శ్రీ సత్యం శంకరమంచి గారి అమరావతి కథలలో ఒక అనిర్వచనీయమైన కథ ‘కాకితో కబురు’. ఈ అమరావతి కథల సంపుటికి కమనీయమైన ముందు మాట రాసిన శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు ఈ కథ గురించి ప్రస్తావిస్తూ ‘కాకితో కబురు’ అన్న దానికి రచయిత మేఘసందేశం అంత స్థాయిని కలిపించారు అన్నారు. శంకరమంచి గారి కథలు, కథావస్తువులు, కథలలో పాత్రలు, ఇతివృత్తానికి తగ్గట్టు చేసిన ఊహలు చెప్పడానికి వాక్యాలు చాలవు అనడంలో అతిశయోక్తి లేదు. ఆ కథలకు బాపు గారు వేసిన వర్ణణాచిత్రాలు ఆ కథలకు అలంకారాలే. ప్రత్యేకంగా ఈ ‘కాకితో కబురు’ అనే కథకు బాపు గారు వేసిన చిత్రం పదే పదే చూడాలనిపిస్తుంది. రచయితలు ఇలాంటి ఉత్తమశ్రేణి కథలు రాయాలని కలలు కనడం సహజం. తెలుగుదనం ఉట్టిపడుతూ, ప్రపంచ సాహితీ జగత్తులో తెలుగు వారు సగర్వంగా తెప్పుకోదగ్గవి ఈ కథా సంపుటి లోని కథలు. ఇవి పాఠకుల హృదయాలలో చిరకాలంగా నిలిచిపోయే మేటి కథలు.
జువ్వి, చింతాలు మావ
అంట్లు తోమే పిల్ల పేరు ‘జువ్వి’. మానులా పడి ఉండక, మనిషిలా బ్రతకాలని, నవ్వాలని, ఏడవాలని కలలు కంటూ ఉంటుంది. ‘సంపాదన లేనోడికి పిల్లనిస్తానా?’ అన్న దెప్పిపొడుపులకు రోషం వచ్చి పడవలో వంటవాడిగా చేరిపోయిన మనిషి చింతాలు మావ. అమరావతి ఒడ్డు నెలరోజుల క్రితం విడిచి వెళ్ళిన చింతాలు మావ కోసం జువ్వి ప్రతీ రోజూ నిరీక్షణే, పైగా దూరంగా ఉన్న మావ మీద విరహం. మళ్ళీ ‘ఎక్కడ పడవ వొదిలేసి లాంచీలో చేర్తాడో దూరంగా ఉన్న గోదారి వెడిపోతే మావ సూపందదేమోనని’ జువ్వి కి దిగులు కూడా పట్టుకుంది. ‘తన మెడలో తాళి వేస్తే సక్కంగా వంట చేసి పెట్టేదాన్ని కదా, ఏటి ఖర్మ?’ అని జువ్వి అభిప్రాయం.
జువ్వి నేస్తాలు
చెట్ల మీదుండే కాకులు, కొమ్మ తొర్రల్లో ఉన్న ఉడతలు, చిటారు కొమ్మ ల మీదున్న రామచిలుకలు జువ్వికి నేస్తాలు. దొడ్లోకి రావడం ఆలశ్యం కాకులు వచ్చి వాలతాయి, ఉడతలు పరిగెత్తుకొస్తాయి, రామచిలుకలు రివ్వున వాలతాయి. తోమటానికి తెచ్చిన గిన్నెల్లోంచి ఓ కూరముక్క తొర్రలోంచి తొంగి చూసే ఉడతకు విసురుతుంది, గిన్నెలో అడుగు మెతుకులు తీసి రాయి మీద కాకులకు పెడుతుంది, రాణివాసం పిట్టలైన రామచిలుకలకు ఎంగిలి గిట్టవని వస్తూ వస్తూ ఏరుకొచ్చిన చింతకాయలు ఎగరేస్తుంది. జువ్వి అంట్లు తోముతుంటే తన చుట్టూ తన నేస్తాలు సభ చేసినట్లు చేరతాయి. జువ్వి అంట్లు తోముతూ వాటికి తన వూసంతా వెళ్ళబోసుకుంటుంది.
