“దొర అన్నాయం జరిగి పోయింది”, గట్టి గట్టి గా ఏడుస్తున్నాడు యీరయ్య
“ఏమయ్యింది”, “ఏమిటి ఆ చేతుల నిండా రక్తం?”, త్వరగా చెప్పు సింగయ్య గారు
“అన్నాయం జరిగి పోయింది దొర”, అన్నాయం జరిగి పోయింది”…. అన్నాడు యీరయ్య
“ఏమయ్యింది, తొందరగా చెప్పి తగలడు”, “కంగారు గా ఉంది”, “ఏమయ్యింది, అసలేమయ్యింది?” అని అడిగాడు సింగయ్య గారు.
“ఆ చేతిలో కొడవలేంటి, నీ ఆ అవతారమేంటి”, “చూస్తుంటే ఏదో పాడు పని చేసిన వాడిలా కనిపిస్తున్నావు”, “కొంపదీసి ఏమైనా చేసావా, ఏంటి?”,” అన్నాడు సింగయ్య గారు.
“చేయరాని పని చేస్తే ఊర్లో నా పరిస్తితి ఏంటి?, ఓక్క సారైనా ఆలోచించావా”, కోపంగా అంటున్నాడు సింగయ్య గారు.
“ముందు ఆ ఏడుపు ఆపు”, “ఆ కొడవలి పక్కన పెట్టు భయమేస్తోంది” విసుక్కున్నాడు సింగయ్య గారు.
“దుర్మార్గులయ్యా….. ” అన్నాడు బాధతో యీరయ్య
“ఏవరూ రా, తొందరగా చెప్పి ఏడువు”, కంగారు పడుతున్నాడు, కాళ్ళు ఒణుకుతున్నాయి, చమటలు పట్టడం మొదలయ్యాయి సింగయ్య గారికి.
“పోలీస్ ను పిలిపించడయ్య దొర”, అని ఏడ్చాడు యీరయ్య.
“పోలీసా, అసలు ఏమయ్యింది? నీతో పాటు నన్ను కూడా లోపలేస్తారు, నా పరువు పోతుంది, అసలే దాని పెళ్ళి కూడా కుదిరింది”. వణుకుతూ అన్నాడు సింగయ్య గారు.
“నేను ఒక్కడిని, వాళ్ళు నలుగురు వచ్చారయ్యా….” అన్నాడు కులిమిలి పోయి ఏడుస్తూ యీరయ్య
“ఏవరు రా వాళ్ళు?”, “నలుగురు రావటం ఏంటి, అర్థం పర్దం లేకండా మాట్లాడుతున్నావు”. అన్నాడు సింగయ్య గారు.
“చితక బాదా రయ్యా….”, గట్టి గట్టి గా ఏడుపు కొడవలి ఇసిరేసాడు యీరయ్య.
“ఏం జరిగింది?”, “నువ్వు అసలు ఎక్కడ నుంచి వస్తున్నావు?”, “నీతో గొడవెందుకు పడ్డారురా?”, “చెప్పి తగలడు ఎవరు వాళ్ళు?”, అని గొంతు లేపుతున్నాడు సింగయ్య గారు.
“ఒళ్ళంతా పిప్పి పిప్పి చేసారు.. ” అన్నాడు కన్నీటి ధారతో యీరయ్య
“ఇదిగో ఈ నీళ్ళు తాగు ముందు”, అని చేతికందిచాడు సింగయ్య గారు.
“గుటక్ … గుటక్ .. గుటక్ ..”, అని తాగాడు యీరయ్య.
“దొరా పొలం పనికి చేనులో కెల్లానయ్యా”, అన్నాడు యీరయ్య
“ముందు ఆ దొర అనటం మానేయి”, “చిరాగ్గా ఉంది, ఎన్నడూ పిలవంది అలా పిలిస్తే అసలు బాలేదు”, “ఆ వెళ్ళి”, అని అడిగాడు కొంచెం కంగారుగా సింగయ్య గారు.
