చంటోడు: అమ్మా… అమ్మా… మరే … మరే … బయట బూచోడొచ్చాడమ్మ.
తల్లి కీర్తన: బూచోడు లేదు, ఏమీ లేదురా కన్నయ్య, అసలూ బూచోళ్ళుండ రమ్మా, అంది ముద్దు చేస్తూ
చంటోడు: నిజం అమ్మా, నీ మీద ఒట్టు , నేను చూశాను, నిజంగా
కీర్తన:(నవ్వి) ఎవరినో చూసి బూచోడు అనుకున్నవేమో రా నాన్న
చంటోడు: కాదు, నేను నిజంగా చూశా
కీర్తన: నీకు బూచోడుంటారని అసలు ఎవరు చెప్పారమ్మ? గారాబం చేస్తూ అంది.
చంటోడు:నువ్వేగా మొన్న సరిగ్గా అన్నం తినక పోతే బూచోడు వస్తారన్నావు, మళ్ళీనేమో వచ్చి ఎత్తుకు పోతారన్నావు
కీర్తన: అదా! అయినా నువ్వు అన్నం పెట్టిందంతా తినేసావు గా.
చంటోడు: చివరలో ఓక ముద్ద వదిలేసాగా, అందుకే వచ్చాంటాడు
కీర్తన: ఓక్క ముద్దేగా, మిగతాదంతా నా బుజ్జి బాబు లా తినేసావు (బుగ్గ పిండుతూ)
చంటోడు: మరీ, మొన్న నేను బయట ఆడుకుంటా నంటే బూచోడొచ్చేస్తాడన్నావుగా
కీర్తన:ఆ రోజు ఎండ ఎక్కువ కదా ఉండి అలా అన్నాను పండు
చంటోడు: బూచోళ్ళకు కాళ్ళు కాలవా మరి?
కీర్తన: (నవ్వుతూ) అందుకే అసలు బూచోళ్ళు రారు
చంటోడు: మరి.. మరి…ఆ రోజు నే కిడికీ లోంచి చూసాను, అని నసుగు తున్నాడు
కీర్తన: (నవ్వుతూ) సరే ఈ సారి వస్తే నాకు చూపించు, ఇపుడు “చిన్నారి పెళ్ళి కూతురు” సీరియల్ మొదలవుతుంది సరేనా అంది.
చంటోడు: దాంట్లో బూచోడుంటాడా?
(ప్రోగ్రామ్ మొదలయ్యింది నాటకీయ పరిణామములైన శబ్థాలు రావడం మొదలు అయ్యాయి)
(కీర్తన, చంటోడి మాటలు పట్టించు కోకుండా, ముందు భాగంలో ఎమైందే చూపిస్తుంటే లీనమయ్యింది. అది తను చూడలేదు, రోజూ చూడటం అలవాటు.)
చంటోడు: అమ్మో చాలామంది బూచోళ్ళన్నారే, అని మళ్ళీ అడగటం మొదలు పెట్టాడు. దింట్లో కూడా బూచోడుళ్ళుంటారా?
కీర్తన:నన్ను చూడనీయమ్మ ఈ ప్రోగ్రామ్ , అంది కొంచెం విసుగుతో
చంటోడు: మరి నేను ఏంచేయను నువ్వు ఇది చూస్తుంటే, మొన్న అన్నవు గా పిల్లలు ఇది చూడ కూడదు, దీంట్లో బూచోళ్ళుంటారని.
కీర్తన: అవును, అందుకే అటు వెళ్ళి, ఆడుకో నువ్వు అంది.
(చంటోడు వెళ్ళకుండా అటు ప్రోగ్రామ్ వైపు వచ్చే సౌండ్, సన్నివేశం చూస్తూ )
చంటోడు: చాలా మంది బూచోళ్ళు ఉన్నారు, నేను చూడను, భయమేస్తోంది, అని అన్నాడు తల్లి కీర్తన ను
కీర్తన: అబ్బ ఉండమ్మా, నువ్వు మాట్లాడుతుంటే ఒక్క ముక్క అర్థం కావట్లా సీరియల్ లో, అంది
(వాడి ధోరణి లో కుశల ప్రశ్నలు వేస్తున్నాడు)
చంటోడు: ఆ పాప ఎవరూ?
