అదే మన ఊరిలో అయితే ఈ వేసవి లో వనభోజనాల కు వెళ్లి ఉండే వాళ్ళము, అని వాపోయాడు నా మిత్రుడు, అజయ్ , మెన్న ఫోన్ మాట్లాడినప్పుడు. ఈ మాత్రం దానికే అంత దిగులు పడాలా అని నేను సర్ది చెప్పి , సెలవులే కదా పిల్లలను తీసుకొని మా వూరికి రమ్మని ఓ సలహ ఇచ్చాను. సరే అని నా ఆహ్వానం అంగీకరించాడు.
కొన్ని నెలలు అయ్యింది వాడిని కలిసి. వాడిని చూడగానే ప్రాణం లేచి వచ్చింది. ఆఫీసు లో ఒత్తిడి వల్లనో లేక ఇంకొక కారణం చేతనో యేమో కొంచెం చిక్కాడు. అజయ్ నా ప్రాణ స్నేహితుడు, చిన్నప్పటినుండి కలిసి పెరిగాము ఓకే వీథిలో. వాడికీ నాకు ఆటల పిచ్చి, ఎండ వాన అని లేకుండా ఇద్దరమూ ఎంత సేపు ఆడమన్నా రోడ్లమీద ఆడేవాళ్ళము. ఒక్కొక్క సారీ మథ్యాన్నం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకుండా మా ఇంటిలోనే అమ్మ పెట్టింది తినేసే వాడు. మా అమ్మచేతి తిన్న వంట నేనెప్పుడు మరచిపోను రా అనేవాడు నాతో. అది చిన్నప్పటి సంగతి.
తర్వాత, ఇద్దరం కష్టపడి చదువు కున్నాం, డిగ్రీలు అవ్వగానే నేను ఉద్యోగం మెదలు పెట్టాను, అజయ్ మాత్రం ఇంకా పెద్ద చదువులు చదవాలని పట్టుదలతో నేను పనిచేసే ఊరిలో మాస్టర్స్ ఉందేమో చూడమన్నాడు. మా ఆఫీసు లో తెలిసిన వారి ద్వారా మంచి కాలేజీ లో పిజీలో సీట్ దొరికింది. రెండేళ్ళు పూర్తి అయ్యాయి, నాకు ఆఫీస్ ద్వారా ఇంగ్లాండ్ వచ్చే అవకాశం వచ్చింది. వాడిని విడిచి వెళ్ళాలంటే చాలా బాధ వేసింది. నేను ఇంగ్లాండ్ వచ్చేశాను, తరువాత సంవత్సరం లో వాడు మంచి మార్కుల తో పాస్ అయ్యి మంచి ఉద్యోగఅవకాశం సంపాదించాడు. కష్ఠే ఫలి అన్నారు, వాడికి వచ్చిన అవకాశానికి అందరికంటే నేను సంతోషంగా ఫీల్ అయ్యాను.
ఇప్పుడు మాకు ఒక బాబు, వాడికి ఓ పాప. ఓ ఐదు నెలల క్రితం బర్మింగ్ హామ్ లో డిప్యూటేషన్ మీద వచ్చాడు ఫ్యామిలి తో. ఎప్పుడు ఫోన్ మాట్లాడినా ఏదో ఇండియాను మిస్ అవుతున్నట్లు అక్కడి సంగతులన్నీ చెప్తుంటాడు. వాడు అక్కడ నేను లేకుండా దాదాపు పదిహేను ఏళ్ళు గడిపాడు, ఇండియా పండగలు, పబ్బాలు, వన భోజనాలు అంటే వాడికి ఇష్టం. సంక్రాంతి పండగ అంటే వాడికి మరీ ఇష్టం, ఎందుకంటే గాలి పటం ఎగరవేయటం కోసం. ఆరోజు మాత్రం మా ఆయన చిన్న పిల్లవాడైపోతాడు అంటుంది వాడి భార్య సంథ్య. చిన్నప్పుడు కూడా అంతే, వాడి సంగతి సంథ్య కంటే నాకే బాగా తెలుసు.
