ఏందో, పచ్చడంట, నూరాలంట ఈవ కి ఇప్పుడు, బో చెప్పుద్ది, కనికరం లేదు అని విసుకుంటొంది పనిమనిషి సుబ్బమ్మ.
మూడయ్యింది, ఓ ముద్దట్టచ్చుగా, బండడు అంట్లు తోవించుకుంది, నీర్సం వచ్చి సత్తన్నా, ఇప్పుడు ఏందో, పచ్చడంట, నా బొంద పచ్చడి.
కనీసం ఓ కప్పు కాఫీ అయినా పొయ్యదు, పొద్దుగూకులూ పనే. చేతులు అరిగినయ్, చూడు, ఎట్ట పొరలు పోత్తున్నయో తడిసి, వంకరలు పోతున్నయ్ అంటోంది చాకలి వెంకాయమ్మ తో. మనిషినా గొడ్డునా, మిరగాయ కారం కి చేతులు బోతా ఉండయి అంది.
అది సరేలే, ఆ సేతి లోది ఇటీయ్ అని బలవంతంగా లాక్కుంది రోకలిని వెంకాయమ్మ. ఓ నాలుగు మిరగాయలు వేసి దంచంటం మెదలు పెట్టింది. ఒకటి తుళ్ళి బయట కొస్తే , తీసి లోనకై అంది వెంకాయమ్మ. రోలు పక్కన చతికిలపడి కూర్చుంది సుబ్బమ్మ.
అది ఎక్కడ చచ్చిందో ఏందో, పొద్దుగాల బోయింది. అంటోంది సుబ్బమ్మ. ఇంతలో ఓ నాలుగు కాఫీ గిన్నలు నేల మీద గీసు కుంటు రోలు ను కొట్టుకుని ఆగిన శబ్థం. సుబ్బమ్మ ఇవి కడిగి పెట్టు తొందరగా కావలి అని ఆదేశించి మరీ వెళ్ళింది, వాళ్ళ అమ్మగారు సావిత్రి.
సుబ్బమ్మ కు చిర్రెత్తింది, వెంకాయమ్మ అది చూసి ముసి ముసి నవ్వులు. అట్ట కూకోబాగా, అమ్మగారు కోప్పడతరు అంది. సుబ్బమ్మ మూతి తిప్పి, మళ్ళీ కూతురు నాగమ్మ సంగతి చెప్పటం మొదలు బెట్టింది.
అరే, బడి కి బోవే అంటే, ఇంటదా. అయ్య తో హోటల్ కు బోద్ది. ఆడ ఏముంటది పాడు, తినేసిన ప్లేట్లు , ఎంగిలి ఇత్తరాకులు, అనేలోగా సావిత్రి అమ్మగారు , సుబ్బమ్మా, కాఫీ గిన్నలు తోమావా, అని గట్టి అరుపు. విసుగు గా ఇదిగో అమ్మగారు అని గబా గబా తోమిఇచ్చింది. సావిత్రి సరిగా తోమిందా లేదా అని చూసుకొంటూ గిన్నెల్ని తీసుకొని లోపలికెళ్ళింది
వెంకాయమ్మ చేతిలో రోకలి లాక్కుంది. దంచటం మెదలు పెట్టింది. చచ్చినోడు, నాగమ్మ ను లాక్కెల్తాడు పొద్దున్నే. వద్దయ్యా అంటే ఇంటాడా, నీ సిగతరక, మనకెందుకే సదువులు, సట్టుబండలు అంటాడు. విని చాస్తడా.
రోట్లో పండు మిరగాయ తొక్కు ఎర్రగా మెరుస్తోంది. దంచుతూనే ఉంది. వంగి చేత్తో కలిపింది, ఇంతలో ఓ మూడు బొట్టుల చమట రోట్లోకి జారాయి. ఏమి పట్టించుకోకుండా చేత్తో కలుపుతునే ఉంది, దంచుతోంది సుబ్బమ్మ. వెంకాయమ్మ బట్టల బాదుడు మొదలెట్టింది.ఇంతలో నాగమ్మ వచ్చింది.
ఎంత సేపే ఎళ్ళి, తాగుబోతోడు, ఆడి మాట అయితే ఇంటావు. మొహం సూడు ఎలాఉందో, ఆడ కూర్చో ఇంటికి యెల్దాము అంది.
ఈ లోపల సావిత్రి ఓ చేత్తో కాఫీ, తినటానికి ఓ నాలుగు బజ్జీలు ఇచ్చి, ఉండు గిన్న ఇస్తాను పచ్చడి తీయటానికి అని లోపలికెళ్ళింది. నాగమ్మ ఇటు రమ్మని సైగ చేసి, బజ్జీలు తీసుకోని తిను ఏడువు అంది. ఇంతలో సావిత్రి లోపల నుండి వచ్చిన చేతిలోంచి, గిన్నె అందుకొని ఎర్రటి కొరిమి కారం తీయడం మెదలు పెట్టింది. సావిత్రి ఇంకో గ్లాసు లో పాలు తీసుకొనచ్చి వెంకాయమ్మ కు ఇచ్చింది.