కీర్తన: ఒరేయ్ ఉండు. పాప లేదు గీప లేదు, ఆ పెళ్ళి వాళ్ళు ఏమంటారో ఏమో, అంటోంది ఆ సన్ని వేశాన్ని చూస్తూ
చంటోడు: ఈ బూచోడు ఇందాకటాయినేనా?
కీర్తన: (విసుగు గా, చిరు కోపం ప్రదర్శిస్తూ) నువ్వు కొంచెం నోరు మూస్తావా? ఈ వెధవ ఎడ్వటైజ్మెంట్ ల గోలొకటి, మధ్యలో వీడి వాగుడు వల్ల అసలు ఇప్పటి వరకూ ఏమైందో అర్థం కానే కావట్లా
(హర్లిక్స్ ఎడ్వటైజ్మెంట్ వస్తుంటే చూసి చంటోడు)
చంటోడు: నాకు, ఆ హర్లిక్స్ కొంటావా అమ్మా?
(ప్రోగ్రామ్ లో ఇంకా దూరి పోయి)
కీర్తన: చూద్దాం లే, ఇదిగో, ఇంకొంత సేపట్లో ఈ వారం స్టోరీ మొదలవుతుంది, మధ్యలో ఇంక వాగావా, గట్టిగా ఓక్కటేస్తా, అంది చేయి చూపిస్తూ
(ఇంతలో ఇస్త్రీ చాకలతను బట్టలు తీసుకెళ్ళడానికి వచ్చాడు)
ఇస్త్రీ చాకలతను: అమ్మగారు, బట్టలు, ఇస్తారా?
కీర్తన: నువ్వూ ఇప్పుడే రావాలా, ఉండు ఇస్తాను అక్కడ కూర్చో.
(స్టార్ట్ అవుతోంది సీరియల్)
చంటోడు: అమ్మా, ఆకలేస్తోంది ఏదైనా తినటానికి ఇస్తావా? అని అడిగాడు.
(సీరియల్ మొదలవ్వగానే అడిగేసరికి వెటకారంగా )
కీర్తన: నన్ను తినరా, ఇందాకేనా తినింది నువ్వు సరిగ్గా అరగంట కాలేదు, అప్పుడే ఆకలిట, అంది.
ఇస్త్రీ చాకలతను: అమ్మా, ఇస్త్రీ కి బట్టలిస్తే, నే వెడ్తా
(సీరియల్ మధ్య లో లోపలికి వెళ్ళడం ఇష్టం లేక, ఆ ఇస్త్రీ చాకలితో సీరియల్ గురించి అడగటం మొదలు పెట్టింది, అలా అయినా ఆగు తాడులే అని)
కీర్తన: నువ్వు ఈ సీరియల్ చూస్తావా? భలే ఉంటుంది, అసలు ఆ పెళ్ళికూతురు, అదిగో ఆ పిల్లే, చాలా బావుంది కదూ, అంటోంది
చంటోడు: అమ్మా, దాహంగా ఉంది, మంచి నీళ్ళు కావాలి, ఇస్తావా? అని అడిగాడు
కీర్తన: బయట ఎంత చల్లగా ఉందో చూడు, దాహమేంటి నీ మొహం
(ఇస్త్రీ చాకలి వైపు తిరిగి తనను వెయిట్ చేయిస్తున్నందుకు, తనకు మస్కా కొడుతూ )
కీర్తన: దీంట్లో ఒకాయన అచ్చం నీ లాగే ఉంటాడు అంది
ఇస్త్రీ చాకలతను: నేనుచూడనమ్మగారు, పనుంటది, బట్టలిస్తే నే పోత, అన్నాడు (సిగ్గు పడుతూ)
కీర్తన: ఇదిగో అయిపోయింది, ఇంకో రెండు నిమిషాలలో బ్రేకు ఇస్తారు ఎలాగూ, అంది
(ఇస్త్రీ చాకలతను దిక్కులు చూస్తున్నాడు, గడియారం వైపు చూసాడు, నాలుగు కావస్తోంది, తొందరగా తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాడు)
కీర్తన: చూడు ఆ పెళ్ళిమంటపం, ఎంత బావుందో, పెళ్ళంటే అలా చేయాలి, అంది
చంటోడు: అమ్మా నాకు బోరు కొడుతోంది, నేను ఏమి చేయను, అని అడిగాడు
కీర్తన: ఐప్యాడ్ ఆడుకుంటావ? అని అడిగింది
(ఐప్యాడ్ ఇస్తే మాట్లాడకుండా ఉంటాడని అలా అంది)
చంటోడు: ఎక్కడుంది?
