‘లాంబీ లాంబీయే లాంబడి ఎకేరియా
లార లేరియే లాంబడి ఎకేరియా’
ఇదంతా అసలు ఏంటండీ అనుకుంటున్నారు, కదూ! మా ఇంట్లో, ఐదు పోర్షన్ లు కలిసి ఉంటాయి. కొన్ని సొంత వాళ్ళు ఉన్నవి, కొన్ని అద్దె కిచ్చినవి. మా పక్క ఇంటి లో దుర్గ, సాంబశివం ఉండేవారు. ఓ రోజు, ఇంటికి ఇద్దరు లాంబడీలు వచ్చారు. వాళ్ళు ఇలా పాట పాడుతూ లోపలికి వస్తూన్నారు.
‘ఘేవూలారయే తోన శారేతీ మంగాయీ
ఘేవూలారయేతోన టపారే మా గోకి’
దుర్గ, గబా గబా బయటకు పరిగెత్తుకు వచ్చింది. మీ లంబాడీ భాష భలే ఉంటుంది, కానీ ఒక్క ముక్క అర్థం కాదు అంది వాళ్ళతో. వాళ్ళు నవ్వి, పాడే పాట ఆపి, బావున్నారా అమ్మగొరు, అని అడిగారు, బాగున్నానని చెప్పింది, దుర్గ. అంతలో ఇద్దరి లో ఓ లంబాడి వనిత దుర్గ తో, అమ్మగొరు, నువ్వు అడిగనవ్ గా అవీ తీసుకొచ్చిన, అని అంది. అవునా, అంది ఆశ్చర్యం తో దుర్గ. తీసుకొచ్చినవి, ఒక్కొక్క టీ తీసి చూపించటం మొదలు పెట్టింది.
ఓ అందమైన కుట్టు పనులతో రకరకాల రంగులతో నేచి, అద్దాలు పొదగించిన పచ్చటి కాంచళి (రవిక) ను, వివిధ రంగుల తో ఉన్న కుచ్చుల పేటియ (లంగా) ని, అద్దాల రూపాయి బిళ్ళలతో తయారుచేసిన ఎర్రటి గుమ్ టో (ముసుగు) ను బయటకు తీసింది. దుర్గ కళ్ళు పెద్ద వయ్యాయి. అవే కాకుండా, ముక్కుకు మెరిసే లాంటి భూరియా, చెవికి ములును, మెడకి తెల్లటి హంస రంగు లో ఉన్న హంస్ గొలుసు, చేతులకు మేలిమి రంగులో ఉన్న బరియా గాజులు, తెల్లటి కడియాలు, చేతి వేళ్ళకు నగీషిలు, జిగేల్ ఉంగరాలు, అన్నీ, ఒక దాని తరువాత ఒకటి తీసి, దుర్గ చేతికి ఇచ్చింది. సంతోషం ఇంతా అంతా కాదు , ఎగ్గిరీ ఓ గెంతేసింది దుర్గ.
నీ పేరేమన్నావు అని అడిగింది, దుర్గ. నా పేరా అమ్మగారు, సీత్లభవాని, అని జవాబిచ్చింది. అంటే, అని అడిగింది, దుర్గ. గదీ మాకు రెండు పండగలు అమ్మగారు, సీత్లాభవాని (దాటుడు), తీజ్. మా అయ్యకు, సీత్లాభవాని అంటే ఇష్టం, గందుకు నాకాపేరెట్టిండు, అంది. తీజ్, బాగ చేసుకుంటాము అమ్మగొరు, అని అంది. తొమ్మిది రోజులు జరుగుద్ది మా తండా లో, అంతా కళ కళ గా ఉండుద్ది అంది. అయితే ఈ సారి మీ పండగ కి నేనొస్తాలే అంది దుర్గ. సరేనమ్మ, అంది ముసి ముసి నవ్వులతో, సీత్లభవాని. దుర్గకు వరండా లో కూర్చున్న అందరికి చూపించేసింది. వాటిని తీసుకొని హడావుడి గా లోపల పరుగెడుతూ, ఏమండీ, గుమస్తా బాబు ను ఆ ఫొటో స్టూడియోకు పంపండి, వేణు గారిని తొందరగా రమ్మని చెప్పండి, అంది.