రోట్లో దంచిన చేత్తో తీస్తూ, అబ్బ సత్తున్నా, సేతి మంటతో, అంది. అది విని వెంకాయమ్మ, చెయ్యి చూసి ఇంటికాడ యెన్న రాసుకో తగ్గుద్ది అంది. ఎర్రటి పచ్చడి గిన్నె అమ్మగారికిచ్చింది. అది చూసి సావిత్రి నోట్లో లాలాజలం ఊరింది. తీసుకొని లోపటకెళ్ళింది.
సుబ్బమ్మ విమ్ సోపుతో చేతులు కడిగి, కాఫీ తాగటానికి కూర్చుంది. నాగమ్మ గులక రాళ్ళతో ఆడుతుంటే ప్రేమ గా చూసింది, అది గమన్నించి వెంకాయమ్మ నవ్వుకొంటొంది, వాళ్ళ తంతు తెలిసి.
ఈ లోపల, సావిత్రి, మిగిలిన సాంబారు, పచ్చడి, అన్నం తీసుకొచ్చి నీ గిన్నలో మార్చుకొని, అవి కడిగిచ్చి వెళ్ళు అంది. సుబ్బమ్మ కాఫీ తాగి, వంటలు తన సత్తు గిన్నెల్లోకి మార్చి, హడావుడి గా తోమడం మొదలు పెట్టింది, జాగ్రత్త, మా అమ్మ పుట్టింటి నుండి తెచ్చినవి, ఇప్పటిక్ సగం సొట్టలే, అని గట్టిగా అంటూ విసుక్కుంది సావిత్రి.
తోమినవి అందించింది, సావిత్రి ఆ విసుగులో జిడ్డు పోవు, సరిగా తోమవు, గిన్నెల సొట్టలు, అనుకుంటూ గొణుక్కుంటూ మాట్లాడు కుంటోంది. ఇంతలో, సుబ్బమ్మ, నేనెళ్ళొత్తా అమ్మగారు అంది. రేపు పెందరాళే రా శ్రావణ శుక్రవారం నోము, పేరంటం అని గుర్తు చేసింది. సరే, అమ్మగారు అంటూ నాగమ్మ తో బయల్దేరింది. వెంకాయమ్మ నేను ఊరికెల్తన్నా, రాను అమ్మ గారు అంది, ఈ మథ్య నాగాలు ఎక్కువ పెడు తున్నావు అంటూ, మళ్ళీ తిప్పుకొని, సరె ఎల్లుండి తొందరగా రా అంది. సరేనని బయలుదేరింది వెంకాయమ్మ.
సావిత్రి వంట మొదలు పెట్టింది, చారు లో ఇంగువేసి కరివేపాకు తిరగమోత, మెంతి మజ్జిగ చేసింది చలవకి. పండు మిరప కాయ పచ్చడిలో తిరగమోత వేసింది ఘమ ఘమ లాడే లాగా. సదాశివరావు, ఆఫీస్ అయి ఇంటికొచ్చాడు, ఆ తిరగమోత వాసనకు, కాఫీ గట్రా వద్దు, స్నానం చేసి భోజనం చేస్తానన్నాడు. అన్నీ ఎరేంజ్ చేసింది. భోజనం స్టార్ట్ చేసారు, మల్లె పువ్వు లాంటి అన్నం లో ఎర్రటి పండు మిరప కారం పచ్చడి వేసి , కరించిన నెయ్యి వేసి, కలుపుతున్నాడు, నోట్లో నీళ్ళు ఊరటం ఆగట్లా, కలిపి ఓ పేద్ద ముద్ద చేసి బార్లా తెరిచి నోట్లో పెట్టుకున్నాడు. ఆ టేస్టు , ఓక్క సారి నాలుక నుండి మెదడు కు, ఓ మెరుపు లాగా, వెళ్ళి “అబ్బా” అని అన్నాడు.
సుబ్బమ్మ, గుడిసలో, గాలి లేక చమట తుడుచు కుంటూ, ఈ చచ్చినోడు, మళ్ళీ ఏ సారకొట్టుకో పోయుంటాడు అంది. ఆ చిన్న లాంతరు ఇటు పెట్టి, ఆ చల్లటి కూడంతా ప్లేట్ లో బోర్లుంచి నాగమ్మ కు ఇచ్చింది. తను, పస్తు తో పడుకుంది. రంగయ్య అర్ద రాత్రి వచ్చాడు. నిద్ర పోతున్న సుబ్బమ్మ ను గట్టిగా కాలితో తన్ని, అన్నం ఉంచ లేదని నానా రభస చేస్తుంటే, నాగమ్మ, ఏడుస్తూ, కళ్ళు తుడుచుకొని, భయం తో నులక మంచం కిందకు దూరి చెవులు మూసుకొంది. రేపట్నుండి బడి కి వెళ్దామని మనసు లో నిర్ణయం తీసుకుంది!
శుభం భూయాత్!