(కీర్తన మళ్ళీ సీన్ మిస్ అవుతుందని లోపలికి పరిగెత్తింది, అది ఎక్కడ పెట్టిందో ఈ హడావుడిలో గుర్తుకు రావట్లా, కొంచెం సేపు ఆ సీరియల్ గురించి ఆలోచించడం ఆపేస్తే గుర్తొచ్చింది, తీసుకొని గబ గబా వచ్చి చంటోడు చేతిలో పెట్టి, మళ్ళీ చూడటం మొదలు పెట్టింది)
చంటోడు: పాస్వాడ్ టైప్ చేస్తావా? అన్నాడు
( ఆ సీరియల్ చూస్తూ అన్ లాక్ చేసి ఇచ్చింది)
(కీర్తన కు కొంత మిస్ అయ్యింది కదా, ఆ ఇస్త్రీ చాకలతని వైపు తిరిగి, ఏమైంది, కట్నం డబ్బులిచ్చాడా మొత్తానికి, అని అడిగింది)
ఇస్త్రీ చాకలతను: (బుర్ర గోక్కుంటూ) నే చూడ లేదమ్మగారు అన్నాడు, బట్టలివ్వ మని మళ్ళీ అడిగాడు
(ఆయన అన్న బట్టల సంగతి విననే లేదు )
కీర్తన: ఇచ్చేఉంటాడు లే, లేకపోతే ఆ పెళ్ళిని జరగనిస్తుందా, ఆ రాక్షసురాలు? ఏప్పుడూ డబ్బుల గోలే, అంది
(ఇస్త్రీ చాకలతని కి ఒక్క ముక్క అర్థం కావట్లా)
ఇస్త్రీ చాకలతను: అమ్మగారు, బొగ్గులన్నీ కాలిపోతాయ్, ఇంకా చాలా పనుంది బట్టలిస్తే నే వెళ్ళాలి అన్నాడు.
కీర్తన: ఇదిగో అలా నువ్వన్నావు ఇలా బ్రేక్ ఇచ్చారు, ఉండు బట్టలు తీసుకొస్తా, అంది
చంటోడు: అమ్మా, ఆకలేస్తోంది పాలు తెస్తావా వచ్చేటప్పుడు అన్నాడు, అమ్మ అటు వెళ్ళడం చూసి
(కీర్తన ఇంకా ఆ సీరియల్ లో కట్నం గురించి ఆలోచిస్తోంది, ఏదో తనలో తను అనుకుంటోంది, లోపలికి ఎందుక వచ్చిందో మరిచి పోయింది, లాస్ట్లో చంటోడు అరిచాడు గా అది గుర్తోచ్చి స్టవ్ వెలిగించింది, పాల ప్యాకెట్ కట్ చేసి వేడి పెట్టి, పంచదార కలిపే సరికి మళ్ళీ సీరియల్ సౌండ్ మొదలయ్యింది, పాలు చంటోడి కిచ్చింది, ఆ ఐప్యాడ్ లాక్కుంది)
కీర్తన: ఐప్యాడ్ మీద పోస్తావ్, అంది.
ఇస్త్రీ చాకలతను: (విసుగు తో) అమ్మగారు, బట్టలిస్తానని లోపల కెళ్ళారు, మీరు తీసుకురాల, కొంచెం త్వరగా తీసుకురామ్మ గారు , అన్నాడు
కీర్తన:ఇదిగో ఈ చంటోండు, అరగంట క్రితమే తిన్నాడు, నన్ను ఏడుపించి అటు ఇటు తిప్పించి పెట్టించుకున్నాడు, అది తినేటపుడు సరిగా తినడు, వెంటనే ఆకలి అన్నాడు, ఆ గోలలో నీ సంగతి మరిచా, అంది ఇస్త్రీ చాకలయనతో.
