.. సన్నాయి అప్పన్న
డూ డూ బసవన్నకు
రంగు రంగుల బొంతలు కప్పి,
మూపురాన్ని రంగు చీరతో చుట్టి,
పొట్ట చుట్టూ పట్టు చీరలతో ముస్తాబు చేసి,
కాళ్ళకు గజ్జెలు కట్టి,
నొసట అందమైన తోలు కుచ్చులు చుట్టి,
కొమ్ములకు ధగ ధగ మెరిసే ఆభరణాలు పెట్టి,
డూ డూ బసవన్నా
ఇటురారా బసవన్నా
ఉరుకుతు రారన్నా
రారన్న బసవన్నా
అమ్మవారికీ దండం బెట్టు
అయ్యగారికీ దండం బెట్టు
మునసబు గారికి దండంబెట్టూ
కరణం గారికి దండంబెట్టూ
రారా బసవన్నా,
రారా బసవన్నా..
అంటూ
సన్నాయి అప్పన్న బూర ఊదుతూ,
ఆ ప్రక్కన మనిషి డోలు వాయిస్తూ,
మరో పక్కన చిన్న అప్పన్న శ్రుతి సన్నాయి ఊదుతూ..
చక్కటి వేషధారణలతో
నెత్తికి రంగుల తలగుడ్డలు,
మూతిమీద కోర మీసాలు,
చెవులకు కమ్మల జోడులు,
ఎదుటివారు ఇచ్చిన పాత కోటులు,
భుజంమీద కండువాలు,
చేతికి వెండి మురుగులు,
నుదురున పంగనామం,
సైకిల్ పంచ కట్టు..
మేళతాళాలు,
వాయిద్య విన్యాసాలు,
రణగొణ ధ్వనులు,
బసవన్న బుడిబుడి అడుగుల నృత్యాలు.
ఇవన్నీ ప్రాచీన జానపద కళా రూపాలు,
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు సాంప్రదాయ చిహ్నాలు!
మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు.
కౌండిన్య – 13/01/2021