“నా మాన నే చేను కోస్తుంటే….”, అంటూ భళ్ళున ఏడ్చాడు యీరయ్య.
“ఇదిగో, అటు పక్కకి వెడదాం రా”, “ఎవరైనా చూస్తే మన కొంప మునుగుతుంది”, అంటూ ఇంటి పక్క సందులోని తీసుకెళ్ళాడు సింగయ్య గారు.
“ఇలారా, చెప్పు , గట్టిగా గట్టిగా అరవకు”, “ఎవరైనా వింటే ఇంతే నా సంగతులు”, “ఆ ఏమైంది”. ఆత్రుతగా అడిగాడు సింగయ్య గారు.
“ఆ కొడవలి తో నా మానా నేను చేను కోస్తుంటే, వెనకనుంచి….” ..ఏడుస్తూ .. “కనికరం లేదయ్య….” అన్నాడు యీరయ్య.
“ఏం చేసారు రా?”, “చెప్పేదేదో పూర్తిగా చెప్పి తగలడు. అన్నీ సగం సగమే, ముందుగా ఆ ఏడుపు ఆపు”, “ఆ ఏడుపులో సగం అక్షరాలు మింగుతున్నావు”, “ఎవరికి కనికరం లేనిది?” అని విపరీతమైన కోపంతో అన్నాడు సింగయ్య గారు.
“అమాయకుడిని సేసి… వెనకనుండి ….”, గట్టిగా ఏడ్చాడు యీరయ్య.
“ఇదిగో, నాకు బీపీ పెరిగి ఇక్కడే పోయేలాగున్నాను.. నువ్వు నసగడం ఆపి త్వరగా ఏడువు..”, చమట కారిపోతోంది సింగయ్య గారు.
మళ్ళీ ఆ కొడవలి అందుకున్నాడు యీరయ్య, దాన్ని చూపిస్తూ ..
“దీంతో ఏసానయ్యా ….”, అంటూ ఏడ్చాడు యీరయ్య.
“వేశావా?, ఎవర్ని వేసింది ?”, చమటకు బట్టలు తడిచి పోయూయి, కాళ్ళ వణుకుతో చతికిల పడి కూర్చున్నాడు సింగయ్య గారు.
“పోలీసు ను పిలవండయ్యా….”, అని ఏడ్చాడు, కొడవలి ని గట్టిగా నేల మీద కొట్టాడు యీరయ్య.
“అసలు నిన్ను పనిలో పెట్టుకున్నందుకు తప్పు నాదేరా”, గట్టిగా బుర్ర మీద కొట్టుకుంటూ సింగయ్య గారు.
“అమ్మగారు మీ ఆవిడి మొహం చూసి మంచి వాళ్ళలాగా ఉన్నారంటే సరే అన్నా” అన్నాడు తనకు తాను తిట్టుకున్నట్లుగా సింగయ్య గారు
“ఇంత పని చేస్తావనుకోలేదు రా…” అన్నాడు మళ్ళీ కోపంతో సింగయ్య గారు.
“ఇంకెక్కడ నా పెళ్ళాం అయ్యా…”, అంటూ ఏడ్చాడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ యీరయ్య.
“ఏంటి, దానికేమయ్యింది, దాన్ని కూడా…” అన్నాడు సింగయ్య గారు.
“దుర్మార్గులు బాబు…” , అంటూ ఇంకా గట్టిగా ఏడ్చాడు యీరయ్య.
“సాయ సత్తులా పోరాడానయ్యా… నలుగురు….”, ఏడుస్తున్నాడు, కళ్ళ నీళ్ళు తుడుచుకుంటున్నాడు యీరయ్య
“పెళ్ళి ఆగడం ఖాయం”, “ఓ పని చేయి, తొందరగా ఊరు వదిలి వెళ్ళు”, “దూరం గా వెడిపో”, “ఇంద డబ్బులు”, జేబు లోంచి ఉన్న డబ్బులంతా తీసి చేతిలో పెట్టాడు సింగయ్య గారు.