(మళ్ళీ సీరియల్ చూడటం మొదలయ్యింది)
(చంటోడు, పాలు తాగుతూ గ్లాసు సరిగా పట్టుకోక మొత్తం ఒలక పోసాడు కొన్ని వాడి మీద కొంత సోఫా మీద)
కీర్తన: వెధవామ్, అని తిట్లు తిడుతూ, ఇస్త్రీ చాకలతను తో, బయట ఆరేసిన గుడ్డ తెమ్మని పంపింది. గ్లాసు తీసి పక్కన పెట్టి చంటోడి షర్ట్, నిక్కర్ తీస్తోంది ఆ ప్రోగ్రామ్ చూస్తూ.
ఇస్త్రీ చాకలతను: ఇదిగోండమ్మగారు, అని చేతికందించి, అమ్మగారు మల్లీ పొద్దుబోతది నేను రేపు వచ్చి బట్టలు తీసుకెడతానని, మళ్ళీ వస్తానని బయలు దేరబోయాడు
కీర్తన: అమ్మో, అలాగ కాదు మళ్ళీ అయ్యాగారు నన్ను కోప్పడతారు. ఎల్లుండి బయటకు వెళ్ళాలిట, ఇదిగో ఈ సోఫా మీద పడింది ఓక్క సారి తుడుస్తావా? నేను ఇంతలో వెళ్ళి బట్టలు తీసుకొస్తా అంటూ లోపలి వెళ్ళడం మొదలు పెట్టింది
(ఇస్త్రీ చాకలతను ఆ గుడ్డ తీసుకొని, ఆ చంటోడు సోఫామీద ఎగురుతుంటే వాడిని కిందకు దింపి, సోఫాను తుడవడం మొదలు పెట్టాడు)
(కీర్తన కు మళ్ళీ నాటకీయమైన సౌండ్ వస్తే సీరియల్ లో లోపలికి వెడుతున్నదల్లా ఆగి సీరియల్ చూడటం మొదలు పెట్టింది, ఓ రెండు నిమిషాలు నిలబడి చూసింది, ఇంతలో ఇస్త్రీ చాకలతను ఆ సోఫా తుడిచిన గుడ్డ అందించాడు, సీరియల్ బ్రేక్ వచ్చింది. ఇస్త్రీ చాకలితో బట్టలు తీసుకొస్తానన్నట్లు సైగలు చేస్తూ లోపలికి వెళ్ళింది)
కీర్తన ఇంకా సీరియల్ లోనే మునిగి ఉంది, మళ్ళీ లోపలికి ఎందుకొచ్చిందో అనుకొని, ఆ బట్టలు అని గుర్తుకొచ్చి, చంటోడి కి ఓ బనియన్ అందాకా కప్బోర్డు లోనుంచి తీసి బయటకొచ్చింది, ఇంకా మనసంతా ఆ సీరియల్ మీదే, ఎడ్వటైజ్మెంట్ వైపు చూస్తూ చంటోడికి బట్టలు వేసింది కీర్తన.
మళ్ళీ సీరియల్ మొదలవబోతొంది చంటోడికి ఈసారి ఓ వార్నుంగు ఇచ్చింది.కదలకుండా సోఫాలో కూర్చోమని చెప్పింది. ఇస్త్రీ చాకలతని వైపు చూసింది, ఆయన అక్కడ లేడు, మాయం అయ్యాడు.
కంగారు లో ఇటు సీరియలా చూడాలా, లేక వెళ్ళి పోయిన ఇస్త్రీ చాకలి ని మళ్ళీ పిలవాల అని అనుకుంటోంది. మదిలో, వాళ్ళయన మెదిలారు, అమ్మో ఆ బట్టలు పని అవ్వ లేదో ఈ రోజు నా పని ఔటే అనుకుంటోంది, కీర్తన బయటకు పరిగెత్తింది, తాళాలు కూడా తీసుకోలేదు ఆ హడావుడిలో, తలుపు దగ్గరకు లాగింది చంటోడు లోపడే ఉన్నాడు కదా అని. చాకలాయన బయలు దరి ఓ కొన్ని నిమిషాలయ్యిందిగా కొంచెం దూరం వళ్ళి ఉంటాడు అని పరిగెడుతోంది నైటీ లో, సొసైటీ లో వాళ్ళు పలకరిస్తున్నరు అంతా మామూలేనా అని అన్నట్లూ, మొహమాటం గా సమాధానం చెప్పి కంగారు గా ఆ ఇస్త్రీ షాపు చేరింది.
