శ్రీ ఆస్వాల్డ్ జెన్నింగ్ కూల్డ్రే ఆంధ్ర చిత్రకారులకు ఆదిగురువు వంటి వారు.
ఆక్స్‌ఫర్డ్ సమీపాన గల అబింగ్డన్ లో జన్మించిన కూల్డ్రే , 1909 లో రాజమండ్రిలో అప్పట్లో ప్రారంభించిన గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపల్ గా పదవీబాధ్యతలు చేపట్టారు. రాజమండ్రిలో నివసించిన తొమ్మిదేళ్ళ కాలంలో కూల్డ్రే ఆంధ్రదేశానికి చేసిన సేవ మరువరానిది.
భారతదేశం గర్వించదగ్గ చిత్రకారులలో శ్రీ దామెర్ల రామారావు ఒకరు. కూల్డ్రే గారితో పరిచయమయ్యే నాటికి దామెర్ల రామారావు వయస్సు పధ్నాలుగేళ్ళు. ఆ బాలునిలోని చిత్రకళా ప్రతిభను, పిపాసను గుర్తించి, అతడికి ప్రేరణ యిచ్చి, సొంత డబ్బులతో కూడా సహాయం చేసి, ఎనలేని ప్రోత్సాహం అందించి, ఒక ఉత్తమ పరిణత చిత్రకారునిగా తీర్చిదిద్దారు కూల్డ్రే.
పాశ్చాత్య చిత్రకళా ప్రభావంతో భారతదేశంలో సంప్రదాయక చిత్రకళ శైలులు మరుగున పడిపోతున్న సమయంలో, 1920 దశాబ్దంలో భారతీయ చిత్రకళ పునరుద్ధరణకు ఉద్యమాలు బయలు దేరాయి. అవనీంద్రనాథ్ ఠాగోర్, నందలాల్ బోస్ వంటి బెంగాలీ చిత్రకారులు బెంగాల్స్కూల్ఆఫ్ఆర్ట్స్ ను స్థాపించగా, ట్రినడే, శారదా వకీల్, ధురంధర్, చుగతాయ్ వంటి ముంబాయి చిత్రకారులు బాంబేస్కూల్ఆఫ్ఆర్ట్స్ ను నెలకొల్పారు. కూల్డ్రే నాటిన జాతీయతా భావబీజాలతో దామెర్ల రామారావు గారు ఆంధ్రాస్కూల్ఆఫ్ఇండియన్ఆర్ట్స్ స్థాపించాడు.
కూల్డ్రే ఒక్క దామెర్ల రామారావుకే కాదు, వరదా వెంకటరత్నం, అడవి బాపిరాజు, కవికొండల వెంకటరావు, దామెర్ల వెంకటరావు వంటి పలువురికి మార్గదర్శకుడైనారు. అతని ప్రేరణతోనే అడవి బాపిరాజు అజంతా చిత్రాలను, అమరావతి శిల్పాలను అధ్యయనం చేసి, తన కళకు మెరుగులు దిద్దుకున్నారు. ఆదివారాలలో సెలవు దినాల్లో కూల్డ్రే సాహిత్య, చిత్రకళాభిమానులను తన బంగళాకు ఆహ్వానించి, అనేక విషయాలపై చర్చలు జరిపిస్తూ వుండేవారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో అప్పుడు జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్న శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా ఆ చర్చల్లో పాల్గొనేవారు.
కూల్డ్రే కేవలం విద్యాధికారే కాక, గొప్ప చిత్రకారుడు. అంతకు మించి గొప్ప సంస్కార హృదయుడు. ఆంధ్ర విద్యార్థులు ఆ రోజులలో వ్రాస్తున్న కవిత్వాలు, చిత్రిస్తూ వచ్చిన బొమ్మలు, కావిస్తూ వున్న ఉపన్యాసాలు, ఆడుతూ వచ్చిన నాటకాలను మిక్కిలి ఆసక్తిగా అవలోకిస్తూ వారందరినీ ప్రోత్సహించిన ఆచార్యశేఖరుడు. ఆంధ్రదేశంలో ఉన్నంత కాలం ఆయన మన జీవనవిధానంతో మమేకం చెందిన వ్యక్తి.
