గమనిక:
మొదటి విషయం :
ఇలాంటి తవిత్వం వ్రాసిన వారిని నేను ఎక్కడా చూడలేదు అని మాత్రం కామెంటు పెట్టకండే.
రెండో విషయం :
బాబు, నువ్వు చూసింది చాలు అనేదాకా నే చూసినవన్నీ మీకు చెబుతూనే ఉంటాను.
ఇక…అందుకోండి నేను “ఏం చూసాను” అనే నా భావ తవిత.
- మంచు సుతి మెత్తగా భూమిని తాకినపుడు నేల పడిన గిలిగింతలు చూసాను!
- ఉరుములు ఉద్రేకంతో నేలను చీల్చినపుడు ధరిత్రి పడిన భాధను చూసాను!
- సన్నటి జడి వానలో తడుస్తూ ఆస్వాదిస్తున్న మనిషిని చూసాను!
- ప్రళయ వాతావరణంలో చాలించమని చేతులు జోడించి ప్రార్ధించేవారిని చూసాను!
- అమావాస్య చంద్రుడు నవ్వినపుడు ఆయన బుగ్గలో పడ్డ సొట్టని చూసాను!
- సందెపొద్దులో అస్తమిస్తున్నభానుడి కి అలసటతో నుదుటి మీద పట్టిన చమటని చూసాను!
- ఎండ కాచి వాన కురిసిన వేళ పలకరించడానికి బయటకు వచ్చిన ఇంద్రధనుస్సుని చూసాను!
- పుప్పొడి కోసం వాలిన తేనెటీగతో పువ్వు ముచ్చటించడం చూసాను!
- ఆకు చివర నీటి బిందువు తన భారాన్ని మోపలేక క్రిందపడుతూ భయంతో పెట్టుకున్న కన్నీళ్ళను చూసాను!
- శివ పూజకు చిగురించిన త్రిదళంలో స్వామిని చేరే దాక పడే తపనను చూసాను!
- మర్రి చెట్టు తన ఊడలను చూస్తూ మీసం మెలేయటం చూసాను!
- నాణెంలో భాగాలు తన వెనక భాగం చూడలేక తాము చెందిన ఆవేదనను చూసాను!
- బారుకొంగలు ఎగురుతూ ఒకరినొకరూ కబుర్లు చెప్పుకోవటం చూసాను!
- పళ్ళు లేని పండు అవ్వ, పండు పళ్ళను చప్పరించడం చూసాను!
- చల్లగా, మెల్లగా వీస్తున్న చిరుగాలి కొమ్మరెమ్మ లకు జోలపాటలు పాడటం చూసాను!
- అలమటించి, ఆకలి బాధతో, నీళ్ళు త్రాగి పస్తులున్న పేద కడుపులని చూసాను!
- లేగదూడ తల్లి పొదుగులో ఆత్రంగా పాలు త్రాగడం చూసాను!
- సిగిరెట్టు తాగే ధైర్యం లేని కుర్రకారు పొగమంచులో మంచు పొగల గింగిరాలు ఊదడం చూసాను!
- ఆస్ట్రేలియా అడవుల్లో మనుషుల్సి చూసి కంగారూలు కంగారు పడటం చూసాను!
- “పాపం మూగ జీవులు ఏమి మాట్లాడలేవు” అనడం చూసి జంతుజాతి “భాషలలో మా భాష వేరయా, విశ్వథాభి రామవినుర వేమ” అనుకోవడం చూసాను!
- తన బోండాలని విదేశాలకు ఎగుమతి చేసారన్నా వార్త విని, తోటలో కొబ్బరి చెట్టు వేరే చెట్లతో “మా పిల్లలు ఫారెన్ వెళ్ళారు” అంటూ విర్రవీగడం చూసాను!
- జ్వరం మాత్ర బొజ్జలోకి వెళ్ళి ఎ.సి వేయగానే కొంతసేపటికి ఒళ్ళంతా చల్లబడటం చూసాను!
- “తిత్తి తీస్తా” అని వినబడగానే లోపల ఊపిరితిత్తులు భయంతో ఊపిరి బిగపట్టడం చూసాను!
- తాళం చెవిలో పెట్టగానే లోపలి భాగాలు తాళంకప్పను తెరవటానికి అప్రమత్తం అవడం చూసాను!
- కనీసం వచ్చే జన్మలోనైనా గాలి సోకగానే ఆవిరివ్వకుండా ఉండే వరం ఇవ్వమని కలరా ఉండలు కలిసికట్టుగాకమలాసునిడి (బ్రహ్మదేవుడు) ని కోరడం స్వయంగా నేను చూసాను!
- రోమాలు నిక్కపొడుచుకోగానే “అబ్బా! వీడేంటి మరీ ఇంత ఫీలవుతూ మనకు పని పెట్టాడు” అంటూ అవి విసుక్కోవడం చూసాను!
- స్కూలు లైబ్రరీ లో “టీచర్లు పిల్లల వీపు విమానం మ్రోత మోగించరాదు” అన్న నిశ్శబ్ధం బోర్డు చూసాను!
- అద్దం వేరే అద్దం లో చూసుకొని “ఓలమ్మో నా సింగిల్ ఇమేజ్ కాకుండా సెంచెరీ ఇమేజ్ లు కనపడుతున్నాయి, కొంపదీసిఇది మహాభారతం నాటి మయసభలో అద్దం కాదు కదా?” అనకోవడం చూసాను!
- ఎదుటి వారు ఏ భాషవారైనా సరే మనసు వాళ్ళు పడే బాధను వెంటనే అర్థం చేసుకో కలగడం చూసాను!
- కౌండిన్య – 23/03/2023