Skip to content

Ramesh Kalavala

We all are stories in the end. Just make it a good one!

Menu
  • About
Menu

హిందూస్తానీ సంగీతం 

Posted on October 25, 2025November 30, 2025 by Ramesh

భారతీయ సంగీతం కాలాంతరం రూపాంతరం చెంది, 13వ శతాబ్దం నుండి పర్షియన్, అరబిక్ సాంస్కృతిక ప్రభావం వల్ల దక్షిణాది లోని కర్నాటక సంగీతం నుండి విడి పడి ఉత్తరాదిలో హిందూస్తానీ సంగీతం గా ఆవిర్భవించింది. 

ఈ సంగీతం అనేక పోకడలతో వివిధ ప్రాంతాలలో ఘరానాలు ( విభిన్న పద్దతులు) గా ప్రాచుర్యం పొందాయి. వీటిలో గ్వాలియర్ ఘరానా, కిరాణా ఘరానా, అత్రౌలి-జయపూర్ ఘరానా, ఆగ్రా ఘరానా, పటియాలా ఘరానా లాంటివి కొన్ని ముఖ్యమైన ఘరానాలు.  ఎందరో ప్రసిద్ధ ఉస్తాదులు, కళాకారులు ఈ ఘరానా లకు సంబంధించిన వారే. 

హిందూస్తానీ ఆవిర్భావము, ఈ ఘరానాలకప చెందిన సుప్రసిద్ధ గాయకులు గూర్చి ఆన్లైలో వివరాలు దొరుకుతాయి.

ఇక హిందూస్తానీ సంగీతంలో ప్రధాన అంశాలు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. లోతుగా అధ్యయనం చేసేవారికి మరిన్ని వివరాలు విస్తృతంగా ఈ రోజుల్లో వికీపీడియా లాంటి వివిధ మాధ్యమాల్లో దొరుకుతున్నాయి. కొన్ని విషయాలు ఇక్కడ వ్రాయడం ద్వారా హిందూస్తానీ సంగీతాన్ని కొంత వరకు అర్థం చేసుకునే ప్రయత్నం తప్ప పూర్తి అవగాహన వస్తుందని భావన మాత్రం కాదు. 

సప్తక్

సరిగమపదనిస లు భారతీయ సంగీతంలో సప్త స్వర స్థానాలు, ఈ ఏడు స్వర స్థానాలను హిందూస్తానీ సంగీతం లో సప్తక్ గా పిలవబడుతుంది. 

స్వర స్థాయి లేదా రకాలు

సప్తక్ లో వివిధ రకాల స్వరాలు వినబడతాయి. అతి మందర స్థాయి సప్తక్ (లో షార్ప్ ఆక్టేవ్) , మందర స్థాయి సప్తక్ (లో ఆక్టేవ్) , మధ్య స్థాయి సప్తక్ (మిడిల్ ఆక్టేవ్ ), తారా స్థాయి సప్తక్ (హై ఆక్టేవ్) , అతి తారా స్థాయి సప్తక్ (షార్ప్ ఆక్టేవ్) అనే రకాలుగా ఉంటాయి.  

మానవులకు స్వరం సాధారణంగా మధ్య స్థాయి లో ఉంటుంది. ఈ స్వర స్థాయి లో హెచ్చుతగ్గులు ఉండవు. మధ్య స్థాయి లో స్వరాలను స్వర లిపి లేదా సంగీత లేఖన పద్దతి లో వ్రాయడానికి ప్రత్యేక గుఱుతులు ఏమీ ఉండవు. 

మధ్య స్థాయి నుండి ఒక తక్కువ స్థాయి స్వరాన్ని మందర స్థాయి ని సూచిస్తుంది. ఈ స్వర స్థాయి ని లిపి గా వ్రాయడానికి స్వరం క్రింద ఒక చుక్క గుఱుతు గా ఉంటుంది.  అలానే రెండు స్థాయిలు తక్కువ ఉన్న స్వరాన్ని . అతి మందర స్థాయి సప్తక్ అని, వీటిని లిపిలో వ్రాయటానికి స్వరం క్రింద రెండు చుక్కలు గుఱుతుగా ఉంటాయి. 

