రాగం- హిందోళం, తాళం- ఆదితాళం
రచన: పరమహంస శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి
మనకు తెలిసిన గోపాలుడు ఎవరు? గోకులంలో గోవుల పాలన చేసేవాడు, నందుని కుమారుడు, మన్మథుడు పుత్రుడుగా గలవాడు.
గోపాలుడు భోగశరీరం దాల్చిన అవతారమూర్తి. తన ప్రాణ స్నేహితుడైన కుచేలుడి చేత సేవింప బడ్డాడు.
మహా పరాక్రమశాలి. దుష్టశిక్షణ, శిష్టరక్షణగా దితి సుతులైన హిరణ్యకసుపుడు, హిరణ్యక్షుడు అనే రాక్షసులను సంహరించినవాడు. మధు అనెడి అసురుని అంత మొందించిన వాడు, చాణూరం అనే దైత్యుడిని హత మొనర్చిన వాడు.
గోపాలుడు భక్తుల పాలిట కల్పవృక్షం. మన మనసులోని కాలుష్యాన్ని దూరంచేసి మనలో పాపచ్చేదనము గావించేటి వాడు. ముల్లోకాలు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి. అన్నీ వేదాల సారమైన ఆ పరమాత్మ యోగవిచారం ద్వారానే మనకు దొరుకుతాడు కాబట్టి మనసులో ఆ పరమాత్మను ఎవరైతే సేవిస్తారో వారు సదా సుఖించును అని తెలియ జేయుచున్నారు.
గోపాలుని నామాన్ని భజించుచూ తత్త్యమార్గమున పయనించి మోక్షధామమును చేరమని శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులు వారు ప్రస్తుత సంకీర్తనలో సూచిస్తున్నారు.
ప: భజరే గోపాలా మానస
భజరే గోపాలమ్ ॥భజరే॥
చ: భజ గోపాలమ్ భజిత కుచేలం
త్రిజగన్మూలమ్ దితిసుత కాలం ॥భజరే॥
చ: ఆగమసారం యోగవిచారమ్
భోగశరీరం భువనాధారమ్॥భజరే॥
చ: కదనకుఠారం కలుషవిదూరం
మదనకుమారం మధుసంహారమ్॥భజరే॥
చ: నతమందారమ్ నందకిశోరమ్
హతచాణూరమ్ హంసవిహారమ్॥భజరే॥
తాత్పర్యం:
మానస- ఓమనసా! , భజరే= సేవింపుము, గోపాలమ్- గోపాలుని, కుచేలమ్- కుచేలునిచేత, భజిత- సేవింప బడిన వాడును, త్రిజగన్మూలం- ముల్లోకములకు ఆధారమైన వానిని, దితి- దితి యొక్క, సుతకాలమ్= కుమారలను సంహరించిన
ఆగమసారం- వేదసారమైన వానిని, యోగవిచారమ్- యోగవిచారము ద్వారా దొరుకు వానిని, భోగశరీరం- దేహము దాల్చిన వానిని, భువనాధారం- ప్రపంచమునకు మూలమైన వానిని
కథనకుఠారం- పాపచ్చేదనము గావించుటలో గొడ్డలి వంటి వానిని, కలుషవిదూరం- కాలుష్యమును దూరము చేయువానిని, మదనకుమారమ్- మన్మధుని పుత్రుడుగా గలవానిని, మధుసంహారమ్- మధు అనెడి అసురుని అంత మొందించినవాడు
నతమందారమ్- భక్తులకు కల్పవృక్షము వంటి వాడిని, నందకిశోరమ్- నందుని కుమారుని, చాణూరమ్- చాణూరమ్అనే అసురుడు, హత= హత మొనర్చిన వానిని, హంస విహారమ్- పాలకులు పరమహంస
భావంతెలుగులో:
ప: గోపాలుని సేవించు, ఓ మనసా! గోపాలుని సేవించు.
చ: గోపాలుడు కుచేలుడుచేత సేవింపబడిన వాడును, ముల్లోకాలకు మూలమైన వాడును, దితిసుతులైన అసురులను సంహరించినవాడైన గోపాలుని సేవించు.
చ: వేదాల సారమైన వాడును, యోగ విచారంతో దొరికే వాడును, భోగస్వరూపంతో ఉన్నవాడును, ఈ ప్రపంచానికే మూలకారకుడైన గోపాలునిసేవించు.
చ: పాపాలను హరించే గొడ్డలి వంటి వాడును, మనలోని కాలుష్యాన్ని దూరం చేయువాడును, మన్మథుడుని కుమారుడిగాక లవాడును, మధు అనే అసురుడిని సంహరించిన వాడైన గోపాలుని సేవించు.
చ: భక్తులకు కల్పవృక్షము వంటి వాడును, నందగోప తనయుడును, చాణూరుని వధించిన వాడును, పరమహంసల మధ్య విహరించు వాడును అగు ఆ గోపాలుని సేవించు.
