బాహుబలి
నిమ్మడ్డా..గోజ్రాస్ తెల్మి..అర్దా భూస్..క్ క్రాక్వికానా భుమ్లి..మొహినూజుకో…లియూహక్వే..ఉను కాష్టా..పీజ్రా..రూపువీమ్మిన్..బహత్తీ…జరత్రామ మహాష్ మాత్రీ…బ్రీంసా..ఇన్ కునూం. మిన్ మహాక్కి… చూహూ… చున్నమతాస్వీక్ డీ…థారా… ఘరాక్స్… హూర్ర్…ఆర్ర్.. నల్లగా ఒళ్ళంతా మసి పూసుకొని భయంకర రూపంలో కాలకేయుడు వాడిన చిత్ర విచిత్ర ‘కిలికి’ భాష మీకు మళ్ళీ గుర్తు వచ్చిందా?
బాహుబలి మొదటి భాగం చూసిన తరువాత రెండేళ్ళు ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న’ అంశం మీద ఎన్నో ఊహాగానాలు, జోకులు, ఎదురుచూపులతో గడిపి మొత్తానికి బాహుబలి-2 సినిమా వేల థియేటర్ల లో రిలీజ్ అయ్యి మొదటిరోజే కలెక్షన్ల రికార్డ్‌లు బద్దలుకొట్టిన మొట్టమొదటి తెలుగు సినిమా. సూపర్ స్టార్ రజని (తలైవా) కూడా రాజమౌళి గారికి, వారి టీమ్ కు సలాంకొట్టి ఇదొక ‘మాస్టర్ పీస్’ అని ట్వీట్ చేసారు. సోషల్ మీడియాలలో ఓ మూడు రోజులు గా అందరూ ‘నేను చూసానోచ్’ అంటూ వారి వారి పోస్ట్ లతో కవ్వించి తప్పక చూడవలసిన చిత్రంగా నిర్ధేశించారు. ఇక్కడ మా రాణిగారికి కూడా బకింగమ్ ప్యాలేసులో ఓ ప్రత్యేక షో వేసారు. జై మాహిష్మతి!
మొదటి భాగం:
ఉరకలేస్తూ ప్రవహించే నదిలో రాజమాత ‘శివగామి’ (రమ్యకృష్ణ) ఒక చేత్తో చంటోడిని ఎత్తుకున్న సన్నివేశం ఎవరూ మరిచిపోలేరేమో? ఆ చంటోడే డార్లింగ్ ప్రభాస్ చిన్నపుడు. కొండకోయల్లో, అద్భుత జలపాతాల మధ్య ఓ గూడెంలో ‘శివుడు’ గా పెరిగుతూ తన పెంపుడు తల్లి అభిషేకానికి కావలసిన నీళ్ళు తెచ్చే కష్టాలు చూడలేక, ఒంటి చేత్తో పేద్ద బండరాయి తో చేసిన శివలింగాన్ని ఎత్తి
జటా కటాహ సంభ్రమబ్రమ నిలింప నిర్జరి
విలోల వీచి వల్లల్రి విరాజ మన ముర్దని
ధగ ధగ ధగజ్వాల లలాట పట్ట పావకే
కిషోర చంద్రశేఖర రతి ప్రతి క్షమమ
ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది?
ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది
ఎవ్వరూ కనంది ఎవ్వరూ వినంది శివుని ఆన అయ్యిందేమో ?
గంగ దరికి లింగమే కదిలొస్తానంది ..
అంటూ కీరవాణి గారు పాడిన పాటకు శివుడు తన భుజం మీద శివలింగాన్ని మోసుకొచ్చిన సన్నివేశం తను ఎంత బలవంతుడో చూపిస్తూ మన మనసులో ఓ చెరగని ముద్ర వేసింది.
