జోగారావు కి వాట్సప్ లో ‘జబ్బార్ హచ్చి తుమ్మెన్’ వాళ్ళ “ఇలా చేస్తే జీవితంలో అజీర్తి మటుమాయం….” అంటూ ఓ వీడియో శ్రేయోభిలాషి దగ్గర్నుండి రావడంతో ఆత్రుతగా తెరిచి చూడటం మొదలు పెట్టాడు.
ఇలాంటి వీడియోలంటే అతనికి భలే ఆసక్తి , పైగా వాళ్ళు చెప్పినట్లే తను కూడా ఫాలో అవడం కూడా తనకు ఎంతో సరదా.
ఆ వీడియోలో ముందుగా అజీర్తి ఎంత భయంకరమైన వ్యాధో చెప్పి, ఇలా చేస్తే గనుక ఆ వ్యాధి దెబ్బకి కంట్రోల్లోకి రావడం ఖాయం అంటూ చెబుతూ, ఇది ప్రాచీన గ్రంథాలలో నుండి వెలికి తీసిన రహస్యమని, అదీకాక ఇది కొత్త మందులకు ససేమీరా లొంగని వ్యాధి అని, దీనికి మనం చేయాల్సిందల్లా క్రమం తప్పకుండా ఏడు రోజులు ఇక్కడ చెప్పిన విధంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు దక్కుతాయని చెబుతూ, ఇక ఇలా చేయమనడంతో తను కూడా ఔత్సాహికంగా చెవులు రిక్కించి వినడం మొదలు పెట్టాడు.
ముందుగా ఓ పెద్ద బక్కెట్టులో ఐదు లీటర్ల గోరు వెచ్చని నీరు తీసుకోవాలి అనడంతో అక్కడ ఆ వీడియోను ఆపి హడావుడి గా పెరట్లోకి పరిగెత్తాడు.
చనీళ్ళతో నింపిన బక్కెట్టులో కొన్ని నీళ్ళు వొంపేసి దానిని తీసుకొని లోపలకు పరిగెత్తి స్టౌ మీద వేడి నీళ్ళు కాచి ఆ బక్కెట్ లో పోసాడు. గోరు వెచ్చగా ఉన్నాయో లేదో ఓ సారి చూసి తృప్తి పడి మళ్ళీ వీడియో మొదలుపెట్టాడు.
మళ్ళీ ఆ వీడియోలో అజీర్తి వల్ల కలిగే అనర్థాలు గురించి ఓ ఐదు నిమిషాలు చెప్పిన తరువాత ఇలా చేయమనడంతో అప్రమత్తం అయ్యాడు.
ఇపుడు ఐదు కిలోల పచ్చ గడ్డి తీసుకొచ్చి , బాగా కడిగి ఆ గోరు వెచ్చని నీళ్ళలో వేయాలి అనగానే జోగారావు హడావుడిగా పక్కింటి వాళ్ళ ఇంటి పెరట్లోకి సరాసరి జొచ్చి పచ్చగడ్డి కట్టను తీసుకొచ్చాడు.
ఓ ఐదు కిలోల గడ్డిని ఆ నీళ్ళలో వేసి మళ్ళీ వీడియో మొదలు పెట్టాడు.
ఓ అరగంట నానపెట్టాలి అనడంతో ఆ అరగంట ఏం చేయాలో తోచక యూ ట్యూబ్ లోకెళ్ళి
పడుకునే ముందు నిమ్మతో ఐదు నిమిషాలు ఇలా చేస్తే ముఖం తెల్లగా మెరవటం ఖాయం అనే వీడియో ఓ ఐదు నిమిషాలు చూసి..
అరకేజీ ఉల్లిపాయతో ఇలా చేస్తే షుగరు మటుమాయం అనే వీడియో ఓ పది నిమిషాలు చూసి..
ఉసిరికాయతో మూడు రోజులు ఇలా చేస్తే చుండ్రు రాలటం తగ్గి, జుట్టు ఊడటం ఖాయం ఎలాగో ఇంకో ఐదు నిమిషాలు చూసి..
చివరగా చింతపిక్కలతో నేల మీద ఆరు గంటలు గీసి దానితో వచ్చిన పొడితో చేసిన రసాన్ని సేవిస్తే ఓ వారం ఆఫీసుకు ఖచ్చితంగా సెలవు దొరుకుతుందని ఓ పది నిమిషాలు చూసి …
మళ్ళీ ఇందాకా ఆగిన వాట్సప్ వీడియో మొదలు పెట్టాడు.
ఇపుడు ఇందాకా వేసిన పచ్చ గడ్డి ఆ బక్కెట్ లోంచి తీసివేసి ఆకు పచ్చ రంగులో ఉన్న నీటిని వడగొట్టి వేరేగా ఉంచుకోమనడంతో చెప్పిన విధంగా ఆ ఐదు లీటర్ల ఆకు పచ్చని నీటిని రెడి చేసాడు.
ఇక చివరగా అంటూ…. ఆ ఆకు పచ్చని నీటిలో ఇపుడు రెండు కేజీల తవుడు కలిపి గిర గిరా మని మీకు కళ్ళు తిరిగేలా ఓ అరగంట తిప్పి ఆ మిశ్రమాన్ని మీ గేదెకు పెట్టాలి అన్నాడు.
అప్పుడు వెలిగింది బల్బు …ఇది ఏ గేదెలకో అజీర్తి తగ్గే వీడియోనని …. మనుషులు కు సంబందించినది కాదని!
ఇంతలో వాళ్ళావిడ వస్తున్న అలికిడి కావడంతో హడావుడిగా ఆ మిశ్రమాన్ని పారబోయాడు. అది గమనించిన ఆవిడ ఆ రంగు నీళ్ళ సంగతి అడిగింది. “కాంతం.. మన పక్కింటి గేదెకు అజీర్తి చేసిందంటే సహాయం చేద్దాం కదా అని ఈ వీడియో చూసి తయారు చేయబోయాను” అన్నాడు గాలి తీసిన బెలూన్ లాగా తయారయ్యి. కొంచెం తేరుకొని
“ఇంతకీ చెప్పలేదు.. పొద్దునుండి నాక్కూడా కొంచెం అజీర్తి చేసినట్లుగా ఉందోయ్, ఓ టాబ్లెట్ పట్రా” అన్నాడు కాంతంతో..
అదండి సంగతి! ఈ మధ్య బోలెడు “ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా జీవితంలో ఏ వ్యాధి రాదు..” అంటూ వస్తున్న ఉచిత సలహా వీడియోల గురించి సరదాగా రాసినది.
బహుసా వాటిలో కొన్ని మంచి కొరకు పంపినవే అయ్యండవచ్చు కానీ వాటిని సైన్స్ పరంగా రుజువు చేసి మనకు తప్పక ఉపయోగపడతాయని ఎలా నమ్మగలము?
మీకు కూడా అలాంటి వీడియోలు వచ్చినపుడు మీ స్పందనలు ఎలా ఉంటాయి?
శుభం భూయాత్!
కౌండిన్య – 03/02/2019