“ఆకాష్ ఈ రొటీన్ నచ్చడం లేదు”, అంది కళ.
“నేనేమి చేయను”, అన్నాడు ఆకాష్.
“వీకెండ్ కూడా అంతే నువ్వు. నన్ను బొత్తిగా పట్టించుకోవడం మానేసావు”, అని అంది కళ.
“వీకెండ్ లో ఇంటి పని సరిపోతుంది కదా కళ, నువ్వు చూస్తున్నావు కాదా”, అన్నాడు ఆకాష్.
“ప్రతీ దానికి ఏదో ఓకటి సర్ది చెబుతావు”, అంది కళ.
“అలాం ఏమి కాదు కళ”, అన్నాడు.
ఆకాష్ చాలా అర్ధం చేసుకునే మనిషి. కొన్ని నెలల నుండి చూస్తున్నాడు కళలోని మార్పును. భర్తగా తన కర్తవ్యం గుర్తుకొచ్చి దగ్గరకు చేరాడు. పక్కన కూర్చొని కళ చేతులు పట్టుకొని తనతో మాట్లాడటం మొదలు పెట్టాడు.
” ఈ మధ్య కొంచెం బిజీ గా ఉండటం వాస్తవమే కానీ తప్పడం లేదు, అర్థం చేసుకో”, అన్నాడు ఆకాష్
“డబ్బులు సంపాదించు కుంటూ రిటైర్మెంట్ లో ఎంజాయ్ చేద్దామంటే ఎలా ఆకాష్, పెళ్ళైన రెండేళ్ళ నుండి ఇదే రొటీన్ మనకు”, అంది కోపంగా కళ.
“ప్రామిస్, ఇంక ఇలా ఉండదు నేను మారతాను”, అని హామీ ఇచ్చాడు ఆకాష్.
కొంచెం మనసు కుదుట పడింది కళది. తను లోపలికి వెళ్ళింది. ఆకాష్ ఆలోచనలో పడ్డాడు. కళ ను పెళ్ళచేసుకొని ఓ రెండేళ్ళు అయ్యింది. పట్టణం లో ఉద్యోగం కారణం చేత పెళ్ళైన వెంటనే ఆకాష్ తో వచ్చేసింది కళ. పనుల ఒత్తిడి వల్ల ఒకరికొకరు సమయం కేటాయించుకు పోవడం వల్ల మరీ రొటీన్ లాగా అయిపోయింది వాళ్ళ జీవితం.
ఆకాష్ ఇది గ్రహించాడు, ఒకసారి అలోచించాడు. కొంచెం రోజూ చేసే వాటికన్నా కొంచెం భిన్నంగా చేస్తే కళ మళ్ళీ ఓ కొలిక్కి వస్తుందని ఓ నిర్ణయానికి వచ్చాడు. పొద్దున్న ఆఫీస్ కి ఫోన్ చేసి కొన్ని రోజులకు సెలవు సంపాదించాడు ఆకాష్. మనం ఊరెడుతున్నాం అన్నాడు, అన్నీ సర్దమని చెప్పాడు. రైల్వే స్టేషన్ కు వెళ్ళి ఊటీ కి టికెట్లు తీసుకొచ్చాడు, బయలు దేరి అక్కడకు చేరారు.
ఆ రోజు రాత్రి ప్రయాణ బడలిక వల్ల, ఊటీ లోని చల్లటి వాతావరణానికి తెలియకుండా బాగా నిద్ర పట్టేసింది. లేచే సరికి బాగా పొద్దు పోయింది. ఇద్దరూ తయారు అయ్యి హోటల్ నుండి రెస్టారెంట్ లో టిఫిన్ తిన్న తరువాత అడిగింది మనం వెళ్ళేది ఎక్కడకని. ఆకాష్ బోటానికల్ గార్డెన్స్ చాలా బావుంటుంది, అక్కడికి వెడదామని అన్నాడు. బయలు దేరి అక్కడకు చేరారు. పెళ్ళి అవగానే హనీమూన్ కు ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు ఇద్దరికి, ఊటీ కి వచ్చి ఇలా తిరగటానికి ఏదో చాలా కొత్త అనుభవం లాగా ఉంది ఇద్దరికి. కళకు ఇరవై మూడేళ్ళు ఆకాష్ తనకంటే ఐదేళ్ళు పెద్ద. ఇంటిలో పెద్దలు కుదిర్చిన సంబంధమే. ఓకరినొకరు పెళ్ళి చూపులలో చూసుకోవడం వెంటనే ఓ నెలలో పెళ్ళి అయిపోవడం, ఇద్దరూ కలిసి పట్నం రావటం అంతా త్వరగా అయిపోయింది. ఊరిలో చిన్న చిన్న ప్రదేశాలు చూడటం, పండగ సెలవలకు అత్త గారింటికి, పుట్టిన ఇళ్ళకు వెళ్ళడం తప్ప పెద్దగా ఇద్దరూ కలిసి తిరిగింది లేదు. పనుల రొటీన్ లో కళకు సమయం కేటాయించడం లేదని పదే పదే ఆకాష్ కు విన్నవించినా అవి పెడచెవి పెట్టడంతో కొన్ని నెలలనుండి తనకు విసుగుగానే ఉంటోంది. ఇద్దరూ గార్డెన్స్ కు చేరుకున్నారు.
