నవ్వుల నజరాన – పుస్తక విడుదల – స్టాలు- 101 ఎన్ టి ఆర్ గ్రౌండ్, హైదరాబాదు.
మొన్న నాకు కనకాభిషేకం ఎలా చేయాలో అరటిపండు వొలిచిపెట్టినట్లు చెప్పినా ఏ నాథుడు ముందుకు రాలేదు కదూ! పోనీలేండి. అన్నట్లు ఏ నాథుడు అన్నాను కదా అసలు ఆ గొప్ప కనకాభిషేక సత్కారం పొందిన తొలి తెలుగు కవి కవిసార్వభౌముడైన శ్రీనాథుడు గురించి ముందుగా ప్రస్తావించి అసలు విషయం లోకి వెడతాను.
విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయల అనంతరం పరిపాలించిన రెండవ ప్రౌఢ అచ్యుత దేవరాయలు శ్రీ నాథుల వారికి కనకాభిషేక సత్కారం చేయడం అనేది ఆంధ్ర సాహితీ చరిత్రలో ఒక అపూర్వమైన సన్నివేశం.
ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో ‘కవిసార్వభౌమ’ బిరుదాన్ని ధరించిన అరుణగిరినాధుడనే పేరుగల మహా పండితుడైన ‘డిండిముడు’ కూడా ఉండేవాడు.
ఈ డిండిముని పూర్వులు కూడా అసమాన ప్రతిభావంతులే. వీరందరినీ ‘డిండిముడు’ అనే బిరుదనామంతో పిలిచేవారు. డిండిమము (మ్రోగించుకుంటూ తిరిగే కంచు ఢక్క) కలిగిన వారు కావటంవల్ల వీరు డిండిములయ్యారు. ‘బిరుద డిండిమ వాజ్య సంతాడిత వినుత కవిమండలుడు. డిండిమ కవి సార్వభౌముడు’ అన్నది అరుణగిరినాధుడి బిరుదు.
ఇదిగో కనకాభిషేం తో మొదలుపెట్టి , శ్రీనాథుడు గురించి చెప్పి మళ్ళీ ‘డిండిముడు, కంచు ఢక్కా కలిగిన వాడు’ అంటూ ఇంకో కారెక్టర్ గురించి మొదలెట్టేస్తే ఎలాగా?..
కొంచెం ఓపిక పట్టండి.. అసలు విషయానికి దగ్గరలోనే ఉన్నాను..
శ్రీనాధుడు కొండవీటిరెడ్డి రాజులకు విద్యాధికారిగా పనిచేసే కాలంలో రాజుగారి ప్రోత్సాహంతో వేరే సామ్రాజ్యాలకు వెళ్ళి తన ప్రతిభ చాటి చెప్పి రాజ్యానికి కీర్తి, ప్రతిష్ఠలు తీసుకొచ్చేవారు. ఆ సామ్రాజ్యంలో కవులు సత్కారాలే కాకుండా బిరుదులు కూడా పొందేవారుట. ఇలా శ్రీనాధుడు తన కవితాశక్తికి అక్కడ సముచితమైన సత్కారం జరుగుతుందని ఆశించి రెండవ ప్రౌఢ దేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి వెడుతూ అక్కడ డిండిమ కవి సార్వభౌముడితో నేనూ ‘కవిసార్వభౌముడినే’ అంటూ ప్రకటించుకోవడంతో డిండిమునకు దుస్సహమైంది, కోప కారణమైందిట.
ఒరేయ్! ఇవన్నీ నీకు ఎలా తెలుసు? సేకరణ అండి…సరే..
