
కర్నాటక సంగీతం లో పంచ స్వర స్థానాలు కలిగిన రాగాలని ఔఢవ రాగాలు అంటారు (ఆరోహణ, అవరోహణం లలో ఐదు స్వరాలు మాత్రమే ఉన్న రాగాలు).
ఈ రాగాలు విన్నప్పుడు మనకు మాధుర్యం, భక్తి, ధ్యానం, ఆధ్యాత్మికత, లాలన లాంటి భావనలు కలుగుతాయని చెబుతారు.
ఈ ఔఢవ రాగాలలో మనకు సరళత కనపడుతుంది. ఐదు స్వర స్థానాలతో పాడటానికి సులభంగా ఉండి, జ్ఞాపక శక్తికి కూడా అనువుగా ఉంటాయి.
ఈ రాగాలలోని స్వర రచనలు తక్కువ గమకాలతో ఉండి, ఎక్కువ ధ్యానం లేదా మాధుర్యం లాంటి భావాలు కలగజేస్తూ, రమణీయంగా ఉంటాయని పండితులు భావిస్తారు. చివరగా, ఈ రాగాలు దేశీ, జానపద శైలి కి దగ్గరగా పోలి ఉండటం వల్ల జనులకు వినడానికి మనోరంజకంగా ఉంటాయి.
ఈ పంచ స్వర రాగాలలో అత్యంత అందమైన ఔఢవ–ఔఢవ రాగం ( ఆరోహణ లో ఐదు – అవరోహణం లో ఐదు స్వరాలు) ఈ “హిందోళ” రాగం.
ఈ “హిందోళ” రాగం 20వ మేళకర్త రాగమైన “నఠభైరవి” నుండి ఉద్భవించిందిని కొంత మంది భావిస్తే ,మరికొందరు 8వ మేళకర్త అయిన “హనుమత్తోడి” నుండీ పుట్టిన జన్య రాగం అని భావిస్తారు ఎందుకంటే ఈ రెండు జనక రాగాలలో మనకు సాధారణ గాంధారము(గ2),శుద్ధ మధ్యమము(మ1),శుద్ధ ధైవతము(ధ1), కైశికి నిషాధము (ని2) కనబడతాయి.
హిందోళ రాగ ఆలాపన కు అనువుగాను, లాలిత్యంతో కూడిన గమకాలతో, స్వర ప్రస్థానంలో మంచి వర్ధమానం చూపిస్తుంది అని తెలుస్తోంది.
కర్నాటక సంగీతం లో హిందోళ రాగానికి హిందూస్తానీ సంగీతంలో సమానమైన రాగం “భైరవి (అసావరీ) ” థాట్ లోని “మాల్కౌంస్” (“మాల్కోష్”) అని చెబుతారు. హిందూస్తానీ సంగీతంలో “హిందోళ్”అనే రాగం ఉన్నా అది కర్నాటక సంగీతం లో హిందోళ రాగానికి సంబంధించినది కాదని తెలుసుకోవాలి.
ఈ “మాల్కోష్” రాగం చాలా అనాది రాగం అని ఇతిహాసాల వల్ల తెలుస్తోంది. “మాల్కోష్” అనే పదం రెండు పదాలైన మాల, కోష్ (కౌషిక) వల్ల ఏర్పడింది. కౌషిక (నాగు పాము) ను మాలగా ధరించే శివుడు చేస్తున్న రౌద్ర శివతాండవం నుండి లాలన చేయడం కోసం స్వయానా పార్వతి అమ్మవారు ఈ రాగం లో గానం చేసారని ఇతిహాసాల్లో ప్రస్తావన ఉంది. అలానే జైనమతం బోధనలలో కూడా ఈ రాగం వాడుకలో ఉండేదని ప్రాచీన గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది. చైనాలోని సంగీత లో కూడా ఈ ఔఢవ ఉందని చెబుతారు. కానీ ఈ అనాది “మాల్కోష్” రాగానికి ప్రస్తుతం వాడుకలలో ఉన్న “మాల్కౌంస్” రాగానికి చాలా తేడాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ “మాల్కౌంస్” అర్థ రాత్రి ఘడియల సమయం తరువాత పాడటానికి అనువుగాను, ఈ రాగం మైమరిపించే లాగాను, సాంత్వనం కలిగించే లా ఉంటుందని, మొదట మత్తులోకి జారే లా ఉండి తరువాయి కొండలు కదిపే శక్తి కలిగి ఉంటుందని హిందూస్తానీ సంగీత ఉస్తాదులు ద్వారా మనకు తెలుస్తుంది. ఈ “మాల్కౌంస్” లో కూడా అనేక రకాల రాగాలు ఉన్నాయి. ఈ రాగం గురించి, హిందూస్తానీ సంగీతంలో ఈ రాగం తో చేసిన పాటల గురించి విడిగా చెప్పుకోవచ్చు.