ఓ మనసా! గోపాలుని సేవించు!
అద్వైత వేదాంత భావం:
మన మనసు ఎల్లప్పుడూ ఆలోచనలతో నిండి ఉంటుంది. “మనస్సు విషయాలలో మునిగియుండగా నన్ను చింతించు మనస్సు నా యందే రమించు చున్నది” అని భగవానుడు భాగవతంలో తెలియజేసాడు, కాబట్టి మనసులో భగవత్చింతన గలిగి ఉండాలి.
గోవులను పాలించు వాడైనందున శ్రీకృష్ణుడు గోపాలుడని పిలువబడ్డాడు. గోవులలానే మనలో కూడా పశుప్రవృత్తులను క్రమపరచి రక్షించువాడు కాబట్టి మానసులో ఆగోపాలుని నిరంతరం సేవించాలి.
కుచేలుడు గోపాలుని ప్రాణ స్నేహితుడు. కుచేలుడు అంటే చిరిగిన బట్ట కలవాడు అని అర్థం. జీవులందరూ వశించే దేహములను ధరించినవారై కుచేలులయ్యారు. కుచేలుడు పేదవాడు, కానీ ఆయన హృదయంలో ఎల్లప్పుడూ పరమాత్మైన గోపాలుని సేవించి ఆయనకు ప్రీతిపాత్రుడయ్యాడు కాబట్టి ఓ మనసా! కుచేలుడిలా గోపాలుని సేవించమని చెబుతున్నారు.
గోపాలుడు ముల్లోకాలకు మూల కారకుడు. అవస్థాత్రయమే ముల్లోకములు. ఎవరిలో జాగ్రత్స్వప్న సుషుప్యవస్థలు నడుస్తున్నాయో, ఎవ్వరు ఈమూడింటికి కారణమై ఉన్నాడో అతడే గోపాలుడు.
గోపాలుడు దితి సంతానమైన హిరణ్యకసిపుడు, హిరణ్యాక్షుడు అనే అసురులను సంహరించిన వాడు. హిరణ్యం అంటే బంగారం(ధనం), అక్షి అంటే దానిపై మమకారం. ఈ రెండిటి వల్ల ఆ పరమాత్మను చేరడం అసాధ్యం అందువల్ల వాటిని హరించాలి కాబట్టి ఓ మనసా నీలోని దితిసుతులను సంహరించి ఆగోపాలుని సేవించు సూచిస్తున్నారు.
గోపాలుడు వేదాల సారంశం. భోగస్వరూపం దాల్చిన అవతార పురుషుడు, కానీ ఈగోపాలుడు ప్రపంచం అంతటికీ మూలకారకుడు. ఆయన యోగ విచారంతో మనకు దొరికుతాడు. యోగము అంటే ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి, యోగకారకుడై యోగేశ్వరుడైన పరమాత్మతో కలిసి కరిగి పోవటమే, కాబట్టి మనసా ఆగోపాలుని ఎల్ల వేళలా సేవించుమంటున్నారు.
గోపాలుడు పాపాలను హరించే గొడ్డలి వంటివాడు, మనలోని కాలుష్యాన్ని దూరంచేసి అజ్ఞానాన్ని పారద్లోలే వాడు, గోపాలుడి కుమారుడు మన్మథుడు కామనికి ప్రతిరూపం. మధు అనే అసురుడిని సంహరించాడు గోపాలుడు. ఎవరైతే కామమును అదుపులోనుంచుకొని అభిమానమును అంతరింప చేసుకొంటేవారు గోపాలుని సాన్నిధ్యము పొందగలరు కాబట్టి ఆ గోపాలుని సేవించు ఓమనసా అంటున్నారు.
నంద కుమారుడైన గోపాలుడు భక్తులకు కల్పవృక్షము వంటి వాడు. కల్పవృక్షము దేనినడిగితే దానిని ప్రసాదిస్తుంది, కాని మోక్షమునివ్వలేదు. ఈ గోపాలకల్పవృక్షము మోక్షం కూడా ప్రసాదిస్తుంది.
చాణూరుడు కంసుని మిక్కిలి శూరుడైన భటుడు. కృష్ణుడు వ్రేపల్లె నుండి మధురా నగరమునకు వచ్చినప్పుడు అతని ఎదిరించి మల్ల యుద్ధము చేసి చంపాడు. ఎంత రాక్షసత్వాన్నైనా దహించ గలిగే శక్తి ఆ గోపాలుడికి ఉంది. పరమహంసలు ఆ గోపాలుని ధ్యానించి తన్మయులైనారు. అందుచేత ఆగోపాలుని నవవిధభక్తితో భజించి తరించమని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు మనస్సుకు తెలియ చేయు చున్నారు.
శుభం భూయాత్!
కౌండిన్య- 20/06/2020
Beautiful explanation
This shows your firm goal and travel towards philosophical journey