“ఘనవరమ్ము పీఠికాపురమ్ము” – పద్య శతకం – శ్రీ శ్రీనివాస్ లింగం, శతక కర్త.
శ్రీనివాస్ లింగం గారి స్వస్థలము “పిఠాపురం” కానీ వీరు ప్రస్తుతం నివసించేది “యు ఎ ఇ”. శ్రీనివాస్ లింగం స్వతాహా తెలుగు భాషాభిలాషి, సహజ కవి. తను పుట్టిన ఊరు మీద ఉన్న మమకారంతో “ఘనవరమ్ము పీఠికాపురమ్ము” అనే మకుటంతో ఇటీవల పద్య శతకం రచన చేసి అందరి ప్రశంసలందుకున్నారు.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ శతకాన్ని మెచ్చుకుంటూ వారి రికార్డ్స్ లో స్థానం కల్పించి, శతక కర్తను సత్కరించారు. ప్రముఖ రచయితలైన శ్రీ భువనచంద్ర, శ్రీ తనికెళ్ళ భరణి లాంటి వారి సమక్షంతో శతకావిష్కరణ జరగడం అభినందనీయం.
ఈ శతకం లో పిఠాపురం లోని చారిత్రాత్మక, సాంస్కృతిక విషయాలన్నింటినీ కలగలిపి చక్కటి పద్యాలుగా అల్లడం విశేషం.
పిఠాపురం లో విశిష్టమైన ప్రాచీన దేవాలయలు ఉన్నాయి, ఘన చరిత్ర కలిగిన రాజ ప్రభువులు అక్కడ పాలించారు, ఆ రాజులు అనేక సాహితీవేత్తలను, కళాకారులను పోషించారు. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన ఊరు గురించి రాబోయే తరాల వారికి తెలిసేలా చేసిన అద్భుత ప్రయత్నం ఇది.
ఈ శతకం ద్వారా పిఠాపురం చివరి రాజా వారైన శ్రీ రాజారావు వేంకట మహీపతి రామరత్న రావు గారి మన్నన్నలు పొందడం ఒక గొప్ప విషయం.
ఈ శతకం లో మొత్తం 135 పద్యాలు ఉన్నాయి. ఈశ్వర స్తుతి లో మొదలుపెట్టి, పిఠాపురం ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో, ఆ ఊరు వేరు వేరు పేర్లతో ఎలా పిలవబడేది చెబుతూ, ఆ ఊరిలోని ప్రసిద్దమైన పాదగయ క్షేత్రాన్ని అద్భుతంగా వర్ణించారు.
పాదగయ లో పురుహూతిక దేవిని, కుక్కుటేశ్వర స్వామిని, రాజరాజేశ్వరీ దేవిని, నందీశ్వరుడిని, క్షేత్ర ప్రాంగణంలో ఉన్న నిర్మలమైన కోనేరును కీర్తిస్తూ, ఆ క్షేత్ర శోభ ఢమఢమఢమ మని ఢమరుకం లా ధగధగధగ మెరుస్తోంది అంటూ వర్ణన చేసారు కవి.
పిఠాపురం అనేక దేవాలయాలకు ప్రసిద్ది. వీటిని కీర్తిస్తూ, అచ్చట ఉన్న గ్రామ దేవతలను ప్రస్తావిస్తూ, పంట కాల్వల వర్ణణ తో పాటు, పిఠాపురం కోట లాంటి
ప్రదేశాలు, అక్కడ నివసించిన ప్రముఖుల విశేషాల చక్కటి వర్ణన అనేక పద్యాలలో చేసారు.
పిఠాపురం చరిత్ర చాలా పురాతనమైనది. మౌర్యులు, ఖారవేల ప్రభువులు, శాతవాహనులు, సముద్ర గుప్తులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, రెడ్డిరాజులు, కాకతీయులు, కృష్ణదేవరాయలు, గోల్కొండ రాజుల నుండి ఇపుడు నివసిస్తున్న చివరి రాజు అనేక వివరాలతో అనేక పద్యాలలో తన భావాన్ని జోడించారు. ఈ శతకం కోసం అనేక విషయాలను సేకరించి, వాటిని పద్యాలలో క్రోడీకరించి వ్రాయడం ఒక గొప్ప కళ.
పిఠాపురం లో ఎందరో గొప్ప కవులు జన్మించారు, ఎన్నో గొప్ప రచనలు చేసారు. వారందరి గూర్చి ప్రస్తావిస్తూ, చివరగా పిఠాపురం మధుర చరిత్రను వ్రాయగలిగిన వరాన్ని ఇచ్చిన వాణికి మ్రొక్కుతూ ఈ శతకాన్ని ముగించారు కవి శ్రీనివాస్ లింగం.
ఈ శతకం లో ఉన్న కొన్ని పద్యాలు మచ్చుకకు.
పాదగయ వర్ణన:
ఢమఢమఢమమనుచు ఢమరుకముమ్రోగు
ధగధగధగమెరయు దాక్షిశోభ
పాదగయయె మాకు పరమపవిత్రంబు
ఘనవరమ్ము పీఠికాపురమ్ము॥
చరిత్రకు చిరునామాగా మిగిలిన కోట:
చరిత తరచి చూడ సంద్రంబగుకనులు
కవులు రాజులెల్లరు కలరు పెక్కు
శిధిలమైన కోట చిరునామాగమిగిలెఁ
ఘనవరమ్ము పీఠికాపురమ్ము॥
దేదీప్యమైన మొక్కపాటి వారి నవల గురించి:
“మొక్కపాటి” పెరటి మొక్క బారీష్టరు
పార్వతీహాస్యభావపటిమ
తెలుగునవలలందు దేదీప్యమైనది
ఘనవరమ్ము పీఠికాపురమ్ము॥
పిఠాపురం వైభవాన్ని చాటి చెప్పే ఈ విలువైన శతకాన్ని అందరూ తప్పక చదవవలసినది.
శ్రీనివాస్ లింగం గారి కృషికి అభినందిస్తూ, ఈ శతకాన్ని తప్పక చదువుతారని ఆశిస్తూ…

కౌండిన్య ( రమేష్ కలవల ) – 25/02/2024