సాంబశివం, బాబు ను పిలుస్తున్నాడు. ఇంత లో దుర్గ , సీత్లభవాని ని ఇంటి లోపలికి తీసుకెళ్ళింది. ఆవిడ తో వచ్చిన ఇంకొక లంబాడి ఆమె కూడా లోపలకు వెళ్ళింది. ఓ గంట తరువాత ముగ్గురు లంబాడీ వాళ్ళు ఇంటి లోంచి బయటకు వస్తుంటే, గుమస్తా బాబు వచ్చాడు, అర్థం కాక నోరు వెల్లబెట్టి చూస్తున్నాడు. ఎక్కడో చూసిన మొహం, కానీ వేషధారణ వేరేగా ఉంది. కనిపించేది, మనసు చెప్పేదానికి పొంతన కుదరట్లా అనుకుంటున్నాడు మనసులో. సాంబశివం కూడా వాళ్ళని చూసి, ఏ మాట్లాడాలో అర్ధం కావట్లా. ఆయన తో పాటు వరండాలో అందరూ ముచ్చట గా చూస్తున్నారు. తీరా చూస్తే, ఆ మూడో లంబాడీ ఆవిడ, స్వయాన, దుర్గే. సీత్లభవాని కి సొంత చెల్లెలు లాగా ఉంది. కొత్త వారు, ససేమీరా అక్కా చెళ్ళెళ్ళనుకోవటం ఖాయం.
అందరూ దుర్గ చుట్టూరు మూగి వేసుకున్న వన్నిటిని వింత గా చూస్తున్నారు. ఈ సందడి లో, తోసుకుంటూ వచ్చాడు, ఫోటోగ్రాఫర్ వేణు గారు. ఏదో పిలింపించారు ఫొటో తీయటానికి అనీ, కానీ ఈ హడావుడి చూసి ఆ గుంపు లో జరుగుతోందో అనీ తోసుకుంటూ వచ్చి, పద్మవ్యూహం లోకి వచ్చిన అభిమన్యుడు లా ఫోస్ పెట్టాడు. మాస్టారు, మీరు ఫోస్ పెట్టడానికి కాదు, పెట్టించడానికి అని అన్నాడు బాబు నవ్వుతో. మొహమాటంగా ఓ నవ్వు నవ్వారు, వేణు గారు. ఇంత లో దుర్గ, ఆయన ను గమనించి, ఆయన తో ఫొటోల సంగతి చర్చించటం మెదలు పెట్టారు.
వేణు గారు, మేడ పైన ఫ్లాష్ లైట్లు , కరెంట్ తీగలు లాగారు. ఓ బల్ల వేసి, లంబాడీ దుర్గను కూర్చున్న పోస్ లో ఓ ఫొటో తీసారు. ఆయనకు, ఇంకో ఐడియా వచ్చింది. పరదా కట్టించారు, ఏదో పూలవనం లాగా బ్యాక్ డ్రాప్, దుర్గను ఊహల్లో విహరిస్తున్న ఓ పోజ్. కొన్ని సింగిల్సు అందరికీ, మరికొన్ని కలిపి తీసారు. మొత్తానికి వేణు గారు ప్యాకప్ అన్నారు. అన్నీ సర్దుకొని, ఇంటికి బయలుదేరారు. దుర్గ ఆయనను తొందరగా కడించమని ప్రాథేయ పడింది. ఆయన కూడా కుతూహలం తో రేపే ఇస్తానని మరీ వెళ్ళి పోయారు.