ఓ రోజు శివుడు ఎంతోకాలంగా అధిరోహించాలను కున్న ఎత్తైనశిఖారాన్ని ఎక్కడానికి హునన ..హూనన హూనన … అంటూ ఓ అతిలోక సుందరి ఇచ్చిన ఆహ్వానానికి ముగ్ధుడై ధీవర .. అన్న పాటతో కష్టాలన్నింటినీ తెగించి ఆ కొండ పైకి చేరతాడు. ఈ పాటలో లోతైన లోయల సొగసులు, ఎత్తైన జలపాతాల వొరవళ్ళు, అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలే కాకుండా శివుడి తెగింపు, ధీశక్తి అన్నింటినీ కనుతీరుగా చిత్రీకరించారు రాజమౌళి గారు. కేరళ లోని జలపాతాన్ని ఇంత అందంగా చూపించడం ఆయనకే సాధ్యమయ్యింది. అంత అందమైన ప్రకృతిని చూడగానే దానిలో లీనమవ్వాలనిపించడం ఖాయం, ఆ సన్నివేశం చూస్తున్నపుడు ఆ జలపాతంలో జల్లలు మన మీదే పడుతున్నాయన్న భావన కలగడం సహజం.
ఆ కొండపైన చేరి తనను కొండపైకి ఆహ్వానించిన చంద్రిక, అక్కడ గుహలలో నివసిస్తున్న కుంతల రాజ్య వీరవనితైన ‘అవంతిక’ (తమన్నా) కు తటస్థపడి ఆమె ప్రేమలో పడతాడు. ఇద్దరూ ఒకేలా పచ్చబొట్టు వేయించుకొని ‘పచ్చబొట్టేసినా ..’ అంటూ ఓ ప్రేమ పాట పాడి హాలీవుడ్ కు టాలీవుడ్ కు ఉన్న వ్యత్యాసాన్ని చూపించారు. అవంతికతో పాటు మాహిష్మతి రాజ్యంలో బందీగా ఉన్న కుంతల రాజ్య రాకుమారి ‘దేవసేన'(అనుష్క) ను విడిపించడానికి శివుడు కూడా బయలుదేరి ఆ సంగ్రామంలో మహిష్మతి రాజ్య శైన్యాధికారి ‘కట్టప్ప’ (సత్యరాజ్) ను కలుస్తాడు. కుంతల రాజ్య సైనికులతో పోరాటానికి వచ్చినవాళ్ళు ఆ శివుడిని చూసి వారి ఆయుధాలు కింద పడేసి, దణ్ణం పెడుతూ ‘బాహుబలి…..’ అంటూ గట్టిగా అరుస్తూ జేజేలు కొట్టడంతో తనకు అర్థం కాక ప్రభాస్ వాళ్ళని విసుక్కొని ‘నేనెవరూ? నన్నెందుకు ఆ కళ్ళు దేవుడిలా చూస్తున్నాయి?’ అంటూ అడగడంతో కట్టప్ప నున్నటి గుండు మీద వర్షానికి జారిపోతున్నా వినకుండా శివుడి కాలు తల మీద పెట్టించుకొని తీరిగ్గా ‘అచ్చంగా నీలా ఉన్న మీ నాన్న ‘అమరేంద్ర బాహుబలి’ ని చంపిన పాపాత్ముడిని నేనే’ అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకొని అసలేం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. చంపిన మాట వాస్తవమే కానీ ఎందుకు చంపాడో ఓ రెండేళ్ళు సస్పెన్స్‌లో పెట్టిన సంగతి మళ్ళీ చెప్పనక్కర్లేదు.
మాహిష్మతి రాజ్యం. కొండల మధ్యలో బంగారు వన్నెతో కూడిన అతి పెద్ద రాజ మందిరం, లోపల పెద్ద భవంతులు, ఎత్తైన ప్రాకారాలు, బంగారంతో మెరిసే విగ్రహాలు, నిలువెత్తు ఆభరణాలు, కత్తులు, ఖడ్గాలు, విల్లులు లాంటి ఆయుధాలు, సైన్యాలు, అశ్వాలు, ఏనుగులు, విశాలమైన మైదానాలు, పెద్ద రాజ్య సభ, భారీ ఆసనాలు, బోలెడు ప్రజలు, రాజ్యంలో బలగాలు. ఇది వరకు రాజ్యాలు ఎలా ఉండేవో చదవడం తప్ప ఊహించుకోవడమే. రాజమౌళి గారి ఊహాకల్పన ఇంతా అంతా కాదు. అద్భుత చిత్రీకరణ.