సంక్రాంతి పండుగ అనగానే ముందు మనకు భోగి మంటలు, హరిదాసులు, గొబ్బెమ్మలు, ముగ్గులు ఎన్నో కళ్ళముందు కదులుతాయి. వాటి అన్నింతో పాటు గాలి పటాల పందాలు కూడా గుర్తుకు వస్తాయి. చిన్నతనం లో నేను వాడు కలిసి డాబా మీద గాలి పటాలు తయారు చేసే వాళ్ళం. న్యూస్ పేపర్లు , చీపురు పుల్లలు, దారాలు, గాజు పెంకులు, అన్నం మెతుకులు, ఇవన్నీ మేడ పైకి ఎవరు చూడకుండా జాగ్రత్త గా జారవేసేవాళ్ళం. మా గాలిపటాన్ని ఎంతో శ్రద్ధ గా చేసే వాళ్ళం. ఆ వీథి లో గాలిపటాల పందాలలో మాదే పై చేయి గా ఉండేది , దానికి కారణం, అజయ్ దారం మీద రాసే సీక్రేట్ మిశ్రమం. అది సీక్రేట్ కాబట్టి ఎలా తయారు చేసేవాడో చెప్పదలుచుకోలేదు. అది దారానికి రాస్తే ఎదుటి వాళ్ళ గాలిపటం దెబ్బకి తెగిపోవాల్సిందే, అందు కే వాడి పతంగం ఎప్పుడూ ‘పందెం గెలిచే పతంగం’!
అజయ్ కు ఆటలతో పాటు, ఆంధ్ర భోజనం అంటే చెవి కోసుకుంటాడు. ఓరేయ్ , బర్మింగ్ హామ్ లో అచ్చటి ఆంధ్ర భోజనం ఎక్కడ దొరుకుతుంది అని చాలా సార్లు అడిగాడు. అది కూడా మా అమ్మ చేసేదిలా ఉండాలిట. ఏ శ్రీ రామ నవమి కో అయితే కళ్యాణం తో పాటు మంచి సరైన భోజనం తినే సదవకాశం ఉండేది బర్మింగ్ హామ్ లో అని సరదాగా అనేవాడిని.
ఏది ఏదైనా, అజయ్ నాతో ఉన్నాడు, వాడికెలగైనా ఓ సర్ప్రైజ్ ఇవ్వాలని నిశ్చఇంచుకున్నా. ఇండియాను మరిచి పోయేలా చేద్దామని ఓక అభిప్రాయానికి వచ్చాను. శనివారం మా ఊరు , లిన్స్ లేడ్ లో కెనాల్ ఫెస్టివల్ అయితే అందం కలిసి వెళ్ళాము. అక్కడ ఆరోజు అన్నీ చూసిన తరువాత వాడి కళ్ళలో ఓ మెరుపు కనిపించింది. ఇంకా ఇక్కడేం చూశావు, అని మనసులో అనుకొని ఇంటికి చేరాము. అక్కడంతా నడక కదూ అలసిపోయి నిద్ర పోయాడు. వాడి నాతో ఉన్నాడన్న సంతోషం తో నాకు చాలా సేపు నిద్ర పట్టలేదు. అటూ ఇటూ దొర్లు తంటే, నా భార్య, మ్రృదుల, ఇక చాల్లేండి ఆలోచించింది పడుకోండి రేపంతా మనం బిజీ అని కునుకు లోకి జారుకుంది. నేను ఇలాంటి సమయం లో కుంభకర్ణుడి ని ఆవహిస్తే కానీ నిద్ర రాదు అనుకొని, ఓ సారి దేవుడి ప్రార్థన చేసుకొని గాఢ నిద్ర పోయాను.
