అందరి కీ హనుమంతుడు గురించి ఎంతో కొంత తెలుసు. నాకు కొంతే తెలుసు, ఎంతో తెలుసు కోవాలని చాలా సార్లు నా మనసు ఉబలాట పడుతుంది.
ఈ రోజులలో మన పూజ్య గురువులు, చాగంటి వారి ప్రవచనాలు కానీ, సామవేదం వారి బ్రహ్మ వాక్కులు కానీ టెక్నాలజీ సహకారం తో జ్ఞానాన్ని మనందరికి పంచుతున్నారు, ప్రసాదిస్తున్నారు. అయినా సరే, వాళ్ళు చెప్పిన వాటిలో కొంత బుర్ర కెక్కిన చాలు అని పలు మారులు అనిపిస్తుంది.
నాకు ఈ మధ్య ఒక వీడియో వాట్సాప్ లో పంపారు. అది చూసిన తరువాత, హనుమంతుడు గురించి ఇంకొంచెం తెలుసుకోవాలని గాఢ ప్రభావం ఏర్పడింది. అది ఎవరిదో కాదు, శ్రీ ఉషశ్రీ గారి వ్యాఖ్యానం, టివీ వచ్చిన కొత్తల్లో కాబోలు. నాకు మా మావయ్య గారు శ్రీ ఉషశ్రీ గారు వ్రాసిన ‘సుందర కాండ’ పుస్తకం ఇచ్చారు, నేను కొన్ని సార్లు చదివనా, మళ్ళీ ఇంకొక సారి చదివితే బావుండునిపిస్తుంది, ఇచ్చినందుకు ఆయన కు నేను ఎంతో ఋణపడి ఉన్నాను. ఆయన కూడా హనుమంతుడికి ప్రఘాఢ భక్తులు, వారి తాత గారు బ్రహ్మశ్రీ బిరుదు గల వారు, భక్తితో స్వయాన ధర్మాచల హనుమత్ స్వామి వారి గుడి నిర్మంచారు, అది దాదాపు ఓ వంద ఏళ్ళ క్రితం!
ఆ వీడియో లో హనుమంతుడు ఎందుకు సుందర భాష్యుడుో శ్రీ ఉషశ్రీ గారు వివరిస్తారు. అది వింటే రోమ రోమాలు కదిలి, శ్రీ ఉషశ్రీ గారి మీద ఇంకొంచెం గౌరవం పెరిగి, హనుమంతుడు మీద మరీ భక్తి పెరిగి, నేను అలా మాట్లాడితే చాలు అనిపించింది. ఇంకా ఎన్నో తెలుసు కోవాలని కుతూహలం కలిగింది.
అది శ్రీ రాముడు లక్షణు తో హనుమంతుడు ని మెుదటి సారి కలిసినప్పుడు సన్నివేశం, ఆయన వాక్చాతుర్యాన్ని ప్రసంసిస్తూ
నా నృగ్వేద వినీతస్య
నా యజుర్వేద దారిణః ।
నా సామవేద విదుషః
శక్యమేవం విభాషితం ।
తాత్పర్యం: ఈ కపిప్రవరుని సంభాషణ ఎంత ఉదాత్తంగా ఉన్నదో చూశావా! వేద త్రయం అధ్యయన చేసి, ఆరు శాస్త్రాలు కంఠపాఠం అయి, నవ వ్యాకరణాలు కరతలామలకం అయినవాడు కానీ ఇలా మాట్లాడడు!
అ విస్తరం అ సందిగ్దం
అ విలంబితం అవ్యథం ।
తాత్పర్యం: చెప్పవలసిన విషయాన్ని మూడు ముక్కలలో చెప్పాడు.అంతమాత్రాన మనకు వినబడకుండా మాటలు మ్రింగేయలేదు; సాగగీత సంగీతం లేదు. గొంతు చించి ఖటోరంగా అరవలేదు. సంస్కార సంప్పన్నమై మధ్యమస్తాయిలో హృదయాహ్లదకరంగా మాట్లాడాడు.
ఇంత ప్రతిభ కల సచివుడుంటే ముల్లోకాలను జయించగలడు! రాముని నోట ఇటువంటి ప్రశంస ఎవరికి లేదు, హనుమంతుడికి తప్ప!
మాట ఓక్కటే మానవ ప్రాణికి లభించిన వరం. మిగిలిన ఆహార, నిద్ర, భయ, మైథునాదులు సృష్టి లో అన్ని ప్పాణులకూ సహజమే! మాట్లాడడము అనే విద్యను హనుమంతుడి నుండి నేర్చుకోవాలి అని మహర్షి వాల్మీకి భావించాడు, అందు కే హనుమంతుడు ‘సచివుడు సుందర భాష్యుడు’!
నాకు ఇక్కడ, సుందరకాండ గురించి చర్చించే ఉద్దేశం లేదు, అర్హుడిని కాను. నాకు, మాట్లాడడము అనే విద్యను గురించి చర్చిద్దామనింపింది. ఇదిగో, దీన్ని రాయడం మెదలు పెట్టాను.
