Skip to content

Ramesh Kalavala

We all are stories in the end. Just make it a good one!

Menu
  • About
Menu

హే భూగోళం..

Posted on December 5, 2020 by Ramesh

“హే భూగోళం ప్లే ఆనంద భైరవి సాంగ్స్”..”హే భూగోళం నిన్నే..” అంటుంటే

“భూగోళం కాదు బామ్మ హే గూగుల్ అంటే గానీ పలకదు” అన్నాడు మనవడు. 

అదేదో నువ్వే అడగరా అంటూ ‘ఆనంద భైరవి’ ఎలా పలకాలో వాడికి చెప్పింది, వాళ్ళ మనవడు దాన్ని “హే గూగుల్ ప్లే ఆనంద భైరవి మూవీ సాంగ్స్” అని అడిగాడు. అది వెంటనే 

“ప్లేయింగ్ అనకొండ సాంగ్స్ ఆన్ యూ ట్యూబ్”

“నీ బొంద..” అంది బామ్మగారు. 

“నేను అడిగింది ఆనంద భైరవి సినిమా పాటలైతే.. దానికి అర్థమయ్యింది కొండచిలువలూనూ, త్రాచుపాములు’ అంటు దాన్ని కసురుకుంది.

“నో స్వేరింగ్..” అంది గూగుల్

“కొంచెం సేపు నోరు మూయి” అంది కసిగా. 

“దానికి అలా కాదు .. హే గూగుల్ .. స్లీప్” అన్నాడు మనవడు అది నోరు మూసింది.

‘సిరి కొలను చిన్నాడిని ‘ అడిగి చూడరా అంది బామ్మ.

“బామ్మ.. నీ సొంత పేర్లతో పిలిస్తే అవి పలకవని చెప్పానా? “ అన్నాడు 

“ఐ ఫోను లో.. హే సిరి ప్లే అనంద భైరవి సాంగ్స్” అన్నాడు.

“ప్లేయింగ్  ఆంధోని బరావీ హిట్స్ ఫ్రమ్ ఆపిల్ మ్యూజిక్” అంది

“పళ్ళురాలతాయి” అంది బామ్మగారు.

“హూస్ టీత్ గ్రానీ ? .. యూ డోంట్ ఈవెన్ హావ్ టీత్” అంది సిరి

“ఏవిటి రా వాగింది అది? “ అని అడిగింది మనవడితో

“నీకు వయసు మళ్ళిందిటా.. పైగా నీకు పళ్ళు కూడా లేవుటా..” అన్నాడు మనవడు.

“నా గురించి ఆ చిన్నోడి కు ఎలా తెలుసురా?” అడిగింది

“ఎప్పుడో నీలో గొణుక్కొని ఉంటావు అది వినే ఉంటాడు” అన్నాడు. 

“సరే కాని ఆలస్యం చేయకుండా ఆ అలేక్య ను అడుగు. పొద్దున్నుంచి ఆ సినిమా పాటలు వినాలని ఉందిరా.” అంది బామ్మ

“అలెక్సా .. ప్లే ఆనంద భైరవి మూవీ సాంగ్స్” అడిగాడు  

కొంచెం సేపు ఆలోచించి దాని దగ్గర లేదని సమాధానం ఇచ్చింది.

“కొట్టానంటే గూబ గులాబ్ జామూన్ అవుతుంది” అంది బామ్మ కోపం వచ్చి. 

“ప్లేయింగ్ హౌ టు మేక్ గులాబ్ జామూన్ వీడియో “ అంది అలెక్సా

“నీ పిండాకూడు..” అంది

“బామ్మ నీ తిట్లు అన్ని రికార్డ్ అవుతాయ్.. రేపు మనల్ని తిరిగి తిట్టినా తిట్టవచ్చు” అన్నాడు. 

“అయినా ఈ అలేక్య కు ఎప్పుడూ తిండి గోలేంటిరా? “ అని అడిగింది బామ్మగారు.

“నువ్వే కదా దాన్ని ఎక్కువ ఎప్పుడూ  చిరుతిండ్ల వీడియోలు అడుగుతావు.” అన్నాను.

“మొన్న కారం కారంగా ముంతపప్పు మసాలా తిందామని దాని గురించి అడిగితే  మంతెన సత్యనారాయణ గారి మొలకల వీడియో పెట్టింది చచ్చు మొహంది?”  

“బామ్మా.. “ అన్నాడు.

“ఉండు నేను ఇంకోలా అడుగుతాను” అంది ఆ రిమోట్ తీసుకొని.

“అలేక్యా.. ప్లే చైత్రము కుసుమాంజాలి సాంగ్” అంది. 

“బటన్ నొక్కుతూ మాట్లాడాలి.. అలెక్సా అనాలని చెప్పానా?” అన్నాడు.. 

“అలెక్సా. ప్లే చైత్రము కుసుమాంజాలి సాంగ్ డైరెక్టెడ్ బై ది గ్రేట్ జంధ్యాల గారు ఫ్రమ్ ఆనంద భైరవి సినిమా వాచ్డ్ వెన్ అ యామ్ ఎ చైల్డ్”

అంది ఆయాస పడుతూ.

అది చెప్పిన సమాధానంతో ఎక్కడ ఆ రిమోట్ విసిరికొడుతుందోనని మనవడు పట్టుకోవడానికి పొజిషన్ లోకి వచ్చాడు.

“ఛీ నీ మొహం మండా..” అని నిజంగానే విసిరింది వాడు పట్టుకొన్నాడు.

“ఆనంద భైరవి సినిమా గురించి తెలియని పుచ్చు వంకాయలను చచ్చినా నేనెక్కడా చూడలేదు” అంటూ తన గదిలోకి వెళ్ళి తలుపేసుకొని “ కొలువైతివా రంగ సామీ… తదీం తోం తగదీం తోం” అంటూ ఆవిడే పాడుకోవడం మొదలెట్టింది.

“హే అలెక్సా.. ప్లే బాబ్ డిలన్ సాంగ్స్” అన్నాడు

“ప్లేయింగ్ బాబ్ డిలన్ హిట్స్ ఆన్ అమెజాన్ మ్యూజిక్” అంది.

కౌండిన్య – 5/12/2020

  • హిందోళ రాగం
  • “Cat and the Robin – A Dialogue”
  • హిందూస్తానీ సంగీతం 
  • సంగీత జ్ఞానం
  • నీలిమేఘములలో – 35 సినిమా
©2026 Ramesh Kalavala | WordPress Theme by Superbthemes.com