చుట్టూరు మనుషులు ఉన్నారని చూసుకోకుండా, తన సంతోషం తట్టుకోలేక సాంబశివం, ఒక్క సారి లంబాడి దుర్గను ఎత్తు కున్నారు. అమ్మో, వెయిట్ పెరిగావ్ అన్నారు, నెత్తి మీద ఓ చిన్న మొట్టికాయ వేసి, చాల్లేండి డ్రెస్సు ఎంత బరువు అనుకుంటున్నారు, మొత్తం కలిపి ఓ పది పన్నెండు కిలోలుంటాయి అంది దుర్గ. రోజు ఎలా వేసుకుంటారో అని వాపోయారు ఇద్దరూ. ఇంత లో, నేనెళ్ళొత్తా అమ్మగారు అంది దుర్గ తో, సీత్లభవాని. సాంబశివం ను జేబు లో ఓ నాలుగొందలు తీసుకొని చేతిలో పెట్టింది. ఇంకో యాభై మళ్ళీ తీసుకొని దార్లో హోటల్ తిని మరీ వెళ్ళమంది సంతోషంతో. వాళ్ళు వెళ్ళి పోయారు.
వారమయ్యింది, వేణు గారు అత్త పత్తా లేరు. కబురంపితే గుమస్తా బాబు తో, ఏదో అర్జెంట్ పెళ్ళిట వెళ్ళాడని వాళ్ళ మిసెస్ చప్పరు అన్నాడు. ఏం పెళ్ళో, ఇదిగో ఇస్తానన్నాడు, మాయమయ్యాడు, అని విసుక్కొంటేంది దుర్గ. ఓ రెండు రోజులాగి తీరిగ్గా వచ్చారు వేణు గారు. వచ్చీ రాగానే, మీ ఫొటోలు అదిరాయని ఐస్ చేశారు. ఇంక ఏముంది, తిట్టాలను కున్నవన్నీ మర్చిపోయి, సాంబశివం, దుర్గ చూడండం మొదలు పెట్టారు. ఓక దానిని మించినవి మరొకటి. దుర్గ సంతోషం గా ఫీల్ అయ్యింది, అన్నింటి కంటే దుర్గ సింగిల్, సీత్లభవాని తో తీయుంచు కున్నవీ మళ్ళీ మళ్ళీ చూడాలనుకు నే లాంటి చిత్రాలు. వేణు గారు, మనసు లో అమ్మయ్య అనుకొని, సెలవు ఇప్పిచ్చమన్నారు. సాంబశివం, ఆయన ని ప్రక్కకు తీసుకెళ్ళి పరిహారం ఇచ్చి ధన్యవాదాలు తెలిపి మరీ సాగనంపారు, వేణు గారిని.
దుర్గకు, సీత్లభవాని కలవాలని ఉబలాటం. తరువాత రోజు, స్కూటర్ మీద, నాగార్జున సాగర్ దగ్గర తండాకి వెళ్ళ టానికి ప్లాన్ చేశారు. పొద్దున్నే లేచి, స్నానాలు చేసి, సీత్లభవాని తెచ్చినవన్నీ మళ్ళీ వెనక్కు తిరిగి ఇవ్వటానికి, పనిలో పని ఫొటోలు చూపించటానికి బయలు దేరారు. దారి లో హోటల్ లో ఆగి ఇడ్లీ వడ సాంబారు తిని, దారిలోకి కొన్ని తినే లా కట్టించు కొని, కాఫీ కొట్టి మరీ బయలు దేరారు. నాగార్జున సాగర్ వరకు స్పీడ్ గా నడుపుకుంటూ వచ్చారు సాంబశివం, అక్కడ నుండి దారిలో వాళ్ళను అడుగుతూ వంకర టింకర్ల రోడ్ల తో జాగ్రత్త గా నడుపుతున్నాడు. దుర్గ పడకుండా సాంబశివం ని పట్టుకొని కూర్చుంది వెనక. ఏవో ఒక ఇరవై గుడిసెలు కనపడుతున్నాయి, అందరినీ అడిగీ, సీత్లభవాని ఇల్లు ఇక్కడే నని ఋజువు చేసుకున్నారు. స్కూటర్ స్టాండ్ వేసి, గడి కొట్టారు ఇంటి కి. ఓ ఖాదీ దోతి, అంగి వేసుకొని, తలకు ఇరవైనాలుగు మూరల పెద్ద పెద్ద రుమాలు కట్టి, భుజం మీద కండువా ధరించి, ఎడమ చేతిలో చేతి కర్ర పెట్టు కొని, చెవులకు బంగారు పోగులు, చేతికి వెండి కడియాలు ధరించి, ఒకాయన బయటకు వచ్చారు. మీరెవరయ్యా, అని అడిగాడు. ఫలానా సీత్లభవాని అని చెప్తుంటే, నేను ఆమె భర్త అని పరిచయం చేసుకున్నాడు. లోపల కు రమ్మని ఆహ్వానించాడు.