“నా కొద్దయ్యా ఈ పాపిస్ఠి డబ్బులు, వీటి కోసమే గదయ్య రోజూ కష్ట పడేది, ఇదేనయ్య దాన్ని బలి దీసుకుంది…”, అంటూ ఆ ఎర్ర నోట్లను విసిరికొట్టాడు యీరయ్య.
“ఓరేయ్, నా మాట విను. ఇవి తీసుకొని త్వరగా బయలుదేరు”, “కొంచెం సేపట్లో ఆ పాసింజర్ రైలు వస్తుంది”, “ఎక్కడకో దూరంగా వెడిపో”, “మళ్ళీ తిరిగి రాకు”, అని అన్నాడు సింగయ్య గారు.
“నే ఎళ్ళనయ్యా.. ఇదిగో ఈ కొడవలి తో….”, అని చూపించాడు యీరయ్య
“ఓరేయ్ నీకో దణ్ణం పెడతా.. నువ్వు చేసింది చాలు.. త్వరగా బయలు దేరరా…”, “ఇంటిలో పెళ్ళి హడావుడి రేపు దాని పెళ్ళయి పోతుంది”, “తరువాత సంగతి ఆ దేముడెరుగు”, “నువ్వు వెంటనే బయలు దేరు”, అని తోసాడు సింగయ్య గారు.
“వెడతానయ్యా, మిగతా ఇద్దరిని….”, యీరయ్య అనేలోగా,
“ఏమిటి, ఇద్దరినా?”, “పాపిస్టోడా, వాళ్ళని అంటున్నావు కానీ, నువ్వు దుర్మార్గుడివే కదరా?”, “అంతటి అఘాయిత్యం ఎలా చేసావురా?” అని ఊగిపోతున్నాడు సింగయ్య గారు.
“అట్టాంటి పరిస్తితి లో మీరైనా అంతే బాబు…”, అంటూ ఏడ్చాడు యీరయ్య.
“సరే కాని, ఇంద డబ్బులు నువ్వు ముందు పద”, అని తను లేపి గేటు వరకూ తీసుకెళ్ళాడు సింగయ్య గారు.
(సింగయ్య గారు తోస్తున్నాడు యీరయ్య ను త్వరగా వెళ్ళమని, మళ్ళీ ఎక్కడ ఎవరు చూస్తారో అని, ఆ ప్సాసింజర్ పోయిందంటే రేపటి వరకూ మళ్ళీ ట్రైన్ లేదు అందుకు గబ గబానెళ్ళమని చెబుతున్నాడు )
(ఇంతలో పొలం పని చూసుకొని బొడ్డెమ్మ ఇంటిలో పాచి పనికి సింగయ్య గారింటికి వస్తూ ఉంది)
తను వచ్చి యీరయ్య అవతారం చూసి …
“ఏటి నీ ఈ యేషాలు?”, అంది యీరయ్య తో
“అయ్యగారు , మీకు నచ్చిందా ఆయన పాత్ర? నాటకం యేత్తాడంట, ఏందో నాటకం…”, అంది బొడ్డమ్మ సింగయ్య గారి తో
“ఏ హే ఉండవే…”, విసుక్కుంటూ ” మొత్తం పాడి చేసావు”, అన్నాడు కోపం గా యీరయ్య.
సింగయ్య గారి కి నోట్లో మాటలు రావట్లా.
“ఇదిగోండి బాబు గారు, మీ డబ్బులు”, అంటూ సింగయ్య గారికి తిరిగి ఇచ్చాడు.
“దీనికి ఎమి తెలీదు.”, “మంచి రసపట్టు లో ఉంటే మొత్తం పాడి చేసింది…..” అన్నాడు యీరయ్య.
