రచన – పరమహంస శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి
రాగం- కాపి , తాళం – ఆది తాళం
ప- స్మర వారం వారం – మానస
స్మర నంద కుమారమ్.
చ 1. ఘోష కుటీర పయోఘృతచోరం
గోకుల బృన్దా వన సఞ్చారమ్ || స్మర||
చ 2. వేణురవామృత పాన విలోలం
విశ్వస్ధితిలయ హేతు విహారమ్ || స్మర||
చ 3. పరమహంసహృత్ పఞ్జరకీరం
పటుతరధేనుక బక సంహారమ్ || స్మర||
తాత్పర్యము :
స్మర – స్మరింపవే, వారం వారం – పదే పదే, మానస – ఓ మానసా!, స్మర – స్మరింపవే, నంద కుమారమ్ – నందుని కుమారుడైన శ్రీ కృష్ణుడిని.
ఘోష – వ్రేపల్లె , కుటీర – కుటీరాలలో , పయోఘృత – తెల్లని వెన్న , చోరం – దొంగలించిన వాడు, గోకుల – గోకులంలోని , బృందావన – బృందావనంలో , సంచారం- తిరిగేవాడు.
వేణు – మురళి, రవామృత – అమృతం లాంటి ధ్వని, పాన – గానం , విలోలం- విలయం అనగా ప్రళయం, వినాశనం, విశ్వ- విశ్వంలో , స్థితిలయ – స్థితి, లయకు, హేతు – కారకుడైన, విహరమ్ – విహరించు
పరమహంస హృత్ – శ్రీ సదా శివుల గురువుల హృదయంలో , పంజర – పంజరంలో , కీరం – పక్షిలా,
పటుతర – బలంగా మదించిన ధేనుక – ధేనుకాసురడు, బక – బకాసురుడు, సంహారమ్ – సంహరించినవాడు.
భావం తెలుగులో:
నందుని కుమారుడైన ఆ స్వామిని ఓ మానసా! మళ్ళీ మళ్ళీ సంస్మరింపవే!వ్రేపల్లెలో వెన్నదొంగలించినవాడును, గోకులములో బృందావనమున విహరించినవాడైన ఆ స్వామిని మదిలో తలంచి తలచి సంస్మరింపవే!
మధుర మురళీగానామృతము చేయువాడును, విశ్వములో స్థితి, లయ, ప్రళయ కారణసంభూతుడై విహరించు వాడిని మనసులో పదే, పదే స్మరింపవే!
పంజరములోనున్న చిలుకవలె పరమ హంస ( శ్రీ సదా శివుల గురువులు) హృదయములో స్థిరముగా నివసించు గోపాలుడిని, బలముగా మదించి ఉన్న ధేనుకాసుర, బకాసురు అను రాక్షసులను సంహరించిన స్వామిని ఓ మనసా! మరల, మరల సంస్మరణ చేయవే!
అద్వైత వేదాంత భావం:
బాల గోపాలుడు వెన్నదొంగ. గోకులంలో విహరిస్తూ గోపకుల,గోపికల కుటీరాలలో నుండి వెన్న దొంగలించేవాడు. ఆధ్యాత్మిక ధోరణిలో ఆలోచిస్తే గనుక కడవలో పెరుగుని కవ్వంతో చిలకడమనే ప్రక్రియకు ప్రతిఫలంగా వెన్నముద్ద తేలుతుంది, అలాగే ‘మనసు’ అనే కడవలో ‘జ్ఞానం’ అనే పెరుగు వేసి,చిలకగా (నిరంతర స్మరణ) చేయగా వచ్చే ఫలాన్ని (వెన్నను) సమర్పిస్తే ఆ నందకుమారుడైన శ్రీకృష్ణుడు తృప్తిగా స్వీకరించి మనల్ని అనుగ్రహించాడు. అందుకు ఆ స్వామిని పదే పదే మనసులో స్మరించాలి.
శ్రీ కృష్ణుడు మురళీరవుడు. వేణువులో అంతా శూన్యమే, ఇది పరిపూర్ణతకు చిహ్నం. శూన్యమైన మనసులో ఏ మాలిన్యమూ, వికారమూ ఉండవు. వేణువు తన సర్వస్వాన్నీ పరమాత్మకు అర్పించుకుంది. నేను, నాది అనే భావాలు లేవు, అందుకే అద్వైత ధోరణి లో వేణువు, మాధవుడు రెండు కాకుండా ఒక్కడే కాబట్టి ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ వేణువు అందిస్తుంది.
శ్రీ కృష్ణుడైన ఆ పరమాత్ముడు ఈ విశ్యంలోని స్థితి, లయ అవస్థలకు కారకుడకై ప్రళయం లా సమస్తం ఆ భగవంతుడిలో కలిసిపోయిలా చేసి జీవనవిముక్తిని కలుగజేస్తాడు కాబట్టి ఆ స్వామిని మళ్ళీ మళ్ళీ స్మరణ చేయమని మనసుకు తెలియజేస్తున్నారు.
పంజరంలో చిలుకును బంధించినట్లు మన మనసులో ఆ భగవంతుని బంధిస్తే గనుక ఎంతటి చెడునైనా (రాక్షసత్వాన్ని) పారద్రోలగలుగుతాడు ఆ నందకుమారుడు.
అహంకారంతో, అవివేకంతో తనకు తోచినట్లు చేయడం వల్ల శాపంతో ద్వాపరయుగంలో బలరాముడు, శ్రీకృష్ణుడు చేత ‘ధేనుక’ అనబడే అసురుడు సంహరింపబడి ముక్తిని పొందుతాడు, అలాగే మనలో ‘నేను’ అనబడే అహాన్ని పారద్రోలి, అద్వైత సాధనకు తోడ్పడేలా ఆ నందకుమారుడిని మనసులో సేవిస్తే పాపాలను తొలగిస్తాడని తెలియజేస్తున్నారు.
బకు (కొంగలా చేపలు పట్టి జీవహింస చేసినవాడు) కాబట్టి ఆ ఉత్కలుని సంహరించి లోకాలకురాజైన శ్రీకృష్ణ పరమాత్మ ధర్మసంస్థాపన చేసాడు. అందువల్ల ఆ నందకుమారుడిని మనసులో సేవిస్తే జీవహింస లాంటి పాపాలను తొలగిస్తాడని మనకు తెలియజేస్తున్నారు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు వారు.
కౌండిన్య – 24/06/2020