతారుట. ఆయన కోపంలోంచి పుట్టిన భావకవిత్పపు పట్టును అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తా. ఎంకి పాటలు ఎందుకు కొన్నావు? జానపదం అండీ. పాతకాలంలో గృహ జీవితంలో అద్భుతంగా ఉండేదిట సాహిత్యం. పెన్సిళ్ళు, ఐ ప్యాడ్ అక్కర్లేదు భావం కావలంతే. కవితలు కంఠస్థం పట్టావా? లేదు బండన భీముడు ఓ సారి ముల్లు నలభై సార్లు తిరిగేలోగా చెప్పా. కంఠస్థం చేసా? ఉ.. ఉ.. చూసి చదివా! చిన్న నాటకం రాసావుట? పాత్రధారుల కోసం వెతికావుట, మళ్ళీ చప్పపడ్డావేంటి? పాత్ర ధారులు దొరికారు, రికార్డింగ్ చేయాలి అంతే. గొప్ప నాటకమా? మరీ అంత చెత్త నాటకం అని చదివిన వారు అనలా! మరి ఇందాక నాటకం గురించి అడిగితే ఈ సంగతి చెప్పలేదు. పాత సంగతులెందుకు లేండి. ఈ మధ్య గీతలు గీస్తున్నారుట? అవును మీకెవరు చెప్పారు? భాదితులు సంఘం నుండి ఓ లెటర్ వచ్చింది. ఆన్లైన్ లో పోస్ట్ చేసారు కానీ మిమ్మల్ని ట్యాగ్ చేయలేదేమో? అవునా, కొంచెం పంపిస్తారా? నేర్చుకొవాలనే ప్రయత్నం ఈ మధ్య కొంతనయమే. మీ కథల లో హీరోయిన్ల పేర్లు ‘క’ అఖ్షరం తో మొదలుట? ఎందుకీ ఛాదస్తం? మీరే జవాబు చెప్పారుగా ఎందుకు ఇంక అడగటం? అబ్బో కోపం కూడానూ … దేవుడా… మా ఆవిడ కూడా అంటుంటింది నేను ఆ పదం ఎక్కువగా ఉపయోగిస్తానని, కానీ అల్లూ అర్జున్ స్టైల్ లో కాదు, ఏదో లోకం ఏమవుతుందో ననిపించినపుడు అంటుంటా! సీనీ సాహిత్యం? మా ఇంట్లో మా ఆవిడ చలవ వల్ల దేవులపల్లి, ఆత్రేయ, సిరివెన్నెల గార్లవి వినడం మొదలుపెట్టా. సినారె గారు రాసిన పాటల గురించి కూడా చదివా. కళాతపస్వి గారి సీని కళా ఖండాలు సమయం దొరికనపుడల్లా చూడలనిపిస్తుంది, బాలు గారి స్వరంలో ఆ సినమాలోని పాటలు వినడం చెప్పనక్కర్లేదు.
మరీ భక్తి రసం? దగ్గరవారి వల్ల త్యాగరాజు కృతులు, అన్నమయ్య సంకీర్తనలు వింటుంటాను. ప్రవచనం? సమన్వయ సరస్వతీ, వాగ్థేవి వరపుత్ర సామవేదం గురువు గారివి ఇంటిలో నిత్యం మారుమోగుతూనే ఉంటాయి. మరి ప్రకృతి మీద రాస్తారా? మొన్న అదే పదిగా ఆ మేఘాలను చూస్తూ ఉంటే ఎవడో నవ్విపోయాడు, నా గోడు ఆ పక్కన వాలిని పక్షికి వినిపించా. అది సరే కానీ, మీరు రాసినవి ఎవరు చదువుతారు? ఆప్యాయం గా చదివే వాళ్ళు కొంతమంది ఉండటంతో ఈ మాత్రమన్నా రాసేసా, ప్రోత్సాహం ఇచ్చిన పత్రకలో కొన్ని ప్రచురించా ఇంతకంటే ఏం కావాలి. మీకు రాయాలని మొదట ఎప్పుడని పించింది? మా మావగారు రైల్లో చదివే కథలు అని ఓ పుస్తకం రైల్లో వెడుతూ చదువుతూ నవ్వుకొంటుంటే నన్ను వింతగా చూసిన పక్కాయనకు ఏదో ఓ రోజు నేను రాసింది చదివి మీరు కూడా నాలానే నవ్వుదురు గాక అని శపించాను, ఇది చాలా ఏళ్ళ క్రితం మాట. మరీ…? ఇంక చాల్లేండి ప్రతీవాడు సెల్ఫ్ కొట్టుకొని, క్లాస్ పీకేవాడే అంటారు జనాలు మళ్ళీ!
ఓకే ఓకే.. సరే సరే . అదిగో .. తోస్తారేంటి మనసులోంచి? మొహం మీద గుండె తలుపేస్తారేంటి? మీతో మాట్లాడిందంతా లోపలే ఉన్నాయి కాబట్టి మీరే రాసుకొని మీరే ప్రచురించుకోండి! ..
ఎక్కడ దొరికాడో మహానుభావుడు .. ఇదిగో ఓ సలహా… మీకు మీ భావం లో రసజ్ఞత ఉండేలా రాయండి, హాస్యం రాసి నలుగురిని నవ్వించండి, అక్షర శిల్పి కృష్ణశాస్త్రి గారు చెక్కినట్లు చెక్కాలి ‘నవ్విపోదురుగా నాకేటి సిగ్గు…’ అంటూ భావం ఉట్టిపడేలా రాసారు ఆయన.
అంత సౌండ్ పెడితే నే చెప్పేది ఏమి వినపడుతుంది?
“నేనెవరూ? నన్నెందుకు ఆ కళ్ళు దేవుడిలా చూస్తున్నాయి?”, అంటూ బాహుబలి డైలాగ్స్ వినిపిస్తుంటే..
అది ఆపి ఓ పేపర్ కలం తీసుకొని రాయడం మొదలు పెట్టండి అదే నా సలహా.. ఉంటా
సరే సరే మీరు దయచేయండి.. అగ్గిపుల్లా సబ్బు బిళ్ళా కవితలకు అనర్హం అని తెలుసు..
శుభం భూయాత్!
కౌండిన్య – 06/03/2017