తెలుగు కవులు – మొదటి భాగం
ఈ మధ్య తెలుగు భాషా పరిశోధనలో భాగంగా మన తెలుగు సాహిత్య రంగంలో ప్రముఖుల రచనా పద్దతులు, వారి రచించే శైలి, అనుసరించే విధానం, వారి సాహిత్య విశిష్టత, వారి రచించిన గ్రంథాలు, కావ్యాలు, మహాకావ్యాలు, శతకాలు, కవితలు, పద్యాలు, కథలు, ఆత్మ కథలు, కథనాలు, నవలలు, వ్యాసాలు, విమర్శలు, గేయాలు, నాటకాలు, లేఖలు, సంపుటీలు, సామెతలు, నిఘంటువులు వీటన్నింటి గురించి చదువుతూ ఈ పరిశోధన లోని విషయాలను గూర్చి క్లుప్తంగా రాయదలిచాను. క్రీ పూ 200 ల సమయంలో శిథిలాలలో తెలుగు భాష దాఖలాలు బయటపడ్డాయని చదివాను. దీనినిబట్టి మన భాష ఎంత ప్రాచీనమైనదోనని తెలుస్తుంది. లభ్యమయ్యే తెలుగు భాష సాహిత్యానికి దాదాపు వెయ్యేళ్ళ చరిత్ర ఉందని చెబుతారు. దానికి ముందు జానపద సాహిత్యం ఉండవచ్చునేమో నని భావిస్తారు. ఈ వెయ్యేళ్ళలో ఎంతో మంది కవులు ఎన్నో రచనలు చేసారు. సాహిత్య యుగ విభజనలో అంటే క్రీ శ 1000 తరువాత కాలం నుండి నన్నయ్య, శివకవి, తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాథ, రాయల, దక్షిణాంధ్ర, క్షీణ యుగాల వరకూ పక్కన పెట్టి ఆధునిక యుగంలో గత వందేళ్ళగా రచించినవి కోకొల్లలు అని చెప్పవచ్చు.
మన స్కూల్లో తెలుగు పాఠాలలోనూ, బయట చదివిన వాటిలో మనకు తెలిసిన పూర్వపు కవుల గురించి చెప్పుకోవాలంటే ఆది కవి నన్నయ్య దగ్గర నుండి మొదలుపెట్టాలి, ఆయన రచించిన మహాభారతం మనకు తెలుగులో మొట్టమొదటి సాహిత్య కావ్యం. నన్నయ్యకు, నారాయణ భట్టు సహాయంగా నిలిచాడుట అందుకే వీరిద్దరూ ఆంధ్ర భాషా చరిత్రలో యుగపురుషులు, వీరు భాషకు ఓ మార్గాన్ని నిర్థేశించారు, కావ్య పరిపూర్ణత సాధించి, ఓ శైలిని సృష్టించి, తరువాత తరానికి మార్గదర్శకులు అయ్యారు. కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎఱ్ఱన గురించి తెలియని తెలుగు వారుండరంటే అతిశయోక్తి కాదేమో. నన్నయ్య చూపిన మార్గంలోఎంతోమంది అనుసరించి పద్యకావ్యాలను అందించారు. వారి తరువాత శ్రీనాధుడు, పోతన, జక్కన, గౌరన్న ఛందస్సులలో ఎంతో పరిణితి చెంది అదే కాలంలో సంస్కృత కావ్యాలు, నాటకాలు అనువాదం చేసారు. శ్రీనాధుడి శృంగార నైషధము, పోతన గారి భాగవతము, వీరభద్ర విజయము వినని వారుండరు. ఇదే సమయంలో గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాధ రామాయణం తెలుగులోని మొదటి రామాయణం. తరువాత శ్రీకృష్ణదేవరాయల యుగం గురించి కూడా పలుసార్లు విన్నాము. రాయల వారి సభలో అష్టదిగ్గజాలైన కవులతో శోభిల్లింది. వీరిలో ప్రత్యేకంగా తెనాలి రామకృష్ణులు రాసిన పాండురంగ మహత్మ్యం, రాయలు వారు స్వయంగా రాసిన అమూక్త మాల్యద గురించి కూడా విన్నాము. తరువాత యుగమంతా కర్ణాటక సంగీత సాహిత్యంతో మునిగింది. త్యాగయ్య, అన్నమాచార్య, క్షేత్రయ్య, వేంగమాంబ, రామదాసు వంటి వారు ఎందరో సుప్రసిద్ధులు, మహానుభావులు.