“ఓ వారం నుండి ఎడతెరిపి లేకుండా ఇదే పనిగా నటించడం నేర్చుకుంటుంటే, సివరలో వచ్చి మొత్తం పాడిచేసింది”, అన్నాడు యీరయ్య.
“నాలో ఎదుగుదలేముంటాది?”, “నాటకాలోలు మంచి పాత్ర ఇత్తానంటే, ఇంత బాగా సేత్తుంటే , మంచి రసపట్టు సన్నివేశాన్ని మొత్తం నాశనం నాశనం సేసింది…” అని అన్నాడు యీరయ్య.
“నే నెల్లొత్తా. ఇంటికి రా నీ పని సెబుతా.. ఇంత మంచి కలాకారుడిన్ని ఏవరూ పట్టించుకోరు”, అంటూ కోపం తో ఆ చేతి రంగు బట్టలకు పూసుకుంటూ.
ఇంతలో బొడ్డెమ్మ ఆయన వైపు తిరిగి
“బాబుగారు, మీరు, ఆడి మాటలు ఎం పట్టించు కోబాకండి, నాటకం యేత్తాడంట నాటకం కొడవలితో..”, “చూటేటోరు పరుగెత్తరూ…”, అంది బొడ్డెమ్మ
“ఏదో మంచి పాత్ర యేయ వయ్యా యంటే ఇని సావడు”, అంది యీరయ్య గురించి అంటూ.
“ఏందో ఇప్లవాలు, కొడవల్లు..”, “ఇంట్లో, రోజు ఇదే గోల….. తొంగోడు, తొంగోనీయడు…” అంటోంది బొడ్డమ్మ.
సింగయ్య గారు ఇంకా అయిన దానికి ఆయన తేరుకోలేక పోతున్నాడు.
(ఇంత లో సింగయ్య గారి భార్య వచ్చింది )
“ఏమండి, ఆ పెళ్ళి వాళ్ళు అడిగింది పంపించారా?”, “ఏమిటి మీ అవతారం”, అంది కోపంతో,
“ఉన్న ఒక్క పెళ్ళి చేయటానికి నానా అవస్థ పడుతున్నారు. మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టే రకం”, విసుగ్గా అంది ఆవిడ.
“ఏంటి ఆ కొడవలి అక్కడ?”, “ఆ రంగు దానిమీద?”, “ఇది ఆటలు ఆడుకునే సమయమా? ఎంటో ధైర్యం లేదు పాడు లేదు, లోపలికి తగలడండి”, “భోలెడు పెళ్ళి పనులున్నాయి”, అంటూ లోపలికెళ్ళింది సింగం గారి భార్య.
ఇంకా సింగయ్య గారు పూర్తిగా తేరుకోలా, కింద ఆ గేటు దగ్గర చతికిల పడి కూర్చొన్నాడు. “ఆ దొరా … అని అన్నప్పుడైనా అర్థం చేసుకోసుకోవాల్సింది, ఆ చేతి రంగు చూసి రక్తం అని ఎలా అనుకున్నానబ్బా?”, అని అనుకుంటున్నాడు.
“ఎంత బాగా నటించాడు వెధవ, చూడ్డానికి పొట్టిగా భూమికి నాలుగు అడుగులు కూడా ఉండడు, నల్లగా చీకటిలో చూస్తే కనబడడు కానీ , నన్ను మటుకు ఆ స్వర్గపు అంచుల వరకూ తీసుకెల్లాడు”, అని సింగయ్య గారు అనుకుంటున్నాడు.
మళ్ళీ ఆలొచించి “స్వర్గమో, నరకమో?”, వాడు నాకు పెట్టింది మాత్రం నరకమే, వెధవను ఇంటి లో పెళ్ళి అవ్వగానే పని లోనుండి పీకేస్తా, పీడ విరగడవుతుంది, అనుకుంటున్నాడు.
బొడ్డెమ్మ ముసి ముసి నవ్వులతో లోపలకెడుతోంది.
శుభం భూయాత్ !