అక్కడ తోటను అన్నిటిని ఆస్వాదిస్తూ చెట్టా పట్టాలు వేసుకొని ఓ రెండు గంటలు తిరిగారు, అన్నీ విషయాలు మాట్లాడుకున్నారు. అసలైతే రోజూ ఆ సమయానికి ఆకాష్ ఆఫీస్ లో ఉంటాడు. కళకు ఇంటిలో పనులు తో ఓక్క క్షణం తీరిక ఉండదు. ఇలా ఇద్దరూ కలిసి ఇన్నిరోజులు తిరగటానికి రావడం ఇదే మొదటిసారి. ఓక చోట కూర్చున్నారు ఆ తోటలో. కళను చూసి తను ఎంత కళగా ఉంటుంది అనుకుంటున్నాడు మనసులో ఆకాష్. తన వంపులు సొంపులు రాసులుగా పోసిన కళ అందాన్ని కూడా చూస్తూ తను భార్య అయినందుకు గర్వంగా ఉన్నాడు. దైనందిక పనుల మధ్యలో చిన్న చిన్న ఆనందాలకు సమయం ఇప్పటి వరకూ కేటాయించ లేదు. కళను తీసుకొని ఊటీ వచ్చినందుకు చాలా సంతోషించాడు. కళ సంగతి తెలీదు కానీ ఆకాష్ కు మాత్రం రంగు రంగుల సీతా కోక చిలకలు వళ్ళంతా నాట్యం చేస్తున్నట్లుంది. ప్రేమ గీతాలు పెదాల మీద కదులుతున్నాయి ఆకాష్ కు. ఓక్క సారి ఆకాష్ ను చూసి “ఐ లవ్ యు”, అని చెప్పింది కళ. “సారీ, నిన్న కోప్పడి నందుకు” అంది. ఆకాష్ కూడా “ఐ లవ్ యు టూ”, అన్నాడు. ఆకాష్ నోట్లోనించి ఈ మధ్య కాలం లో భిన్నంగా విన్నది అది ఒక్కటే. ఆకాష్ ఉండబట్ట లేక ఆ నుదుటిమీద ఓ ముద్దు ఇచ్చాడు. ఆ చల్లటి వాతావరణంలో తను నుదురు మీద ఆ అధరాల స్పర్శకు, చిరు వేడి శ్వాసకు అప్పటి వరకూ తిరిగిన అలసటంతా తీరినట్లయ్యింది కళ కు. తను కూడా అనుకుంటోంది అనవసర విషయాలు ఎక్కువ ఆలోచించేదని. కళ అలా ఆలోచలోకి వెళ్ళబోతుంటే, ఆకాష్ ఏదో అనేసరికి ఆలోచనలను కట్టపెట్టింది. కొత్తగా పెళ్ళైన జంటలా ఒకరి ఒడిలో ఇంకొకరూ ఒదిగి ఉన్నారు. ఈ ప్రేమ పావురాలను ఎవరైనా చూస్తే ముచ్చట పడతారు. సమయం పాదరసంలా కదిలి పోతుంది, ఆకాష్ కు నమ్మకం వచ్చింది, వెళ్ళేలోగా కళ మనసు మారుతుందని. ఆ చల్లటి వాతావరణంలో రోజంతా వెచ్చటి ప్రేమను వ్యక్త పరచడం లోనూ దాన్ని ప్రజ్వలింపచేయటం లో గడిపారు.