ఈరోజు, అజయ్ కు, జీవితాంతం గుర్తు ఉండేలా చేయాల్లన్న కోరిక తీరుతున్నందుకు నాలో ఏదో తెలియని సంతోషం. అది తల్లడిల్లుతోంది. మ్రృదుల, నేను వాళ్ళు లేచే లోగా అన్ని పనులు ముగించాము. వాళ్ళు కూడా లేవగానే, ఎక్కడి వెల్తున్నామో చెప్పకుండా, రెడి అవ్వమని చెప్పాను. కారెక్కాము.
సంథ్య, మృదుల ఏదో మాటల్లో పడ్డారు వెనుక సీట్లో. పిల్లలు కూడా మైమరిచి మాట్లాడుతున్నారు. నేను అజయ్ కు మేము ఉండే ఊరు విశేషాలు అన్నీ ఓక దాని తరువాత ఒకటి చెప్తూ పోతున్నాను, వాడు ఏమనుకుంటాడో అన్న విచక్షణ లేకుండా. చాలా రోజులయ్యింది కదా ఎంత మాట్లాడినా తనివి తీరదు. మా ఊరు పొలిమేరలు దాటి డన్స్టబుల్ అనే గ్రామం చేరబోతున్నాము. పచ్చని పచ్చిక బైర్లు, చక్కగా అమర్చిన ఇళ్ళు, ప్రతి ఇంటి ముందు గార్డెన్ లో రకరకాల మొక్కలు, పూల మొక్కలు చూసి అజయ్ మెహం వికసించింది. వాడిని చూసి నాకు తృప్తి కలిగింది.
ఇవన్నీ చూసి ఉండ బట్టలేక అజయ్ మనం ఎక్కడికి వెళ్తున్నామని ప్రశ్నించాడు. అంతలో, నేను తీసుకు వెళ్ళాలనుకున్నది రానే వచ్చింది. మెల్లగా కార్ పార్క్ లోకి వెళ్ళి నా మెంబర్షిప్ కార్డు చూపించి కారు ను పార్క్ చేశాము.
మేము చేరిన ప్రదేశం పేరు డన్స్టబుల్ డౌన్స్. అది చక్కటి ప్రదేశం. బాపు గీసిన బొమ్మ లాగ, కొండలు బారులు తీరి ఉంటాయి. దాని ప్రక్కన దిగువ ప్రదేశం. అందుకే దాన్ని డౌన్స్ అంటారు.అక్కడినుంచి కిందకు చూస్తే ఓ లోతైన ఖాళీ ప్రదేశం కనపడుతుంది, చాలా విశాలంగా ఉంటుంది. ఆ మైదానంలో గ్లైడింగ్ కూడా నేర్పస్తారు. గ్లైడింగ్ అంటే పక్షి లా ఎగరటమే. సన్నని తేలికగా ఉండే చిన్న సైజు పక్షి పోలి, రెక్కలు కలిగి ఉంటుంది, దానికి ఇంజన్ ఉండదు, దానిని చిన్న విమానం కి కట్టి పైదాకా తీసుకెళ్ళి వదులుతారు. అది పక్షి లాగా గాలిలో ఎగురుతూ ఉంటుంది. ఆ తరువాత దైవాదీనం అనుకుంటున్నారా? కాదండోయ్, మనముందు ఇన్స్టక్టర్ కూర్చుంటారు. ఆయన కూడా గైడ్ చేస్తూ ఉంటారు, మనం చేయవలసిందల్లా ఆ మేఘాల లోంచి ఇళ్ళని గూళ్ళల్లా, మనుషులు ని బిందువులు గా, వాహనాలను కదులుతన్న పురుగులలా, పొలాలు తివీచీ లాగా, పెద్ద చెరువులు చిన్న కొలను లాగ, కొండల ను గుట్టల్లా ఉన్న అద్బుత దృశ్యాన్ని తిలకిస్తూ, మేఘాల లో విహరిస్తూ, రోలర్ కోస్టర్ రైడ్ లా ఎంజాం చేయటమే కావల్సింది.