మాహిష్మతి రాజ్యానికి బిజ్జల దేవుడు (నాజర్) పెద్దకొడుకు, అవిటి వాడు, వక్ర బుద్ది కలవాడు. ఆయన భార్య శివగామి (రమ్యకృష్ణ) అందరూ ఆమె ఆజ్ఞనే శిరసావహిస్తారు ఆ రాజ్యంలో. వీరి కొడుకు బల్లాల దేవుడు (రాణా). బిజ్జల దేవుడి తమ్ముడు కొడుకు అమరేంద్ర బాహుబలి (ప్రభాస్). తన తండ్రి యుద్దంలో చనిపోతాడు, తల్లి ప్రసవించిన సమయంలో పోవడంతో బాహుబలిని పెంచే బాధ్యత కూడా శివగామి దే కావడంతో మమతల తల్లీ! ఒడి బాహుబలి…….అంటూ ఓ పాటతో ఇద్దరినీ పెంచి పెద్ద చేస్తుంది. బాహుబలికి తన సైన్యాధికారి కట్టప్పని మామ అంటూ స్నేహంగా ఉండటంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.
బల్లాల దేవుడు, బాహుబలి కలిసి అన్నీ విద్యలు నేర్చుకుంటూ అతి బలవంతులుగా పెరుగుతారు. కండలు తిరిగిన శరీరాలతో ఒంటి చేత్తో దేనినైనా పిండి చేయగల సాహసం వీరిది. బల్లాల దేవుడు మైదానంలో బలిసిన పశువుతో యుద్దం చేసిన వి ఎఫ్ ఎక్స్ గ్రాఫిక్స్ తో తీసిన సన్నివేశం చాలా రక్తిగా ఉంటుంది. ఇద్దరూ సమకాలీకులైనా ప్రజల నాయకుడు మాహిష్మతి రాజ్యానికి యువరాజుగా బాహుబలికి పట్టాభిషేకం కట్టపెట్టడం అన్న అంశంపై బిజ్జల దేవుడు, బల్లాల దేవుళ్ళ కపట బుద్ది బయట పడుతుంది. తను పెద్ద వాడు కనుక తనే సింహాసనానికి వారసుడిని తన అభిప్రాయం వ్యక్తం చేయడం తో వారి ప్రతిభ చాటుకోవడానికి ఓ సదవకాశం దొరుకుతుంది. కాలకేయుడు దండయాత్ర చేస్తున్నాడన్న వార్త తెలిసి ఎవరైతే రాజ్య రక్షణలో గొప్పగా పన్నాగాలు పన్ని కాలకేయుడు మీద గెలుస్తారో వారే పట్టాభిషేకానికి అర్హులు అన్న శివగామి ఆజ్ఞతో ఇరువురు కాలకేయుడు తో హోర పోరాటం సాగిస్తారు, చివరకు బాహుబలికే సమర్ధుడిని నిర్ణయిస్తుంది శివగామి.
ఈ యుద్ద సన్నివేశం తీసిన తీరు చూస్తున్నప్పుడు మనకు సినిమా యొక్క లోతు కనపడుతుంది. విజువల్స్ గ్రాఫిక్స్ వాటి ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఓ బెంచ్‌మార్క్ సెట్ చేసింది. గ్లాడియేటర్, త్రీ హండ్రెండ్ లాంటి సినిమాలలో యుద్ద సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోదు. దీనికి ముందు రామచరణ్ తేజ చేసిన మగధీరుడు ఈ కోవకు చెందుతుంది.
బాహుబలి ప్రజల నాయకుడైతే, బల్లాల దేవుడు ఎట్టి పరిస్తితులలో ప్రజలకు నాయకుడు అవుదామన్న ఆలోచన విధానంతో పాటు ధర్మం, అధర్మం, మంచి, చెడులను చూపిస్తూ కుట్ర పన్నించి కట్టప్ప చేత బాహుబలిని చంపించి, దేవసేన ను బందీగా చేస్తాడు బల్లాల దేవ. మాహిష్మతీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు, కుంతల రాజ్యాన్ని నాశనం చేయిస్తాడు.
