లండన్ పికడెల్లీ సర్కస్ బిల్బోర్డు లైట్లు:
గ్రీష్మ రాత్రులు
మెరిసే నక్షత్రాలు
మిణుగురులు!
(వేసవి కాలం, రాత్రి సమయం. స్థలం పికడెల్లి సర్కస్. ఇందులో మిణుగురులు వస్తువులు. ఆ చీకటి రాత్రిలో పికెడెల్లీ బిల్బోర్జు లైట్లు మిణుగురులను తలపిస్తూ, నక్షత్రాల్లా మెరుస్తూ కళకళాలాడుతున్నాయి)
లండన్ అండర్ గ్రౌండ్ ప్రయాణం:
వసంత కాలం
సొరంగం లో సొరంగం
వేగ ప్రయాణం!
(వసంత కాలం, రాత్రి సమయం. స్థలం అండర్ గ్రౌండ్. అందులో రైలు ప్రయాణం వస్తువు. ఆ చీకటిలో లోలోపల ఉన్న సొరంగాలలో ఆ ట్యూబ్ ప్రయాణాలు, ఓ మధురానుభూతులు!)
లండన్ థేమ్స్ నది:
సాయం వర్షాలు
కాగితం పడవలు
నదీ అలలు!
(వర్షా కాలం, సాయం సమయం. స్థలం థేమ్స్ నదీ తీరం. అందులో అలలు, ప్రయాణించే పడవలు వస్తువులు. నదీ తీరం నుండి చూస్తే నీటి మీద పడవల ప్రయాణం చిన్నప్పుడు ఆడుకున్న పడవ బోట్లు లాగా ఉంటాయి. ఇక ఆ నదిలో అలలు చేసే అలజడి, ఆ వర్షపు నీరు చేసే సవ్వడి చూడ ముచ్చటగా ఉంటుంది)
లండన్ సన్న జడి వాన:
ముసురు సాయం
శిశిరంలో తుషారం
చిత్తడి మయం!
(చలి కాలం, సాయంకాల సమయం. స్థలం లండన్. అందులో చిత్తడి వస్తువు లండన్ లో చిత్తడి వాన సర్వసాధారణం, అలా కురుస్తూనే ఉంటుంది, అది యు కె యొక్క వాతావరణం కు ప్రత్యేకత, )
లండన్ ఆక్సఫర్డ్ స్ట్రీట్ షాపింగ్:
వీథిలో జనం
గ్రీష్మంలో కోలాహలం
డబ్బులు మాయం!
(వేసవి కాలం, సాయం సమయం. స్థలం లండన్ ఆక్సఫర్డ్ స్ట్రీట్. ఆ వీథ బజార్లలో షాపులు, అక్కడకు వచ్చిన వారు వస్తువులు. అక్కడ జనులు చేసే కోలాహలం చూడ ముచ్చటగా ఉంటుంది. అక్కడ షాపుల్లో దొరికేవి కొంటూ పోతే జేబుల లో ఏమీ మిగలవు ఏ మాత్రం, అది సత్యం!)
లండన్ నాటక ప్రదేశాలు:
గ్రీష్మంలో వేడి
పాత్ర సెగల వాఁడి
జనాల నాడి!
(వేసవి కాలం, నాటక ప్రదర్శనలు జరిగే సాయం సమయం. వస్తువు కళాకారులు. నాటకాలకు లండన్ ప్రసిద్ధి. షేక్స్పియర్ లాంటి మహానుభావులు అక్కడ థియేటర్ స్థాపించి నాటక ప్రదర్శనలు జరిగేలా చూసారు. వందల ఏళ్ళ నాటి గొప్ప గొప్ప థియేటర్ లలో ఎందరో కళాకారులను ప్రోత్సహించే పాత్రలతో, జనుల నాడి తెలుసుకొని మరీ అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తారు.)
లండన్ యునివర్సిటీస్ చదువులు:
జోరు హుషారు
గ్రీష్మంలో కుర్రకారు
శ్రీవాణి తీరు!
(వేసవి కాలం, చదువులకు వెళ్ళే ఉదయ సమయం. చదువుకోవడానికి వచ్చిన కుర్రకారు వస్తువు. అనేక గొప్ప విద్యాపీఠాలకు లండన్ ప్రసిద్ధి. కుర్రకారు జోరుగా, హుషారుగా చదువుకోవడానికి వెడుతూ లండన్ లో కనపడుతూ ఉంటారు. వేసవి కాలంలో వెలుతురు ఎక్కువ ఉండటం మూలానా మహానగర వాతావరణాన్ని ఆవహించి, ఆస్వాదిస్తుంటారు. ఆ చదువుల తల్లి శ్రీవాణి తీరు చదువులు బోధించడమే కదా! )
లండన్ లో ఆకస్మిక వర్షం:
శరద్రాత్రులు
తెరలుగా మబ్బులు
ఛత్రధరులు!