అలానే మధ్య స్థాయి నుండి ఒకటి ఎక్కువ స్థాయి స్వరాన్ని తారా స్థాయి ని సూచిస్తుంది. ఈ స్వర స్థాయి ని లిపి గా వ్రాయడానికి స్వరం పైన ఒక చుక్క గుఱుతు గా ఉంటుంది.  అలానే రెండు స్థాయిలు తక్కువ ఉన్న స్వరాన్ని . అతి తారా స్థాయి సప్తక్ అని, వీటిని లిపిలో వ్రాయటానికి స్వరం పైన రెండు చుక్కలు గుఱుతులు గా ఉంటాయి. 

శృతి (పత్తి లేదా పిచ్ లేదా స్కేలు)

హిందూస్తానీ సంగీతం లోని గీతాలు లేదా రాగాలు ఒకే శృతి లో ( పత్తి లేదా పిచ్ లేదా స్కేలు అంటారు ) పాడటానికి హార్మోనియం, శృతి పెట్టె లేదా తాన్పూరా వాడటం చూసే ఉంటారు. 

స్వరాల కొలతలు / రకాలు 

హిందూస్తానీ సంగీతంలో స్వరాల లో రకాలు ( స్వరాల కొలతలు ) గూర్చి క్లుప్తంగా తెలుసుకుందాం. స్వరాలలో శుద్ద, అచల్, కోమల్, తీవ్ర స్వరాలు కొలతలు ఉంటాయి.

మానవుల సాధారణ స్వరం శుద్ద స్వరం లో ఉంటుంది. 

స, ప లు అచల్ స్వర రకాలు, ఇవి స్థిర స్థానాలు. 

రి, గ, మ, ద, ని లు వికృత స్వరాలు. ఈ వికృత స్థానాల గుర్తించడం కోసం సంగీత లిపిలో స్వర స్థానం క్రింద ఒక గీత ఉంటుంది. ఉదాహరణకు – శు రి , శు మ. 

స్వరాలలో మ ఒక్కటి మాత్రమే తీవ్ర స్వరం కలిగి ఉంటుంది. ఒక్క స్థానం పైన ఉన్న దానిని ప్రతి మధ్యమం అని అంటారు, దీనిని లిపి లో స్వరం పైన ఒక చిన్న నిలువు గీత ఉంటుంది.

ఠాట్ ( సంగీత కొలమానం) పద్ధతులు

పండిట్. విష్ణు నారాయణ్ భాత్కండే ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో, హిందుస్థానీ సంగీతానికి ప్రస్తుత ఠాట్ ( సంగీత కొలమానం) పద్ధతిన వర్గీకరణ/క్రమబద్ధీకరణ చేసారు. హిందూస్తానీ లో రాగాలన్నీ క్రింద పేర్కొన్న పది ఠాట్ ల పైనే ఆధారపడి ఉంటాయి. 

1.మార్వా 

2.బిలావల్ 

3.కాఫి 

4.ఖమాజ్ 

5.కల్యాణ్ 

6.భైరవి 

7.భైరవ్ 

8.పూర్వి 

9.అసావేరి 

10.తోడి

ఠాట్ కు, రాగాల కు తేడా క్లుప్తంగా తెలుసుకుందాం. పైన చెప్పినట్లుగా ఒకొక్క ఠాట్ (పది ఠాట్ లలో) కు సంబంధించిన రకరకాల రాగాలతో వర్గీకరణ చేయడం జరిగింది. ముఖ్య మైన రాగం పేరుతో ఆ ఠాట్ ను పిలుస్తారు. ఉదాహరణ కు – ముఖ్యమైన మార్వా రాగం ఉన్న ఠాట్ ను మార్వా ఠాట్ అని, బిలావల్ రాగం ఉన్న ఠాట్ ను బిలావల్ ఠాట్ అని, కాఫీ రాగం ఉన్న ఠాట్ ను కాఫీ ఠాట్ అని, ఖమాజ్ రాగం ఉన్న ఠాట్ ను ఖమాజ్ ఠాట్ అని, కళ్యాణ్ రాగం ఉన్న ఠాట్ ను కళ్యాణ్ ఠాట్ అని, భైరవి రాగం ఉన్న ఠాట్ ను భారవి ఠాట్ అని, పూర్వీ రాగం ఉన్న ఠాట్ ను పూర్వీ ఠాట్ అని, అసావరీ రాగం ఉన్న ఠాట్ ను అసావరీ ఠాట్ అని, అలానే తోడి రాగం ఉన్న ఠాట్ ను తోడి ఠాట్ అన్న ఠాట్ పద్దతి ని ఏర్పాటు చేసారు. 

