లేట్ గా వస్తానన్న భర్తకు తన భార్య వండిన వంట అంతా టేబుల్ మీద పెట్టి పడుకుంది. ఇంతలో దొంగతనానికి వచ్చిన ఓ చిలిపి దొంగోడు ఆ వంటల ఘమఘమలకు తట్టుకోలేక చాలావరుకు ఆరగించి కొద్దో గొప్పో మిగిల్చి వెళ్ళాడు. ఆఫీస్ నుండి తిరిగొచ్చిన భర్త విపరీతమైన ఆకలితో ఆ కొంచెం మిగిలినవి పళ్ళాలు, గిన్నెలు, గరిటెలతో సహా మెరిసేలా ఖాళీ చేసాడు. ఇంతలో భార్య లేచి, ఆ గిన్నెలను వాటిని చూసి, భర్తతో ముద్దుగా “దొంగా, ఆకలేసినట్లుంది, ఏమి మిగల్చకుండా అన్నీ తినేసారు”, అంది. ఆకలి తీరని భర్త కు చిర్రెత్తింది, భార్య కొద్దిగానే మిగిల్చిందన్న కోపంతో “ఏమి పెద్దగా మిగిలాయి గనుక, అన్నీ మిగల్చకుండా తినేయడానికి”, అన్నాడు. ఆవిడ ఆయనకు ఆ రోజు వంట సరిపోలేదేమో నని “అయితే రేపు కొంచెం ఎక్కువ పడేస్తాలేండి”, అంది, ఆ గిన్నెల వైపు చూసి “అయినా ఇవ్వనీ తోమడం ఎందుకండీ”, అంటూ అన్నీ లోపల సర్ధండం మొదలు పెట్టింది. విసుగుతో కూడిన కంగారుతో “అవి తోమినవి కావు”, అన్నాడు. “మీరు భలే వాళ్ళే, మీరు తోమినందుకు నేనేమి అనుకోనులేండి”, అంది. చేసేదిలేక “నీ ఖర్మ”, అన్నాడు. కిటికీ దగ్గరనుండి ఇకఇకలు పకపకలు వినపించాయి. ఇద్దరూ వెళ్ళి చూస్తే చీకట్లో ఎవ్వరూ కనిపించలేదు.
కౌండిన్య -21/11/2016