ఆయాస పడుతూ ఇస్త్రీ చాకలి వాళ్ళ ఆవిడతో ఏడి మీ ఆయన అని సైగలు చేసింది. “బట్టలు తేవడానికి ఇందాకనగా పోయి ఇంకా రాలేదు”, అంది. అటూ సీరియల్ మిస్ అయిన విసుగు, ఇటు చంటోడు ఒక్కడే ఇంటి లో ఉన్నడన్న కంగారు, అదీ కాకుండా చెప్పా పెట్టకుండా ఇస్త్రీ చాకలాయన వెళ్ళాడన్న కోపం తో , ఓపిక ఉన్న లేక పోయినా, ఆవిడ మీద కోపంతో అరిచింది. ఆ ఇస్త్రీ చాకలతని వాళ్ళ ఆవిడ కొంచెం గట్టిదే, “ఇంతదూరం వచ్చారు గా ఆ బట్ట లేదో తెస్తే సరిపోయేది కదమ్మగారు”, అంది.
కీర్తన అవునుకదూ అనుకుంది, మళ్ళీ ఇంత దూరం వస్తాడని అనుకోలేదని తనకు తాను సమాధాన పరుచుకుంటోంది. సరేలే, మీ ఆయన రాగానే వెంటనే పంపించు అంది.
ఆ చంటోడు గుర్తుకొచ్చి మళ్ళీ ఇంటికి పరిగెత్తడం మొదలెట్టింది. ఆలోచిస్తోంది, పొరపాటున చంటోడు బయటకు గనక వచ్చి ఇంటి తలుపు వేసేసాడో, ఇంకో తాళం లేదు, ఇంతే సంగతి, వాళ్ళయన తో చివాట్లు ఖాయం ఈ రోజు అని అనుకుంటోంది, కీర్తన.
ఇంతలో, దారిలో ఆ పక్కింటి ఆవిడ బజారు నుండి వస్తూ సీరియల్ సంగతి అడిగింది కీర్తన ని, చంటోడి సంగతి మరిచి పోయి, ఆ చూసిన కొన్ని సన్నివేశాలు చెప్పింది. ఆవిడ నిరుత్సాహం తో ఇంతేనా జరిగింది అని నిట్టూర్చింది. తను మధ్యలో చూడటం కుదరలేదని చెబుతూ ఉంటే ఆవిడకు, చంటోడు గురుతుకు వచ్చాడు. వాడిని ఇంటిలో ఉంచిన సంగతి చెప్పి సెలవిప్పించ మని మళ్ళీ కంగారుగా ఇంటికి బయలు దేరింది కీర్తన.
ఆయాస పడుతూ ఇల్లు చేరింది, ఇంటి తలుపు వేసే ఉంది. అమ్మయ్యా, అనుకొంది ఆ కిడికీ దగ్గరకు వెళ్ళ “చంటి, చంటీ తలుపు తీయమ్మా”, అని పిలుస్తోంది కీర్తన. ఎంతకీ పలకడు చంటోడు. ఆందోళన పెరిగి ఇంకా గట్టిగా అరవడం మొదలు పెట్టింది. ఎక్కడినుండో వాడు నవ్వితున్న శబ్థాలు వినిపిస్తున్నాయి, ఇక ఇకలు పక పకలు, వెనక నుండి వచ్చి అమ్మని పట్టుకొని, అమ్మా, అని అరిచాడు. కీర్తన కి గుండె సడన్ గారి జారి నట్లు అయ్యంది. వాడు ఇంటిలో ఉండకుండా బయటకు వచ్చినందుకు చెంప చెళ్ళు మనిపించింది. ఎందుకు కొట్టిందో అర్థం కాక వాడికి, గట్టి గా ఏడ్వటం మొదలు బెట్టాడు. కీర్తన తను నించున్న చోటే కుప్ప కూలింది. వెనుక పాడుతా తీయగా ప్రోగ్రామ్ రిపీట్ మొదలయ్యిన సౌండ్ల వినిపిస్తున్నాయి, ఈవిడే కేమో వాళ్ళ ఆయన సంగతి గుర్తుకొచ్చి దిగులు పట్టుకుంది, గుబులు మొదలయ్యంది. ఇంత లో కూరలమ్మే ఆయన కూరలు కొనమని వస్తే కసిరి పంపింది. ఆ అమ్మే ఆయన కీర్తన అవతారం చూసి మూడ్ బాలేదేమో నని రేపొస్తానని చెప్పి వెడిపోయాడు.