ఠాట్ లో ఆరోహణ మాత్రమే ఉంటుంది, పైగా ఠాట్ లను పాటల రూపంగా పాడరు, వీటికి రక్తి/మాధుర్యం/శ్రావ్యత కు సంబంధం లేదు. కానీ, పాటల రూపంలో శ్వావ్య రస మాధుర్యం భరితంగా పాడ కలిగిన వి ఠాట్ నుండి వర్గీకరణ చేసిన రాగాలు. 

వివిధ రాగాల గూర్చి విడిగా చర్చించే అవకాశం ఉంది. కాబట్టి,  ముందుగా ఠాట్ ల లో ఏడు స్వర స్థానాలు తప్పక ఉండాలి, ఠాట్ కు 12 స్వర స్థానాలు సాధ్యపడతాయి( ఏడు శుద్ద స్వరాలు – స,రి,గ,మ,ప,ద,ని,స లు , నాలుగు కోమల్ స్వరాలు- రి(1,2), గ(1,2), మ(1,2), ని(1,2) ఒక తీవ్ర స్వరం – మ(1,2) క ), ఆరోహణ క్రమంలో ఉంటాయి. పాశ్చాత్య సంగీతంలో కూడా ఇవే స్వర స్థానాలు ఉంటాయి. ఈ ముఖ్యమైన పాశ్చాత్య తరహా సంగీతం గురించి మరొక సారి తెలుసుకుందాం. అలానే, ఈ ఠాట్ వ్వవస్థ గురించి, వాటిలో ఉన్న రాగాల గూర్చి పుంఖాలుగా వ్రాయవచ్చు. ప్రస్తుతానికి పరిమితిని బట్టి కొన్ని విషయాలను మాత్రమే పరిశీలిద్దాము. 

హిందూస్తానీ సంగీతంలో ఠాట్ లకు లేదా రాగాలు నిర్దిష్ట సమయంలో వినడానికి అనుకూలంగా ఉంటాయని భావిస్తారు. ఉదాహరణకు బిలావల్ టఠ్ లో అన్నీ స్వరాలు శుద్ద స్వరాలు కలిగి ఉంటాయి (కర్నాటక సంగీతంలో ధీర శంకరాభరణం మేళ కర్త రాగం లాగా), దీనిని ఉదయం సమయంలో వినడానికి అనువుగా ఉంటుందంటారు.

ఈ బిలావల్ అనే రాగాం కన్నా ఇటీవల అలహ్య బిలావల్ అనే రాగాం ఎక్కవగా వినియోగంలో ఉందని చెప్పాలి. హంసధ్వని రాగం ఈ బిలావల్ ఠాట్ లోనిదే. 

రాగ అసావరీ కొంచెం పొద్దు ఎక్కిన తరువాత, భైరవ్ తెల్ల వారు జామున, కళ్యాణ్ ఠాట్ సాయంత్రం సమయానికి కేటాయించారు.  అన్నీ ఠాట్ లలో కల్లా తోడి ఠాట్ “రారాజు” వంటిదని చెబుతారు. 

శుద్ద రాగం, సులువైన రాగాలు తెల్లవారుజామున, కొంత ఎక్కువ స్థాయి రాగాలు పొద్దు పొడిచిన తరువాత, నైపుణ్యం కలిగిన రాగాలు మధ్యాహ్నం కొరకు, ప్రేమ,రసానుభూతి కలిగే రాగాలు సాయంత్రం వేళ, సాధారణమైన రాగాలు రాత్రి వేళపాడటం వల్ల సంగీత రసానుభూతి కలుగుతుందని భావిస్తారు. 

అలానే ఏ సమయం లో రాగాలాపన / రాగ ప్రదర్శన అనువుగా ఉంటుందో తెలియజేయడం తో పాటు ఋతువు కు కూడా హిందూస్తానీ సంగీతం లో ప్రాముఖ్యత ఉంటుంది. ఉదాహరణకు భైరవ ఠాట్ లోని రాగాలు చలి కాలం లో, కళ్యాణ్ ఠాట్ లోని రాగాలు వసంతం లో మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయని చెబుతారు. 