అజయ్ కి, నడుస్తూ, గ్లైడింగ్ గురించి అంతా వివరించాను, చాలా ఆసక్తి చూపించాడు. ఇంతలో, నేను వాడికి ఇవ్వాలనుకున్న సర్ప్రైస్ సమయం ఆసన్నమయ్యింది. దాదాపు గా పదిహేనేళ్ళనుంచి కలుస్తున్న ఆప్త మిత్రులు, వారి పిల్లకాయలు, వాళ్ళ టీనేజి కుర్రకారు, కొత్తగా పెళ్ళయిన జంటలు, వాళ్ళలో కొందరి పేరెంట్సు ఇండియా నుండి వచ్చినవారు, అందరూ కలిసి వనభోజనం, విందు భోజనానికి వచ్చినట్లు, గా కూర్చొని ఉన్నారు. మమ్మల్ని చూసి కొందరు ఎదురుకోల్పులు, కొందరు పలకరింపులు, కొందరు ఆలింగనాలు, మరికొందరు ఉక్కికి బిక్కిరి చేయటాలు క్షణకాలం లో అయిపోయాయి. అందరం ఓ గంట, రెండు గంటల దూరం లో ఉన్నా, ఏదో ఇలాంటి సందర్భం వస్తే కాని కలవటానికి కుదరదు. ఆఫీసు ల బిజిలు, పిల్లల స్కూళ్ళు, కాలేజులు, మహిళల యాక్టివిటీస్, అన్నీ కలిసిరావాలి కదండీ.
మహిళలు అన్నాను కదా, వారి ప్రయాసే ఇదంతా. డన్టబుల్ డైన్స్ లో ప్రతి సంవత్సరం వేసవి లో పతంగాల పండుగ జరుపుతారు. మా తెలుగు మహిళలు రెండు నెలలు కష్టపడి ఇదింతా ఆర్గనైస్ చేశారు. నేను, అజయ్ కు వేసవి లో వనభోజనాలు మిస్ అవుతున్నాడన్న నిరాశ లేకుండా, ఇక్కడ మేము పండగలు, పబ్బాలు, వన భోజనాలు అన్నీ చేసుకుంటామని ప్రత్యక్షంగా చూపించాను.
అందరూ, పతంగాలు ఎగర వేయటం మెదలు పెట్టారు. నేను, అజయ్ కు ఓ మంచిది నవ్వుతున్న చంద్రుడి ది కొనియిచ్చాను. వాడిలో, చిన్నతనం ఉట్టి పడుతోంది. ఎత్తు, మరెత్తుకు, ఇంకా ఎత్తుకు ఎగరేస్తున్నాడు. అక్కడ ఉన్న రంగ రంగుల, రక రకాల గాలి పటాలను చూసి సంభ్రమాశ్చర్యానికి లోనవుతున్నాడు. అవన్నీ చూసి నేను ఆస్వాదిస్తున్నాను. సంతోషం సగం బలం అన్నారు, వాడు నన్నటి వరకు చిక్కనట్లు కనిపించినా, ఈ రెండు రోజుల్లోనే మామూలు మనిషి అయ్యాడు అనిపించింది. కొందరు వనితలు మథ్యలో జ్యూసులు అందిస్తున్నారు, పుచ్చకాయ ముక్కలు పుల్లలకు గుచ్చి అందించారు. కొంత మంది ఆటల్లొ పడిన పిల్లలు అవి ఇస్తుంటే వద్దని తుర్రు న పడిగెట్టారు, మరికొందరు సున్నితంగ తిరస్కరిస్తున్నారు. ఓ పండగ వాతావరణం సంతరించుకుంది. ఈ లోపల ఓ చంటొడు వచ్చిఅమ్మా నేను రైడ్స్ ఎక్కుతా అని మారం చేసాడు. ఇంక మనం భోజనాలు చేయాలి ఇప్పుడు వెల్తే ఎలగా అని నచ్చచెబుతోంది.