పైన ఆ సందర్బం సుందర కాండ లో మచ్చుకకు ఒకటి, అలా ఎన్నో సందర్బాలు మన కొరకు వివరణ చేసారు వాల్మీకి మహర్షి. వేళ్ళ సంవత్సరాల క్రితం లో రాసినా ఈ రోజు కీ కూడా మనలను ప్రభావితం చేస్తున్నాయి అంటే అర్థం చేసుకోండి వాటి గొప్పతనం, అవి మనకు నిజ జీవితం లో ఇచ్ఛే స్పూర్తి.
మనకు రోజూ ఎన్నో సంఘటనలు ఎదురవుతుంటాయి. కొన్ని చోట్ల మనము మాట్లాడిన తరువాత అనిపిస్తుంది, అయ్యే కొంచెం జాగ్రత్త గా మాట్లాడి ఉంటే బావుండుని, అదే కనుక మనం ఒక సారి ఆచి తూచి ఆలోచంచి మాట్లాడితే పశ్చాత్తాపం లేకుండా ఉంటుంది. నా ఉద్దేశం లో, తొందర పాటు సంభాషణ కంటే కూడా, కొంచెం ఆలోచనా రహిత భాషణ మనకే మేలు కలిగిస్తుంది. హనుమంతు ల వారు ఎన్ని రకాలు గా ఆలోచించారండీ, సీత అమ్మ వారితో ఎలా మాట్లాడితే ఆవిడ తనను రాముల వారు పంపిన ధూత అని నమ్మగలరు అని? పరిస్తితి ని విశ్లేషిస్తూ ప్రతికూలంగా సంభాషించటం విలక్షణం. అలా అని, మీ లో స్వతహా గా మీలో ఉన్న చాతుర్యం, చమత్కారం ను కోల్పోకండోయ్!
అలాగే, కొన్ని చోట్ల, సుతి మెత్తగా మాట్లాడతాము. పెద్దవాళ్ళు, ‘ఒరేయ్ నీలో నువ్వే గొణుక్కుంటావేంటి రా’, అనడం చూస్తాము. సందర్భోచితంగా, మధ్యమస్తాయిలో మాట్లాడితే హృదయాని కి ఎంతో ఆహ్లదకరంగా ఉంటుంది. దాని వలన ఎదుటి వారికి మీరంటే ఏమిటి అని ఓ అభిప్రాయం ఏర్పడుతుంది కదా? ఫస్ట్ ఇంప్రషన్ ఈస్ ది బెస్ట్ ఇంప్రషన్ అంటారు, అందువల్ల శ్రీ రాము చంద్ర ప్రభువు ఆంజనేయుడు యెక్క శక్తి ని రెండే రెండు పథ్యాలతో గ్రహించగలిగాడు, మహానుభావుడు.
ధైర్యే సాహసీ లక్ష్మీ, అని ఓ సామెత ఉంది. కొన్ని సందర్బాలలో మాటలలో ధైర్యం వ్యక్తం చేయాల్సి ఉంటుంది. అది కనక లేక పోతే ఎదుటి వారు నీరస పడి నిరుత్సాహ పడతారు. వారిలో ఉన్న సామర్ధ్యన్ని బయటకు తీసుకు రావాలంటే ధైర్యం గా మాట్లాడాలని నా అభిప్రాయం. ఆ కపీవరుని కి ధైర్యం చెప్తేనే గదండీ వెయ్యి యోజనాల సముద్రాన్ని ఓ అవలీలగా ఒక్క గెంతు లో దాటగలిగాడు. అలాగని, అనవసర పొగడ్తలు చేయకూడదేమో?
ఒక్కొక్క సారి, మనము మాట్లాడే కంటే కూడా, శ్రోతలు గానే ఉంటే నేర్చుకుంటామని అనిపిస్తుంది. మనకు ఏదోవిధంగా ఎందరో మహాను భావుల ని, వాగ్దేవీ పుత్రులు ని, కని వినే ఎరిగే అదృష్టం కలుగుతుంది. వారు దీక్ష తో అన్నీ గ్రహించి మనకు చాలా కఠినమైనవి, ఖటోరమైనవి కూడా, సులభంగా, శ్రవణానందంగా అర్దమయ్యేటట్లు వివరిస్తారు. వారి బోధన శైలి, మాటకారి తనం, పద ఉచ్ఛారణ, వాక్సుద్ది వీటన్నిటి నుండి ఎన్నో నేర్చుకోవచ్చు. అలాంటి సమయం లో మనం మాట్లాడితే అది ఒక అధిక ప్రసంగం అవుతుందేమో?