రాగాలు 

రాగం అనేది సంస్కృతం లో నుండి వచ్చిన పదము. ఇది భారతీయ సంగీత వ్వవస్థ కు పునాది వంటిది అని చెప్పవచ్చు. ఇది స్వర వర్ణాలంకితమై శ్రోతలను రంజించే ధ్వని. భావాన్ని గానంలో వృద్ధి చేసి చూపించేది. రాగాలు మొత్తం 16 వేలనీ, అవి 16 వేల గోపికలు తమ విశిష్ట, విలక్షణ పద్ధతులలో గీతాలాపన చేసినప్పుడు 16 వేల సరిగమాద్యాలింగితగీత రాగాలు అయ్యాయని ఐతిహ్యం.

హిందూస్తానీ సంగీతంలో రాగాలలో కనీసం ఐదు స్వరాలు ఉంటాయి. స్వరాల ఏ క్రమంలో అయినా పాడతారు. వీటిలో ఆరోహణ, అవరోహణ క్రమాలు వర్తిస్తాయి. రాగల ప్రత్యేకం గా ఒక రసాన్ని లేదా భావాన్ని ఉత్పత్తి చేస్తూ మనస్థితిని మెరుగు పరిచేలా ఉంటుంది. రాగాలు ఒక ఠాట్ కు సంబంధించినదిగా ఉంటాయి. రాగాలలో వాది, సంవాది తప్పక ఉండాలి. వీటి గురించి ముందు తెలుసుకుందాం. 

రాగాలు వివిధ రసాలు లేదా భావాలను కలిగిస్తాయి. కొన్ని రాగాలు శాంతిని, కొన్ని భక్తిని, కొన్ని రసజ్ఞతని, మరికొన్ని శృంగార అనుభూతి కలిగించేలా చేస్తాయి. 

ఆరోహణ, అవరోహణం లో మొత్తం ఏడు స్వర స్థానాలు కలిగి కానీ, ఐదు లేదా ఆరు స్వర స్థానాలు కలిగి కానీ ఉంటాయి.

ఒక్కొక్క స్వర స్థానం లేక పోవడం, లేదా ఒక్కొక్క స్వర స్థానాన్ని ఒత్తుగా పలకడం ద్వారానూ ఒక్కొక్క స్వర స్థానం నుండి ఇంకొక స్వర స్థానానికి మారడం ద్వారానూ ఆ రాగం యొక్క స్వభావాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు. 

రాగాలలో ముఖ్యం గా వీటి గురించి తెలియజేస్తారు- వాది, సంవాది, అనువాది, వివాది, ఆరోహ, అవరోహ, పకడ్, జాతి, ఠాట్, సమయ్, రస్, స్థాయీ, అంతర, ముఖడ, ఆలాప్, తాన్. వీటిగురించి క్లుప్తంగా తెలుసుకుందాము.

వాది అనగా రాగం లో ఉండే స్వరాల లో ఒక ముఖ్యమైన స్వరాన్ని నొక్కి పలకడం జరుగుతుంది మరియు ఆ స్వరం రాగం లో తరుచుగా వాడబడుతుంది. 

సంవాది అనగా రాగం లో ఉండే స్వరాల లో రెండవ ముఖ్య స్వరం. సంవాది వాది కంటే రాగంలో తక్కువ గా ఉపయోగించబడుతుంది. కానీ, మిగతా స్వరాల కంటే ఎక్కువ గా వినియోగించబడుతుంది.

అనువాది అనగా రాగం లో మిగిలిన స్వరాలు( వాది, సంవాది తరువాతి స్వరాలు)

వివాది అనగా రాగం లో విరుద్ధమైన స్వరం గా పరిగణించబడుతుంది. ఈ స్వర వైషమ్యము వల్ల రాగానికి ఒక అందం చేకూరుతుంది. వివాది ప్రయోగం చాలా తక్కువగా చేయబడుతుంది. కానీ గాయకులు లేదా విద్వాంసులకు వివాది కూర్పు వల్ల రాగాన్ని మధురమైన రీతిలో పాడేందుకు దోహదపడుతుంది. 

