ఆయన, ఆయన తరువాతే ఎవరయినా!
ఆయన పోస్టు పెడితే చాలు..మినిమమ్..
ఓ వెయ్యి లైకులు గ్యారంటీ ఏ సమయానికైనా!
మొన్న బెండకాయ ఫొటో పెట్టి, ఇదేంటి చెప్పుకోండి చూద్దాం అని పెట్టి పెట్టగానే, వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది లైకులు, రెండు వేల కామెంట్లు వచ్చాయి. మహానుభావుడు! నేను కూడా ‘ఆకుపచ్చని వేరు శనక్కాయ్” అని కామెంటు పెడదామనుకొని, మళ్ళీ నాకెందుకు అని మనసు మార్చుకొని, నేను ఆ మిగిలిన ఒక్క లైకు కొడితే గనుక లైకులు, కామెంట్లు సరిసమానం అవుతాయని ఓ లైకు కొట్టాను.
ఆయన పడ్డ కష్టం చూసి నాకు కూడా ఓ మామూలు ‘గడ్డి’ గురించి వ్రాద్దామని గడ్డి కనపడిన చోట చతికిల పడి, బాసింపట్టు వేసుకొని మరీ దాని మీద ఓ ఇరవై నిమిషాలు రీసెర్చ్ చేసి చమటోర్చి ఈ పోస్టు వ్రాసాను. నేను వ్రాసిన ప్రతీ వాక్యానికి మీ మనసులో స్పందన ఎలా ఉంటుందో కూడా ఊహించి ఇక్కడ జత పరిచాను.
ఇక నా రీసెర్చ్ లోని ఆణిముత్యాల లోకి వస్తే…
ముందుగా ఇక్కడ గడ్డి కత్తిరించక పోతే పొడుగ్గా పెరుగుతాయి (ఒరేయ్ సన్నాసి.. నువ్వు కూడా జుట్టు కత్తిరించుకోక పోతే నీకు పొడుగ్గానే పెరుగుతుంది)
ఈ గడ్డి చలికాలంలో చలికి తట్టుకోలేక నిక్కబొడుచుకొని, ఎండ ఎపుడు వస్తుందా అని బిక్క మొహం వేసుకొని సూర్యూడి వైపు చూస్తుంటుంది (మరి నీ పరిస్తితేంటో? అసలు చలి తగ్గేదాకా ఇంట్లోంచి బయటకు తగలడతావా? ఒక వేళ తగలడినా అంతరిక్షంలోకి వెళ్ళేవాడిలా తయారయ్యి వెడతావేమో బయటికి?)
ఒక గడ్డిపరకకు జలుబు చేసి ముక్కులోంచి నీరు కారడం స్వయంగా చూసాను (ఇంకా నయం డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళి మందులిప్పించావు కాదు.. ఆ డాక్టరు కూడా నీ లాంటి వాడే అయితే స్టెతస్కోప్, మైక్రోస్కోప్ లతో చూసి బయోస్కోపీ అంటూ ఆ గడ్డి మీద రకరకాల పరీక్షలు చేసి, దానికి ఒంట్లో బాలేదని నీకు సూది పొడిచేవాడు.. సరిపోయేది)
పట్టపగలు రెండు గడ్డిపరకలు కొట్టుకోవడం చూసాను (పోలీసు స్టేషన్ కు ఫోన్ చేయక పోయావా పోనీ? లాకప్ లో ఇద్దరిని విడివిడిగా పెట్టి నీ చేత సాక్షి సంతకం చేయించుకు పంపేవారు. నీకు జాలి ఎక్కువై తరువాత రోజు ఏ లాయర్ దగ్గరకో వెళ్ళి బెయిల్ కూడా తెచ్చి వాటిని విడిపించే రకం లాగా కనపడుతున్నావ్..ఏ గాలికి అవి కదలినా నీకు కొట్టు కున్నట్లు కనపడతాయ్ మా ఖర్మ..)
నాకు ఒక్కో దేశంలో గడ్డి ఒక్కోలాగా ఉంటుందనిపిస్తూ ఉంటుంది. (ఒరేయ్ ఛాదస్తం వెధవా.. వేరే వేరే దేశాలలో వస్తువులు, మనుషులు వేరేలా ఉండటం చూడటంలా?)
ఏ దేశం లోనైనా గడ్డి బట్టలేసుకోవడం ఎన్నడు చూసి ఎరగను, ఇక్కడా అంతే! (నువ్వు కుట్టరా వాటికి బట్టలు.. ఇది వరకు నీలాంటి వాడే ఒకడు పనిలేక పిల్లి తల గొరికాడుట.. వాటికి బట్టలు కుట్టించి, అవి ఉతుక్కోడానికి వాటికి వాషింగ్ పౌడర్ కూడా ఇచ్చిరా పోనీ.. వాషింగ్ పౌడర్ నిర్మా .. తట్టుకోలేని సంతోషం చెప్మా.. అంటూ గింగిరాలు తిరుగుతూ పాటలు పాడుకుంటాయి మనలానే అవి కూడా)
చివరగా ఇక్కడ ఎండుగడ్డి ఎండాకాలమే మొలుస్తుంది కాబోలు. ఇపుడు అంతా ఆకు పచ్చగా కనపడుతున్నాయి (అసలు ఎండుగడ్డి మొలవటమేంటిరా? తింగర నా బుచ్చి.. ఎండాకాలం లో ఎండకి తట్టుకోలేక అలా తయారైవుతాయి. పోనీ వాటికి ఎండదెబ్బ తగిలి కమిలి పోకుండా నువ్వు రాసుకునే సన్ క్రీమ్ వాటికి రాయి.. ఇంతకీ బడికి ఎపుడైనా వెళ్ళావా? వేరేవాడు రాసిన థీసిస్ కొనుక్కొని డాక్టరయ్యిన వాడిలా కనిపిస్తున్నావు..)
ఇంకో అసలైన గడ్డి విషయం గురించి చెప్పటం మరిచిపోయాను (ఇదిగో ..ఇంకోసారి గడ్డి గురించి ఏమైనా రాసావో జీవితాంతం “గడ్డితో వెయ్యి వంటకాలు” అన్న ఛానెల్ లోని “గడ్డితో చేసిన గుగ్గిళ్ళు” అనే వంటకంతో మొదలుపెట్టి ఆ వెబ్ సైటులో వంటలన్ని రోజుకొకటి చేసి నీ చేత తినిపిస్తా జాగ్రత్త! అమ్మ ఆయ్.. )
(ఇక కొట్టండి లైకులు, రాయండి కామెంట్లు…. మీరు కొట్టినా, రాయకపోయినా .. సరదాగా నవ్వొస్తే నవ్వుకోండి.. అది చాలు)
శుభం భూయాత్!
కౌండిన్య (రమేష్ కలవల)- 22/02/2019