తెలుగు భాషకు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌను గారు ఎనలేని సేవ చేసారు. వేమన పద్యాలను వెలికితీసి వెలుగులోనికి తీసుకొచ్చిన ఘనత ఆయనదే. 19 వ శతాబ్దంలో మొదట్లో తెలుగు సాహిత్యం పునరుద్ధరణ మొదలయ్యి, తరువాత ఆంగ్ల కవుల ప్రభావల్ల రచనా శైలిలో భావకవిత్వం లాంటి మార్పులు చేకూరాయి. ఈ ఆధునిక యుగంలో కందుకూరి విరేశలింగం రాజశేఖర చరిత్రము తో పునరుద్ధరణ సంపూర్ణమయ్యి,గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి, కట్టమంచలి రామలింగారెడ్డి, రాయప్రోలు సుబ్బారావు, సురవరం ప్రతాపరెడ్డి లాంటి వారు తెలుగు సాహిత్యాన్ని వ్యవహారిక భాషా దిశలోకి మళ్ళించిన నవయుగ వైతాళికులు. ప్రపంచ సాహిత్యంలో లాగానే తెలుగు సాహిత్యంలో కూడా రకరకాల పద్దతులు ఉన్నాయి, ముఖ్యంగా అవి జానపద సాహిత్యం, వచనా కథ సాహిత్యం, పద కవితా సాహిత్యం, పద్య కవితా సాహిత్యం, చంపూ సాహిత్యం, శతకా సాహిత్యం, నవలా సాహిత్యం, చిన్న కథలు, అవధానములు, ఆశు కవితలు, సినిమా సాహిత్యం లాంటివి. ఆధునిక యుగంలో గురజాడ అప్పారావు, శ్రీ శ్రీ లాంటి వారు వాడుక భాషనే సాహిత్యంలో ప్రోత్హహించి వివిధ సాహితీ ప్రక్రియలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు.
ఆధునిక యుగంలో ముందుగా ఎక్కువ వినిపించేది కన్యాశుల్కం నాటిక, ఇది భారతదేశ ఆధునిక మహిళా చరిత్రను పునర్లిఖిస్తుంది. ఇందులో తాంబూలాలు ఇచ్చేసాను, ఇక తన్నుకు చావండి, డామిట్! కథ అడ్డం తిరిగింది, పొగత్రాగని వాడు దున్నపోతైపుట్టున్, మన వాళ్ళు వొట్టి వెధలలోయ్, వీళ్ళమ్మా శిఖ తరగా! ప్రతిగాడిద కొడుకూ తిండిపోతుల్లాగా నా ఇంట జేరి నన్ననే వాళ్ళే లాంటి కొన్ని సంభాషణలు అద్భుతంగా ఉండి, హాస్యం ఎత్తిపొడుపులతో, గొప్ప రచనా నేపథ్యంతో, సంఘ సంస్కరణ అనే కథా వస్తువుతో, సరళమైన వాడుక భాషలో తెలుగు వాడు గర్వించదగ్గ నాటికంగా చెప్పవచ్చు. 20 వ శతాబ్దం తొనినాళ్ళలో గురజాడ అప్పారావు గారు వాడుక భాషా పితామహుడైన గిడుగు రామమూర్తి పంతులుగారితో కలిసి వ్యవహారిక భాషోద్యమం మూలాన సాహిత్యం కూడా గ్రాంథిక భాష నుంచి వ్యవహారిక దిశకు కొనసాగింది. ఈ యుగానికి చెందిన నవ్యకవితా పితామహుడిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు. వీరు భావకవిత్వానికి ఆద్యులు. కళాకారునిలో ఊహాలు, భావాలు, సృజనాత్మకు ప్రాధాన్యమిచ్చే రూపం భావుకత. పాశ్చాత్య దేశాలలో పరిమళించిన భావుకతను ఈయన తెలుగులోవిరజిమ్మారుట. ఆయన రచించిన తృణకంకణము తెలుగు కవిత్వాముతో నూతన శకం ఆరంభం అయ్యిందంటారు. ఏదేశమేగినా ఎందుకాలిడినా జాతి గౌరవం నిలపాలంటూ రాసింది, అవమానమేలరా అనుమానమేల, భరతపుత్రుడనంచు భక్తితో పలుక అంటూ రాసినవి కట్టలు తెంచుకొని పారాయట.