ఆరోహ, అవరోహణాలు లో స్వరాలు తక్కువ స్థాయి నుండి హెచ్చు స్థాయి వరకూ పలికేలా ఉంటాయి.

పకడ్ లో కొన్ని స్వరాల సమూహం కలిసి రాగం యొక్క ప్రత్యేకతను లేదా స్వభావాన్ని తెలియజేస్తాయి.

జాతి రాగాన్ని ఏ తాళం లో లేదా లయ లో ఎలా పాడాలో తెలియజేస్తుంది 

ఠాట్ – ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ప్రతీ ఒక్క రాగం ఆ పది ఠాట్ లలో ఏదోక ఠాట్ కు చెందుతుంది. 

సమయ్ – ప్రతీ రాగం ఏ సమయం లో ప్రదర్శించాలో సూచిస్తుంది. 

రస్ – రాగం యొక్క భావాన్ని లేదా రసాన్ని తెలుపుతుంది.

స్థాయి ( మొదలు ) –  రాగం లో మొదటి భాగాన్ని సూచిస్తుంది. సహజంగా స్థాయి లో మందర, మధ్య స్థాయి స్వరాలు ఉంటాయి.

అంతర – రాగం లో రెండో భాగాన్ని సూచిస్తుంది సహజంగా మధ్య, తారా స్థాయి కలిగిన స్వరాలతో కూడి ఉంటుంది. 

ముఖడా – గానం లో మొదటి వరుసను ముఖడా గా పిలుస్తారు. 

ఆలాప్ – ఇది రాగ ఆలాపన. వాది, సంవాది, ప్రతి వాదిలతో కూడిన స్వరాలతో తక్కువ స్థాయి ఆలాపన తో మొదలవుతుంది. కొన్ని కొన్ని సార్లు స్వరాల బదులు “ఆఆ” అనే శబ్ద వర్ణాలు కనిపిస్తాయి. 

తాన్ (తానం) – తానం విద్వాంసుడి ప్రతిభను, సాధన ను చాటి చెప్పేలా ఉంటుంది. కఠినమైన రాగాల కలయిక తో స్వరాలతో గారడీ చేస్తూ ఒక లయతో విన్యాసాలు చేసే ప్రక్రియ తానం. తానాలలో వివిధ రకాలు ఉన్నాయి, క్లుప్తంగా బోల్ తాన్ , శుద్ధ తాన్, కూట్ తాన్,మరియు మిశ్ర తాన్ అనే రకాలు గలవు. వీటిలో స్వరాల అమరిక మార్పుల వల్ల రక రకాలు గా ఉంటాయి

రాగ అలంకారాలు, విన్యాసాలు 

అలంకారం రాగానికి ఆభరణం లాంటిది. ఒక దాని తరువాత ఇంకొక అలంకారాలు జతచేయడం వల్ల రాగ మాధుర్యం వచ్చేలా సహకరిస్తుంది.

గమక్ – కొన్ని స్వరాలు నొక్కి పలకం ద్వారా మరియూ స్వర జతుల ద్వారా చేయబడే ప్రక్రియ ఈ గమకం.

ముర్కీ- ఇది తానం లో రెండు మూడు స్వరాలతో పాడే ప్రక్రియ 

కట్కా – ఇది రెండు, అంతకంటే ఎక్కువ స్వరాల ఈడ్పు వంటిది. 

మీండ్ – స్వరాలను లాగడం ద్వారా వచ్చే ధ్వనిని మీండ్ అంటారు. దీనివల్ల రాగం లో ఆగకుండా ముందుకు సాగేలా చేస్తుంది. 

పైన పేర్కొన్న రాగం లోని విషయాలను కొంతమేరకు చెప్పడం జరిగింది. ఎక్కువ వివరాలు ఆన్లైన్ లో లబ్ధ్యం అవుతాయి. 

ఈ భారతీయ శాస్త్రీయ సంగీత సాంప్రదాయ రాగ సృష్టి యావత్ ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుకగా భావిస్తారు.  అక్బర్ సమయంలో ఆయన ఆస్థాన విద్వాంసుడైన తాన్ సేన్ రాగాలు ఎంతో ప్రభావితమైనవి అని చెబుతారు. ఆయన రాగాలాపనల వల్ల నగరమంతా మేఘమయమై చీకటి ఆవరించిన క్షణాలు ఉన్నాయని గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది. 