(చలి కాలం, రాత్రి సమయం. గొడుగు వస్తువు. అకస్మాత్తుగా మబ్బులు కమ్ముతూ, సన్నటి జడివాన కురవడం లండన్ వాసులకు కొత్తేం కాదు. అలా కురవడం మొదలవ్వ గానే పుట్టగొడుగుల్లా వీధుల్లో గొడుగులతో మనుషులు(ఛత్రధరులు) కనపడుతూ ఉంటాయి. పుట్టగొడుగు ప్రక్కన వెడుతూ ఉన్నట్లు కనపడుతుంది, కానీ మొహాలు కనపడవు, మాటలు మాత్రం వినపడతాయి.)
లండన్ బకింగ్హం ప్యాలేసు:
ఓ రాజసౌధం
వేసవిలో సోయగం
నివాస గృహం!
(వేసవి కాలం. పొద్దున్న సమయం. రాజసౌథం వస్తువు. బ్రిటన్ రాజు గారి లండన్ లోని మూడు వందల గదుల ప్యాలేసు వారి నివాస గృహం, అది ఒక సోయగం. వేసవిలో ఆ సౌథంలోని కొన్ని గదులను చూడటానికి అనుమతి ఇస్తారు.)
లండన్ పార్లమెంటు:
గ్రీష్మ వేనలి
మేరు బంగారు మేని
ప్రభుత్వ గని!
(వేసవి కాలం. మధ్యాహ్న సమయం. పార్లమెంట్ బిల్డింగ్ వస్తువు. యు కె ప్రభుత్వ పార్లమెంటు వేసవి లో ఆ పొడుగాటి భవనం, మెరిసే బంగారం తో అల్లిన జడ (వేనలి) లాగా థైమ్స్ నదీ తీరంలో అద్ద్భుతంగా కనపడుతుంది.)
లండన్ బిగ్ బెన్:
వేసవి సాయం
మలిసంజ సమయం
కాల యంత్రాంగం!
(వేసవి కాలం. సాయం సంధ్యా సమయం. ఇక్కడ గడియారం వస్తువు. లండన్ లోని బిగ్ బెన్ గడియారం ఓ అద్భుత యంత్రం. అలుపెరగక పనిచేస్తూనే ఉంటుంది. ఆ సంధ్యా సమయంలో వేసవి సూరీడి కిరణాలు పడుతూ థేమ్స్ నదీ తీరాన ఎత్తైన బిగ్ బెన్ గడియారం చాలా చూడ ముచ్చటగా ఉంటుంది.)
పది, డైనింగ్ స్ట్రీట్:
శీతల చలి
ప్రధాని కి లోఁగిలి
ఇల్లు వాకిలి!
(శీతల కాలం. సాయం సమయం. టెన్ డౌనింగ్ స్ట్రీట్ వస్తువు. లండన్ లోని డౌనింగ్ స్ట్రీట్ లోని పదవ నెంబర్ ఇల్లు యు కె ప్రధానమంత్రి యొక్క నివాసం. లండన్ పర్యాటకులకు దర్శించే ప్రదేశం.)
కౌండిన్య ( రమేష్ కలవల ) – 10/02/24
హైకుల గురించి…!!!
“హైకూ“ మన సొంతం కాదు. జపనీస్ నుంచి దిగుమతి చేసుకున్న కవితా
రూపక ప్రక్రియ.అయితే మన కవులు హైకూను సొంతం చేసుకున్న తీరు వల్ల,ఇది
మన సాహిత్య వాతావరణంలో చక్కగా ఒదిగిపోయింది.
హైకూ పుట్టుక….!!
“ హైకు “ ప్రపంచ సాహిత్యంలో అతి చిన్న పద్యం.5..7..5 అక్షరాల (సిలబుల్ ) మూడు
పాదాల పద్యం ఇది. 16వ శతాబ్దం నుంచి జపానులో ప్రచారంలో వుంది. హైకూలో వస్తు,స్థల,కాలాలు అనే మూడంశాల మధ్య సజీవ సంబంధం వుంటుంది. చిన్న పద్యం కావడంవల్ల ఒక్క వ్యర్థ పదమూ వుండటానికి వీల్లేదు. హైకూ రాసేటపుడు గారడీ వాడు తీగమీద నడిచినంత జాగ్రత్త గా వుండాలి. కాస్త అటూ ఇటూ అయినా కూడా జారి కిందపడే ప్రమాదం వుంది.
హైకూ అనుభూతి ప్రధాన మైంది. నిజానికి ప్రకృతి కవిత. తాత్వికత దీని ప్రాణం. ఎలాంటి వస్తు నిర్దేశం లేకుండా కేవలం ఊహాత్మక రూప ప్రక్రియ ఇది. దీని వెనుక వున్న తాత్విక నేపథ్యమే హైకూ ప్రత్యేకతగా చెప్పొచ్చు. జపానులో రూపాంతరం చెందిన జెన్ బౌధ్ధం లోంచి హైకు రూపుదిద్దుకుంది.
జెన్ అంటే ధ్యానం! మనసు కాలంతో ఏకీభావన పొందినప్పుడు అనుభూతి కలుగుతుంది. ఈ అనుభూతిలోంచి పిండిన సారమే హైకూ. లౌకిక విషయాలకు అతీతమైంది.