ఇరవై ఒక్క శతాబ్దం లోని తెలుగు సాహిత్య కవులు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ శ్రీ. వీరే కాకుండా జాషువా, దేవులపల్లి, అడవి బాపిరాజు, చలం, సినారె, వోల్గా, ఆరుద్ర, దేవరకొండ బాలగంగాధర తిలక్, చెళ్ళపిళ్ళ, ఛాసో ఇంకో ఎందరో మంచి మంచి కవులున్నారు. అందరిని గూర్చి వేరే భాగంలో వివరంగా రాస్తాను కానీ ఇక్కడ ఇద్దరి ముగ్గురి గురించి ప్రస్తావన మాత్రం చేస్తాను. ఈ శతాబ్దంలో కవితా సంచలనం సృష్టించనవి రెండిటిని పేర్కొంటారు. అవి మహా ప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి. మహాకవి శ్రీ శ్రీ గారు రాసిన మహా ప్రస్థానం మనకు కవితా ప్రామాణికం. గత డెబ్బై, ఎనభై ఎళ్ళగా పాఠకులలో ఎంతగా చొచ్చుకు పోయిందో చెప్పనవసరం లేదు. కవిత్వం ఓ ఆల్కెమీ, కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకు తెలుసు, శ్రీ శ్రీ కి తెలుసు, కృష్ణశాస్త్రి కు తెలుసు అన్నారు. అలాగే అభ్యుదయ భావకవి దేవరకొండ బాలగంగాధర తిలక గారు రాసిన అమృతం కురిసిన చదివిన వారికి కవితామృతం గ్రోలినంతానందం కలిగిస్తుందిట. కవిసామ్రాట్ట్ విశ్వనాధ సత్యనారాయణ గారు కథల పోటీకి సరిగ్గా ఇవరైతొమ్మిది రోజులలో తొమ్మిదివందలా తొంభైతొమ్మది పుటల వేయిపడగులు రచించి, అడవి బాపిరాజు గారు రచించిన నారాయణ రావు నవలతో బహుమతిని పంచుకున్నారుట. సాహితీ ఉన్నతశిఖరాలను అధిరోహించిన విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం మహాకావ్యంగా పరిగణించ బడుతుంది. తెలుగు మెట్ట మాగాణుల సువాసనలను కిన్నెరసాని పాటలలో ఆలపించిన రసహృదయుడు. సనాతన ధర్మ వశిష్ఠతలపై సాహిత్య సేద్యం చేసిన మహనీయుడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వంలో భావుకత వెలలు విరుస్తుంది. ఈయన రేడియోలలోనూ, నాటికలలో, సినిమా పాటల రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందిన మహనీయుడు. విశ్వనాథ గారు కృష్ణశాస్త్రి గురించి చెబుతూ మనకు కిట్సు, షెల్లీ, వర్డవర్తుల లాంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో కృష్ణశాస్త్రి గారిగా పుట్టినారు అని అన్నారుట. కృష్ణపక్షం తెలుగు సాహితీ చరిత్రలో ఓ ముఖ్య ఘట్టం. ఈ శతాబ్దంలో కవులు రేడియోలు, చలనచిత్రాలలో కొత్తతరం సాహిత్య ప్రక్రియ దిశగా యుగళ గీతాలు, వీణ పాటలు, వేదాంత గీతాలు, భావగీతాలు, జానపద గీతాలు, విప్లవ గీతాలు అందించి చిరకాలంగా నిలిచారు.
ప్రస్తుతం 21 వ శతాబ్దం పరిస్తితులలో సాంఘిక విప్లవ సాహిత్యము, నవలలు, చిన్న కథలు, సీనీ సాహిత్యము, టీవి సాహిత్యము లాంటివి తెలుగు సాహిత్యం ముఖచిత్రాన్ని పూర్తి చేస్తున్నాయి. ఆంధ్ర సాహిత్య చరిత్ర గురించి రాసిన వారు చాలామంది కవులు ఆరుద్ర లాంటి వారున్నారు కానీ విదేశాలలో ఉన్న వారికి ఇవి అందుబాటులో లేని కారణంగానూ, ఆధునిక యుగంలో అన్నీ ఆన్లైన్ లో లభ్యం అవుతుండగా, వికిపీడియా లాంటి సంస్థల వల్ల చాలా విషయాలు తెలుసుకో గలుగుతున్నాము. రాను రాను పత్రిక ప్రచురణలు కూడా అంతర్జాల పత్రికలుగా తీర్చిదిద్దుకుంటున్నాయి అనడంతో ఏ మాత్రం సంచయం లేదు. ముందు తరంలో రాసినవన్నీ ఈ తరం వారికి, మరియు మున్ముందు తరాల వారికి అందించేలా సాహితీ రచనలను ఇంటర్నెట్ ఆర్చీవులలో కూడా పొందు పరచడంతో నాలాంటి వారికి ఎంతో దోహదం చేస్తున్నాయి. నేను దీంట్లో రాసినదంతా చాలా వరకూ వికిపీడియా చలవే. కొత్తగా రాసింది కొంతే తప్పా మిగతాదంతా సేకరించి, కూర్పు చేసినదే. ఇకపోతే మన తర్వాత తరాలలో సాహిత్యం ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టతరమైన పనే. ఆ ఊహ ఏదో నేనే ఊహిస్తే సరిపోతుందేమో? నా ఉద్ధేశ్యంలో కాలంతో పాటు సాహిత్యం కూడా కొత్త పద్దతులు అనుసరిస్తూ టెక్నాలజీ ను ఉపయోగించు కుంటూ ముందుకు సాగి, కంప్యూటర్లు కూడా మనుషుల లానే మంచి సాహిత్యం రాసే రోజులు రావడం ఖాయమని కచ్చితంగా చెబుతాను. కనురెప్పలు ఎగరేసారా? ఇది అసాధ్యం కాదని, కంప్యూటర్లలకు మనుషులాగే తెలివితేటలు నూరుతున్న రోజులివి, కావున ప్రపంచంలోని సాహిత్యం అంతా సమ్మేళనం జరిగి ఎవరికి ఎలాంటి సాహిత్యం కావాలో కంప్యూటర్లను అడిగి రాయించుకునే రోజులు తప్పక రావచ్చునని చిలక జోస్యం చెబుతూ ఈ మొదటి భాగం ముగిస్తున్నాను.
శుభం భూయాత్!
కౌండిన్య – 16/03/2017