తర్వాత రోజు ఊటి లో లేక్ కు వెడదామని ప్లాన్ చేసారు. అక్కడ బోట్ హైర్ చేసుకున్నారు. నిర్మలంగా ఉన్న ఆ లేక్ లో నడుపుకుంటూ వెడుతున్నారు. ఆహ్లాదంగా ఉంది మంచు తెరల మధ్యలో ఒక్కొక్క తెరను తెరుచుకుంటూ వెడుతూ ఆకాష్ కళను చూస్తున్నాడు. భార్య భర్తలుగా ముందు రోజు కొత్త ప్రదేశంలో గడిపిన అనుభూతి వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపింది. పరస్పరం లోకాన్ని మరిచిపోవాలను కుంటున్నారు. సన్నటి జడి వాన మొదలయ్యింది. అలా తడుస్తూ ఆ ప్రదేశం లో ఉన్న అందానికి, దాన్ని చూస్తుంటే వచ్చే సంతోషానికి దాసోహమయ్యారు. ఓకరు నొకరూ కన్ను విప్పరకుండా చూసుకుంటూ మధ్యలో వేరే వాళ్ళు బోట్ లో కనిపించి పలకరిస్తున్నా మైమరిచి అలా వాళ్ళు నడుపకుంటూ విహరం చేస్తున్నారు. ఆ సన్నటి జల్లు లో తడిసి మద్దవుతున్నారు. చలి కాలంలో ఆకులు రాలి చెట్టు సహజంగా రమణీయం గా ఉంటుంది, అలాగే కళను చూసాడు ఓ నిండు యవ్వనవతి తడిబట్టలతో ఆకులు రాలిన చెట్టులా ఉండటం చూసి మనసు చలిస్తోంది. బోట్ నడపడం ఆపి కొంచెం దగ్గరకు జరిగాడు. తన చేతులు పట్టుకున్నాడు. కళ యొక్క మృదువైన చేతులని సుతిమెత్తగా తడువుతున్నాడు. వాటిని తీసుకొని ఓకసారి తన పెదాల వరకూ తీసుకెళ్లి చుంబించాడు. కళ నవ్వి, “నిజంగా ఎంత బావుందో ఈ ప్రదేశం”, అంది. “అవును, అందుకే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎగురుకుంటూ వస్తారు”, అన్నాడు ఆకాష్. “రోజంతా ఇలా జల్లుతో తడుస్తూ ఇక్కడే ఉండాలని పిస్తోంది”, అంది. ఇంతలో ఆకాష్ అటు వెడుతున్న వారిని చూపించాడు. కళ వారిని చూసి ముసి ముసి నవ్వులు నవ్వింది. చిలక గోరింకల లాగా ఒదిగి మద్దాడుతూ వాళ్ళు ఎక్కడున్నరోకూడా తెలియని పరిస్తితి వాళ్ళ బోట్ వచ్చి ఆకాష్ వాళ్ళ బోట్ కు ఢీ కొట్టింది. దానికి తేరుకొని వీళ్ళకు సారీ చెప్పి నిమిషంలో అలా ఆ మంచు తెరలో మళ్ళీ మాయమైయ్యారు. ఇద్దరూ నవ్వుకున్నారు. కారుమబ్బులు కమ్ముకొని వర్షం మొదలయ్యింది. “త్వరగా వెడిపోదామంది”, “ఫర్వాలేదు నాకు ఈత వచ్చు”, అని అభయమిచ్చాడు. “ఇపుడు వెళ్ళికంటే కొంచెం తగ్గిన తరువాత వెళ్ళడమే మేలు”, అని అన్నాడు. “నాకు భయం గా ఉంది”, అంది కళ. తనను నెమ్మదిగా తనవైపుకు రమ్మని హత్తుకొని కూర్చున్నాడు. ఆ కారు మబ్బుల వల్ల చీకటి గా ఉంది. అక్కడకు వచ్చే జంటల ఒంటి లోంచి వచ్చే వేడి తాపానికి ఆ మేఘాలు కరిగి కురిసిన వర్షం లాగా ఉంది. ఆ వాన వల్ల అక్కడున్న జంటల అందరి మదనతాపం యొక్క వేడి తగ్గగానే ఆ వాన కురియటం ఆగింది. ఇద్దరూ ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ సెంటర్ లో ఇంకా చుట్టు పక్కల చూడవలసిన ప్రదేశాల గురించి అడిగితే, నీలగిరి కొండలు గురించి చెప్పారు, వాటి గురించి అంతా తెలుసుకొని తరువాత రోజు వెడదామని నిశ్చయించుకున్నారు. హోటల్ వెళ్ళి బట్టలు మార్చుకొని వేడి వేడిగా తినడానికి బయలుదేరి, హోటల్ కు తిరిగి వచ్చి ఆ రాత్రి సేద తీర్చుకున్నారు.
