పాత్రధారులు
సుబ్బమ్మ – పని మనిషి
వెంకాయమ్మ – చాకలి
సావిత్రి – యజమానురాలు
నాగమ్మ – సుబ్బమ్మ కూతురు
సదాశివరావు – యజమాని
సుబ్బయ్య – సుబ్బమ్మ మొగుడు
(ఈ కింద సన్నివేశాలకు పెరడు లో అంట్లు తోమే చోటు, బట్టి ఉతికే చోటు, ఓ రోకలి తో ఉన్న రోలు ఎరెంజ్ చేయాలి)
మొదటి సన్నివేశం: సుబ్బమ్మ, వెంకాయమ్మ
సుబ్బమ్మ: ఏందో, పచ్చడంట, నూరాలంట ఈవ కి ఇప్పుడు, బో చెప్పుద్ది, కనికరం లేదు.
సుబ్బమ్మ: బండడు అంట్లు తోవించుకుంది, నీర్సం వచ్చి సత్తన్నా, ఓ ముద్దట్టచ్చుగా?
సుబ్బమ్మ: పొద్దుగూకులూ పనే. (విసుగుతో) చేతులు అరిగినయ్, చూడు, ఎట్ట పొరలు పోత్తున్నయో తడిసి, వంకరలు పోతున్నయ్. కనీసం ఓ కప్పు కాఫీ అయినా పొయ్యదు.(కోపం తో)
వెంకాయమ్మ: ఆ సేతి లోది (రోకలి) ఇటీయ్.
(వెంకాయమ్మ, రోట్లో మిరగాయలు వేసి దంచంటం మెదలు పెట్టింది. ఒకటి తుళ్ళి బయట కొస్తే )
వెంకాయమ్మ: తీసి లోనకై (చిరు నవ్వు తో)
(సుబ్బమ్మ, అది వేసి రోలు పక్కన చతికిలపడి కూర్చొని వెంకాయమ్మ తో మాట్లాడడం మొదలు పెట్టాలి)
రెండవ సన్నివేశం: సుబ్బమ్మ, వెంకాయమ్మ, సావిత్రి
సుబ్బమ్మ: అది ఎక్కడ చచ్చిందో ఏందో, పొద్దుగాల బోయింది
సావిత్రి: సుబ్బమ్మ ఇవి కడిగి పెట్టు తొందరగా కావలి
(సుబ్బమ్మ కు చిర్రెత్తినట్లు నటించాలి)
(వెంకాయమ్మ అది చూసి ముసి ముసి నవ్వు నవ్వాలి)
వెంకాయమ్మ: అట్ట కూకోబాగా, అమ్మగారు కోప్పడతరు అంది.
(సుబ్బమ్మ మూతి తిప్పి, మళ్ళీ కూతురు నాగమ్మ సంగతి చెప్పటం మొదలు బెట్టాలి.)
సుబ్బమ్మ: అరే, బడి కి బోవే అంటే, ఇంటదా. అయ్య తో హోటల్ కు బోద్ది.
సుబ్బమ్మ: ఆడ ఏముంటది పాడు, తినేసిన ప్లేట్లు , ఎంగిలి ఇత్తరాకులు (వెటకారం తో)
సావిత్రి: సుబ్బమ్మా, కాఫీ గిన్నలు తోమావా (అని గట్టి అరుపుతో)
సుబ్బమ్మ: ఇదిగో అమ్మగారు (అని గబా గబా తోమి తీసుకెళ్ళి నట్లు. )
(సావిత్రి బయటకు వచ్చి అవి తీసుకొని, సరిగా తోమిందా లేదా అని చూసుకొంటూ గిన్నెల్ని తీసుకొని లోపలికెళ్ళీలి)
మూడవ సన్నివేశం: సుబ్బమ్మ, వెంకాయమ్మ
(వెంకాయమ్మ చేతిలో రోకలి లాక్కొని సుబ్బమ్మ దంచటం మెదలు పెట్టాలి, దంచుతూ వెంకాయమ్మ వైపు చూస్తూ)
సుబ్బమ్మ: చచ్చినోడు, నాగమ్మ ను లాక్కెల్తాడు పొద్దున్నే.