సీత్లభవాని, వీళ్ళను చూడ గానే గుమ్ టో తలకు సవరించుకొని, కూర్చోమని ఆహ్వానించింది. మట్టి గ్లాసు లతో మంచి నీళ్ళు తీసుకొచ్చింది. త్రాగి, సీత్లభవాని కు తనకోసం తీసుకొచ్చిన వన్నీ ఇచ్చింది, ధన్యవాదాలు తెలిపింది. ఈ లోగా బియ్యం తో చేసిన పాయసం (కడావో) తీసుకొచ్చింది. త్రృప్తిగా తిన్నారు. తనకు, తీసిన సింగిల్ ఫోటో నజరానా తీసి ఇచ్చింది, దుర్గ. చాలా ఖుషీ గా ఉందమ్మా అని పదే పద్ వ్యక్తం చేసింది సీత్లభవాని. కొంచెం సేపు, తండా లో జరిగే తీజ్ పండుగ తొమ్మిది రోజుల సంబురాలు… కఠోర నియమాలు.. డప్పుల మోతలు… తండంతా కేరింతలు… పెళ్లికాని ఆడబిడ్డల ఆటాపాటలు.. అన్నాచెళ్ళెల్ల… అక్కాతమ్ముళ్ల అనుబంధాలు… బావమరదళ్ల అల్లరిచేష్టలు… ఆ పై భక్తి భావం… వీటన్నింటి మేళవింపే తీజ్ పండుగ గురించి ముచ్చటలు చెప్పుకున్నారు.
మళ్ళీ మరీ ఎండ పడకుండా బయలు దేరతామని, సెలవు తీసుకొని, సీత్లభవాని, వాళ్ళ ఆయన ని, అటు వచ్చినపుడు కలవకుండా వెళ్ళద్దని చెప్పి , చేతిలో వద్దంటున్నా కొంత డబ్బు ఇచ్చి తిరుగు ప్రయాణం పట్టారు దంపతులు, సాంబశివం మరియు దుర్గ.
శుభం భూయాత్!
మొన్న ఎందుకో, నాగార్జున సాగర్ మీద కవితా ప్రయోగం చేస్తున్నప్పుడు ఓ సారి లంబాడీల సంగతి గుర్తుకొచ్చింది. దీని గురించి రాయాలనిపించింది. వస్త్ర ధారణ అలంకరణ లో లంబాడీ స్త్రీల వేషధారణ ఆకర్షణీయంగా, అందం గా ఉంటుంది. కొందరు ఆ మోజు తో లంబాడీ వేషధారణ లో ఫొటోలు తీయించుకోవటం ఓ సరద. అదీ కాక, వికీపీడియా ద్వారా తెలిసిందేంటంటే, ఆగస్టు నెల రెండవ వారం నుంచి ఆగస్టు నెల చివరి వరకు వివిధ జిల్లాలోని లంబాడీలు బంజారాల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే సీత్లాభవాని (దాటుడు), తీజ్ పండుగలను ఒక్కొక్క రోజున జరుపుకుంటారు. అందు వల్ల, సీత్లాభవాని, దీనిలో ఓ పాత్రకు నామకరణం చేయటం జరిగింది.
లంబాడి భాష రాజస్థానీ లాంటిది, ఓ ప్రత్యేకమైన భాష. లంబాడీల ఆచారం, సంస్కృతి సంప్రదాయాలు చక్కగా ఉంటాయి. అంతా కలిసి గిరిజనుల తండాళ్ళలో నివసిస్తుంటారు. ఇలాగా, దాదాపు ఓ 3000 తండాలు ఉండవచ్చనట తెలంగాణ రాష్ట్రం లో. వికీపీడియా లో చదివితే వాళ్ళ గురించి కొంత అవగాహన వస్తుంది.