అనారోగ్య కారణంగా ఆకస్మికంగా ఇంగ్లండు తిరిగి వెళ్ళాక రచించిన “సౌత్ఇండియన్అవర్స్ (దక్షిణభారత స్మృతులు)” అనే పుస్తకంలో తనకు భారతదేశంలో గడిపిన కాలమంతా, మధురస్మృతిగా మిగిలిపోయిందని పేర్కొన్నాడు. ఆ పుస్తకంలో ఆయన చిత్రించిన మొత్తం పంతొమ్మిది నీటివర్ణ చిత్రాలను కూడా జతపరిచారు. కూల్డ్రే చిత్రాలు ఎంతో పొందికగా, జీవం ఉట్టిపడుతూ, ఫోటోగ్రాఫిక్ప్రెసిషన్ తో ఉంటాయి.
పల్లె జీవితపు అందాలను తన రచనలలోనే కాక, చిత్రాలలో కూడా అందంగా చూపించారు. కుప్పనూర్పిళ్ళు, మోటబావి నుండి నీళ్ళు తోడడం, చెట్టు కింద పశువులు విశ్రమించడం, గోదావరి గట్టున మెట్ల మీద ఒ పాప తన తల్లి కోసం నిరీక్షణ చేస్తున్న దృశ్యం, ఓ సన్యాసి, జాలరి, నటరాజు, కృష్ణుడు, విజయనగర దేవాలయ శిథిలాలు, అలాగే దక్షిణ భారతదేశం లోని దేవాలయాలు, వాటి పరిసరాలు – యివన్నీ అతనికి ప్రియమైన దృశ్యాలు.
“ఆంధ్రచిత్రలేఖనం సాంప్రదాయం సుమండి. ఇది భారతీయ సంస్కృతికి మకుటాయమానమైన విధానం” అంటూ కూల్డ్రే ఉత్సాహంతో పొంగిపోయి, ఆ అభిప్రాయాలు, ఆయన హృదయంలో నాటుకుపోయిన చిత్రాలు శాశ్వతంగా గ్రంథరూపం చేసారు.
కూల్డ్రే తన పుస్తకంలో ఆంధ్రదేశంలోని తోలుబొమ్మలాట ను ఎంతగానో మెచ్చుకొన్నాడు. అది ఎంతో సృజనాత్మకమైన కళా ప్రక్రియ అని అతడు పేర్కొన్నారు.
ఈ “సౌత్ ఇండియన్ అవర్స్” పుస్తకం దామెర్ల రామారావు, అడవి బాపిరాజు మరియు కవికొండల వెంకటరావు కు అంకితం చేసారుకూల్డ్రే. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కూల్డ్ర్ మాత్రం తనను చిత్రకారుడిగా కాకుండా కవిగా, రచయిత గానే చెప్పుకుంటారు. ఆయన 1924 లో విడుదల చేసిన “సౌత్ ఇండియన్ అవర్స్” పుస్తకంతో పాటు “ది మిస్టేకెన్ ఫ్యూరీ” (1914), “థేమ్స్ అండ్ గోదావరి” (1920), “ట్రియోలెట్స్ అండ్ ఎపిగ్రామ్” (1948) ది ఫాంటమ్ వాటర్ఫాల్”(1949), “సోనెట్స్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్” (1951) “వెర్సెస్ ఓవర్ ఫిఫ్టీ ఇయర్స్” (1958) ప్రచురించారు. వీటిలో ఆయన చిత్రాలతో పాటు కవితలు, చిన్నకథలు కూడా ఉన్నాయి.
ఆంధ్ర చిత్రకళారంగ పునరుజ్జీవనానికి ఎంతో దోహదం చేసిన, ప్రాచీన జీవన విథానాన్ని చిత్రీకరించి, గ్రంథస్థం చేసిన శ్రీ ఆస్వాల్డ్ జెన్నింగ్ కూల్డ్రే కు ఆంధ్రులు ఎంతో ఋణపడి ఉంటారు.
(సేకరణ వికిపీడియా, శ్రీ అడవి బాపిరాజు గారి “అస్వాల్డు కూల్డ్ర్ గురువు” భారతీ పత్రికలో ప్రచురించమైన వ్యాసం, శ్రీ కవికొండల వెంకటరావు గారు రాసిన “తెనుఁగు బిడ్డవు! ఎవరికిఁ దీసిబోదు?” వ్యాసం నుండి)
(నాకు నచ్చిన కొన్ని చిత్రాలు “సౌతిండియన్ అవర్స్” మరియు “ది ఫాంటమ్ వాటర్ఫాల్” పుస్తకాలలోనుండి సరదాగా గీసినవి. ఈ రోజు ఆర్ట్స్ డే సందర్భంగా కూల్డ్రే గారిని తలుచుకోవటము మన బాధ్యత)
కౌండిన్య ( రమేష్ కలవల) – 15/04/2019





