నేను రైల్లో ప్రయాణిస్తున్నాను. ఆ రైలు భోగిలో నాతో పాటు కొందరు ప్రయాణికులు కూర్చొని ఉన్నారు.
పక్కనున్న కిటికీ లోనుండి బాహ్యప్రకృతిని ఆస్వాదిస్తున్నాను. బయట కనిపించే చెట్ల మధ్యలోనుంచి భానుడు నాతో దోబూచీలు ఆడుతున్నాడు.
ఎదురుగా కూర్చున్న ఓ తోటి ప్రయాణికుడు నా చేతికి ఉన్న ప్లాస్టర్ వైపు పదే పదే చూడటం గమనించాను. సున్నిత మనస్కుడు లాగా ఉన్నాడు, ఆ చిరుగాయాన్ని చూసి కొంత చెలించినట్లుగా కనపడుతున్నాడు. నేను మాత్రం ఎప్పటిలాగే నిర్మలంగానే ఉన్నాను.
అతను ముందు మాట కలిపాడు. గాయం అయ్యిందా? అని దీనంగా అడిగాడు.
ఆహ్లాదమైన ప్రకృతి ప్రభావం వల్లనో ఏమో నాలో కవిహృదయం పొంగి ‘నే రక్తం ధారపోసాను’ అని చెప్పాను.
‘అవునా? అంటే ఏం చేసారు?’ అని అడిగాడు.
ప్రయాణ శబ్ధ కాలుష్యం వల్ల అతను అడిగినది సరిగా వినపడక ‘నే రక్తం ధారపోసాను’ హెచ్చు స్వరంతో మళ్ళీ చెప్పాను. మిగతా అందరి చూపు నా వైపుకు మళ్ళింది.
అతను ‘మీకు దేశ భక్తి ఎక్కువనుకుంటాను, కదూ!
నాకర్థమైయ్యింది. మీరు తప్పక సైన్యంలో పనిచేసి ఉంటారు’
‘ఆ సైన్యంలో ఎడార్లు, నదులు, అరణ్యాలు దాటి,
ఆయుధాన్ని భుజాన వేసి,
ట్రెంచెస్ లో వేచి చూసి,
వణికించే చలిలో, వానలో, ఎండలో, మంచులో కర్రలా బిగిసిన వెన్నెముక తో,
చంపడం,చావడం లాంటివెన్నో చూసి,
మీ రక్తం ధార పోసి,
దేశ సేవ చేసిన వాడిలా కనిపిస్తున్నారు. అవునా?’ అంటూ
‘హరికేను లాంతరు ఆరినా
ఆత్మీయుల ఆలోచనలతో కదులుతున్న కనురెప్పలు,
మీ లాంటి వారి రాక కోసం
ఎదురు చూపులతో కరడు కట్టిన ఎన్నో కళ్ళు,
మిత్రమా, నీకు నా జోహార్లు!’ అంటూ ఏకధాటిగా చెప్పి, అదిగో నా గమ్యం వచ్చింది అంటూ లేచి ఆలింగనం చేసుకొని ఆ ఆగిన స్టేషన్ లో దిగాడు. ట్రైన్ మళ్ళీ కదిలింది.
ఇదంతా చూస్తున్న ఎదురుగా ఇంకో అతను నన్ను ఓ త్యాగశీలిలా చూసాడు. మరో పక్కనున్న వృద్దురాలు తను తినబోయే పండు ప్రేమతో తినమంటూ నాకిచ్చింది. మిగతావారి కళ్ళలో నా మీద గౌరవం పెరిగిన భావం ప్రస్పుటంగా తెలుస్తోంది .. ఒక్క నా పక్కన కూర్చున్న ఆయనకు తప్ప.
కొంత సేపట్లో నా పక్కన కూర్చున్నాయనతో ‘నే రాత్రి నిరాహార దీక్ష చేసాను’ అన్నాను.
ఏంటి ? అని అడిగాడు.
‘నే రాత్రి నిరాహార దీక్ష చేసాను’ అని మళ్ళీ చెప్పాను, అందరి వైపుకు ఓ సారి చూసాను.
సర్రున లేచింది అతని స్వరం. ‘ఏ టెస్టు కోసం బ్లడ్ ఇచ్చుంటావ్! డాక్టరు గారు రాత్రంతా ఫాస్టింగ్ చేయమని చెప్పుంటాడు. ఇందాకటి నుండి చూస్తున్నా, యదవ బిల్డప్పాపు నువ్వునూ.. నువ్వెంత ప్రయత్నించినా కవి వి మాత్రం ఛస్తే కాలేవు, ఇందాక నీ గురించి ఏదేదో ఊహించేసుకొని, ఊగిపోయి నాలుగు ముక్కలు చెప్పాడు చూడు అతనిలో కవి అయ్యే లక్షణాలు, దేశ భక్తి బాగా కనిపిస్తున్నాయి.’ అన్నాడు.
గుమ్మడి కాయంత నా మొహం కాస్తా సపోటా పండంత అయ్యింది. మిగిలిన వారు కోపంతో పళ్ళు నూరటం రైలు ఆగబోతున్న పట్టాల కీచు శబ్ధంలో కూడా బానే వినపించాయి.
స్టేషన్ రావడంతో నేను లేచి చిన్నగా జారుకో బోతున్నాను, ముందుకు నడిచాను. అంతే.. నా వీపు విమానం మోత మ్రోగింది. నా శరీరంలో నలుమూలల నుండి రక్తం అంబులెన్స్ లా శరవేగంతో ప్రయాణించి నా వీపు మీద ఆ వృద్దురాలి హస్తముద్ర చిత్రీకరణ ప్రారంభించాయి. వెనక్కి తిరిగాను. ఇందాకా ఆ పండు చేతిలో పెట్టిన వృద్ధురాలు దురుసుగా దాన్ని నా చేతిలోంచి లాక్కొని ‘ఇది నాది. బయట కొనుక్కొని తిను’ అంటూ దాన్ని నోట్లో పెట్టుకొని కసుక్కున కొరికింది!
నా చేతులు ప్రమేయం లేకుండా గూబల్ని కప్పాయి. గుయ్ య్ మనకుండా!!! ఆలస్యం చేయకుండా వడి వడి గా ప్లాటుఫారమ్ మీదకు దిగాను.
వామ్మో! నే ఛస్తే కవిని కాను!!