జువ్వి వూసు కబుర్లు
జువ్వి అంట్లు ఒక్కొక్కటి తెచ్చి దొడ్లో పడేస్తుంటే కాకులు గెంతుతూ దగ్గరకు వస్తుంటే “ఉండండే! ఒకటే తొందర!” అని విసుక్కుంటుంది వాటిని జువ్వి. అవి వింటాయా? ముక్కు ముక్కు రాసుకుంటూ, రెక్కలు తప తప కొట్టుకుంటూ జువ్వి దగ్గరకు వస్తాయి. జువ్వి రాయి మీద పెట్టిన మెతుకులు కలబడుతూ తింటుంటే “కొట్టుకు చావకండే! ఈ కొద్ది దానికి!” అంటూ మందలిస్తుంది జువ్వి. ఆ అంట్లు తోముతూ తన వూసంతా వెళ్ళబోస్తుంటే ఒక కాకి రాయి మీద, ఇంకోటి గుట్ట మీద, మరొకటి బోర్లించిన గిన్నె మీద చేరి జువ్వి చెప్పినవన్నీ ఆలకిస్తూ ఉంటాయి. జువ్వి ‘చింతాలు మావ ఏ రేవులో ఉన్నాడో సూసిరాకుడదంటే?’ అని ఓ రోజు, ‘ఏయ్! మావ పడవ దొండపాడు రేవు కాడున్నాడేమో? ఎట్టుండాడో చూసి రాకూడదంటే!” అంటూ ఇంకో రోజూ కబుర్లు చెబుతుంటే ఆ కాకులు అంతా తెలిసిపోయినట్లు “ఆలోచిస్తాము” అన్నట్లు ముక్కులతో రెక్కలు గీసుకుంటూ అంటుండటం, ఇంతలో ‘జువ్వి, ఎవరితో మాట్లాడుతున్నావు?” అని అమ్మగారడిగిన మాటకు ‘ఏం లేదమ్మ! ఈ కాకులు ఒకటే రొధ! హేయ్” అంటూ అదిలించ అంట్లు ఇంట్లో ఇచ్చేయటం మామూలే.
జువ్వి జాలి గుండె
ఇంటావిడ జువ్వికి ఉప్పులపిండి పెట్టి ‘తినవే’ అంటే ఆ ఆకు చెత్తో పట్టుకొని ఏడుస్తుంది. తనలానే అంట్లు తోమిన తల్లిని గుర్తుచేసుకుంటుంది. ఇంటి వాళ్ళు ఏమైనా పెడితే జువ్వి తల్లి మొగుడికి తెలియకుండా జువ్వికి పెడితే “అయ్యకో” అంటూ ఏడ్చేది. ఇప్పటికీ అంతే, ఆకు పట్టుకొని ఏడిస్తే ‘ఏడుపెందుకే పిచ్చిదానా?’ అని ఆ ఇంటావిడ సముదాయించి “మీ అయ్యకు వేరే ఇస్తా నువ్వు తిను” అంటే ముఖం వికసించి నవ్వుకుంటూ ఆకు తీసుకెడుతుంది. తను తీసుకెళ్ళే అన్నం మెతుకుల కోసం తనను విడిచి పెట్టనంటాడు జువ్వి అయ్య. జువ్వి తెచ్చిన అన్నం తింటూ వాణ్ణీ వీణ్ణి డబ్బులడుక్కొని తాగి జువ్విని కొడతాడు. ‘తిట్టినా కొట్టినా అయ్య అయ్యే కదా! నేను మావ వెంట వెడిపోతే అయ్యకు దిక్కెవరు అంటుంది’ జాలిగండెతో జువ్వి.
