ఓ పల్లెటూరు, చక్కటి పెంకుటిల్లు;
వరండాలో మడత కుర్చీలు, ఆ పక్కన విసినకర్రలు, ఇంటి ముందు అరుగులు, వాకిట్లో పేడ కల్లాబులు మీద సుద్ద ముగ్గులు.
ఇంటిలో కెడితే మధ్యలో ఖాళీ ప్రదేశం, చుట్టూరూ స్థంభాలు, ఆ ప్రదేశం మధ్య నుండి పైకి చూస్తే ఆకాశం, దాని చుట్టూరు గదులు, వీటికి దిట్టమైన టేకు తలుపులు, వాటికి గడీలు, గొళ్ళాలు, గుమ్మాలకు పసుపుపచ్చ అలంకారాలు, గోడలకు తాతముత్తాల ఫొటోలు, నిగనిగ మెరిసే పాలరాయి లాంటి జింక కొమ్ములు.
పడక గదిలో ఎత్తైన మంచాలు, దిట్టమైన టేకు అలమరలు, ఇనప కడ్డీల కిటికీలు, బయటకు చూస్తే పూలతోటలు, మరో పడగ గదిలో పైపుల మడత మంచాలు, దిట్టం బొంతలు, దిండు గలీబులు.
వంటగదిలో ఇత్తడి, రాగి సామన్లు ,గ్యాస్ సిలిండర్ స్టవ్ లు, పక్కన పెట్రోమాక్స్ లైట్లు,బియ్యపు బస్తాలు, లేత లేత కూరలు,కంది పప్పు, రకరకాల గింజలు,పచ్చడిజాడీలు, శనగ గానుగ నూనె వాసనలు,సున్నుండల డబ్బాలు, కాఫీ ఫిల్టర్లు,టీ వడరోసిన గుడ్డలు, ఇడ్లీ వేసి తీసిన పాత్రలు, పదును కత్తి పీటలు, బోర్లించిన తపాలాలు.
తోటలో తులసమ్మ కొలువు, పక్కన మంచినీళ్ళ బావి, కనకాంబరం, కాడమల్లె, పారిజాతం, ముద్ద మందారం పూలమొక్కలు, పండ్ల చెట్ట్లు, చేతికందే అరటి, బొప్పాయి చెట్లు, ఎత్తుగా కొబ్బరి, పనస చెట్ట్లు, లేత మునగ చెట్లు, తీపి జామలు, వగరు చిన్న ఉసిరి చెట్టు, గుబురు వేప చెట్టు., అటు వైపు గోవు మాలక్ష్మిలు, ముద్దుగా పాలుగ్రోలే లేగదూడలు, వాటికి పెట్టే గడ్డి మూటలు, తవుడు బాల్టీలు.
అంట్లు తోమే స్థలం, బట్టలు ఉతికే బండ రాయి, వేడినీళ్ళ రాగి బాయిలర్, స్నానానికి ఇనప బక్కెట్లు, రేకు షెడ్ బాత్రూమ్, దాంట్లో అటకమీద సామన్లు గోడమీద బల్లులు, నూనె, నలుగు పిండి, కుంకుడు రసాలు, విసినకర్ర సాంబ్రాణీలు, సువాసనల అగరొత్తులు.
దేముడు గదిలో సీతారాములు, అమ్మవార్లుఇత్తడి కుందుళ్ళు, వెండి దేముడి సామన్లు, మెరిసే బంగారు పూలు, చెక్క పీటలు, రాసే గంధపు చెక్క, ఎర్రటి ముద్ధ మందార పువ్వులు, పారిజాతం మంచి మరువాలు, ఇటుక రంగు కనకాంబరాలు, తెల్లటి కాడ మల్లెలు, ఎండిన ఖర్జూరాలు, చీమలు పట్టిన బెల్లాలు, పంచామృతాలు, ఉద్ధరణి పాత్రలు, మెరిసే విగ్రహాలు, దీవించే దేముళ్ళు!