
మట్టి, దుమ్ము, ధూళి, దువ్వ….అందులో ఏమున్నాయి? అది ఒఠ్ఠి మట్టి కాదు …. అందులో ఉన్నాయి లక్ష కథలు…అణిగి మణిగి రేణువులై ఉన్నాయి కోటి బతుకులు …
దేవరుల కథలు, దేవతల కథలు, వూళ్ళెళ్ళిన వాళ్ళ కథలు, ఊరేగిన వాళ్ళ కథలు, అడుక్కుతిన్న వాళ్ళ కథలు, అర్థాకలి గాళ్ళ కథలు, ఆశలు తీరని కథలు, చెట్టుకొమ్మెక్కిన కథలు, నక్షత్రాలైన కథలు, పక్షి కథలు, పావురాళ్ళ కథలు..
అన్నీ మనుషులు గాథలే .. ఎన్నో ఉన్నాయి ఆ మన్నులో..
కళ్ళలో దుమ్ము
ఎదురుగా గాలి దుమారం! నిలువెత్తున లేచిన దుమ్మూ, దూగరా! ఆ మట్టి తిట్టుకుంటోంది, ఆ దుమ్ము మూలుగుతోంది.
ఎల్లయ్య అవసరమై పుల్లయ్య దగ్గరికి బాకీకెళ్తే, ఉన్న కాస్తపొలం తాకట్టు పెట్టుకొని అప్పులిచ్చి , వడ్డీకి వడ్డీ మెలేసి ఉన్న ఇంటినుంచి కూడా తరిమికొట్టగా, ఎల్లయ్య ఇంటిని తన ఇల్లుగా చేసుకొని పుల్లయ్య కులుకుతుండగా, ఉన్న ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేక పోయిందిగా!
ఇల్లాలు వెళ్ళిపోతే సంతులేక ఒంటరిగాడై కూలిపోతున్న రెండు ఇళ్ళూ చూసుకుంటూ, తాకట్టు పత్రాలు చదువుకుంటూ ఏ యమ్మయినా ఇంత గంజిపోస్తే తాగుతూ – హరీ’మన్న పుల్లయ్య తన కంట్లో తానే దుమ్ము కొట్టుకోలేదా? దుమ్ము పడిన కళ్ళు గరగర! కడుపు చురచుర!
మెత్తటి దుమ్ములో, సన్నటి దుమ్ములో అరికాళ్ళు గిలిగిలిగింతలు కాగా ముందుకు నడిస్తే…
మట్టిలో ఇంకిన కన్నీళ్ళు
ఆ చెట్టు కింద దుమ్ము జానకి కన్నీటితో కన్నీరు మున్నీరై పోతొంది.
అక్కడే ! అక్కడే ! పిచ్చిపిల్ల! జానకి ! తాను మనసా వలచి తప్పక తాళికడ్తాడని నమ్మిన వయసుగాడు ఇంకొకత్తెని చేపట్టి పల్లకీలో ఊరేగుతూ వెళ్ళిపోతుంటే ఆ చెట్టు చాటున నుంచొని చూసింది. తన పెన్నిధి తనకు దూరమైపోగా,కళ్ళు కరిగి పోగా జలజల రాలిన కన్నీళ్ళన్నీ ఆ మట్టిలో ఇంకిపోయినాయి.
ఆ ముందుకెళ్తే..
మట్టి గోడ
సంగడు పెద్దవాడై మంచంలో పడి ఉంటే కూతురు లచ్చి కూలిచేసి గంజి పోస్తోంది. గుడిసె సగం కూలిపోయిందేం చెప్మా!
సంగడు మట్టిలో పుట్టాడు, మట్టిలో బతికాడు. మట్టి కలిపాడు. ఈ ఊరి ఇళ్ళ గోడలన్న మూడొంతులు వాడి చేత్తో కట్టినవే! వాడి ఉప్పర సంగడి గుడిసె గోడ పడిపోతే వాడు వేసుకోలేడు!
ముందుకు నడు!
మట్టి కుండలు, జ్ఞాన పలకలు
అరవై ఏళ్ళ కుమ్మరి సీతాలుకి కూడా మట్టే ప్రాణం. గబగబ కుండలు చేస్తుంది.