అవంతిక కు ఇచ్చిన మాట ప్రకారం చిన్న బాహుబలి తను ఓక్కడే మాహిష్మతి రాజ్యంలోని నిప్పులే శ్వాశగా గుండెలో ఆశగా … అంటూ కీరవాణి పాటతో కోట లోకి ప్రవేశించగానే ‘తిరిగి వచ్చాడు బాహుబలి’ అంటూ సంకెళ్ళతో దేవసేను చూపించి రామాయణంలో హనుమంతుడు లంకలో సీతా రక్షణకై ప్రవేశించడం స్పూర్తిగా తీసుకున్నారేమో అని అనిపించింది. బందీగా ఉంటూ దేవసేన బల్లాలదేవుడి చితి కోసం ఎన్నో రోజులుగా ఒక్కొక్క పుల్లని చేరదీయడం కనపడుతుంది. మహాభారతంలో సన్నివేశాలను కూడా బాగా అధ్యయనం చేసారేమో నని అనిపిస్తుంది.
ఈ మొదటి భాగంలో కొన్ని ప్రశ్నలతో ముగించి రెండో భాగం మీద ఆసక్తి కలిగించేలా కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు? ఆ పసిబిడ్డ శివగామి ఎందుకు బ్రతకాల అని అంది? అసలు ఆ చితికి సిద్దం చేస్తున్న దేవసేన ఎవరు? అన్న ప్రశ్నలతో ముగించడంతో ఓ రెండేళ్ళు వీటి గురించి చర్చించుకుంటూ, ఈ మొదటి భాగం తీసిన అద్భుత తీరును మెచ్చుకుంటూ పొగడ్తలతో రెండేళ్ళు అందరూ గడపాల్సి వచ్చింది. రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ఎన్నో ఏళ్ళ అనుభవంతో తెరమీద నిండుతనాన్ని తీసుకువచ్చారు. ఈ సినిమాకే అంకితమైన మన ప్రభాస్ ఓ మాంచి వీరుడిలా కండలు పెంచి తెలుగు వారి హృదయానికి కొంత దగ్గరయ్యాడు. అలాగే రాణా కూడా నెగెటివ్ పాత్రలో కూడా తన శైలితో అందరినీ ఆకట్టుకున్నాడు. మొదటి భాగంలో తమన్నాకు అనుష్కా కంటే ఎక్కువ పాత్ర ఉండి, ఎనిమిది పాటలు ఉండటంతో కొంచెం వీటి మోస్తాదు ఎక్కువయ్యాయన్న మాటలు తరువాత వినిపించాయు. ఇందుకే మన సినిమాలు మూడు గంటలు ఉండటానికి ఓ కారణం.
రెండవ భాగం:
భళి భళి రా భళి భళి … సాహోరే బాహుబలి.. జై హారతి నీకో పట్టాలి అంటూ జై కొడుతూ గగనాల ఛత్రం పడతూ మాహిష్మతి ప్రజల జేజే ధ్వనుల గీతంతో సినిమా మొదలు అవుతుంది.
బాహుబలి పట్టాభిషేకానికి ముందు రాజ్యంలో పరిస్థితులు స్వయంగా తెలుసుకోమని శివగామి ఇచ్చిన సలహాకి కట్టప్పతో కలిసి మారు వేషంలో బయలుదేరుతాడు. కుంతల రాజ్యానికి చేరుకోగానే దారిలో దోపిడి దొంగల వల్ల పల్లకీలోంచి దిగి కత్తి పట్టిన వీర వనిత దేవసేన అందానికి ముగ్థుడై ప్రేమలో పడటం గమనించిన కట్టప్ప వారిని దగ్గర చేయటం కోసం వాళ్ళ కోటలోకి పనికి చేరతారు.
