మొన్న ఆఫీసు నుండి ఇంటికి రైల్లో వస్తుంటే ఒక ఆలోచన వచ్చింది. నేను ఆలోచనలో పడటం సహజం. ఏదో ఒక స్థలం లో ఓ చక్కటి తోట ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుదని ఆలోచన. బావుంది కదూ ఆలోచన? అందరికి బహుశ ఈ ఆలోచన ఇంతకు ముందు వచ్చే ఉండి ఉండవచ్చేమో. దైవ నిర్ణయం, మానవ సంకల్పం కలిస్తే ఏదైనా సమకూరుతుంది. సాహసిస్తే అన్నీ సాథ్యమే.
ఆ ఆలోచనలో, నాకు చిన్న నాటి నుంచి కళ్ళతో చూస్తున్నవి, ప్రభావితం చేస్తున్నీవీ మదిలో మెలిగాయి. అవి, వేసవి సెలవులలో తాతగారింటి పెరడు లోని అరటి, బొప్పాయి, ఉసిరి, మునగ మెక్కలు కానీ, ఆ పల్లెటూరు లోని కొబ్బరి, జామ, తాటి, పనస చెట్లు కానీ, వీథి చివరనున్న వేప చెట్టు కానీ, ఊరు బైట ఉన్న మామిడి, చెరుకు తోటలు కానీ, పొలిమేరలలో ఉన్న చింత చెట్టు కానీ, కోనేరు లో ఉన్న కలువ పూలు కానీ, గుడి వాకిట్లో ఉన్న గన్నేరు, నంది వర్ధనం, మందారం, పారిజాతం కానీ, గుడి ఆరుబయట ఉన్న రావి చెట్టు కానీ, పక్కంటి లోని మరువం, గులాబీ లు, సన్న జాజి , సిరి మల్లె మొక్కలు కానీ, కాలువ ప్రక్కనే ఉన్న యూకలిప్టస్ చెట్టు కానీ, ఇవన్నీ , మరెన్నో గుర్తుకు వచ్చాయి.
అన్నీ మన తెలుగు తోట లో పెంచడం సాథ్యం కాదు, వాటిలో కొన్నైనా పెంచాలని ఓ ఆశ. ఆ తోట లో కొన్ని పూల మెక్కలు సువాసనలు వెదజల్లటానికి, కొన్ని చెట్లు ఆశ్వాదించటానికి, కొన్ని సేద తీర్చుకోవటానికి, మరికొన్ని ఆహ్లాదానికి ఉండటానికి పెంచితే బావుంటుందని నా అభిప్రాయం. వీటిలో కొన్ని మనతో పాటు, భగవంతుడి కి సమర్పణ చేసేవి లాగా ఉండాలి అని నా కోరిక. భగవంతుడి సమర్పించేవి పవిత్రత కు ప్రతీకారం.
రోజూ మనము దేవుడి కి అర్పించేది, అరటి పళ్ళు మరియు కొబ్బరి కాయలు. సాధారణం గా కొబ్బరి చెట్టులు ఇంటిలో పెంచడం చేస్తాము, అలాగే అరటి కూడా పెరట్లో పెంచుతాము. కాబట్టి మన తోటలో కొబ్బరి, అరటి చెట్లు ఉంటే బావుంటుంది. వీటితో పాటు దేవుడి కి పలు రకములైన పూలు సమర్పిస్తాము. అవి పారిజాతాలు, గన్నేరు, మందారం, నంది వర్దనం, మరువం ఇవన్నీ సొంత తోట నుంచి సమర్పిస్తే ఆ అనుభూతే వేరు.
పల్లెటూరు తోటలలో, ఇళ్ళల్లో పెంచే పళ్ళు చాలా మధురంగా ఉంటాయి. మచ్చుకు జామ పళ్ళు. పెరడు లోని జామ చెట్టు నుంచి కోసిన దోర జామ కాయ తిన్న అనుభవం అంతా ఇంత కాదు. కొందరు దోరగా ఇష్ట పడతారు, మరి కొందరు పండుగా ఇష్ట పడతారు. కానీ జామ తీపి గుణం చెక్కరకేళి అంత తియ్యదనం. మనందరికీ తెలుసు బొప్పాయి తినడం వల్ల ఎంత మేలో. అలాగే ఇంటిలో పండే మామిడి ని వేసవి లో ఆస్వాదిస్తే అమ్రృతం తాగినంత తృప్తి. మామిడి అన్నీ పళ్ళలోకి రారాజు. పళ్ళ తో పాటు, పూలు చక్కని సువాసనలు వెదజల్లుతుంటాయి. అవి సిరి మల్లెలు, సన్న జాజులు, మరియు గులాబీ లు. వీటి పరిమళాలు మనసును ఆహ్లాదంగా ఉంచుతాయి. ఇవన్నీ మన తోట లో ఉండవలసినవే.
మండుటెండలో చెట్లకింద సేద తీర్చు కున్నంత హాయి మరి ఎక్కడా ఉండదు. కొన్ని వ్రృక్షాలు చల్లని గాలిని వీస్తూ వీస్తూ అలసట జడి లేకుండా చేస్తాయి. అంతేకాకుండా మన వినోదానికి ఉయ్యాల లు వేసుకునేలా, మరియు గాలిని స్వచ్ఛత చేయడానికి ఉపయోగ పడతాయి. అందుకే ఏక వేప ఒక మామిడి చెట్టు తో మన తోటను అలంకరిస్తే బావుంటుందని ఒక వాంచ. ఇంటి పక్కన కాలువ ఉంటే యూకలిప్టస్ చెట్టు వేస్తే మంచిది, ఎందుకంటే ఎక్కువ నీ రాకుండా పీలుస్తుంది. దానికి తోడు మంచి వాసన వెదజల్లుతుంది. కావున వీటితో మన తోటను అలంకరించాలి.
మనసుకు ఆహ్లాదం కలిగంచేది గల గల పారే సెలయేరు చప్పుడు. అందుకే మన తోట లో ఒక చక్కని సెలయేరు, కొలను ఏర్పాటు చేసి అందు లో కలువలు వేస్తే అద్భుతం మహాద్భుతం. ఇది పరిసరాలను రమ్యంగా గోచరిస్తుంది. దాహం తీర్చు కోవటానికి వచ్చే పక్షుల కిలకిలరావం తో మనసు పులకిస్తుంది.
వీటన్నిటి మథ్య లో ఒక చిన్న కుటీరం వేసుకొని మన తోట పరిసరాలలో ఉన్న అన్నిటి నీ అర్పిస్తూ, ఆస్వాదిస్తూ,, సేద తీర్చుకుంటూ, ఆహ్లాదిస్తూ, అనుభూతి పొందుతూ ఉండాలి. అంతకంటే ఇంకేమి కావాలి ఈ జన్మకు?
నేను రాసిందాంట్లో కొత్తదేమీ లేదు, అన్నీ తెలిసినవే, మనందరమూ చూసినవే, కానీ ఏదో తెలుగు తోట గూరించి వ్యక్తం చేయాలి అన్న తపన. ఇవన్నీ మీతో పంచు కోవాలని ఒక చిరకాల వాంఛ, మిమ్మలిని కూడా ఉహాలోకాలలో వహరింప చేస్తుందని ఓ ఆశ,అంతే!