చల్లటి కుండలు.. అన్నం వండుకునే కుండలు. ఎంచక్కటి మూతలు. ఆ పక్కన పలకలు ..జ్ఞాన పలకలు. బలపం పట్టుకొని స్వాతి ముత్యాల్లా ‘ఓనమా’.. దిద్దుకునే పలకలు..
సీతాలుకి ఇంతవయసొచ్చినా కుండలలో వండుకునే కూరలు, పప్పుచార్లు.. పాయసాలు .. వరన్నం ఎరగదు.
పలకలలో దిద్ది పెరిగి పెద్దై, మేధావులై, పదిమందిలో గొప్ప వారనిపించుకొని ఆ పలకల్ని సీతాల్ని మర్చిపోయిన ఓ అయ్యలారా, మట్టి ముందుకు రమ్మంటోంది. రండి!
నేలతల్లి ముద్దు కొడుకు
నాగలి భుజానకెత్తుకొని నేలని నమ్ముకున్న ఓ అయ్య మనకి పెరుగన్నం, పాలబువ్వ అందించేటయ్య రెండుపూటలా సంకటే తింటాడు. ముద్దలో నేతి బొట్టు ఎరగడు.
అయితేనేమి! ఆ కళ్ళలో దీక్ష కండల్లో బలం, ఎత్తిన నాగలి, పైకెత్తిన ములుకోలు, ఆ అంగంలో రాజసం, ఆ మీసంలో పొంకం, ఆ చూపులో ఠీవి.. ఇవన్నీ ఎక్కడినుంచి వచ్చాయి.
ఆ అయ్య నేలతల్లి కొడుకయ్యా!
మట్టి…ఒఠ్ఠి మట్టి….
మహాపురుషుల పాదాలు తాకిన మట్టి…బౌద్దుల పావుకోళ్ళలో దూరి పాదాభివందనం చేసుకున్న మట్టి.. చిన్నప్పుడు మనం గుప్పెళ్ళతో తిన్న ఒఠ్ఠి మట్టి ఇదే!
మట్టి పలుకుతోంది. ఒఠ్ఠి మట్టి తుళ్ళి తుళ్ళి పడుతోంది. ఎటు చూసినా మట్టి. కృష్ణ వొడ్డునిండా మట్టి.. కృష్ణ గర్భంలో మట్టి, కృష్ణ అవతల మట్టి.. వూరునిండా మట్టి… మట్టి నిండా కథలు.. మట్టి నిండా చరిత్ర.. తరతరాల మట్టి.. యుగయుగాల ఒఠ్ఠి మట్టి!
మనం మట్టిని మరిచిపోతున్నామా? “తల్లిని మర్చిపోతున్నార్రా చిన్నారులు” అంటోంది నేలతల్లి. మనం మట్టిని మర్చిపోతున్నాం. మనుషుల్ని మర్చిపోతున్నాం.
ఆ మట్టిని రేపుతాను.. ఉవ్వెత్తుగా రేపుతాను.. కథల కథల మట్టిని, మనిషి మనుషులు మట్టిని తుఫానులా రేపుతాను!
ఇందులో దొర్లుతాను.. పొర్లుతాను, వొళ్ళంతా చల్లుకుంటాను. వొళ్ళొంతా మట్టి విభూది పూసుకొని కళ్ళు విచ్చుకు మట్టి కడుపు లోకి చూస్తాను.
అధ్భుతమైన కథ
ఈ కథ మట్టి గురించా? మనుషులు గురించా? ఆ మట్టిలో రేణువులలా అణిగి మణిగి ఉన్న మనుషుల కోటి బ్రతుకుల గురించి. దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ అన్నట్లుగా యుగయుగాల దేశ మట్టి చరిత్రలో కూరుకుపోయి, వెతికిన కొద్ది కనిపించే మనుషుల గాథల గురించి.
మనుషులు ఎంతో సాధించామనుకున్న తరువాత వెళ్ళిపోతే అయ్యేది ఈ మట్టేనని సూటిగా గుర్తుచేసే కథ.
కౌండిన్య – 26/08/2018