మాటకారీ తనం గురించి ప్రస్తావన వచ్చింది కదా, నన్ను ఈ మథ్య ప్రేరేపంచిన వ్యక్తి గురించి చెప్పాలనిపించింది. ప్రతి దేశానికి క్లిష్ట పరిస్థితి వచ్చినపుడు కాని, గడ్డుకాలంలో కానీ, ఒడుదుడుకు లు వచ్చినపుడు కానీ, మాట్లాడ గలుగే మాంత్రికులు కావాలి. ఈ మథ్య చదివిన వాళ్ళలోఇండియన్ డిప్లమ్యాట్ క్రృిష్ణ మెనన్ గారు ఓ మాటల మాంత్రికుడు. ఆయన ఇండియా కు విదేశంలో గళం ఇచ్చిన ఘనుడు. తెరపి లేకుండా ఇరవై గంటలు యు న్ (యునైటెడ్ నేషన్స్ ) లో ఇండియన్ ఫారెన్ పాలసీ గురించి చర్చించినవారు. య ట్యూబ్ లో ఆయన వీడియోలు ఉన్నాయి.
మా నానగారు అంటుడే వారు, వాళ్ళ తాత గారు, అంటే మా ముత్తాతగారు, వాళ్ళని గాయిత్రీ చేసుకోండర్రా అని మందలించే వాళ్ళుట. ఆయన ఆంగ్లము మాట్లాడం లో కూడా ప్రవీణులు. బ్రిటీష్ వారి వద్ద రెవిన్యూ ఆఫీసర్ గా చేసి రిటరై, మా తాతగారింటి పంచ లో నుండి పిల్లలకు తెలుగు, ఇంగ్లీషు చక్కగా ఎలా పలకాలి, మాట్లాడాలి అని చర్చించే వారుట. ఆరోజులలో మన పెద్ద వాళ్ళకు తెలిసినవన్నీ ఇలాగా పిల్లలకు హిత బోధ చేసేవారు. మనము ఈ రోజులలో పిల్లలతో కలిసి భోంచేస్తున్నప్పుడు, లేదా ఏదో సందర్బంలో మాట్లడటం గురించి చెప్తేనే బావుంటుంది. చైనా లో ఇప్పటికి కథలు చెప్పే సంస్కృతి కొనసాగుతుంది. య కె లో నాటక రంగాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్ళారు, బహుశ వీటన్నిటి ఒక ఉద్దేశం కూడా అదేనేమో? మన నాటకాలు, హరి కథలు, బుర్ర కథలు కూడా ఎంతో కొంత మాటకారి తనానికి దోహదపడతాయి.
సంస్కృతం, వేద మంత్రాలు పద ఉచ్ఛారణ కు వినియోగ పడతాయి. ఈ మధ్య పాశ్చాత్య దేశాలలో కూడా చిన్న పిల్లలకు పాఠశాల లో సంస్కృతం నేర్పుతున్నారు. ఇవన్నీ కూడా బాగా మాట్లాడానని పనికొచ్చే అస్త్రాలే. సర్ విలియం జోన్స్ ఎనలేని సేవ చేసారు సంస్కృత భాష కు, మన సంస్కృతి గురించి చదివి, వాటి గూర్చి మనకే చాటి చెప్పారు. భాష ను నేర్చుకున్న వ్యక్తి, కొన్ని సంస్కృత పుస్తకాలను ఇంగ్లీషు లోనికి అనువాదం చేసిన మేధావి. ఇది ఎందుకు చెప్తున్నానకుటున్నారా? మన పూర్వీకులు గ్రంథాలలో మనకు వీటి నన్నింటినీ ఆలోచించి అమర్చారు, మనము వీటిని పునరుద్ధరణ చేయటమే కావాలి. ఇక్కడ శ్రీ స్వామీ వివేకానందుడు గురించి తప్పక ప్రసావించాలీ, ఎందుకంటే స్వయానా సరస్వతీ వర కటాక్షులు, చికాగో లో ఆయన మాట్లాడి న శైలీ అందరినీ ఆకర్షించింది, ప్రతి ఒక్కడి హ్రృదయాలలో చిరకాలంగా నిలిచిపోయింది.
మీరు, ఇది చిదివీ, వీడు చెప్పినవన్నీ పాటిస్తాడా ఏంటీ అని అనుకోవచ్చు? ఇది అలవరుచు కోవటం చాలా కష్టమైన పని, కావున నా ఉద్దేశ్యం పాటిద్దామనే. అది నా తపన కూడా. ఇదేమి మోటివేషనల్ ఆర్టికల్ కాదు, అంత కంటే ఏవరి నో మార్చేయాలన్న ఉద్దేశం అస్సలు లేదు, ఏదో నాకు అనిపించిదీ, అగుపించిదీ, ఇన్నాళ్ళుగా హ్రుదయం లో మెలిసిందీ, పంచు కోవాలని నా ఓ కుతూహలం! అప్రస్తావన చేసానని అనుకోకుండా, తప్పులుంటే మన్నించి, నన్ను ఆశీర్వదిస్తారని ఓ అభిలాష! శ్రీ రస్తు శుభమస్తు.
చివరగా, ఎవరికైనా శ్రీ ఉషశ్రీ గారి వీడియో చూడాలని కోరిక గలిగితే ఈ లింక్ క్లిక్ చేయండి
https://www.youtube.com/shared?ci=c6Z8ATaN6LE
శుభం భూయాత్!