తరువాత రోజు ఆకాష్ రెడి అయ్యాడు, కళను రెడి అవ్వమని చెప్పి నీలగిరి కొండలకు వెళ్ళే వివరాలకోసం బయటకు వెళ్ళి వస్తానన్నాడు. తను రెడి అయ్యింది, ఇద్దరూ టిఫిన్ తిని బస్ తీసుకొని బయలు దేరారు. ఆకాష్ కు నచ్చిన చిలకపచ్చ రంగు చీర కట్టుకుంది. కొప్పు నిండా తురుము కున్న మల్లెలు, వాటి పరిమళం చూట్టూతా వెదజల్లు తున్నాయు. తన నవ్వు ముఖం, అందంగా కళ్ళుతిప్పుకోలేని విధంగా ఉండటం చూసి ఆ బస్సు డైవర్ కూడా ఆపుకోలేక ఓసారి కింద నుండి పై వరకూ చూసాడు. కూర్చున్నారు బస్సులో. చేతిలో చెయ్య వేసి అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. తను కూడా ఓ ఉద్యోగం చేద్దామను కుంటున్నట్టు చెప్పింది. ఆకాష్ కి నచ్చింది, ఇంటికే అంకిత మవ్వకుండా కళకు కూడా తనకు నచ్చిన వాటిలో చేర్పిస్తానని చెప్పాడు. ఇద్దరూ నీలగిరి కొండలు దగ్గర దొడ్డబెట్ట చేరారు. ఇంతలో ఆకాష్ కొన్ని విషయాలు కనుకొస్తానని తనను కూర్చొమని వెళ్ళాడు. వెంటనే వస్తానని చెప్పాడు కాని వెళ్ళి అరగంట అయ్యింది తను రాలేదు. తను అక్కడ నుండి కదిలితే మళ్ళీ తను వెతుక్కుంటాడని అక్కడే కూర్చొని ఉంది. సమయం గడుస్తోంది ఆకాష్ రావడం లేదు. ఎడబాటు సహించలేని తనం కళలో ప్రస్పుటంగా ఉంది. ఆ విరహబాధ తట్టుకోలేక పోతోంది కళ. ప్రకృతి లో రాబోవు వసంతం కోసం ఎలా ఎదురు చూస్తారో అలాగే ఆకాష్ కోసం ఎదురు చూస్తోంది. ఏన్నడూ తనగురించి అంతగా ఎదురు చూడలేదు. గత రెండు రోజుల నుండి అనుక్షణం ప్రతీ నిమిషం సంతోషం తో నిండింది. ఆకాష్ త్వరలో తిరిగి వస్తాడన్న ప్రఘాడ నమ్మకంతో కూర్చొని ఉంది, తనను మనసులో ఆకాష్ ను తలుచుకునే లోగా దూరం నుంచి “కళ” అని వినిపించడం తో ఒక్కసారిగా లేచి పరిగెత్తింది. గట్టిగా హత్తుకోంది, వదిలి పెట్టడం లేదు. ఆకాష్ కూడా గట్టిగా కొంచెసేపు పట్టుకొని జరిగింది వివరించాడు. కొత్త ప్రదేశం లో దారి తప్పడం వల్ల కొంచెం సమయం పట్టిందని వివరించాడు. ఆ సంఘటన వల్ల మరియు ఎడబాటు తనం వల్ల కళను ఇంకొంచెం ఆకాష్ కు దగ్గరగా తీసుకొచ్చింది. అప్పటినుంచి తన చేయి వదల దలుచుకో లేదు. అక్కడ ఉన్న ప్రకృతి ని చూసి మైమరిచిపోతూ ఉన్నారు. సంతోషం లో అన్నీ అందంగా కనిపిస్తున్నాయి. చెట్లు , చేమలు, పక్షులు, జంతువులు, అన్నింటికంటే ముఖ్యంగా పరిసరాలను చూస్తూ , పరస్పరం ముద్దాడుకుంటూ జీవితంలో మరువరాని ఘడియలుగా నిలిచేలాగా , ఒకరికొకరు రామచిలకల్లా , ప్రేమపక్షుల్లా రోజంతా గూడును వదిలి ఆ నలమల కొండలలో తిరుగుతూ రాత్రికి వాళ్ళ గూడుకు చేరుకున్నారు.
తరువాత రోజు తిరుగు ప్రయాణం. ప్రయాణంలో అక్కడ గడిపిన క్షణాలను నెమరు వేసుకంటూ ఇద్దరూ ఇంటికి చేరారు. ఆ ఉదకమండలం మళ్ళీ వాళ్ళ జీవితాలలో పరిమళం తీసుకొచ్చినందుకు ఆకాష్ కళ చాలా సంతోషించారు. ప్రతి సంవత్సరం ఇలాగా ఎక్కడోక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు.
కళ కూడా ఉద్యోగ వేట మొదలు పెట్టింది. ఆ రోజు ఆకాష్ ఇంటికి రాగానే తనకు వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ చూపింది, గట్టిగా కౌగిలింత లో ముంచేసి, తన బ్యాగ్ లోనుంచి టికెట్లు తీసాడు. ఇంకో నెలలో నైనిటాల్ వెళ్ళబోతున్నాము అని చెప్పాడు. “హుర్రే అని ఆకాష్ ను ఎత్తుకుంది” “కళ, ఏమో అనుకున్నాను కానీ గట్టిదానివే”, అన్నాడు
శుభం భూయాత్!