కొన్ని హిందూస్తానీ రాగాలు ఉదాహరణ కు

రాగంప్రదర్శనసమయంభావం / స్వభావంప్రధాన లక్షణాలు
యమన్(Yaman)సాయంత్రంశాంతికరమైనది, భక్తి పరమైనది, ఉత్తేజకరమైనది“రాగాల రాజు”గా పిలువబడుతుంది; సమృద్ధమైన స్వర నిర్మాణం కలిగినది
భైరవ్ (Bhairav)ఉదయంమహిమగలది, భక్తిమయమైనది, శక్తివంతమైనదిగంభీరమైన ఆరోహణ –అవరోహణతో; గౌరవభావాన్ని కలిగిస్తుంది
తోడి (Todi)ఉదయంస్నిగ్ధమైనది, సౌందర్యమయమైనది, భావోద్వేగపూరితమైనదిప్రేమ, వేదన భావాలనువ్యక్తపరుస్తుంది; సున్నితమైనస్వరరచన
భీంపలాసీ(Bhimpalasi)మధ్యాహ్నం/ సాయంత్రంమధురమైనది, వ్యక్తీకరణాత్మకమైనది, భావప్రధమైనదిభావపూరితమైనది; ఆవిష్కరణకువిస్తృత అవకాశం ఉంది
పిలూ (Pilu)రాత్రిలోతైనది, ఆత్మపరిశీలనాత్మకమైనదిసెమీ–క్లాసికల్ రాగం; భావనాత్మకంగాబలమైనది
మార్వా (Marwa)సాయంత్రంచివరఉద్వేగభరితమైనది, ఉత్సాహపూరితమైనది, వీరభావపూరితమైనదిధైర్యం, శక్తిని సూచిస్తుంది; చురుకైనలయ నిర్మాణం కలిగి ఉంటుంది
శ్రీ (Shree)ఉదయంఉల్లాసకరమైనది, ఆశావహమైనదిప్రకాశవంతమైన స్వరాలు; ఆరంభస్థులకు అనుకూలమైనది
బిహాగ్ (Bihag)సాయంత్రంరొమాంటిక్, స్వప్నాత్మకమైనది, నాస్టాల్జిక్మెలోడియస్‌గా, మృదువుగాఉంటుంది; విరహాన్ని ప్రతిబింబిస్తుంది
ఆసావరి(Asavari)సాయంత్రంచివరధ్యానపరమైనది, గంభీరమైనదిలోతైన స్వర నిర్మాణం; ఆత్మీయఅనుభూతిని కలిగిస్తుంది
దర్బారి కానడా(Darbari Kanada)రాత్రి చివరగంభీరమైనది, రాజసమైనది, సున్నితమైన

హిందూస్తానీ సంగీతం లో రూపాలు

ఈ సంగీతం లో వివిధ శైలి 

  1. ద్రుపద్
  2. తుమ్రీ
  3. ఖయాల్
  4. భజన్
  5. గజల్
  6. ఖవ్వాలీ
  7. రివాయత్
  8. రబీంద్ర సంగీత్ 

ఈ పై వాటి ఒకొక్క శైలి గూర్చి ఎన్నో వ్రాయ గల విషయాలు ఉన్నాయి అనడం లో సందేహం లేదు. వీలుకుదిరినప్పుడు, అమ్మ దయ దొరికినప్పుడు మళ్లీ వ్రాస్తాను. 

ప్రత్యేకం గా రబీంద్ర సంగీత్ నాకెంత ప్రియమైన శైలి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 2232 పాటలను రచించారు, మరియు స్వరపరిచారు.  హిందూస్తానీ, కర్నాటక సంగీతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసారు. కర్నాటక సంగీతంలోని తాళాలను స్పూర్తి తో ఏడు కొత్త తాళాలను రబీంద్ర సంగీత్ కోసం కనిపెట్టిన మహానుభావుడు. 

కౌండిన్య- 25/10/2025

  • హిందోళ రాగం
  • “Cat and the Robin – A Dialogue”
  • హిందూస్తానీ సంగీతం 
  • సంగీత జ్ఞానం
  • నీలిమేఘములలో – 35 సినిమా
©2026 Ramesh Kalavala | WordPress Theme by Superbthemes.com