భోజనాలు కోసం అందరూ తలా ఓ వంటకం చేసుకొని వచ్చారు తెలుగు మహిళలు. మృదుల వంతు తోటకూర పులుసు, ఊరు మిరపకాయలు. అందరూ కలిసి వడియాలు, అప్పడాలు, గోంగూర పచ్చడి, కంది పొడి, బచ్చలి పప్పు, సాంబారు, రసం, అరటి కాయ ముద్దకూర, బెండకాయ వేపుడు, వంకాయ కారం పెట్టి కూర తీసుకొచ్చారు. ఈ కూరలు, ఆకు కూరలు అన్నీ ఇక్కడ దొరుకుతన్నాయి మీరు ఆశ్చర్య పోవద్దు. మా తెలుగు మహిళలు చాలా పనిమంతులు, చిటిక లో అన్నీ ప్లేట్లు లో రెడి చేసి సర్వ్ చేయడం మొదలు పెట్టారు.
అజయ్ కు, నాకు కూడా సంథ్య తీసుకొచ్చి ఇచ్చింది. సంథ్య, అప్పడే అందరినీ కలుపుగోలుగా మాట్లాడం తో పాటు చనువుగా నేను వడ్డిస్తానన్న దాక వచ్చంది. మా తెలుగు మహిళల ని ఎంత పొగిడినా తక్కువే, కొత్త వాళ్ళను ఇట్టే ఆకర్షిస్తారు, తెలిసిన వారి తో ఎవరికి అలసట రాకుండా పని పంచుకుంటారు. వాళ్ళను చూస్తే ఉమ్మడి కుటుంబం లో కలిసి మెలిసి ఆడవాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. నా దిష్టే తలగిటట్టుంది. వీరి వంటలు తింటే ఎంతటి వారి కైనా ఆంధ్ర గుర్తుకు రావలసిందే.
అజయ్, వాడి ప్లేటు లో ఉన్నవన్నీ ఎంతో ఆత్రంగా తింటున్నాడు, వాడితో పాటు నేను కూడ ఓక్కొక్క దానిని రుచి చేస్తుంటే, తను నా చేయి తట్టాడు. ఎంటా అని చూస్తే, వాడి కళ్ళలో నీళ్ళు, మా అమ్మ జ్ఞాపకం వచ్చిందిట ఆ తోటకూర పులుసు తింటే. మృదుల చేసింది అని చెప్పాను, తనవైపు తిరిగి కళ్ళు అద్దుకుంటూ అభినందించాడు( ఓ నవ్వుసెంటిమెంట్ కు ) . వాడికి చాలా రోజుల నుంచి ఆంధ్ర భోజనం తిందామన్న కోరిక ఈరోజు తీరింది. వాడు వనభోజనం ఇండియా కాకుండా ఇక్కడ తిన్నందుకు కొంచెం పస్చాత్తప పడినట్లు ప్రస్పుటం గా వాడి మొహం లో కనిపించింది. అందరి మగవాళ్ళు, పిల్లలు తిన్నతరువాత, మహిళలు కూడా ఎదుటి వారు చేసిన వంటకాలను పొగుడ్తూ భుజించారు.
