నంది తిమ్మన గారి కవితలు ముద్దుగా ఉంటాయని ఒక ప్రతిష్ఠ. ఈయనకు మారు పేరు ముక్కు తిమ్మన. ‘ముక్కుతిమ్మనార్యు ముద్దుపల్కు’ అని లోకంలో ప్రవాదం కూడా ఉంది.
ముక్కుతిమ్మనార్యుని ‘పారిజాతాపహరణము’ వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగంగా కీర్తించబడ్డ ప్రబంధయుగానికి చెందిన అపూర్వ కావ్యం.
తిమ్మన గారి ‘పారిజాతాపహరణము యొక ముద్దైన కావ్యము’ అని ప్రస్తావించి, ఈ కావ్యంలోని పద్యాలు పారిజాత పరిమళాలు అంటూ ప్రశంసించారు శ్రీ విశ్వనాథ గారు.
ఈ కావ్యంలోని ఒక విచిత్ర ఘట్టం ‘పుణ్యక వ్రతము’. నారదుడు సత్యభామ తో ఈ పుణ్యక వ్రతము (మగని దానం చేయడం) చేయమని, ఆ వ్రతకల్పం ఉపదేశిస్తాడు.
“పుణ్యకవ్రతము” ను ఆచరించిన సత్యభామ, ఆ వ్రత నియమానుసారం తన పతియైన శ్రీకృష్ణుణ్ణి నారదమహర్షికి దానం ఇస్తుంది. శ్రీ కృష్ణుడు అంతటి వాడే నారదులకు దాసుడవుతాడు.
తనకు దానంగా లభించిన ఆ పరమాత్మునిచేత ఆ దేవర్షి పనులు చేయించుకుంటూ ఆడుకొనడం ఏ కవి రాసి ఉండడు, అదీకాక తెలుగులో ఒక్క ముక్కు తిమ్మన గారే వ్రాసి ఉంటారుట.
పంచమాశ్వాసము లోని నారదుడు కృష్ణుడి చేత పనులు చేయిస్తున్న పద్యము
సీ “మేళవించినవి సుమ్మీ దీని మె” ట్లని
మాంసలాంసంబున మహతిఁ జేర్చి,
“మిన్నేటిజలము సుమ్మీ తొలంకెడు” నని
డాచేత మణికమండలు వొసంగి,
“ఇది జపోచితము సుమ్మీ జతనం” బని
వలచేతఁ బద్మాక్షవలయ మిచ్చి,
“యీశాను డిచ్చెఁ జుమ్మీ మాకు నిది” యని
శార్దూలచర్మంబుఁ జంకఁ జొనిపి
తే “పొమ్ము పొ” మ్మని యొకకొంత పోవఁ బోవ,
“రమ్ము ర” మ్మని మరలఁ జేరంగఁ బిలిచి
కపటనటనాపరుండైన కంసవైరిఁ
బరమముని నవ్వుటాలకుఁ బనులు గొనియె.
మ నిగమాంత ప్రతిపాద్యు నాద్యు నభవు నిత్యు న్గుణాతీతు వి
శ్వగురున్ జిన్యయు నవ్యయుం బరము నిశ్శింకం బనుల్గొంచు మౌ
నిగరిష్టుండు కృతార్థుఁ డయ్యె నన సందేహింపఁగా నేల! భ
క్త గణాధీనుఁ డనంగ నవ్విభుఁడు లోకఖ్యాతిఁ బెంపొందఁడే!
క్లుప్త తాత్పర్యం:
నారదుడి వీణ పేరు మహతి దాని గురించి చెబుతూ “దీని మెట్లు మేళవించివున్నవి సుమా! జాగ్రత్త!” అని దానిని కృష్ణుని బలిష్ఠమైన భుజానికి (మాంసలాంసము) తగిలించాడుట.
ఆయన మణికమండలమును కృష్ణుడి ఎడమచేతికి అందిస్తూ “ఇందులో పవిత్రమైన ఆకాశగంగా జలము ఉంది. తొణకనివ్వకు” అని హెచ్చరించాడుట.
అలాగే ఆ పరమాత్ముడి కుడిచేతికి తామరపూసలమాలను ఇస్తూ “ఇది జపం చేయడానికి ఎంతో ఉపయోగకరం. భద్రం సుమా!” అన్నాడుట.
తను నిత్యం జపం చేసుకునే పులిచర్మాన్ని ఇస్తూ
“దీన్ని సాక్షాత్తూ పరమశివుడే నాకు ఇచ్చాడు, జాగ్రత్త” అని దానిని కృష్ణుని చంకలో జొనిపాడుట.
ఇక ఆయన సామగ్రి అందచేసిన తరువాత శ్రీ కృష్ణుడిని
ముందు “అటు వెళ్ళూ” అని చెప్పి, కొంతదూరం వెళ్ళగానే “అహాఁ! అటు కాదు. ఇటు రా!” అంటూ అటూ ఇటూ నడిపించాడుట.
బ్రహ్మాదులకే వశంకాని నారాయణుణితో నారదుల వారు చేయించుకున్న సేవలను వర్ణించిన అద్భుతమైన, మృదువైన భావములు కలిగిన, తెలుగు మరియు భారతీయ సారస్వతపు ప్రత్యేక పద్యము ఇది.
ఈ కావ్యాన్ని నంది తిమ్మన క్రీ.శ.1500 ప్రాంతంలో రచించారని చెబుతారు.
ఈ పారిజాతాపహరణం కావ్యంలోని పంచమాశ్వాశం లోనే నారదుడు చతురోక్తులతో శ్రీకృష్ణుడిని నుతిస్తున్న కంద పద్యాలు చదవటానికి కూడా సరదాగా ఉన్నాయి.
ద్వ్యక్షరికందము: దీనిలో “న , మ” అనే రెండు అక్షరాలతో సాగుతుంది.
మనమున ననుమానము నూ
నను నీనామ మనుమనుమననమునునేమ
మ్మున మాన నన్ను మన్నన
మను మను నానామునీనమానానూనా!
నర్ధభ్రమక / అనులోయ విలోమ కందము: దీనిలో మొదటి రెండు పాదాలు తుది నుండి వెనుకకు చదివితే మూడు నాలుగు పాదాలవుతాయిట.
నాయశరగసారవిరయ
తాయననజయసారసుభగధరధీనియమా
మాయనినిధీరధగభసుర
సాయజనయతాయరవిరసాగరశయనా!
(ఈ ద్వ్యక్షరికందము ఉపయోగించి నే రాసే ఓ గలగల పద్యం కోసం వేచిఉండండి! “నూ , నె” అన్న రెండక్షరాలతో సాగేలా ప్రయత్నిస్తాను. నేను యుకే లో లేచే లోగా ఇండియాలో మీరు మీకు నచ్చిన అక్షరాలతో ప్రయోగించవచ్చు.)
కౌండిన్య – 21/03/2019