hi, NANNA
ఈ మధ్య ఓటిటి లో చూసిన సినిమాల్లో మళ్ళీ చూడలనిపించిన సినిమా “హాయి, నాన్న”.
నాని, మృణాళ్ ఠాకుర్ ప్రథాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, అధ్బుతమైన సంగీతం తో పాటు, చక్కటి మలుపులతో కూడిన స్క్రీన్ ప్లే తో అందించాడు దర్శకుడు శౌర్యువ్. ఇది తన డెబ్యూ డైరెక్షనల్ సినిమా ఇది.
ఈ మధ్య వచ్చిన ప్రేమ కథా చిత్రాల కన్నా ఇది విభిన్నంగా ఉంది.
సగటు ప్రేమ చిత్రంలో లాగా ఈ కథ హీరో, ప్రధానంగా హీరోయిన్ చుట్టూ కాకుండా, వారి కూతురి పాత్ర తో కూడా ముడిపడి ఉంటుంది.
కూతురికి ఉన్న రేర్ కండిషన్ (సిస్టిక్ ఫైబ్రాసిస్) సెంటిమెంట్ తో సాగే కొన్ని సన్నివేశాలు హృదయానికి హత్తుకునే లా చక్కగా నడిపించాడు డైరక్టర్.
కూతురు బ్రతుకుతుందా లేదా అన్న సందిగ్ధంతో పాటు, తనను కాపాడాలన్న తండ్రి యొక్క తపనను చక్కగా చూపించాడు.
అలాగే కూతురికి కష్టం వచ్చినపుడు అండగా నిలిచే పాత్ర తండ్రిది, కూతురి కష్టం భరించలేని పాత్ర తల్లిది, ఈ రెండు విభిన్న పాత్రలను బాగా నడిపించాడు.
అతి మీరిని సన్ని వేశాలు కనపడవు, అనవసరమైన ఫైట్లు లేవు, డైలాగ్స్ సరళంగా ఉంటాయి.
కూతురుగా నటించిన పాప ‘కియారా ఖన్నా’ చక్కగా, ఎంత వరకూ చేయాలో అంతవరకే చేసింది.
ఒక్క ‘ఓడియమ్మ’ అనే మాస్ బీట్ సాంగ్ తప్ప మిగతా పాటల సంగీతం సినిమాలో ఆహ్లాదకరంగా ఉంది. తనకు నచ్చిన ‘శంకరాభరణం’, ‘నళినకాంతి’ రాగాలతో పాటలను కంపోజ్ చేసానని మ్యూజిక్ డైరక్టర్ హేషమ్ అబ్ధుల్ వాహబ్ ఓ సన్నివేశం లో చెప్పడం జరిగింది. వాహబ్ ఒకటి రెండు పాటలకు తన స్వరం అందించాడు. అతని స్వరం కు రెహమాన్ స్వరం లాగా సూఫీ ఇన్ఫూయన్స్ కనిపిస్తుంది.
సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ ను వాడారుట మ్యూజికి డైరక్టర్ వాహబ్, ఇలా చేసిన మొట్టమొదటి భారతీయ చలన చిత్రం ఇది.
‘గాజు బొమ్మ’, ‘సమయమా’, ‘ఇదే ఇదే’ లాంటి పాటలు చిన్న పదాలతో అర్థమయ్యేలా ఉండటం ఒక ప్లస్ పాయింటు. అనంత శ్రీరామ్ గారి అద్భుతమైన లిరిక్స్.
డైరెక్టర్ కథను ఉత్కంఠభరితం గా తీసుకువెళ్ళేలా చేసిన ప్రయత్నం ఫలించింది.
ఊహించని మలుపులతో ఎక్కడా బోర్ కొట్టకుండా చిత్రీకరించాడు డైరెక్టర్.
నానికు తగ్గ పాత్ర ఇది. నాచురల్ గా పాత్రలో ఒదిగిపోవడం స్టార్ యాక్టర్ నానికి తెలుసు.
అలానే, మృణాళ్ ఠాకూర్ పాత్ర కూడా హీరో పాత్ర కు తగ్గకుండా ఉంటుంది. తన చక్కటి నటనతో ఈ సినిమాలో మనల్ని అలరిస్తుంది.
ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ కు రెండు పాత్రలనే చెప్పాలి. మొదటి భాగం లో నడిచే ప్రేయసి పాత్రతో పాటు, రెండవ భాగంలో యాక్సిడెంట్ తరువాత గతం మర్చిపోయిన భార్యగా కూడా బాగా నటించింది.
సహాయ పాత్ర లో ప్రియదర్శన్ పెద్దగా నటనతో మెరిసే పాత్ర కాదు.
అనురాగ్ కులకర్ణి, సిద్ శ్రీ రామ్, కాళభైరవ్, కార్తీక్, గీతా మాధురి, శృతి హాసన్, వాహబ్ ప్లే బ్యాక్ సింగింగ్ చాలా బావుంది.
సినిమా లొకేషన్స్ కూనూర్, గోవా లాంటి ప్రదేశాల్లో అందంగా ఉంటాయి. పాత్రికేయులు వేసుకున్న దుస్తులు, బ్యాగ్రౌండ్ సెట్ లో వాడిని కలర్స్ సన్నివేశానికి సూట్ అయ్యాయి.
ఈ సినిమాలో పెట్టిన ఒక్క ఫైట్ కూడా లేకపోతే బావుండును అనిపించింది, కాని తరువాత వచ్చే సీన్స్ లో హీరోకి వారు చేసే సహాయానికి, ఆ నాలుగు దెబ్బలు హీరోకి తగిలినా పర్లేదనిపించింది.
కొన్ని సీన్స్ నిడివి కూడా కొంచెం తగ్గించి ఉంటే ఓవరాల్ గా సినిమాకు బావుండును అనిపించింది.
నాని నటించిన 30 వ చిత్రం, మృణాళిని ఠాకుర్ తెలుగులో నటించిన 2 వ చిత్రమైన ఈ రొమాంటిక్ డ్రామా సినిమా మీకు నచ్చుతుందని తలుస్తూ.. (నెట్ ఫ్లిక్స్ లో ఉంది)
సైనిగింగ్ ఆఫ్ విత్ మాస్ సాంగ్ “ఓడియమ్మ బీటు…”
వద్దులేండి..
ఓ మంచి పాటతో ముగిద్దాం
ఇటు రావే నా గాజు బొమ్మ
నేనే నాన్న, అమ్మ
ఎద నీకు ఉయ్యాల కొమ్మ
నిన్ను ఊపే చెయ్యే ప్రేమా..
వాలి పో …. ఈ గుండె పై..
ఆడుకో …. ఈ గూటిలో.
దూరం .. పోబోకుమా…
కౌండిన్య – 07-01-2024