తింటే ఆయాసం, తినక పోతే నీరసం అని ఓ సామెత ఉంది. భుక్తాయాసంతో ఓక కునుకు తీస్తే హాయిగా ఉంటుందని పించింది. ఎవరో మాటల లో అననే అన్నారు. ఇంతలో ఒకరు మనం డైన్స్ లో నడవటానికి వెళితే బావుంటుంది అని సలహా ఇచ్చారు. భలేఉంది ఐడియా అని, అజయ్, నేను వెల్తానన్నాడు. నేను సరే అని ఎలాగూ మా అబ్బాయి , వేరె అయిన, వాళ్ళ అబ్బాయి కూడా క్రికెట్ ఆడదామన్నారు. ఆయన కి క్రికెట్ అంటే వీర అభిమానం. కోహ్లి గురించి, కుక్ గురించి మాట్లాడుకుంటూ పిల్లలో ఇండియాలో గల్లీ క్రికెట్ లాగ ఆడేశాము. మథ్యలే అందరు అటు వెళ్ళే వాళ్ళు , ఇటు వచ్చే వాళ్ళు, కొంత మంది పిల్లల ని నడిపించే వాళ్ళు, మరికొందరు పెంపుడు కుక్కలను నడిపిస్తున్నా , మా దారి మాదే క్రికెట్ లగ్నమయ్యి ఆడుకున్నాము. కొంత మంది మా కుర్రకారు పుట్ బాల్ ఆడుతున్నారు ప్రక్కన. మహిళలు రోప్ స్కిప్పింగ్ చేస్తున్నారు, ఓ ఆయన వీటన్నిటిని ఆస్వాదిస్తూ ఎదో రాసుకుంటున్నారు. ఆయన అనుభవాలు డైరీ లో రాస్తున్నారు కాబోలు.
కొంత సేపట్లో, కాలి నడక బృందం తిరిగొచ్చారు. కొందరు చతికిల పడ్డారు వచ్చీ రాగానే, ఓక ఆయన కాఫీ రెడినా అని అరిచాడు. మహిళలు ఎన్నో సంవత్సరాల సహవాసం కదండీ, అనీ అన గానే, చేతికి అందించారు. దాన్ని సేవిస్తూ, ఓ మిత్రుడు, కౌండిన్య, ఈ మథ్య ఎదో కవిత్వం రాస్తున్నావుట కదా, చదివి వినిపించు అన్నారు. నాకంటే మీరు చదివితేనే బావుంటుందని నేను రాసింది అంద చేసాను. అది చదువుతుంటే కొందరు తలలు ఊపటం, కొందరు వారెవ్వ అనటాలు.. మరీ నాకు నేనే ఇక్కడ పొగుడుతుంటే బావుండదు లేండి. చదవటం ముగించారు, ఇది కవిత్వమా అని సరదాగా ఓకరు, ఎందుకు నీలో మార్పు అని ఇంకొకరూ, కామెంట్ల మీద కామెంట్లు కొడుతూనే ఉన్నారు, నేను కొన్ని సార్లు సిగ్గుతో, కొన్ని సార్లు సిగ్గు లేకుండా సమదానలిస్తూనే వున్నాను. ఓ కొంటె వాడు, వెనక నుండి ఇంటర్ నెట్ లోంచి కాపీ కొట్టాడేమో అంకులు అరిచాడు. భళ్ళున నవ్వి, చిరు కోపం ప్రదర్శించాను. ఎందు కంటే రాయడం కూడా ఓ కళ, అందరీలోనూ ఓ కవి దాగి ఉంటాడని నా ఉద్ధేశం, దాన్ని తట్టి లేపటమే. ఏమో ఏ పుట్టలో ఏవుందో ఎవరికి తెలుసు. కొంత మంది వాళ్ళ మధురమైన కంఠ స్వరాల తో అలరించారు మంచి గీతాలు పాడి.
సరే ఈలొగా, అంతక్షరీ ఆడదామని ఎవరో సలహ ఇచ్చారు. కొత్తవి, పాతవీ లేకుండా ఏంతో సందడి గా ఆడారు ఆడ వాళ్ళు మొగ వాళ్ళు కలిసి. ఈ లోపల, పిల్లలు చిరుతిండ్లు ఏదో ఒకటి నోట్లో ఇటు వచ్చి వేసు కుంటూనే ఉన్నారు. అదీ ముగిసింది.
