రాగం – సామ, తాళం – ఆది, రచన- పరమహంస శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి
ప- మానస సఞ్చర రే – బ్రహ్మణి
మానస సఞ్చరరే
చ1. శ్రీరమణీ కుచ దుర్గ విహారే
సేవకజన మన్దిర మన్దారే || మానస||
చ2. మదశిఖి పిఞ్ఛాలంకృతచికురే
మహనీయ కపోల విజితముకురే || మానస||
చ3. పరమహంస ముఖ చన్ద్రచకోరే
పరిపూరిత మురళీరవధారే|| మానస||
తాత్పర్యము :
మానస – ఓ మనసా!, సఞ్చర రే – సంచరించవే, బ్రహ్మణి – పరబ్రహ్మమున.
శ్రీరమణీ – లక్ష్మీదేవి, కుచ- కుచములు, దుర్గ – కోట, విహారే – విహరించు, సేవక – సేవించే, జన- జనులు, మన్దిర – మందిరం, మన్దారే – కల్పవృక్షం.
మదశిఖి – నెమలి , పిఞ్ఛాలంకృత- పింఛము అలంకారముగా ధరించిన వాడు, చికురే – వెంట్రుకలలో , మహనీయ – పూజించ దగువాడు, కపోల – చెక్కిలి, విజిత – సంపత్తిగా కలవాడు, ముకురే – ముకురం అంటే అద్దం
పరమహంస – తన గురువైన పరమహంస శ్రీ శివేంద్ర సరస్వతులు, ముఖ – ముఖమున, చన్ద్రచకోరే – చకోరము చంద్రునివంక పరికించు నట్లు, పరిపూరిత- పవిత్రమైన, మురళీ- వేణువు , రవ – ధ్వని, ధారే- ధరించిన వాడు.
తెలుగులో భావం:
ఓ మనసా! ఆ పరబ్రహ్మమున విహరించవే!ఆ పరమాత్మైన విష్ణుమూర్తి లక్ష్మీదేవి విశాలమైన హృదయంలో విహరించేటివాడు, భక్తుల పాలిట కల్పవృక్షం వంటి వాడు. ఆయనను సేవించే హృదయ మందిరాలలో కొలువుదీరుతాడు.
శ్రీకృష్ణుడు ముంగురులలో నెమలిపింఛమును అలంకారంగా ధరించెడి వాడు, మహనీయుడు! చెక్కిలి సౌందర్యము గలవాడు, అద్దంలాంటి వాడు.
పరమహంస యోగీంద్రుల ముఖము పరబ్రహ్మ కోసం చకోర పక్షి చంద్రుని కోసం పరితపించినట్లు, పవిత్రమైన మురళీరవధారుడైన ఆ పరబ్రహ్మమున విహరించవే ఓ మనసమా!
ఆధ్యాత్మ భావన:
మనసులోని ఆలోచనలు వివిధ కోరికల కోసం ప్రాకులాడుతూ ఉంటుంది. కానీ ఆ కోరికలు తీర్చే లక్ష్మీదేవి స్వయంగా శ్రీమన్నారాయణునునే వరించింది. ఆయన లక్ష్మీదేవి హృదయ పీఠంలో ఎల్లవేళలా విహరిస్తుంటాడు. కాబట్టి మనసులో ఆయనను ధ్యానిస్తే మన కోరికలు తీర్చుతాడు అంతేగాక విష్ణుమూర్తి భక్తుల పాలిట కల్పవృక్షం వంటి వాడు, కోరికలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించగలడు. ఆ పరమాత్మను సేవించే వారి హృదయమందిరాలలో ఆయన కొలువుతీరి ఉంటాడు కాబట్టి మన మనసును ఆ పరబ్రహ్మములో విహరించేలా చేయాలి.
శ్రీకృష్ణుడు తన ముంగురులలో నెమలి పింఛము ధరించి ఉంటాడు. అది కామజయానికి చిహ్నము, దానిని జయిస్తే కానీ ఆయనలో చేరలేము.
శ్రీకృష్ణుని బుగ్గల అందం దర్శణ సౌందర్యానికి మించి ఉంటుంది అని శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులు కొనియాడుతూ ఆ పరమాత్మ మనకు దర్పణం లాంటి వారని తెలియజేస్తున్నారు. దర్పణంలో ప్రతి వస్తువు ప్రతిబింబిస్తుంది . దేనిని తనలో నిలుపుకోదు, వాటివలన మలినపడదు. సాధకుడు తన మనస్సును అద్దంలా నిర్మలముగా ఉంచుకోవాలి. కలత చెందే మనస్సు పరమాత్ముని చైతన్యంలో లీనం కాలేదని ఇక్కడ తెలియజేస్తున్నారు.
చకోర పక్షి చంద్రుడి కోసం ఎలా వేచి ఉంటుందో అలానే తన గురువైన శ్రీ శివేంద్ర సరస్వతులు ముఖము ఆ పరబ్రహ్మమైన శ్రీకృష్ణునిలో చేరాలని పరితపిస్తూ ఉంటుందని మనకు తెలియజేస్తూ, శ్రీ కృష్ణుడు పవిత్రమైన వేణువు ధరించి ఉంటాడు. ఆ వేణువులో అంతా శూన్యమే. శూన్యం పరిపూర్ణతకు చిహ్నం, సూన్యంలో ఏ మాలిన్యమూ, వికారమూ ఉండవు. వేణువు తన సర్వస్వాన్నీ పరమాత్మకు అర్పించుకుంది. నేను, నాది అనే భావాలు లేవు, అందుకే అద్వైత ధోరణి లో వేణువు, మాధవుడు రెండు కాకుండా ఒక్కడే కాబట్టి ఆధ్యాత్మిక ధోరణిలో ఆ పవిత్రమైన పరబ్రహ్మంలో కలిసేలా ప్రయంత్నించాలి. ఎల్లవేళలా మనసును ఆ పరమాత్మ గురించి ఆలోచిస్తూ మోక్షం కోసం చకోర పక్షిలా వేచి చూడాలని మనకు తెలియజేస్తున్నారు శ్రీ సదాశివ బహ్మేంద్ర స్వామి వారు.
శుభం భూయాత్!
కౌండిన్య – 28/06/2020