ఈ డిండిముణ్ణి ఓడించడానికి శ్రీనాధుడు తహతహలాడాడుట. తన విద్యను పరీక్షించ దలచుకుంటే సభను ఏర్పాటుచేయమనీ ప్రౌఢ దేవరాయలను శ్రీనాధుడు అర్ధించాడు. విద్యావిషయ సరసుడైన ప్రౌఢ దేవరాయలు సభ ఏర్పాటుచేశాడు. వీరిద్దరి మధ్య జరిగే విద్యావివాద వినోదానికై సకల ఏర్పాట్లు జరిగాయి. శ్రీనాధునికీ డిండిమునకూ విద్యావివాదం హోరాహోరీగా, ఉద్భటంగా జరిగింది. దీనిలోవిజయం శ్రీనాధుడిదేనిన నిర్ద్వంద్వంగా ప్రకటించారుట. అంత పటాతోపంగా మ్రోగించుకుంటూ తిరిగే డిండిముని కంచు ఢక్కను నిండు పేరోలగంలో శ్రీనాధుడు పగులగొట్టించాడు. కవిసార్వభౌమ బిరుదమూ శ్రీనాధునకివ్వబడిందిట.
అదండి! అలా శ్రీనాధుల వారికి ‘కవిసార్వభౌమ’ బిరుదు చేజిక్కించుకోవటమే కాకుండా డిండిముని కంచు ఢక్కను పగలకొట్టాడుట! అంటే ఆయన ఇంక వీధులలో తిరుగుతుంటే కంచు డక్కా మ్రోగించకోడదనమాట! చడీచప్పుడు లేకుండా నడిచివెళ్ళిపోవాలేమో?
సరే .. ఇంతకీ అసలు విషయమేమిటంటే ఎపుడో ఓ సారి ‘కవిసార్వభౌమ-కౌండిన్య’ , ‘కవికులగురు-కౌండిన్య’ ‘కవీంద్ర కౌండిన్య’ అంటూ కొన్ని హాస్య కథల సిరీస్ అల్లి రాయాలన్న ఆలోచన మాత్రం వచ్చింది, అమలు మాత్రం కాలేదు.
ఓ నెల క్రితం జ్యోతిగారు ఈనెలాఖరున జరిగే బుక్ ఫెయిర్ కు ఓ పుస్తక ప్రచురణకు ఓ కథ పంపిస్తారా అనగానే నో చెప్పకుండా ఒప్పేసుకున్నాను. జ్యోతిగారిలో ఏదో పవరుందనమాట! అయస్కాంతానికి ఉన్న పవర్ లాంటిది. రచయితలు ఆ అయస్కాంత శక్తికి ఎట్రాక్ట్ అవ్వటం ఖాయం. ఆ పవర్ తోనే ఓ ఇరవై ఆరు మంది హాస్య రచయితని అవలీలగా ఇకట్టా చేసి “నవ్వుల నజరానా” పేరుతో ఓ నెల రోజులలో బుక్ ని రెడీ చేసారు.
కథ రాస్తానని ఒప్పుకొని ఓ రెండు వారాలు జుట్టు పీక్కొని “కవిసార్వభౌమ కవికుశలశర్మ” అంటూ శ్రీనాథుల వారు డిండిముని కంచుఢక్క పగుల గొట్టడానికి వెళ్ళబోతున్న సన్నివేశాన్ని నేపథ్యంగా తీసుకొని అల్లిన ఓ హాస్య కథ త్వరలో ఈ “నవ్వుల నజరాన” పుస్తక రూపంలో విడుదల కాబోతొంది.
ఎన్ టి ఆర్ గ్రౌండ్లో జరుగుతున్న బుక్ ఎక్జ్బిషన్ లో స్టాల్స్ 101 ను మీరు తప్పక విచ్చేసి ఈ బుక్ కొనుగోలు చేస్తారని ఆశిస్తూ.. అవకాశం ఇచ్చిన జ్యోతి వలబోజు గారికి, ముందుమాట రాసిన పొత్తూరి విజయలక్ష్మి గారికి, హాస్య కథలు రాసిన మిగతా రచయితలకు అనేక కృతజ్ఞతలతో..
తప్పక కొంటారని ఆశిస్తూ..
#నవ్వులనజరాన
కౌండిన్య – 24/12/2019