ఇంతలో వాళ్ళయన రానే వచ్చాడు, కీర్తన ఇంకా నైటీ లో ఉండటం తో తిట్ల దండకం మొదలు పెట్టాడు. లోపలికి వెడదాం పదా అన్నాడు. కీర్తన జరిగిందంతా వివరించింది, ఉన్న ఒక్క తాళం లోపల ఉందడపోయిందని చెప్పింది. ఆయన కోపం వచ్చి చేతిలో ఉన్న ఆ ఆఫీసు సూట్ కేసు కీర్తన కు ఇచ్చి, ఓక్కటే తాళం ఉండటం తో తనను తాను తిట్టుకుంటూ ఆ తాళాలు తీసేవాడిని వెతకడం కోసం బజారుకు బయలు దేరాడు.
ఆయన అటు వెళ్ళిన తరువాత ఇస్త్రీ చాకలాయన వచ్చాడు, తొందరగా బట్టలు ఇస్తే రేపు సాయంత్రం కల్లా ఇవ్వగలనన్నాడు. కీర్తన తాళం సంగతి చెప్పింది ఆ ఇస్త్రీ చాకలాయనకు, షాపుకు అయ్యగారి తో బట్టలు పంపిస్తా నని చెప్పి తనను వెళ్ళమంది. రెండు గంటలయ్యింది ఆయన రావట్లేదు, వాన మొదలయ్యంది. మళ్ళీ పక్కింటికి వెళ్ళాలంటే నామోషి అని ఇద్దరూ అక్కడే ఉన్నారు. ఆయన ఇంకా రాలేదు, ఎదురు చూస్తోంది. విసుగులో ఓ కునుకు పట్టింది,
చంటోడు తట్టి లేపాడు. “అమ్మా, బూచోడు, బూచోడు”, లే అని లేపాడు. కంగారు గా లేచింది. నిద్ర మత్తులో ఎవరో బూచోడు లాగే ఉన్నాడు, బురద ఒళ్ళంతా పడి, గుమ్మం వైపే నడుస్తున్నాడు, లేచి నిలబడింది, దగ్గర లో చేతికి ఏదైనా అందితే బావుండుని అనుకుంటోంది, చంటోడిని ఎత్తుకుంది, ఎందుకైనా మంచిది ఓక వేళ పరిగెత్తచ్చు అని అనుకొంటోంది కీర్తన. తీరా అతను ఓ మూడడుగు ముందుకు దాకా వచ్చిన తరువాత చూస్తే, అదీ వాళ్ళయనే. ఆ వర్షానికి చూసుకోలేదుట, గోతిలో పడ్డాడుట, చాలా చిరాగ్గా ఉన్నారు.
ఇంతలో కీర్తన చంటోడి తో, “నే చెప్పలా బూచోళ్ళుండరమ్మ”, అంది. వర్షానికి ఆ షాపు వాడు కాస్తా మూసుకొని పోయాడు, అన్నాడు. పక్కింటికి వెళ్ళాడు, కాలింగ్ బెల్ కొట్టాడు. వాళ్ళు తలుపు తీసారు. గొంతు సవరించుకొని చెప్పాడు పక్కింటాయనని అని. వాళ్ళకి అన్ని సంగతులు వివరించారు. లోపలకు ఆహ్వానించారు ముగ్గురిని.
ఇందాక, కీర్తన, ఇస్త్రీ కొట్టు నుండీ వస్తూ చంటిగాడు ఇంటి బయటకు రాకుండా గనక ఉంటే తను సీరియల్స్ ఓ నెల చూడనని మొక్కుకుందిట, ఆ మొక్కు పాటించక్కర్లేదు కాబట్టి సంతోషం లో లోపలకు వెడుతోంది. ఎంటర్ అవుతూనే సీరియల్ ప్రస్తావన తీసుకొచ్చింది, అది విని కీర్తన వాళ్ళాయన చెవిలో బుర్ర రామ ‘కీర్తన’ పాడించాలా? అన్నాడు సరదాగా.
శుభం భూయాత్!