పతంగాల పండుగకు హైలెట్టు పతంగాల నాట్యం, ఛా ఊరుకోండి మాష్టారు అనుకుంటున్నారు కదూ? దాన్ని కళ్ళార చూడవలసిన ఘట్టం. రకరకాల పాటల తో పతంగాల తో నాట్యం చేయిస్తారు. కొన్ని సార్లు రెండితో అయితే, ఇంకొక సారి ఐదు పతంగాలు కలిపి. వాటిని కలిసి నాట్యం చేయించాలంటే చాలా ప్రాక్టీసు, కృషి చేయాలి. వారి కష్టమంతా ఆ నాట్యం లో కనిపించింది. అజయ్ కూడా చూసి నమ్మలేక పోయాడు.
కొంచెం సాయం సమయం అవుతోంది, కొందరి లో అలసట కనిపిస్తోంది, కొందరి లో నిరుత్సాహం కనిపిస్తోంది. కొందరు పిల్లలు ఇంటికి రామని మారం చేయడం, మరికొందరు మళ్ళీ కలవడం వాటి గూర్చి చర్చించారు. అందరికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైయింది. మా గురుతులు చిరకాలం మిగలాలని అందరం ఫొటోలు తీయుంచుకున్నాము. ఆడవాళ్ళు ఓ గ్రూపు గా, మగవాళ్ళు ఓ గ్రూపు గా, పిల్లలు ఓ గ్రూపు ఐతే, అందరం కలిసి ఓ సారీ, చివరిగా జంటల కలిసి కూడా ఒకటి. సోషల్ మీడయా లో పోస్ట్ చెయ్యమని కొందరు, నా ఫొటోలకు తప్పక లైక్ లు కొట్టమని జోకులు.
అందరం ఇంటి ముఖం పట్టాము, అజయ్, ఈ జ్ఞాపకాలు చిరకాలం గా మిగులు తాయని పదే పదే వ్యక్తం చేసాడు కారులో. వాడు పతంగాలు పందానికే కాకుండా వాటిని ఓ జాతర లా అందరిని ఓక చోటకి తీసుకొచ్చిన తంతు, వాటితో నాట్యము చేయించి ఇంకొక మెట్టు కు తీసుకెళ్ళిన విధానం ఎంతో ప్రేరేపించాయట. అదీ కాకుండా మన కల్చర్ తో పాటు ఇతరుల పద్దతులు, విధానాలు కూడా తెలుసుకుంటే ఎంతో నేర్చుకో వచ్చు అని అన్నాడు.
ముగించే ముందు, ఓ చిన్న సెంటిమెంట్ తో ముగిద్దామనిపించింది. మన బంధాలు ఓ రబ్బర్ బ్యాండ్ లాంటివి. గట్టిగా లాగితే తెగిపోతాయి, అలా అని సాగ దీయక పోతే వాడుకకు కష్టం అవుతుంది. సాగదియటం ఆపితే దగ్గరకు వచ్చేస్తాయి. అలాగే, మనం బంధాలను తెగకుండా, ఎక్కువ లాగకుండా జాగ్రత్తగా వాడుకుంటూ, దగ్గర అయ్యేలా ఉండాలని ఆశిస్తున్నాను. జీవితం లో కూడా రబ్బర్ బ్యాండ్ రకరకాలు గా మెలికలు తిరిగినా మళ్ళీ యథాస్థాయి వస్తుంది. కాబట్టి, జీవితం లో చిన్న చిన్నవి మార్పులు వచ్చినపుడు ఒకరికొకరు ఆదుకుంటూ స్నేహాన్ని చిరకాలం గా, అజయ్, కౌండిన్య లా నిలుపుకోవాలని ప్రార్థిస్తున్నాను.
ఎప్పటిలా ఓ చిన్న క్లాజు, ఇది ఒక ప్రయోగం, రాసి ఎవ్వరిని బాధ పెట్టే ఉద్దేశ్యం లేదు, సహృదయం తో స్వీకరించండి, నన్ను ఆశీర్వాదించండి!
నీ రచనావ్యాసంగం చాలాబాగుంది రమేష్. నాకు ఆనందంగా ఉంది. మంచి ప్రయత్నం – గిరిజ అక్క