ఇక ఈ కర్నాటక సంగీతం లోని “హిందోళ” రాగం సాయంత్రం లేదా రాత్రి పూట ఎక్కువగా పాడే రాగం అని, అలాగే, శిశిర, వసంత ఋతువుల లో పాడే సంధి రాగం అని కూడా చెబుతారు.
ఈ రాగ నిర్మాణం లో రిషభ , పంచమాలు లేని కారణంగా ఈ రాగం ఒక ప్రత్యేకమైన రాగంగా పరిగణించ బడుతుంది.
సాధారణ గాంధారం (గ2), శుద్ధ మాధ్యమం (మ1), శుద్ధ దైవతం (ధ1) మరియు కైశికి నిషాదం (ని2) లు ఈ రాగం లో ఉంటాయి.
ఆరోహణ లో స గ2 మ1 ధ1 ని2 స, అవరోహణం లో స ని2 ధ1 మ1 గ2 స లు స్వర స్థానాలు గా ఉంటాయి.
ఈ రాగం లో స్వర స్థానాలు అన్నీ కోమల స్వరాల ఉండటం మూలాన చాలా రుచిగా, తీయగా ఉంటుంది, కరుణ, భక్తి, శృంగార రసాలను పోషించ గలదు అని చెబుతారు.
ఎన్నో భక్తి రస కీర్తనలు, సినిమా పాటలు, అలానే యం ఎస్ రామారావు గారి తెలుగు హనుమాన్ చాలీసా లోని కొన్ని పద్యాలు, ఘంటశాల గారి భగవద్గీత లోని శ్లోకాలు కూడా కొన్ని ఈ రాగం లో స్వర పరిచారు.
అలాగే అనేక సంగీత కచేరీల లో కూడా ఈ రాగాన్ని వాడడం మనకు కనిపిస్తుంది.
త్యాగరాజ స్వామి హిందోళ రాగంలో కూర్చిన “సామజ వర గమన” కృతి గూర్చి తెలియని వారుండరు.
సామజ వర గమన
పల్లవి
సామజ వర గమన ! సాధు హృత్సార సాబ్జపాల ! కాలాతీత ! విఖ్యాత !
అనుపల్లవి
సామని గమజ సుధామయ గాన విచక్షణ ! గుణశీల ! దయాలవాల ! మాంపాలయ;
“హిందోళ” రాగ స్వర సంచారం సులువుగా ఉండటం వల్ల సినిమా పాటల్లో వాడకం ఎక్కువగా కనిపిస్తుంది. “మోహన” రాగం తరువాత చిత్రపరిశ్రమలో ఈ రాగం అత్యధికంగా వాడిన రాగం అని తెలుస్తుంది.
“శంకరాభరణం” (1979) సినిమాలో ఈ కీర్తనను వేటూరి గారు త్యాగరాజ కృతిలో పల్లవి, అనుపల్లవి లను అలాగే ఉంచి, చరణాన్ని సందర్భాని కనుగుణం మార్చి రచించారు. దీనిని విశ్వనాథ్ గారు పెళ్ళి చూపుల పాటగా రాజ్యలక్ష్మి, చంద్రమోహన్ మీద చిత్రీకరించడం జరిగింది. ఈ పాట చివర్లో ఆలాపన పూర్తికాకుండానే శాస్త్రి గారు “శుద్ధ హిందోళంలో రిషభం ఎలా వచ్చింది?” అన్న ప్రశ్న తో పాటను ఆపేయటం జరుగుతుంది. సినిమా కధకోసం కావాలనే హిందోళం లో అపస్వరమైన “రిషభ” స్వరం పాట చివరి ఆలాపనలో వాడబడటం నిజంగానే జరిగింది. తరువాత వాణీ జయరాం గారి గళంలో మళ్లీ రాజ్యలక్ష్మి ఈ రాగాన్ని సరిగా పాడటం సినిమాలో మనం చూస్తాము.