శ్రావణ మాసం శుభగడియలు
కృష్ణ నిండుగా పొంగి పారుతుంటే, కృష్ణ మధ్యలోంచి పడవలు పోలేవు కాబట్టి వొడ్డెమ్మట పోతున్న పడవలు దొడ్లోంచి పోతున్నట్లున్నాయి. తెల్లవారగట్టే వచ్చింది జువ్వి, ఆ రావడం చూసి కాకులు, ఉడతలు, రామచిలుకలు కూడా చుట్టూ చేరాయి. జువ్వి అంట్లు తోముతున్నా ధ్యాసంతా ఆ పడవల మీద పడి, పరుగెత్తి ఒడ్డుకొచ్చిన ప్రతి పడవను చూస్తుంది మావ జాడ కోసం. కాకులన్నీ కావు కావు మంటూ లేచి కృష్ణమ్మ వైపుకెళ్తున్నాయి అంటే చింతాలు మావ పడవస్తుందనమాట. జువ్వి అంట్ల గిన్నెతో పరుగెత్తుకెళ్ళింది. మాసికల తెరచాప పడవ దగ్గర కొస్తోంది. ‘అల్లడుగో చింతాలు మావ! చుక్కాని దగ్గర వంట గిన్నెతో చెయ్యూపాడు, జువ్వి అంట్ల గిన్నె ఊపింది. పడవ దగ్గరకొస్తోంది, జువ్వి కళ్ళలో కృష్ణమ్మ ముంచుకొచ్చింది. ఏదో అడగాలన్నా నోట మాటరావడం లేదు జువ్వికి, ఏదో చెప్పాలన్నా చింతాలు మాటకు నోరు పెగలడం లేదు. పడవ జువ్వి ని దాటిపోతొంది. చింతాలు మావ లంకల్లో కోసుకొచ్చిన జామకాయ ఒడ్డు మీదకు విసిరాడు. జువ్వి చెంగున ఎగిరి అందుకొంది. మాసికల తెరచాప దూరమయ్యింది.
కాకితో కబురు
చింతాలు మావను చూసిన సంబరంతో గెంతుకుంటూ దొడ్లోకి వచ్చి ఒక చేత్తో ప్రేమగా జామకాయ కొరుక్కుతింటుంది. తనింత కొరికి ఇంత ముక్క కాకులకు, మరికొంత ఉడతలకు, మిగిలినది రామచిలుకలతు ఎగరేస్తుంది.
ఇంటావిడ చల్లపిండి పెడితే ఆకు పట్టుకు ఏడిస్తే “మీ అయ్యకు వేరే పెడతాలే” అంటే కళ్ళు తుడుచుకొని మళ్ళీ ఏడ్చింది, ఈ సారి ఏడ్చింది అయ్య కోసం కాదు మావ కోసం.
కళ్ళు తుడుచుకొని చుట్టూ చేరిన కాకులతో “మావ పడవ ధరణికోట రేవు కాడుంటాది. మీరెల్లి నేను మావ కోసం ఏడవలేదని చెప్పండే! నవ్వేనని చెప్పండే!” అంటూ గలగల నవ్వింది జువ్వి.
కేవలం మూడు పేజిల కథ
‘మావ కోసం ఏడవ లేదని చెప్పండే! నవ్వేనని చెప్పండి!’ అన్న కథలో చివర వాక్యం చదవగానే గుండెలో గుబులు పుట్టి, కృష్ణవేణి మన కళ్ళలో ఉప్పొంగి మనం నవ్వుతూ ఏడ్వటం సహజం. శ్రీ సత్యం శంకరమంచి గారి రాసిన ఈ కథ కేవలం మూడు పేజీలే దాన్ని విశ్లేచించి రాస్తే ఎన్నో పేజీలు రాయదగ్గ కథ. రచయిత తన శక్తితో కథను గొప్ప స్థాయికి తీసుకువెళ్ళి కథలోని రసానికి రూపం కట్టి, పాఠకులను ఆయన భావాలను అనుభవించేలా చేయటం ఒక గొప్ప కళ. మనసుకు హత్తుకొని కొన్ని సందర్భాలు కరడు కట్టున హృదయాన్ని కూడా ద్రవింపజేసేలా ఈ కథను తీర్చిదిద్దిన శ్రీ సత్యం శంకరమంచి గారికి జోహార్లు. కథలతో పాటు పాఠకులకు ప్రయాణింపజేయిస్తూ, అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందేలా ఓ వంద కథలు ఉన్నాయి ఈ అమరావతి కథల పుస్తకంలో!
కౌండిన్య – 01/08/2018