మొదటి భాగంలో నార చీరలతో చూసి డిసప్పాంయిట్ అయిన అనుష్క అభిమానులు విప్పారిన కళ్ళతో చూడటం ఖాయం. అందమైన రాకుమారి గురించి మనము కలలు కంటామే, అలాగే ఉంది, నిజం. మన ప్రభాస్ ఇంకొన్ని కండలు పెంచి, ఇంకొంచెం అందంగా తయారై సాహోరే బాహుబలి అనేలా ఉన్నాడు. ఓ సారి ఇండియాలో ఎయిర్పోర్ట్ కనిపించిన ప్రభాస్ ఇతనేనా అనిపించేలా ఉన్నాడు. నేను కూడా ఓ ఆరు పొట్లాలు నా ఒంటి మీద పెంచితే ఎంత బావుంటుంది అనిపించింది.
ఇక బల్లాలదేవ తండ్రితో కలిసి రాజ్యం చేతికి చిక్కించ్చుకోవడానికి కుట్రలు పన్నడం మొదలుపెడతారు. గూఢాచారుల ద్వారా దేవసేన బాహుబలి ల ప్రేమ గురించి తెలుసుకొని ముగ్థమనోహరి దేవసేన చిత్రపటం చూసి మోహిస్తాడు, ప్రేమ కాదు.
ఓ స్థంభం ఎత్తు చిత్రాన్ని గీయించి తను ప్రేమలో పడ్డానని శివగామి కి చెప్పడంతో, తన కొడుకుకు రాజ్యాధికారం దక్కలేదన్న ఎక్కడో ఓ మూల ఉన్న జాలితో దేవసేనతో నే పెళ్ళి జరిపించే బాధ్యత తనదని చేతి మీద చేయి వేసి ఒట్టు పెడుతుంది. గాంథారి ప్రేమ లాగా తన ఆలోచన తనను గుడ్డిదాన్ని చేయడం చూపించారు. దేవసేన కుంతల దేశ క్షత్రీయ పుత్రి కదా పెళ్ళిని తిరస్కరిస్తూ అవమాన పరిచేలా ఓ ఈమైల్ పంపడంతో శివగామి ఇగో హర్ట్ అయ్యి పక్షితో అక్కడ ఉన్న బాహుబలికి దేవసేన ను బంధించి తీసుకు రమ్మని సందేశం పంపుతుంది.
ఈ లోగా పిండారీలు అకస్మాత్తుగా కుంతల రాజ్యం మీద దాడి చేస్తారు. క్షత్రీయ యోధుడు, శైన్యాధికారి కుంతల రాజ్యం అక్కున ఉన్నారు కదా అమాంతంగా తిరుగుబాటు చేసిన సైన్యం మీద గెలిచి ప్రేయసికి ఇంకొంచెం దగ్గరవుతాడు రాకుమారుడు. అబ్బబ్బబ్బ…. బాహుబలి ఒంటి చేత్తో ఆ పోరాటం తీసిన తీరు అదరహో… ఆయన శక్తి సామర్ధ్యలను ఆస్వాదిస్తూ దేవసేన చూసిన ఓర చూపులు… ఈ సన్నివేశ చిత్రీకరణ చాలా బావుంది. ఈసన్నివేశం లోనే బాహుబలి అసలు పేరు ‘అమరేంద్ర బాహుబలి’ అని తెలుస్తుంది. వారిద్దరూ కలిసి చేసే విల్లు విన్యాసాలు అత్యద్భుతః! అర్థనారీశ్వర తత్వం లాగా ఇద్దరి శక్తితో చాలా మందిని కుప్ప కూల్చిన సన్నివేశం భేషుగ్గా ఉంటుంది.
దేవసేన రక్షణ భాధ్యత తీసుకొని ఓరోరి రాజా ధీరాధి ధీరా.. అనే పాటతో హంస నావలోమాహిష్మతి రాజ్యానికి బయలు దేరతాడు. ఈ సాంగ్ ఊహాలోకాలకు తీసుకువెడుతుంది. రెండో భాగంలో చూడవలసిన సన్నివేశం. పుష్పక విమానంలో మేఘాలలో ప్రయాణిస్తూ డ్యూయెట్ సాంగ్‌లో వాళ్ళు ఎంచుకున్న ఫిజిక్స్, కెమెస్ట్రీ, మాథమేటిక్స్ లలో ఏ సబ్జెక్టో తీసుకున్నారో మీరే నిర్ణయించుకోండి. ఓక్క చోట పిల్లలను కళ్ళు మూసుకొమంటే ఓస్ దీనికే అన్న చూపులతో ఆ సీన్ మిస్సయ్యా!