జన సామాన్యం పాడుకునే చాలా లలిత,భక్తి గీతాలూ,సినిమా పాటలూ ఈ రాగాన్ని ఆధారం చేసుకున్నవే.
- సీతాకోక చిలుక సినిమాలో సాగర సంగమమే
- సాగర సంగమం లో ఓం నమశ్శివాయా
- అల్లరి మొగుడు లోని నా పాట పంచామృతం
- బొబ్బిలి రాజా లో బలపం పట్టి భామ బళ్ళో
- అభినందన లో రంగులలో కలవో
- రుద్ర వీణ లో నమ్మకు నమ్మకు ఈ రేయిని
- అన్నమయ్య లో నిగమా నిగమాంతర వర్ణిత
- అన్నమయ్య లో ముసిన ముత్యాలకేలే
- అన్నమయ్య లో కట్టెదుర వైకుంఠము
- అన్నమయ్య లో అంతయు నీవే హరిపుండరీకాక్ష
- అన్నమయ్య లో కొండల్లో నెలకొన్న కోనేటి రాయడు వాడు
ఈ పాటలను బట్టి మనకు కె వి మహదేవన్ గారు, ఇళయరాజ గారు, అలానే కీరవాణి గారు లాంటి వారు సినిమా పాటల్లో ఈ రాగం తో ఎన్నో మధురమైన పాటలు మనకు అందించారో తెలుస్తుంది.
సదాశివ బ్రహ్మేంద్ర వారి “కీర్తన భజరే గోపాలం” కూడా ఈ రాగం లోనే రచించారు.
యం ఎస్ సుబ్బలక్ష్మి గారి కంఠంలో మధురంగా పలికే అన్నమయ్య కీర్తన “దేవదేవం భజే” కూడా హిందోళ రాగమే.
మంగళం పల్లి బాలమురళీకృష్ణ గారు తిల్లానా “డిం న నా త ధీరనా” హిందోళా లో కూర్చినదే. అనేక రాగాలలో ఆయన థిల్లానాలను అనుపమానంగా చేశారుట, వాటిలో హిందోళలో చేసిన థిల్లానా ఒక అద్భుతంగా పరిగణించారు.
అలాగే పాత సినిమా పాటల లో తెలుగు ప్రజలను ఉరూతలూగించిన లవకుశ చిత్రం లోని “రామ కథను వినరయ్య” కూడా ఈ రాగం లో స్వర పరిచినదేనట. బాలమిత్రుల కథ నుంచి ‘గున్న మామిడి కొమ్మ మీద ”, పూజాఫలం చిత్రం నుంచి “పగలే వెన్నెలా జగమే ఊయల”, సీతామాలక్ష్మి చిత్రం నుండి “మావి చిగురు తినగానే” లాంటివి ఎన్నో తెలుగు పాటలు కూడా ఈ రాగం లోనే చేయడం జరిగింది అని తెలుస్తోంది.
హిందోళ రాగ విశ్లేషణ మరియు ఈ రాగం లోని పాటలు కీబోర్డు లో ప్లే చేయడం గురించి ఈ క్రింది వీడియో చూడగలరు:
అలాగే, మరొక హిందోళ రాగం, పాటల గురించి కీబోర్డు లో ఈ పాటలు ఎలా ప్లే చేయాలో తెలియజేసే వీడియో:
కౌండిన్య – 22/11/2025
( సాయం సంధ్య వేళ, సూర్యాస్తమయం హిందోళ రాగ ఔఢవ స్వర స్థానాలు మేఘాల్లో తేలుతూ, వివిధ స్వరాలు అంతటా వ్యాపించి ఉన్నాయన్న ఊహాజనితమైన చిత్రం )