సుబ్బమ్మ: వద్దయ్యా అంటే ఇంటాడా, నీ సిగతరక, మనకెందుకే సదువులు, సట్టుబండలు అంటాడు. విని సత్తాడా? (కోపంతో)
(వెంకాయమ్మ ముసి ముసి నవ్వులు నవ్వాలి)
(సుబ్బమ్మ రోట్లో దంచుతూనట్లే నటిస్తూ ఉండాలి)
(వంగి చేత్తో కలిపాలి, చేతి నుదుట మీద చమట తుడుచు కున్నట్లు, ఓ నాలుగు చమట చుక్కలు ఆ రోట్లో పడినట్లు నటించాలి )
(వెంకాయమ్మ తన పని చేసుకున్నట్లు గా బట్టలు రాయి మీద బాదుతున్నట్లు గా చేయాలి)
(ఇంతలో నాగమ్మ ప్రవేసిస్తుంది, చిన్న గా నడుస్తూ)
(సుబ్బమ్మ చూసి భయం తో వెంకాయమ్మ చాటు కు వెడుతుంది)
నాలుగ వ సన్నివేశం: సుబ్బమ్మ, వెంకాయమ్మ, నాగమ్మ, సావిత్రి
సుబ్బమ్మ: ఎంత సేపే ఎళ్ళి, తాగుబోతోడు, ఆడి మాట అయితే ఇంటావు.(కోపం తో నాగమ్మ ను చూస్తూ)
సుబ్బమ్మ: మొహం సూడు ఎలాఉందో, ఆడ కూర్చో ఇంటికి యెల్దాము ( కోపం తగ్గించుకొని తల్లి పిల్లని తిట్టి తిట్టనట్లుగా నటించాలి)
(సావిత్రి ప్రవేసిస్తుంది ఓ చేత్తో కాఫీ, తినటానికి ప్లేట్ లో ఓ నాలుగు బజ్జీలు తో)
సావిత్రి: ఉండు గిన్న ఇస్తాను పచ్చడి తీయటానికి
(అంటూ తెచ్చినవి అంద జేసి సావిత్రి లోపలికెళ్ళీలి)
(నాగమ్మ ను ఇటు రమ్మని సుబ్బమ్మ సైగ చేయాలి)
సుబ్బమ్మ: ఇదిగో బజ్జీలు తిను ఆడ కూకొని
(నాగమ్మ తింటూ ఉంటే చూసి సుబ్బమ్మ ఇలా అనాలి)
సుబ్బమ్మ: బడి కెళ్ళా లమ్మా, నా బుజ్జి గదూ, నా మాట ఇను.
(ఇంతలో సావిత్రి లోపల నుండి వచ్చి గిన్నె అందివ్వాలి)
(సుబ్బమ్మ గిన్నె అందుకొని ఎర్రటి కొరిమి కారం రోట్లో నుండి తీస్తున్నట్ల నటించాలి)
(సావిత్రి మళ్ళీ ప్రవేసించి , ఇంకో గ్లాసు లో పాలు తీసుకొనచ్చి వెంకాయమ్మ కు ఇవ్వాలి)
ఐదవ సన్నివేశం: సుబ్బమ్మ, వెంకాయమ్మ
(సుబ్బమ్మ రోట్లో దంచిన చేత్తో తీస్తూ, )
సుబ్బమ్మ: అబ్బ సత్తున్నా, సేతి మంటత
వెంకాయమ్మ: (సుబ్బమ్మ చెయ్యి చూస్తూ ) ఇంటికాడ యెన్న రాసుకో తగ్గుద్ది (అనాలి)
(సుబ్బమ్మ ఎర్రటి పచ్చడి గిన్నె తీసుకెళ్ళి సావిత్రి అమ్మగారికి అందించాలి)
సావిత్రి: బాగా నూరావు సుబ్బమ్మ
(అంటూ లోపలికి పచ్చడిని తీసుకెడుతుంది సావిత్రి)
(సుబ్బమ్మ సోపుతో చేతులు కడిగి, కాఫీ తాగటానికి కూర్చోన్నట్లు నటించాలి )
సుబ్బమ్మ: నేనెళ్ళొత్తా అమ్మగారు
సావిత్రి: రేపు పెందరాళే రా శ్రావణ శుక్రవారం నోము, పేరంటం అని గుర్తు చేసింది
సుబ్బమ్మ: సరే, అమ్మగారు
(అంటూ నాగమ్మ తో బయల్దేరాలి సుబ్బమ్మ.)
వెంకాయమ్మ: నేను ఊరికెల్తన్నా, రేపు రాలేను అమ్మ గారు (అనాలి)
సావిత్రి: ఈ మధ్య నాగాలు ఎక్కువ పెడు తున్నావు, సరె ఎల్లుండి తొందరగా రా అంది.
(సరేనని బయలుదేరింది వెంకాయమ్మ.)
ఆరవ సన్నివేశం : సావిత్రి, సదాశివరావు
(ఆఫీస్ అయి ఇంటికొచ్చాడు, ఆ తిరగమోత వాసనకు ఆకలితో అలమటిస్తున్న వాడిలా నటించాలి)
సదాశివరావు: ఏమిటోయ్, ఘమ ఘమలు, లేని ఆకలి తెప్పించేస్తున్నాయి?