దేవసేనను బల్లాలదేవకు పెళ్ళి చేయలన్నది తిరస్కరించిని శివగామి కు దేవసేనకు మధ్య సాండ్విచ్ అయ్యి రాజ్యం పట్టాలు వొదులుకుంటాడు. కుట్రల మీద కుట్రలతో పరిస్థితులు చే జాలి కడుపుతో ఉన్న దేవసేన రాజ్య భహిష్కరణ పొంది, పడమటి కొండలలో వాలిన సూరీడులా కోటను వొదిలి మాతోనే ఉండలాయ్యా దండాలయ్యా.. అంటూ సామాన్యులతో యువరాజు రాణి గడపాల్సిన పరిస్తితికి కాలం తీసుకు వస్తుంది, వాళ్ళల్లో ఒకళ్ళుగా కలిసిపోతారు. బాహుబలి మీద ద్వేషం పెంచాలి సన్నివేశాన్ని సృష్ఠించిన బల్లాలదేవను గుడ్డి ప్రేమతో నమ్మి కట్టప్ప చేత అమరేంద్ర బాహుబలిని హత్య చేయిస్తుంది.
ఇంతలో దేవసేన కు బుడ్డోడు పుట్టిడం, కట్టప్ప మళ్ళీ నున్నటి గుండు మీద కాలు పెట్టడం వగైరాలు జరుగుతాయి. ఆ బుడ్డోడితో మాహిష్మతి రాజ్యానికి చేరుకుంటుంది దేవసేన. కట్టప్ప శివగామి చేసిన తప్పును బల్లాలదేవ పన్నిన కుట్ర గురించి తెలియచేస్తాడు. ఇంతలో తల్లి శివగామి మీద కూడా దాడి చేయించడంతో ఆ బుల్లిబలితో పారిపోయి గోవర్థన గిరిలా ఆ బుడ్డోడిని ఎత్తి పట్టుకుంటుంది. దేవసేనను బల్లాలదేవ బంధీగా ఉంచుతాడు, అనుష్క నారా చీరలో మళ్ళీ మొదటి భాగంలో లా కనిపిస్తుంది. సినిమా చూడకుండా చదివే వారికి ఆన్సర్లు పేపర్ లీక్.
ఆ బుడ్డోడే ‘మహేంద్ర బాహుబలి’ అవంతిక మాట ప్రకారం రక్షించడానికి కట్టప్ప తో కోటకు తిరుగుబాటుకు వస్తాడు. పెదనాన్నతో తలపడి దేవసేనతో చితి పెట్టేలా చేసి రాజ్యానికి అధికారంలోకి తీసుకుంటాడు. వీరిద్దరి పోరాట సన్నివేశాలు ముష్టి యద్దాలు ఒళ్ళు గగ్గురుబాటు కలిగిస్తాయి.
ఈ సినిమాలో వెనకాలంతా శివమయం చేసారు. ముఖ్య సన్నివేశాలలో లయకారకుడైన శివుడి రుద్రం వినిపిస్తూనే ఉంటుంది. ధర్మం రక్షణ యొక్క ప్రాధాన్యతను తెలుపుతుంది, బుద్ది సక్రమంగా ఉండాలని చాటి చెబుతుంది. ఇంక నీతులు చాలేమో?
ఇది ఓ జానపద అపురూప చిత్రం. ఇందులో సన్నివేశాలలో స్పెషల్ ఎఫెక్ట్స్ తో సృజనాత్మకతో కూడి అందరూ పడిన కష్టానికి తగ్గట్టుగా ఉండటం వెశేషం. ఇంతకీ నే సెప్పేదేటంటే ఈ సినిమా అభూత కల్పనల సమాహారం. దర్శకుడు రాజమౌళి సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే.
ఈ సినిమా ను మొదటి సారి థియేటర్ల లో చూస్తేనే బావుంటుందని అనిపించింది కావాలంటే రెండో సారి ఇంట్లో చూడవచ్చని నా అభిప్రాయం.
శుభం భూయాత్!
కౌండిన్య – 01/04/2017.