సావిత్రి: తినేటప్పుడు చూద్దురు గా (ఓ చిరు నవ్వు)
సావిత్రి: ఉండండి కాఫీ తీసుకొస్తా
సదాశివరావు: వద్దు లేవోయ్, నేను పెందరాళే భోజనం చేసేస్తే ఓ పని అయిపోతుంది. ( ఆకలి తొందర ఉన్న వాడిలా నటించాలి)
సావిత్రి: అయితే త్వరగా స్నానం చేసి రండి
(సావిత్రి అన్నీ ఎరేంజ్ చేస్తున్నట్లు నటించాలి)
(ఇద్దరూ భోజనం స్టార్ట్ చేస్తారు)
సదాశివరావు: అబ్బ, అదిరిందోయ్ నీ పండు మిర్టి పచ్చడి.
సదాశివరావు: ఏది ఏదైనా సరే ఈ పచ్చడి చేయటం లో నీ తరువాతే నోయ్. ( పళ్ళు ఇకిలుస్తూ నవ్వాలి)
( అది వింటూ సావిత్రి తనొక ఫైవ్ స్టార్ హోటల్ ఛెఫ్ లా ఫీలవుతున్నట్లు నటించాలి)
ఇంత లో తెర దింపాలి, ఓ గుడిసె లో నులకమంచం సెట్టింగ్ మార్చాలి.
ఏడవ సన్నివేశం: సుబ్బమ్మ, నాగమ్మ, సుబ్బయ్య
(సుబ్బమ్మ, గుడిసలో, గాలి లేక చమట తుడుచు కుంటూ)
సుబ్బమ్మ: ఈ చచ్చినోడు, మళ్ళీ ఏ సారకొట్టుకో పోయుంటాడు.
(ఆ చిన్న లాంతరు ఇటు పెట్టి, ఆ చల్లటి కూడంతా ప్లేట్ లో బోర్లుంచి నాగమ్మ కు ఇచ్చింది)
నాగమ్మ: మరీ అయ్యకు ?
సుబ్బమ్మ: ఆడికెందుకు, తిండి? సారా తోనే కడుపు నింపుకుంటడు. నువ్వు తిను.
నాగమ్మ: నువ్వు తినేసి నవా ?
సుబ్బమ్మ: నా మొహానికి తిండే తక్కువ, ఈ దిమ్మడి బతుక్కి (విసుక్కుంటూ)
నాగమ్మ: (తింటూ సుబ్బమ్మ తో) అసలు, బడి లో ఏలగుంటదే అమ్మి.
సుబ్బమ్మ: నేను ఎక్కడ ఎళ్ళి చచ్చినా? అందుకే ఇలా ఏడ్చినా.
సుబ్బమ్మ: బడి లో మాస్టర్లు సదువులు సెబుతారు. సదువు కుంటే ఆపీస్ ల కు ఎల్లచ్చు.
నాగమ్మ: ఆడ బడిలో నాకు ఎవ్వరూ తెల్దు, నే నెల్లను ( మారం చేస్తూ)
సుబ్బమ్మ: అన్నీ మీ అయ్య పోలిక లే, ఏమి ఎక్కద్దీ నీకు
సుబ్బమ్మ: ఇంగ తిని తొంగో
(సుబ్బమ్మ నేల మీద పడుకుంది)
(నాగమ్మ నులక మంచం మీద పడుకుంది)
(నిద్ర పోతున్న సుబ్బమ్మ ను గట్టిగా కాలితో తన్ని లేపుతాడు సుబ్బయ్య)
సుబ్బయ్య: లే, కూడెట్టూ
సుబ్బమ్మ: రోజూ కూడెక్కడుండి వస్తది, నువ్వు తాగి తందనాలాడ్తే
సుబ్బయ్య: నీ తల్లీ, రోజూ నువ్ మెక్కి నాకాడకి వచ్చే సరికే లేదంట వా? ( సుబ్బమ్మ పట్టుకొని లాగుతూ)
సుబ్బమ్మ: పొద్దుగాల హోటల్లో మెక్కినవ్ గా నీకది చాల్లే
( సుబ్బమ్మ ను కోపం తో పట్టుకొని లాగుతూ కింద పడేస్తాడు)
(నానా రభస చేస్తుంటే, నాగమ్మ, ఏడుస్తూ, కళ్ళు తుడుచుకొని, భయం తో నులక మంచం కిందకు దూరి చెవులు మూసుకొంటుంది)
నాగమ్మ: (గట్టి గా అరుస్తూ) నే బడి కెల్తా, నే బడి కెల్తా
ఇంతలో సుబ్బయ్య ఢాం అని తూలుతూ కింద పడి , పడిన చోట నిద్ర పోతాడు
సమాప్తం